[కిట్టీ వెల్స్ పాడిన ‘పేయింగ్ ఫర్ దట్ బాక్ స్ట్రీట్ అఫైర్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- కిట్టీ వెల్స్ – పేయింగ్ ఫర్ దట్ బాక్ స్ట్రీట్ అఫైర్ (1953)
- ఆల్బమ్ – పేయింగ్ ఫర్ దట్ బాక్ స్ట్రీట్ అఫైర్ – సింగిల్,
- రచన – బిల్లీ వాలెస్, జిమ్మీ రూల్
~
అప్పట్లో గొప్ప గాయకులు పాడి హిట్ చేసిన పితృస్వామ్య భావజాలంతో నిండి ఉన్న పాటలకు అదే బాణీలో పాట కట్టి ఒక స్త్రీగా తన జవాబుని ధైర్యంగా జవాబు పాటగా వినిపించింది కిట్టీ వెల్స్. అలాంటి పాటలలో ముందు వరసలో ఇప్పటి తరం కూడా గుర్తు పెట్టుకున్న పాట ‘ఇట్ వాస్ నాట్ గాడ్ హూ మేడ్ హాంకీ టాంకీ ఏంజెల్స్’. దీని గురించి మనం అంతకు ముందు చెప్పుకున్నాం. ఇది కాక కిట్టీ వెల్స్ గానం చేసిన మరో జవాబు పాట ‘పేయింగ్ ఫర్ దట్ బాక్ స్ట్రీట్ అఫైర్’.
1952లో ‘బ్యాక్ స్ట్రీట్ అఫైర్’ అనే పాటను బిల్లీ వాలెస్, నాష్విల్లే గేయరచయిత జిమ్మీ రూల్ రాసి కంట్రీ సింగింగ్‌లో రారాజుగా వెలుగొందుతున్న హాంక్ విలియమ్స్‌కు దీన్ని ఇచ్చారు. ఆయన తన రేడియో కార్యక్రమాలలో ఈ పాటను పాడుతుండగా, వెబ్ పియర్స్ మొదటిసారిగా దానిని విన్నారు. హాంక్ మేనేజర్, ఫ్రెడ్ రోజ్, ఇది కొంచెం అభ్యంతరకరంగా ఉందని, ఇది రికార్డ్ చేయడం హాంక్ కెరీర్‌కు ప్రమాదకరమని చెప్పి దానిని రికార్డ్ చేయనివ్వలేదు. తర్వాత వెబ్ పియర్స్ దీన్ని పాడి విడుదల చేశారు. పియర్స్ పాట C&W బెస్ట్ సెల్లర్ చార్టులలో వరుసగా మూడవ నంబర్-వన్ సింగిల్‌గా నిలిచింది, అక్కడ అది రెండు వారాల పాటు నంబర్ వన్ స్థానంలో కొనసాగింది. ఈ పాటలో ఒక వివాహితుడు మరో స్త్రీని ప్రేమించి ఆమెతో సంబంధంలో ఉంటాడు. దీన్నిప్రపంచం వీధి వెనక కథగా చెప్పుకుని కించపరుస్తూ ఉందని తమది నిజమైన ప్రేమ అని, భార్య అందించలేని ప్రేమను తాను ఆమె దగ్గర పొందుతున్నానని ఏదో ఓ రోజు తమ ప్రేమ గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుందని అంటాడు. ఇది చాలా పాపులర్ అయి వివాహేతర సంబంధాన్ని గ్లోరిఫై చేసింది.
‘పేయింగ్ ఫర్ దట్ బ్యాక్ స్ట్రీట్ అఫైర్’ పాటను కూడా బిల్లీ వాలెస్, జిమ్మీ రూల్ లే రాసారు. కిట్టి వెల్స్ దీన్ని 1953లో రికార్డ్ చేశారు. ఇది బిల్బోర్డ్ కంట్రీ, వెస్ట్రన్ బెస్ట్ సెల్లర్స్ చార్టులో 6వ స్థానానికి చేరుకుంది. ప్రాంతీయంగా, ఇది మార్చి 1953లో నాష్విల్ సిన్సినాటిలో 2వ స్థానానికి చేరుకుంది.
