Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పెద్దమ్మా! నీకు వందనం

[శ్రీమతి మాలా కుమార్ రచించిన ‘పెద్దమ్మా! నీకు వందనం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

మేజర్ అరవింద్ చిన్నగా భారంగా కళ్ళు తెరిచాడు. కళ్ళల్లోకి సూటిగా వెలుతురు పడుతోంది. కళ్ళు చిట్లించి చూస్తూ, తల అటు ఇటు తిప్పాడు. లేద్దామని ప్రయత్నించాడు. కదులుతున్నాడు కానీ చేతులు, కాళ్లు కదలటం లేదు. కొద్దిసేపు తను ఎక్కడున్నాడో అర్థం కాలేదు. తను ఎక్కడ ఉన్నాడు? ఏం జరిగింది? ఏమైంది?

చిన్నగా కష్టపడి లేచి కూర్చున్నాడు. చేతులకు గొలుసులు. శరీరం గాయాలతో నిండిపోయింది. తను ఉన్నది ఒక చిన్న గది..

కిటికీ లేదు.. ఏ మూల నుంచో వెలుతురు పడుతోంది. గాలి కూడా బరువుగా ఉంది..

కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు.

సరిహద్దు మీద ఉదయం వెలుగు ఇంకా పూర్తిగా పోలేదు. సూర్యుడు భారంగా పడమటి వైపు ప్రయాణిస్తున్నాడు. మబ్బులు కొద్దికొద్దిగా కమ్ముకుంటున్నాయి. గాలి చల్లగా ఉంది..

అంతటా చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం..

ఆ నిశ్శబ్దం ఏదో జరగబోయే ప్రమాదానికి సూచికగా ఉంది..

“టీమ్.. జాగ్రత్తగా ముందుకు,” మేజర్ అరవింద్ నెమ్మదిగా అన్నాడు.

అందరూ అప్రమత్తంగా అడుగులు వేస్తున్నారు..

అకస్మాత్తుగా ఒక భారీ పేలుడు ఆ నిశ్శబ్దాన్ని చీల్చేసింది..

భూమి కంపించింది. గాలి దుమ్ముతో నిండిపోయింది. చెవుల్లో బుల్లెట్ల శబ్దం గుచ్చుకుంది.

“కవర్ చేయండి!” అని అరవింద్ గట్టిగా అరిచాడు.

తన సైనికులను కాపాడటానికి ముందుకు దూసుకెళ్లాడు. ఒక జవాను పడిపోతుండగా అతన్ని లాగడానికి ప్రయత్నించాడు. అదే క్షణంలో అతని కాలికి బలమైన దెబ్బ తగిలింది. అతను నేలపై పడిపోయాడు. చుట్టూ శత్రువులు చుట్టుముట్టారు..

తన చేతిలో గన్ ఉన్నంత వరకు పోరాడాడు. చివరి బుల్లెట్ వరకు తన్ను తాను నిలబెట్టుకున్నాడు.

చివరికి..

తను పట్టుబడ్డాడు!

***

“డాడీ.. డాడీ..” సాహస్ అరుపులు వినిపించి, బెడ్ రూం నుంచి పరుశురామ్, పూజగది నుంచి సావిత్రి, కిచెన్ నుంచి అభిజ్ఞ వచ్చి, ఎక్కడా అరవింద్ కనిపించక, “ఎక్కడరా డాడీ?” ఒకేసారి అడిగారు.

“అదిగో” టీ.వీ.లో మేజర్ అరవింద్ ఫొటో చూపిస్తూ అయిదేళ్ళ, సాహస్, మూడేళ్ళ కైవల్య గంతులు వేస్తున్నారు.

