[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘పవిత్రమైన మనస్సే భగవంతుని ఆలయం’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రశ్న చాలామందిని ఆలోచనలో పడేస్తుంది. కొన్ని మతపరమైన సంప్రదాయాలు ఆయనను గుడుల్లో, ఆలయాల్లో లేదా ప్రత్యేకమైన స్థలాల్లో మాత్రమే ఉన్నారని చెబుతాయి. కానీ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మశాస్త్రాలు అన్నీ కూడా భగవంతుడు సర్వాంతర్యామి అని, ఆయన ఈ సృష్టి అంతటిలోనూ, ప్రతి జీవిలోనూ, మనలోనూ అంతర్గతంగా ఉన్న పరమాత్మ అని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అందుకే అన్నమయ్య భగవంతుని సర్వాంతర్యామి తత్వాన్ని ఒక కృతిలో అద్భుతంగా తెలియజేసాడు:
అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీరఘురామ
కులమును నీవే గోవిందుడా
నా కలిమియు నీవే కరుణానిధి
తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ
తనువును నీవే దామోదర
నా మనికియు నీవే మధుసూదన
వినికియు నీవే విట్ఠలుడా
నా వెనకముందు నీవే విష్ణు దేవుడా
మనము ఆలయానికి వెళ్లి పూజలు, హోమాలు, ఉపాసనలు చేసే లక్ష్యం – భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడమే కాదు, మన అంతరాత్మను శుద్ధి చేసుకోవడమూ. భక్తి లేకుండా చేసే క్రియలు భగవంతునికి ఇష్టపడవు. శాస్త్రాల ప్రకారం, బుద్ధిగతమైన ఆరాధన, ఆత్మశుద్ధితో చేసిన పూజలే ఆయనకు ప్రీతికరమైనవి. దయగల హృదయం నిజమైన ఆలయం. కరుణతో నిండిన మనస్సే భగవంతుని వాసస్థలంగా పండితులు పేర్కొంటారు.
భగవంతుడు నిరాకారుడు, నామరూపాలకు అతీతుడు. మంచి చెడు అనే భేదాలు ఆయన ప్రేమలో లేవు. మనం ఆయనను గుడుల్లో మాత్రమే కాక, ప్రేమలో, సహానుభూతిలో, క్షమలో అన్వేషించాల్సిన అవసరం ఉంది. భగవంతుడి నివాసం మన హృదయమే.
గురుగీతలో పేర్కొన్నట్లు – “గురౌ దృష్టే శివః దృష్టః” అంటే, గురువు రూపంలో కూడా భగవంతుడిని దర్శించవచ్చు. మనకు జ్ఞానం, దిశానిర్దేశం ఇచ్చే ప్రతి చేతిలో ఆయన ఉంటాడు. అలాగే, గీతలో శ్రీకృష్ణుడు అంటాడు – “అహమాత్మా గుడాకేశ! సర్వభూతాశయస్థితః”, అంటే నేను ప్రతి జీవిలో అంతర్భాగంగా ఉన్న పరమాత్మను.
పిల్లల అమాయకత్వంలో, తల్లిదండ్రుల ప్రేమలో, ఓ సాధువు మౌనంలో కూడా భగవంతుడి ఉనికిని చూడవచ్చు. భగవంతుడు మానవతా విలువలలో నివసిస్తాడు – సేవ, దయ, క్షమ, నిస్వార్థత వంటి గుణాల్లో ఆయన ఉన్నారు. ఎవరి చెంపపై కన్నీరు తుడిచినా, ఎవరికైనా ఆశను ఇస్తే, అక్కడే భగవంతుని స్పర్శ ఉంటుంది.
ప్రకృతిలో కూడా ఆయన కనిపిస్తాడు – పుష్పంలో పరిమళంగా, గాలిలో తేమగా, పక్షుల్లో స్వేచ్ఛగా, సూర్యంలో తేజంగా. కాబట్టి గుడిలో మాత్రమే కాదు, ప్రకృతిలోనూ, ప్రతి ప్రాణిలోనూ భగవంతుని దర్శించవచ్చు. ఇది తత్వవేత్తల స్పష్టమైన సందేశం.
శంకరాచార్యులు అన్నట్లు – “చిదానంద రూపః శివోఽహం”, అంటే నేను శుద్ధచైతన్య స్వరూపుడిని. అంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఆయనను బయటే కాక, మన హృదయంలోనూ చూడగలగాలి.
మనిషి పవిత్రమైన మనస్సుతో జీవించాలి. మాటల్లో, ఆచరణలో, ఆలోచనలో సత్యనిష్ఠ ఉండాలి. ఇతరుల పట్ల దయ, సేవా దృక్పథం పెంపొందించాలి. ఇవే దైవత్వానికి మార్గాలు. మనలో ఉన్న ప్రేమ, క్షమ, సహనం రూపంలో భగవంతుడు మనల్ని దర్శిస్తాడు.
చివరకు, భగవంతుని సన్నిధిని అనుభవించాలంటే, మన హృదయం స్వచ్ఛంగా, నిష్కల్మషంగా ఉండాలి. పవిత్రమైన మనస్సే భగవంతునికి నిర్మితమైన సత్య ఆలయం.