Yes, I thought that you were true when I fell in love with you
For you told me you always would play square
Then I learned you had a home, that your wife had not gone wrong
And our love was just a backstreet affair
(అవును నీతో ప్రేమలో పడ్డప్పుడు నువ్వు నిజాయితీపరుడివనే నేను నమ్మాను. నువ్వు నాతో న్యాయంగా ప్రవర్తిస్తావనే అన్నావు. ఆ తర్వాత నీకు ఓ ఇల్లు ఉందని, నీ భార్య ఏ తప్పూ చేయలేదని, మన ప్రేమ కేవలం ఓ వెనుక వీధి విషయమే అని నాకు తెలిసింది)
ప్రేమలో పడుతున్నప్పుడు ఆమె పూర్తిగా అతన్ని నమ్మి ఆ బంధంలోకి ఆనందంగా ప్రవేశించింది. కాని తర్వాత అతను వివాహితుడని ఆమెకు తెలిసింది. అతని భార్య మంచిదని, ఆమె ఏ తప్పూ చేయలేదని కూడా తెలుసుకుంది. అనుకూలవతి అయిన భార్య, వివాహం అనే ఓ సామాజిక బంధం ఉన్నా అతను తనతో బంధం పెట్టుకుంది కేవలం మరో అనుభవం కోసమే అని తెలిసాక కలిగిన షాక్‌లో ఆమె ఈ పాట పాడుతుంది. కిట్టీవెల్స్ ఈ పాటను గానం చేసేటప్పుడు ప్రతి వాక్యంలో ఆ షాక్ మనకు అర్థం అవుతుంది. ‘బ్యాక్ స్ట్రీట్ అఫైర్’ పాట ట్యూన్ లోనే ఉన్నా ఆ పాటలో ఆ గాయకుడు విషాదాన్ని, జాలిని ప్రదర్శించి తన కథను చెప్పి సానుభూతి సంపాదిస్తే, తాను అతనికి మరో అదనపు అనుభవాన్ని తప్ప మరేమీ కానని, కాలేనని తెలుసుకున్న తర్వాత మనసు విరిగి రక్తం ఓడుతున్న హృదయంతో ఆమె తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఈ పాటను గానం చేస్తుంది.
Was too late to say no when I found you’d fooled me so
For as time passed on I’d learned too much to care
Though I knew I must atone, but my will was not my own
I’m paying for that backstreet affair
(నీ మోసం సంగతి తెలిసే సరికి చాలా ఆలస్యం అయిపోయింది. సమయం గడిచిపోయింది, నన్ను గురించి పట్టించుకోవడం నేను మానేసి చాలా రోజులయ్యింది. ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నాకు అనిపించినా, ఏ నిర్ణయమూ నా అధీనంలో లేకుండా పోయింది. ఈ రహస్య సంబంధానికి ఇలా మూల్యం చెల్లించుకుంటున్నాను)
ఆమెకు అతని గురించి నిజాలు తెలిసేసరికే ఆమె జీవితం అతని అధీనంలోకి వెళ్లిపోయింది. చేసింది తప్పని తెలిసినా అది సరిదిద్దుకోలేని అశక్తురాలిగా మిగిలిపోయింది. తన జీవితం గురించి ఏ నిర్ణయమూ స్వయంగా తీసుకోలేక ఆ బంధంలో బందీ అయి సమాజం చీకరించుకుంటూ చులకనగా వీధిచాటు వ్యవహారంగా చూసే ఈ బంధంలోకి ప్రవేశించినందుకు ఇప్పుడు ఆమె మూల్యం చెల్లించుకుంటూ శిక్ష అనుభవిస్తుంది.
‘బాక్ స్ట్రీట్ అఫైర్’ అనే నానుడిని రహస్య సంబంధాలకు, కార్యకలాపాలకు, అనైతిక చర్యలకు వాడతారు. ప్రేమ అని తాను అనుకున్నది ఓ అనైతిక చర్యగా, అతి హేయమైన బంధంగా మిగిలిపోతే ఆ నిజాన్ని గ్రహించి అది కలిగించే దుఖాన్ని భరిస్తూ ఆమె ఆ జీవితానికి లోంగిపోవడం ఇందులో కనిపిస్తుంది. ఊబిలోకి దిగిన అశక్తత ఆమెలో చూడవచ్చు.