అరవింద్ ఫొటో కింద, అరవింద్ బార్డర్‌లో తప్పిపోయినట్లుగా, అతని గురించిన సమాచారం ఏదీ తెలియలేదని వార్త స్క్రోల్ అవుతోంది. గత మూడు రోజులుగా అరవింద్ దగ్గర నుంచి ఫోన్ రాలేదని ఎదురు చూస్తున్నవాళ్ళు, ఆ వార్త చూసి నిశ్చేష్టులుగా నిలబడిపోయారు. అప్పుడే పరుశురాం చేతిలోని సెల్ మ్రోగింది..

మేజర్ అరవింద్ శత్రువుల చేతికి చిక్కారనీ, అయినా భయపడవద్దని, భారత ప్రభుత్వం త్వరలోనే విడిపిస్తుందని హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఆఫీసర్ చెప్పాడు.

టీ.వీలో వార్త చూసిన వెంటనే, అదే కాలనీలో ఉన్న అభిజ్ఞ అన్నయ్య, వదిన, అరవింద్ చెల్లెలు బావ, పరుశురాం అన్నావదినా, సావిత్రి అక్కాబావా ఆప్తులందరూ హడావిడిగా వచ్చారు. ఇంటివాళ్ళకు ధైర్యం చెపుతూ అండగా ఉన్నారు.

ఈ హడావిడికి దూరంగా అభిజ్ఞ టీవీ ముందు కూర్చుంది. వార్తలు మారుతున్నాయి. ప్రతి మాట ఆమె గుండెలోకి గుచ్చుకుంటోంది.

“మేజర్ అరవింద్.. మిస్సింగ్ ఇన్ యాక్షన్..”

రిమోట్ తిప్పుతున్న ఆమె చేతులు వణికాయి..

అరవింద్ తల్లి పూజా గదిలో దీపం ముందు కూర్చుంది. ఆమెతో పాటు పెద్దవాళ్ళంతా కూర్చొని, భక్తిగా చేతులు జోడించి, స్తోత్రాలు పారాయణ చేస్తున్నారు.

పరుశురామ్ బయటకు చూస్తూ నిలబడ్డాడు..

కానీ అతని కళ్ళు దూరాన ఉన్న యుద్ధరంగాన్ని చూస్తున్నాయి. శత్రు చెరలో ఉన్న కొడుకును చూస్తున్నాయి..

తల్లితోపాటు టీ.వీ చూస్తున్న సాహస్ చిన్ని బుర్రకు ఏమి తోచిందో, తల్లి చీర కుచ్చిళ్ళు పట్టుకొని “డాడీ హీరో కదా అమ్మా?” అన్నాడు.

“అవును బాబూ.. నిజమైన హీరో,” అభిజ్ఞ కళ్లలో నీళ్ళు మెరుస్తుండగా అంది.

సాహస్ నెమ్మదిగా జెండాను గీసాడు. వాడి చిన్న చేతుల్లో దేశభక్తి కనిపిస్తోంది.

***

ఆ చిన్న గదిలో కూర్చున్న అరవింద్ గుండెలో ఒక్కసారిగా ఒక ప్రశ్న మెరిసింది..

“ఇది అంతమా.. లేక పరీక్షా?”

అతను కళ్ళు మూసుకున్నాడు. అభిజ్ఞ ముఖం గుర్తుకు వచ్చింది. సాహస్ నవ్వు వినిపించినట్టైంది. కైవల్య ముద్దుమోము అతని హృదయాన్ని తాకింది.

కానీ వెంటనే అతని మనసులో మరో స్వరం వినిపించింది..

“నేను భారత సైనికుడిని.”

అరవింద్ ఆలోచనలలో ఉండగానే నలుగురు సిపాయిలు లోపలికి వచ్చారు. అతన్ని ఒక సైనిక శిబిరానికి తీసుకెళ్ళారు.

అది చీకటి గది కాదు. కానీ స్వేచ్ఛ లేదు. పహారా ఉంది.

ప్రశ్నించటం మొదలు పెట్టారు.

“నీ యూనిట్ ఎక్కడ ఉంది?”

“మీ ఆపరేషన్ ఏమిటి?”

