Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పవిత్రత లేని ప్రేమ యుద్ధం

[డా. మునగా రామ మోహన రావు గారు రచించిన ‘పవిత్రత లేని ప్రేమ యుద్ధం’ అనే కవితని అందిస్తున్నాము. సంచిక నిర్వహించిన లవ్ జిహాద్ కవితలో పోటీలో బహుమతి పొందిన కవిత.]

నమ్మకం
అది ఒక్కసారి మోగి మౌనంలో కలిసిపోయే గుడి గంట కాదు;
నిరంతరం కాపాడుకోవాల్సిన
మనసు గది తాళం.

మాటలు
మధురంగానే మొదలవుతాయి;
నిజాలకు రంగుల ముసుగులు వేస్తూ.
స్నేహం పేరుతో చేరి
స్వార్థపు విత్తనాలు నాటుతాయి.

అది
ఒక షడ్యంత్రం!
కొన్నిసార్లు ప్రేమే
వేషం మార్చుకున్న మోసమై
మనల్ని వంచిస్తుంది;
వలపన్ని ఉచ్చులో దింపి
ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

ఆసక్తిగా మారే ఒక చూపు,
హృదయాన్ని తాకే ఒక మాట
ఒక్క బలహీన క్షణం
నిండు జీవితాన్ని తలకిందులు చేస్తుంది.

ఒక్కసారి చిక్కితే
బయటపడటం దుర్లభం!
ఎవరిది తప్పు? ఎవరిది ప్రభావం?
అని నిలదీస్తే
వెక్కిరించే నిశ్శబ్దమే సమాధానం.

కన్నవారి ప్రేమ
కట్టుబాట్లుగా అనిపించినప్పుడు
మౌనంగా సాంత్వన వెతికే మనసు
పరాయి మాయమాటల ఉచ్చులో పడుతుంది.

సాంప్రదాయాల పునాదులు కదులుతున్నాయి;
విలువల జ్యోతి మసకబారుతోంది.
స్నేహితుల నవ్వుల వెనుక-
కనిపించని ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

బాధ్యత లేని చోట
ఉదాసీనతే రాజ్యమేలుతుంది;
సామాజిక మాధ్యమాల వెలుగుల్లో
సత్యం నీడలా మసకబారుతోంది.

చూసేది ఆకర్షణీయ రూపం,
నమ్మేది కృత్రిమ మాటలు
కానీ లోన దాగి ఉండేది
విషపూరిత ఉద్దేశ్యం.

ఇది ఇప్పుడు
విశృంఖలంగా విస్తరిస్తోంది.

ఇది ఒకరి కథ కాదు
అజాగ్రత్త అడుగుల
విషాద ప్రతిధ్వని.

జాగ్రత్త
అది భయం కాదు;
నీ స్వీయ గౌరవానికి
నీవు తొడిగే రక్షణ కవచం.

సమిష్టి కుటుంబాల విలువలు
మళ్లీ మన జీవాధారంలో భాగమవ్వాలి.

ప్రేమ
అది అంధత్వం కాదు;
నిజాన్ని ఎదుర్కొనే సాహసం.

ఎవరి మాటైనా…
“నిజమా?” అని తర్కించు;
ఎవరి ముందైనా
నీ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు.

తల్లిదండ్రులు
కేవలం బంధం కాదు;
చీకట్లను చెదరగొట్టే దివ్య దీపాలు.
వారిని దూరం పెట్టే ముందు
వారి మౌనంలోని ఆవేదనను
ఒక్కసారి విను.

చట్టాలు, ప్రభుత్వాలు
నియమాలు మాత్రమే చెబుతాయి;
గమ్యాన్ని నిర్ణయించేది మాత్రం
నీ నిర్ణయం.

నీ చుట్టూ –
తోడేళ్లు వేచి ఉన్నాయి;
మెలకువగా ఉండు.

చివరికి జీవితం
ఒకే ప్రశ్న అడుగుతుంది:
“నిన్ను నీవు కాపాడుకున్నావా?”

అప్పుడు,
గర్వంగా సమాధానం చెప్పగలిగేలా,
ఈ రోజే మేలుకో!

Exit mobile version