[వివిధ జంతువుల ప్రత్యేకతలను చిన్న వ్యాసాలుగా బాలబాలికలకు అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]
పిల్లలూ!
మన తాత ముత్తాతల కాలంలో ఉమ్మడి కుటుంబాలుండేవి. చిన్నా, పెద్దా అందరూ కలిసి మెలిసి – ప్రతి యింట్లోను పసిపిల్లల దగ్గర్నుండి – ముదుసలుల వరకు ఉండేవారు. కొన్ని అభిప్రాయ బేధాలున్నా కలిసి మెలిసి హాయిగా ఉండేవారు. పెద్దల పట్ల గౌరవం ఉండేది. మరి ఇప్పుడు వ్యష్టి కుటుంబాలు వచ్చి – వృద్ధాశ్రమాల సంఖ్య ఎక్కువవడం చూస్తున్నాము. మానవ సంబంధాలు మానవీయ సంబంధాలను మరచి పెద్దలు కట్టించిన ఇళ్ళలో మనముంటూ వారిని బయటకు నెట్టివేస్తున్నాము. మనకంటే ఈ విషయంలో మెరుగ్గా ప్రవర్తించే జంతువులున్నాయి. వాటిని చూసి పెద్దలను ఆదరించడం మనం మరల నేర్చుకోవాలి.
మనందరికీ ‘ఉడతా ఉడతా హూత్’ పాటా తెలుసు; ‘ఉడుత సాయం’ గురించీ తెలుసు – రాముడికి సముద్రం మీద వారధిని నిర్మించడంలో వానరసైన్యంతో పాటు – ఉడుత కూడా సాయపడిందనీ తెలుసు. ఆ ఉడుత జాతికి చెందిన బీవర్ ఉడతలు తల్లిదండ్రులని – పెద్దలనీ గౌరవించాలనే విషయాన్ని మనకు చెబుతాయి.
2 అడుగుల నుండి 24 అడుగుల వరకు పొడవుండి, పది అంగుళాల తోకతో నీటిలో పడవల్లా ప్రయాణం చేస్తూ, తోకని తెడ్డులా ఉపయోగించుకుంటాయి. వీటి పళ్ళు గట్టిగా, పదునుగా అంటే మన రంపాలను పోలి ఉంటాయి.
బీవర్లు నీటిలో ఈదగలవు. కాని జీవించలేవు. వాటికి నివసించడానికి ఇళ్ళు కావాలి. మనం ఇళ్ళని గట్టి నేలని చూసి కట్టుకుంటాం – నేల గుల్లగా ఉంటే మట్టితో పూడ్చి కట్టుకుంటాం – కదా! మరి బీవర్లు ఏం చేస్తాయంటే – నది మధ్యలో ఆనకట్టను కట్టి – ఆనకట్ట అవతలి జలాశయాన్ని బంకమట్టితో పూడ్చి – ఒక ‘దీవి’లా తయారు చేసి ఇళ్ళు కట్టుకుంటాయి – కలప కావాలి కదా! ఎలా?
పదునయిన రంపపు పళ్ళతో చెట్ల కాండాల చుట్టూ కొరికి – కొమ్మలను – పుల్లలను నదిలో పడేస్తాయి. ఒకవేళ నదిలో కాకుండా వేరే చోట పడితే – నది నుండి అక్కడికి కాలువలు త్రవ్వుతాయి. నదీ ప్రవాహము మీదగ తాము ఎన్నుకున్న ప్రదేశానికి కొమ్మలను చేర్చుతాయి. నేలను గులకరాళ్ళతో, బంకమట్టితో పూడ్చి కడతాయి. అచ్చంగా మనం ఇనుమును పేర్చి మధ్యలో కాంక్రీటుతో పూడ్చి కట్టినట్లన్నమాట. ఈ గోడకు అవతల ఒక జలాశయం ఏర్పడుతుంది. జలాశయం మధ్యలో మట్టిని పేర్చి ఒక దీవిని నిర్మించుకుంటాయి. ఆ దీవిలో పుల్లలను, ఆకులను, కొమ్మలను ఉపయోగించి – బంకమట్టిని కాంక్రీట్ వాడి ఇళ్ళను కడతాయి. పెద్ద కొమ్మలను కూడా పళ్ళతో చీల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసే నైపుణ్యం వాటి పళ్ళకు ఉంది.
నీటిలో తేలుకుంటూ వెళ్ళి ఆహారాన్ని సంపాదించి తెచ్చి పిల్లలను పోషిస్తాయి. వాటి జనాభా పెరిగిన మనకు అధిక జనాభా వల్ల సమస్యలు సంభవించినట్లే వాటికీ ఇళ్ళ కొరత సమస్య ఎదురవుతుంది. మరి అపుడు అవి ఏం చేస్తాయి?
మనలో కొంత మందిలాగా పెద్దవాళ్ళని బయటకి పంపించవు. బలహీనమయి – వృద్ధాప్యంలో కష్టపడలేని తమ తాత ముత్తాత ఉడతలకి ఆ యిళ్ళను వదిలి – బయటకి వచ్చి యిళ్ళు కట్టుకుంటాయి. మరి ఈ ఆధునిక యుగంలో మనము ఈ బీవర్ ఉడతలలాగా పెద్దలను గౌరవించడం ఎప్పుడు నేర్చుకుంటామో? చూశారా! పిల్లలూ! మనం జంతువుల జీవన విధానాన్ని గమనించి వారి దగ్గరా మానవత్వపు విలువలని తెలుసుకోవచ్చు గదూ!
మరో విషయం – ఆనకట్టలను, ఇళ్ళను, బీవర్లు ఒంటరిగా కడతాయనుకుంటున్నారు కదూ! ఊహూ!! కాదు. ‘ఐక్యమత్యమే మహాబలం’ అనే సూక్తి మనమందరమూ విన్నాం కదూ! బీవర్లు అన్నీ ఐక్యమత్యంతో వుండి ఈ పనులను సామూహికంగా చేసుకుంటాయి. ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అని ఋజువు చేస్తాయి. మనం మంచిని ఎక్కడినుంచయినా గ్రహించవచ్చు కదా!
“మీరు తల్లిదండ్రులను – పెద్దలను బయటకు తరిమేయకండర్రా! మాలాగా ఆదరించండి” అని బీవర్ ఉడతలు మనతో చెప్తున్నాయ్! వాటిమాట విందాం. సరేనా?