అరవింద్ మౌనంగా ఉన్నాడు. అతనికి తెలుసు, తన నోటి నుండి వచ్చే ప్రతి మాట దేశానికి సంబంధించింది..

మౌనమే అతని సమాధానం అయ్యింది..

చేతులకు గొలుసులు. శరీరం గాయాలతో నిండిపోయింది. కానీ ప్రతి శ్వాసలో దేశభక్తి గర్జన వినిపిస్తోంది. అతని కళ్ళలో ఓటమి లేదు.

“నీ దేశం కోసం ఇంత బాధ ఎందుకు భరిస్తున్నావు?” అని ఒక శత్రు సైనికుడు ప్రశ్నించాడు.

అరవింద్ నెమ్మదిగా తలెత్తి చూసాడు.

చిన్నగా నవ్వాడు.

“నువ్వే అన్నావు కదా! దేశం కోసం అని, నా దేశం.. నా గర్వం. ఈ శరీరానికి తగిలే ఏ గాయం నన్ను ఏ మాత్రం బాధించదు.”

అరవింద్ కళ్ళు మూసుకున్నాడు.

శత్రు సైనికుడు అప్రయత్నంగా సెల్యూట్ చేయబోయి ఆగి అరవింద్‌ని చూస్తూ ఉండిపోయాడు.

***

రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో ప్రతి నిమిషం ఒక యుగంలా అనిపిస్తోంది.

ఒక ఉదయం.. ఆకాశం మీద సూర్య కాంతి మెల్లమెల్లగా పరుచుకుంటోంది. ఇంటి ముందు తులసి చెట్టు దగ్గర సావిత్రి దీపం వెలిగించింది. ఆ వెలుగు గాలికి కొద్దిగా కదిలింది..

సావిత్రి ఆందోళనగా దీపం వైపు చూసింది. గాలికి ఊగిన దీపం, మరు నిమిషంలోనే స్థిరంగా నిలబడింది!

అభిజ్ఞ గడప దగ్గర నిలబడి ఉంది. చేతిలో ఫోన్. కళ్ళు రోడ్డుపైనే. ప్రతి వాహనం శబ్దం వినిపించినప్పుడల్లా గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటోంది.

ఆమె మనసులో ఒకటే పేరు – అరవింద్.

గేటు దగ్గర జీప్ ఆగింది.

యూనిఫామ్‌లో ఉన్న అధికారి లోపలికి వచ్చాడు.

“మేడమ్..”

అభిజ్ఞ ఉలికిపాటుగా చూసింది! ఏ వార్త వినవలసి వస్తుందో అని గుండె దడదడదలాడింది!. ఊపిరి ఆగినట్లైంది.

“మేజర్ అరవింద్ విడుదల అయ్యారు.”

ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని, “థాంక్ యూ, ఆఫీసర్” వణుకుతున్న స్వరంతో అంది.

ఆ మాటలు వినిపించి, ఇంట్లో నుంచి పరుశురామ్, సావిత్రి బయటకు వచ్చారు.

“కానీ మీరు ఇప్పుడే ఆయనను కలవలేరు” అని చెప్పి, వెళ్ళిపోయాడు.

ఒక్కసారిగా ఆ మాటతో ఆ ఇంటి గోడలు కూడా ఊపిరి పీల్చుకున్నట్టయ్యాయి. ఆ ఇంట్లో ఆ క్షణం..

నవ్వు, కన్నీళ్లు, నమ్మలేని ఆనందం అన్నీ ఒకేసారి కలిసిపోయాయి. ఆనందాలు వెల్లివిరిసాయి!

పరుశురామ్ పిల్లలతో డాబా పైన జాతీయ పతాకం ఎగురవేయించాడు. మువ్వన్నెల పతాకం గర్వంగా రెపరెపలాడుతోంది. గాలి కూడా ఈ రోజు ప్రత్యేకంగా అనిపిస్తోంది.

అందరూ మేజర్ అరవింద్ రాకకై ఎదురు చూస్తున్నారు.

