Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పట్టిసీమ వీరభద్రస్వామి క్షేత్ర సందర్శనం

[పట్టిసీమ లోని వీరభద్రస్వామి ఆలయం సందర్శించి ఆ అనుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డా. మజ్జి భారతి.]

ది శైవక్షేత్రం. ఇందులో శివుడు వీరేశ్వర స్వామి పేరుతో పూజలు అందుకుంటాడు. ఇది పశ్చిమగోదావరి జిల్లాలో, కొవ్వూరుకు దగ్గరగా, గోదావరి నది మధ్యనున్న చిన్న లంక ప్రాంతం. ఇక్కడ మహాశివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి.

కొవ్వూరు దాటి, గోదావరి నదిపై లాంచి మీద ప్రయాణించి, ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. నది ఈవల నుండి చూస్తుంటే, చిన్నకొండ మీద, దట్టమైన వృక్షాల నడుమ కొలువుతీరిన ఈ క్షేత్రం, దూరం నుండే భక్తులను ఆకట్టుకుంటుంది.

లాంచీ దిగాక, కొద్ది దూరం ఇసుకలో నడవాల్సి ఉంటుంది. తెల్లని మెత్తని ఇసుక మధ్య నిలబడి నాలుగు వైపులా చూస్తే.. ఒకవైపు చిన్నకొండ మీద, చుట్టూ వృక్షాలతో ఆలయం, ఒక వైపు రెల్లు దుబ్బులు గాలికి తలలూపుతూ, చుట్టూ గోదావరి నది నిశ్శబ్దంగా పయనిస్తూ, ఆపైన గోదావరి గట్టు, దూరానికి కనిపిస్తూ ఆంజనేయ స్వామి, రాముడి పెద్ద విగ్రహాలు, ఇంకా దూరంగా కొండలు, కనుచూపుమేరా వృక్షాలు.

మేము సాయంకాలం వెళ్ళాం. అస్తమిస్తున్న సూర్యుని కిరణాలు నదీ జలాలలో సింధూర వర్ణాన్ని చిలికిస్తూ.. ఎంత చూసినా తనివి తీరడం లేదు. ఎన్ని ఫోటోలు తీసినా ప్రకృతి సౌందర్యాన్ని పూర్తిగా క్యాప్చర్ చెయ్యలేకపోయాం. సాయంకాలం నాలుగ్గంటలకు వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చక్కని దర్శనమౌతుంది. ఆ ఇసుక తిన్నుల్లో కూర్చొని, సూర్యాస్తమయాన్ని తిలకించవచ్చు.

ఆలయానికి వెళ్లడానికి, ఉదయం నుండి లాంచీలుంటాయి. ఆఖరి లాంచీ సాయంకాలం ఐదు గంటలకుంటే, ఆలయం నుండి ఆఖరి లాంచి సాయంకాలం ఆరు గంటలకుంటుంది. ఆ తర్వాత పూజారులు, ఆలయాన్ని మూసి చిన్న బోటులో యివతలి తీరాన్ని చేరుకుంటారు.

క్షేత్రపురాణాన్ని తీసుకుంటే, అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తండ్రి చేస్తున్న యజ్ఞకుండంలో పడి మరణిస్తే, అక్కడికి చేరుకున్న శివుడు వీరభద్రుని సృష్టించాడని, అతను పట్టసం అనే తన కత్తితో దక్షుని తల నరికిన అనంతరం, ఆ కత్తిని ఇక్కడ గోదావరి నదిలో కడిగాడని, అందుకే ఇది పట్టసం, పట్టిసీమ, పట్టసాచలమైనదని ప్రసిద్ధి.

దక్షుని వధ అనంతరం, కోపం చల్లారని వీరభద్రుడు ఈ పర్వతంపై ప్రళయతాండవం చేస్తే అతని త్రిశూలం నేలకి గుచ్చుకొని అక్కడ నుండి భద్రకాళి ఆవిర్భవించిందని, ఆ తర్వాత అగస్త్యుడు వీరభద్ర స్వామిని, వెనక నుండి పట్టుకుని, స్వామిని నిలువరించాడని పురాణ కథనం. దానిని ధ్రువీకరిస్తూ, లింగాకారం క్రిందభాగంలో వేళ్ల గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. తర్వాత అగస్త్యుడు, భద్రకాళితో వీరభద్రునికి వివాహం జరిపించాడని పురాణ కథనం.

ఇక్కడ క్షేత్ర పాలకుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ భావనారాయణ స్వామి. గజేంద్రుని రక్షించడానికి, విష్ణుమూర్తి తన శంఖ చక్రాలను కూడా మరిచి భూలోకానికి వచ్చినప్పుడు, వాటిని తెచ్చిన గరుత్మంతుడు, ఎదురుగా నిలబడి ఇవ్వడం వలన అవి తారుమారైనవి. ఆ రకంగా గజేంద్రమోక్షం జరిగిన తర్వాత, ఈ నీలాచలంపై తపస్సు చేసుకున్న జాంబవంతుడికి దర్శనమిచ్చి, ఈ కొండమీద స్వయంభువుగా వెలిసెనని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది.

పట్టిసీమ రాజమండ్రికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సులు, టాక్సీలు దొరుకుతాయి. కొవ్వూరు వరకు డబల్ రోడ్డుంటే ఆ తర్వాత సింగిల్ రోడ్డుంటుంది. రోడ్డు కిరువైపులా ఉన్న పంట పొలాలతో, కొబ్బరి చెట్లతో, మధ్య మధ్యలో గోదావరి పరివాహక ప్రాంతం కనిపిస్తూ, ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. టాక్సీ దిగాక, కొంచెం ముందుకెళ్తే గోదావరి గట్టు వస్తుంది. అక్కడనుండి ఆలయానికి లాంచ్ మీద వెళ్లాలి. టికెట్ మనిషికి 50 రూపాయలు.