You didn’t count the cost, you gambled and I lost
Now I must pay with hours of deep despair
You still can live your life with a true, forgiving wife
But I can’t live down our backstreet affair
(నువ్వు దీని ఫలితం గురించి ఆలోచించలేదు, జూదం ఆడింది నువ్వు, ఓడింది నేను. ఇప్పుడు నేను గంటల తరబడి తీవ్ర నిరాశలో కొట్టుకుపోతూ జరిగిన దానికి మూల్యం చెల్లించుకోవాలి. నువ్వు నీ జీవితాన్ని నిజాయితీతో జీవిస్తూ, నిన్ను క్షమించగల భార్య నీడలో గడిపేయగలవు. కాని నేను మన ఈ వీధి చాటు వ్యవహారాన్ని మర్చిపోలేకపోతున్నాను)
ఎంతో విషాదాన్ని మోసుకొచ్చే వాక్యాలు ఇవి. ఒక బంధంలో ఇద్దరూ కలిసి ఉన్నాక అది తప్పు అని తెలిసాక పురుషుడు తన జీవితంలో భద్రతను కోల్పోడు. అతని భార్య అతన్ని క్షమించేస్తుంది, కుటుంబం స్వాగతిస్తుంది, సమాజం ఆదుకుంటుంది. కాని అదే స్త్రీ విషయానికి వస్తే, జరిగిన తప్పుకు ఆమె జీవితాంతం శిక్ష అనుభవిస్తూనే ఉంటుంది.
The love I gave so free is left to torture me
Though I know it’s hopeless and it isn’t fair
But, still I must go on while the gossips spread are wrong
I’m paying for that back street affair
(నేను మనస్పూర్తిగా పంచిన ప్రేమ నన్ను నరకయాతనకు గురి చేస్తుంది. ఇది నిష్ప్రయోజనమని, అన్యాయమని నాకు తెలిసినా, వ్యాపిస్తున్న పుకార్లు అవాస్తవమైనా, నేను నా దారిలో సాగక తప్పదు. ఆ రహస్య బంధం తాలూకు మూల్యాన్ని నేను చెల్లిస్తున్నాను)
మనస్పూర్తిగా అతన్ని నమ్మి ప్రేమను పంచి బదులుగా వేదనను మిగుల్చుకుంటుంది స్త్రీ. తాను మాత్రమే ఆ శిక్ష అనుభవించవలసి రావడం అన్యాయం అని తెలిసినా ప్రశ్నించలేదు, ఎదిరించలేదు. చుట్టూ తన గురించి వ్యాపిస్తున్నపుకార్లలో నిజం చాలా తక్కువని తెలిసినా మౌనంగా ఉండడం, భరించడం తప్ప ఏమీ చేయలేని అశక్తతతో తమ రహస్య సంబంధానికి మూల్యం ఆమె ఒక్కతే చెల్లిస్తుంది.
మనకు పాశ్చాత్య సంగీతంలోని విశృంఖలత గురించి మాత్రమే తెలుసు. కాని అది ఒక పార్శ్వం మాత్రమే. అక్కడి సమాజంలో ఎంతో సంఘర్షణ, మథనం జరిగాయి. మానవ సంబంధాల గురించి మన కన్నా నిష్పక్షపాతంగా అక్కడి సాహిత్యం చర్చించింది. నైతికత, నిబద్దత మానవ సంబంధాలలో ప్రముఖ పాత్ర అక్కడా వహించాయి. స్త్రీవాదాన్ని లోతుగా అన్నివైపుల నుండి విశ్లేషించే ప్రయత్నం చాలా నిజాయితీగా జరిగింది. ప్రేమ పేరుతో వివాహానికి విలువ ఇవ్వకుండా, సమాజ ఆమోదాన్ని పట్టించుకోకుండా జంటలయిన వ్యక్తుల జీవితాలలోని సమస్యలను బాహాటంగా చర్చించాయి అక్కడి కళా మాధ్యమాలు. దానికి ఉదాహరణ ఈ గీతం.
~
ఈ పాటను క్రింద ఇచ్చిన లింక్ లో వినవచ్చు.
https://www.youtube.com/watch?v=h8j3t_hjWAg

