[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘పవిత్రమైన మనస్సే దేవాలయం’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవద్గీత 15వ అధ్యాయం, 8వ శ్లోకం
శరీరం యాదవాప్నోతి యచ్చాప్యుత్క్రమతీశ్వరః।
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్॥
ఓ అర్జునా, గాలి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సువాసనను తీసుకువెళ్ళే రీతిలోనే జీవాత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ప్రవేశించినప్పుడు దానితో పాటు మనస్సు మరియు ఇంద్రియాలను కూడా తీసుకువెళుతుంది. అంటే మనస్సులో వున్న భావనలన్నింటినీ తన కొత్త మనస్సుకు అనుసంధానం చేస్తుంది అని పై శ్లోకం భావం.
ఈ విషయంలో జీవునికి పూర్తి స్వేచ్ఛ వుంది. ఎందుకంటే మనస్సులో వున్న భావనలపై పూర్తి స్వేచ్ఛ మానవునికి మాత్రమే వుంది. ఒక శరీరంతో తాను చేసే కర్మలు, ఆలోచనలు, ఆలోచనలపై తనకు మాత్రమే స్వేచ్ఛ వుంది. మంచి కర్మలు చేస్తే మనస్సులో పవిత్రమైన భావనలు వుంటాయి. దుష్కర్మల వలన అపవిత్రమైన భావనలు మనస్సును కలుషితం చేస్తాయి. ఈ వాసనలు, భావాలను ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరంలో ప్రవేశించేటప్పుడు వాటిని తీసుకువెళ్ళి కొత్త శరీరంలో జనించే మనస్సులో ఏకం చెస్తుంది. అంటే మానవుడు జన్మ తీసుకున్నప్పుడే ఈ వాసనలు మనస్సులో ప్రవేశించి అతని జీవిత ప్రక్రియను నిర్దేశిస్తాయి కాబట్టి మంచి జన్మ రావాలంటే ఈ జన్మలో సత్కర్మలు చేసి మంచి భావనలను మనస్సులో వుంచుకోవడం అత్యావశ్యకం అని పై శ్లోకం స్పష్టం చెస్తోంది. భౌతిక శరీరం చనిపోయినప్పుడు కూడా, ఆత్మ తన గత జీవితాల అనుభవాలతో పాటు మనస్సును దాని పూర్వ శరీరం నుండి కొత్త జీవితానికి తీసుకువెళుతూనే ఉంటుంది కాబట్టే పుట్టుకతో అంధులుగా ఉన్న వ్యక్తులు ఇప్పటికీ కలలు కనడానికి ఇది ఎందుకు కారణమవుతుందో వివరిస్తుంది.
ప్రతి మనిషి ఆలోచనలు, భావావేశాలు, ఎదురయ్యే అనుభవాలపై నిలకడగా పర్యవేక్షణ చేయటం, ప్రతికూల ఆలోచనలను నిరోధించుకోవడం చాలా అవసరం. సానుకూల ఆలోచనల్లో నిరంతరం నిమగ్నంగా ఉండడం వల్ల మనసు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్ఛమైన భావాలు మనస్సులో ఉన్నప్పుడు మన కార్యాలు కూడా నిష్కలంకంగా, ధార్మికంగా ఉంటాయి. అశుద్ధమైన భావాలు – అసూయ, ద్వేషం, కోపం, స్వార్థం – మన ప్రశాంతతను భగ్నం చేయడంతో పాటు సాటి మానవులతో సంబంధాలను దెబ్బతీస్తాయి. అనారోగ్యకరమైన మనస్సు వలన అనేక అనారోగ్యాలు వచ్చి మానవులను అస్తవస్త్యం చేస్తాయి.
మనస్సు స్థిరతే శాంతికి బీజం అని వేదాంతం చెబుతుంది; మనసు అద్దం వలె శుభ్రమై ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుందని వేమన తన పద్యంలో వివరించాడు (ఆత్మశుద్ధి లేని యాచార మదియేల భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా? విశ్వదాభిరామ! వినుర వేమ!) . స్వచ్ఛమైన ఆలోచనా సరళి మానవునికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, సౌహార్దం నింపుతుంది. ప్రతికూల భావనలను దూరం చేయడంలో ఆత్మ నియంత్రణ కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రతి రోజు, సానుకూల ఆలోచనలతో మనస్సును నింపడం – ఉదాహరణకు ఇతరులకు సహాయం చేయడం, క్షమా భావం పెంచుకోవడం, ధర్మాన్ని పాటించడం – విశిష్టమైన ప్రాప్తిని కలిగిస్తుంది. జీవితం చిన్న చిన్న చేదు అనుభవాలను ఎదుర్కొన్నప్పటికీ, మనసు శుద్ధిని పోషించడమే సుళువైన మార్గంగా నిలుస్తుంది. మన ఆలోచనలు స్వచ్ఛంగా ఉండడం వల్ల, అవి ఉదాత్త లక్ష్యాలవైపు మన జీవితాన్ని రూపుదిద్దుతాయి, అంతేకాకుండా సమాజానికీ మంచి మార్గదర్శకంగా నిలుస్తాయి.
ఆలోచనకు అపారమైన శక్తి ఉంది. ఆలోచన వ్యాధులను నయం చేస్తుంది. ఆలోచనలు వ్యక్తుల మనస్తత్వాన్ని మార్చగలవు. ఆలోచన ఏదైనా చేయగలదు. అది అద్భుతాలు చేయగలదు. ఆలోచన వేగం ఊహించలేనిది.
ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తారో, అలాగే తయారవుతారు అని మనస్తత్వ శాస్త్రం కూడా చెబుతోంది. అంటే వారి ఆలోచనలు ఎలా ఉంటాయో, వారి జీవితం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఆలోచనను మెరుగుపరచుకోవాలి. మంచి ఆలోచనలు మంచి చర్యలను తెస్తాయి. ప్రతి సందర్భంలోనూ సానుకూలతను చూడటం నేర్చుకోవాలి. ఆలోచనల స్వచ్ఛత, ఆహార స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆహార నియంత్రణ కూడా అవసరం.
ఈ విధంగా, చింతనలో పవిత్రత కలిగించుకోవడం ద్వారా మన వ్యక్తిత్వ వికాసానికి, సార్థకమైన జీవనానికి మక్కువ పెంచుకోవచ్చు.