ఆలయం చుట్టూ ప్రహరీ గోడ ఉండి, చెట్లతో ప్రశాంతంగా ఉంటుంది. దర్శనానికి వెళ్లే మార్గం, బయటకు వచ్చే మార్గం వేరువేరుగా ఉంటాయి. సుమారుగా ఇరువది మెట్లెక్కి ముందుకు వెళితే, ఎడమ చేతి వైపు ఒక మార్గముంటుంది. కాని, అది దర్శనమయ్యాక బయటకు వచ్చే మార్గం. అలా ఇంకొంచెం ముందుకు వెళ్లి ఎడమచేతి వైపు తిరిగితే గోశాల ఉంటుంది. దాని పక్కనుండి ముందుకు వెళ్తే మెట్లు కనిపిస్తాయి.

మెట్లెక్కి పైకి వెళ్లిన తర్వాత, ముందుగా ఎడమచేతి వైపున్న విఘ్నేశ్వరుడు పూజలందుకుంటాడు. అది దాటి లోపలికి వెళ్ళగానే చుట్టూ చతురస్రాకారపు కారిడార్ మధ్యలో ఆలయముంటుంది.

కేశవస్వామి, తాండవ వీరభద్రస్వామి, సరస్వతిదేవి, కుమారస్వామి, కనకదుర్గ, మహిషాసురమర్ధిని అమ్మవారు, కాలభైరవుడు, నవగ్రహాలు, భద్రకాళి, సూర్యనారాయణ స్వామి, లక్ష్మీగణపతిల చిన్నచిన్న ఆలయాలు కారిడార్‌లో నాలుగు ప్రక్కలా ఉన్నాయి.

వాటిని దర్శించుకొని లోపలికి వెళ్తే వీరభద్రస్వామి లింగాకారంలో ఉన్నారు. ఎత్తయిన పానిపట్టం మీద, రెండడుగుల ఎత్తు శివలింగం, లింగంపై ముందు భాగంలో చిన్నగా శిఖ చుట్టినట్టు ఉంది. రౌద్రాకారంలో ఉన్న వీరభద్రస్వామిని, అగస్త్యుడు వెనక నుండి పట్టుకొని ఉన్నాడన్న దానికి సాక్ష్యంగా, లింగం క్రింద భాగం కాస్త లోపలికి ఉండి వేళ్ళ గుర్తుల్లా కనిపించాయి.

కార్తీక సోమవారమైనా, మేము వెళ్ళింది సాయంకాలం గనుక, రద్దీ తక్కువగా ఉండి చక్కని దర్శనమైంది. మిగిలిన రోజుల్లో జనాలు తక్కువగా ఉంటారు.

దర్శనమయ్యాక ఆలయం వెనుకకు వస్తే, కుడి చేతి వైపున అనిస్త్రీ, పునిస్త్రీ ఆలయముంది. ఆలయానికి ఏడు మెట్లున్నాయి. మెట్టుకు కడుపును తాకిస్తూ, అలా మూడు మెట్లెక్కి, అనిస్త్రీని పూజిస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారని, పునిస్త్రీని పూజిస్తే రుతు సంబంధమైన సమస్యలు, పెళ్ళికాని వాళ్లకు వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. అనిస్త్రీ రెండడుగుల ఎత్తులో ఉంటే, పునిస్త్రీ మూర్తి కాస్త చిన్నగా ఉంది. పక్కపక్కనే కూర్చుని ఉన్నట్లుగా ఇద్దరూ ఉన్నారు.

అనిస్త్రీ, పునిస్త్రీ ఆలయం

ఇక్కడ నుండి చూస్తే చుట్టూ చెట్లతో కూడిన ప్రాంగణంలో, సుబ్రహ్మణ్యస్వామి గుడి.. అది దాటి ముందుకెళ్తే కోదండరామస్వామి ఆలయం, అందులో నుండి భావనారాయణ స్వామి ఆలయానికి దారి ఉన్నాయి.

సీతారాముల విగ్రహాలకు ఎదురుగా ఆంజనేయస్వామి చిన్న మందిరముంది.

భావనారాయణ స్వామి చేతుల్లో శంఖు చక్రాలు అటు ఇటు ఉంటాయి. స్వామికి కుడిచేతి వైపున ఆళ్వారుల మంటపముంది. ముందు భాగాన ధ్వజస్తంభముంది.

దర్శనాలయ్యాక, ఆలయ ప్రాంగణంలో కాస్సేపు కూర్చుని అక్కడి ప్రశాంతతను అనుభవిస్తూ, వీరభద్రస్వామిని దర్శించుకున్నామన్న ఆనందంతో పులకించిపోయాం. లాంచీ బయలుదేరడానికి అరగంట సమయం ఉండడంతో, గోదావరి నది ఇసుక తిన్నెలపై కూర్చుని, చల్లనిగాలి మోమును స్పృశిస్తూ ఉంటే, సూర్యాస్తమయ అందాలను వీక్షిస్తూ, దైవదర్శనంతో పాటు, ప్రకృతి అందాలను వీక్షిస్తూ తృప్తిగా వెనుదిరిగాం.

***

Exit mobile version