అరవింద్‌ను ముందుగా ముందుగా హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. అక్కడ అతనికి డాక్టర్లు పరీక్షలు చేస్తారు., మనసు రీఛార్జ్ అయ్యేలా కౌన్సెలింగ్ ఇస్తారు. ఆ తర్వాత అతనితో డీబ్రీఫింగ్ చేస్తారు. ఎందుకంటే.. అవన్నీ తెలుసుకోకుండా అతనిని వదలలేరు.

హాస్పిటల్ గదిలో..

అరవింద్, దిండు మీద తల పెట్టి, వెనుకకు ఆనుకొని కూర్చుని కిటికీ బయట ఆకాశాన్ని, చెట్లను, చెట్ల మీద అల్లరి పిల్లలలా గోల చేస్తున్న పిట్టలనూ చూస్తున్నాడు.

“మా ఇంటి ముందు కూడా ఇదే ఆకాశం ఉంటుంది..” అనుకున్నాడు. అప్రయత్నంగా అతని కళ్ళలో నీళ్ళు. యుద్ధంలో, శత్రువు చెరలో కూడా రాని కన్నీళ్ళు.

“సాహూ ఇప్పుడు ఎంత పెద్దవాడయ్యాడో.. కైవు నన్ను గుర్తుపడుతుందా.. అభిజ్ఞ, ఎంత బాధపడిందో.. అమ్మానాన్న ఈవార్తను ఎట్లా రిసీవ్ చేసుకున్నారో! వీరపత్నీ, వీరమాత కదా ధైర్యంగానే ఉండి ఉంటారు. నాన్న గంభీరంగా పాత్రికేయుల, టీ.వీ చానల్స్ ఆంకర్స్ ప్రశ్నలకు జవాబులు ఇస్తూ, వాళ్ళనే తిరిగి ప్రశ్నలడుగున్నారేమో!” తండ్రి ఇచ్చే స్పీచ్ లు కు పాత్రికేయుల మొహాలు ఎలా ఉంటాయో ఊహించుకొని చిన్నగా నవ్వుకున్నాడు. అరవింద్ మనసు పరిపరి విధాల భావాలకు లోనవుతోంది.

కొన్ని రోజుల తర్వాత..

ఆ రోజు వచ్చింది. ఇంటిముందు జాతీయ పతాకం ఎగురుతోంది. కాలనీలో వాళ్ళు, పాత్రికేయులు, వివిధ చానల్స్ వాళ్ళూ గుమిగూడారు. ఇంటి ముందు అందరూ అతనికై ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు.

జీప్ ఆగింది..

మేజర్ అరవింద్ దిగాడు. చుట్టూ ఓసారి చూసి, అందరికీ అభివాదం చేస్తూ ఇంటి గుమ్మం ముందుకు వచ్చాడు. సావిత్రి కొడుకుకు హారతి ఇచ్చి, గుమ్మడికాయతో దిష్టి తీసింది. అమ్మనూ, నాన్ననూ రెండు చేతులతో దగ్గరగా పొదువుకున్నాడు. అప్పటి వరకూ ఆపుకున్న కన్నీరు సావిత్రి కళ్ళ నుంచి జలజలా రాలాయి.

అభిజ్ఞ అతన్ని చూసింది. ఆ చూపులో మూడు నెలల బాధ ఉంది..కానీ అదే చూపులో ఒక జీవితకాల సంతోషం కూడా ఉంది.

సాహస్ పరుగెత్తి వచ్చి “డాడీ” అంటూ మోకాళ్ళకు చుట్టుకున్నాడు.

అరవింద్ మోకాళ్ళ మీద కూర్చుని కొడుకును గట్టిగా హత్తుకున్నాడు. కైవల్య నోట్లో వేలేసుకొని, అమ్మ ఒడిలో నుంచి అమాయకంగా చూస్తోంది. ఒక్కసారిగా కైవల్యను ఎత్తుకొని గుండెలకు హత్తుకున్నాడు. “అభీ..” అని చిన్నగా పిలుస్తూ భార్యను భుజం చుట్టూ చేయి వేసి లోపలికి అడుగేసాడు. అది కేవలం ఒక అడుగు కాదు..

ధైర్యంగా, సాహసోపేతంగా మరణాన్ని సవాల్ చేసి, విజయుడై వచ్చిన అడుగు!

“నువ్వు తిరిగి వచ్చావు.. నువ్వు ఒక్కడివే కాదు..నీతోపాటు దేశ గౌరవం కూడా గర్వంగా తలెత్తుకుని వచ్చినట్లుంది” మేజర్ అరవింద్ నాన్న గంభీర స్వరంతో అన్నాడు.

అభిజ్ఞ, అరవింద్‌ను చూసింది. అతని పట్ల ప్రేమ, అతని దేశభక్తి పట్ల గర్వం ఆమె కళ్ళలో ఒక వింత వెలుగును నింపింది.

బంధుమితృలందరినీ పలకరించి, ఫ్రెషప్ అయ్యి, తనకోసం ఎదురుచూస్తున్న పాత్రికేయులను కలిసాడు. అందరికీ బయట షామియానా వేసి, కూర్చునేందుకు కుర్చీలు, టీ, స్నాక్స్ ఏర్పాటు చేసారు. ఒకరొకరుగా ప్రశ్నలు అడుగుతూ నోట్ చేసుకుంటున్నారు.

ఒక లేడీ జర్నలిస్ట్ “మిమ్మలిని శత్రువులు బంధించినప్పుడు మీకు భయం వేయలేదా?” అని అడిగింది.

“లేదు భయం వేయలేదు” చిరునవ్వుతో జవాబిచ్చాడు.

“అక్కడ శత్రువులు మిమ్మల్ని ఏమడిగారు? ఎలా ట్రీట్ చేసారు?”

ఆ ప్రశ్నకు నవ్వే జవాబిచ్చాడు అరవింద్.

“మీరు విడుదల అవుతానని, క్షేమంగా మన దేశానికి తిరిగి వస్తానని మీకు నమ్మకం ఉండిందా?”

“ఉంది. మనదేశం నన్ను వదిలేయదనీ, చర్చలు జరిపి మన ప్రధాని తీసుకొస్తారని, పైగా పెద్దమ్మ దీవెన ఉందనీ, నేను తిరిగి వస్తాననీ, ఇలా మీ అందరితో మాట్లాడుతానని బలంగా నమ్మాను” అని సమావేశం ముగించాడు.

లోపలికి వచ్చిన అరవింద్‌తో “పెద్దమ్మ నీకేమి ధైర్యం చెప్పిందిరా? అక్కా, నువ్వెప్పుడు వీడితో మాట్లాడావు?” అని అక్కనూ అడిగింది సావిత్రి.

“నేనేమి చెప్పాను, ఎప్పుడు చెప్పాను, ఏమోలే ఎప్పుడో చెప్పి ఉంటాను” ముసిముసిగా నవ్వుతూ జవాబిచ్చింది సావిత్రి అక్క.

సోఫాలో కూర్చున్న తల్లి ఒడిలో పడుకుంటూ “మనందరికీ పెద్దమ్మ భరతమాత. ఆమె దీవెన ఉండగా శత్రువులు నన్నేమి చేయగలరు? పెద్దమ్మనే కాదు మీరంతా నాకోసం చేసిన ప్రార్థనలూ, మీ అనురాగం, అభీ ప్రేమ, పిల్లల ముద్దుమోములు, దేశప్రజల దీవెనలూ అన్నీ నా వెంటే ఉండి, నాకు రక్షణ ఇస్తుంటే నాకేమి భయం” అన్నాడు అరవింద్!

“If a person says that he is not afraid of death, he must be either lying or he belongs to the Indian Army.”

– Field Marshall Sam Manekshaw

Exit mobile version