[డా. అయినాపురపు రామలింగేశ్వర రావు గారు రచించిన ‘పెళ్ళి అయింది..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
“ఏమిటి శాంతమ్మ? మీరంటున్నది. కాంతి, తన్మయి విడాకులు తీసుకుంటున్నారా?. పెళ్ళి అయ్యి ఆరునెలలు కూడా కాలేదు కదా. అప్పుడే విడాకులా?”.. ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టాడు పరంధామయ్య. పరంధామయ్యే దగ్గరుండి ఈ పెళ్ళి జరిపించాడు. అందుకే ఆ ఆశ్చర్యం.
“ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు”.. శాంత మాటలలో ఏదో తెలియని ఆవేదన. పశ్చాత్తాపం.
“అసలు ఏలా జరిగింది? నమ్మలేక పోతున్నా. అమ్మాయి వాళ్ళు చదువుకున్నావాళ్లు, ఆస్తిపరులు కదా, గొడవలు ఎందుకు వచ్చాయి?”
“ఆ ఆస్తిపాస్తుల వల్లే గొడవలు వచ్చాయి పరంధామయ్య గారు”.
“ఏమిటమ్మా నువ్వంటున్నది?”
“అవును. అమ్మాయి, తల్లి, తండ్రి తమకు ఆస్తి ఉందన్నగర్వంతో చేస్తున్న చేష్టలు మరియు చూపిస్తున్న అహం మావాడికి మనఃశాంతి లేకుండా చేసాయి. దానితో”..
“అమ్మా శాంత పెళ్ళి మాటలలోనే నేను శంకించానంటే నమ్ము. కాని మీరూ చదువుకున్నవాళ్ళ. మీ ఆలోచనలు మీకుంటాయి అన్న ఉద్దేశ్యంతో నేను నా నోరు మెదపలేదు. చాలా దురదృష్టమమ్మా. సారీ”
“సారీ మీరు కాదు, నేను మీకు చెప్పాలి. మీరు చాలా మంచి సంబంధాలు ఎన్నో తెచ్చారు. సాంప్రదాయం, కట్టుబాట్లు, ప్రేమ, అనురాగాలు గురించి మీరు అప్పుడు చెబుతుంటే నేను నా స్వార్థ ఆలోచనలు, దురాశతో వాటినన్నిటిని ప్రక్కకు పెట్టి కేవలం ఆర్థిక పుష్ఠికే ప్రాధాన్యత ఇచ్చాను. చేతులారా నేను నా పిల్లవాడి భవిష్యత్‌ను పాడు చేసానని అనుకుంటున్నాను.” వస్తున్న కన్నీరు తుడుచుకుంటూ పశ్చాత్తాపాన్ని వ్యక్త పరిచింది శాంత.
“బాధపడకండి. అన్నీ సర్ధుకుంటాయి.”
“డబ్బులే జీవితానికి ముఖ్యమని, డబ్బు ఉంటే జీవితంలో అన్ని అవే సమకూరుతాయి అన్న మాకున్న అపోహా నన్ను నా కొడుకుని ఈ కష్టాలులోకి నెట్టింది.” శాంత మాటలలో పశ్చాత్తాపం కొట్టొచ్చినట్లు కనబడింది.
చిలక్కి చెప్పినట్లు నచ్చచెప్పిన, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు మూర్ఖంగా ప్రవర్తించిన శాంత తాను చేసుకున్న కర్మకు తానే బలి అయ్యిందని పరంధామయ్యకు అనిపించింది. ఎంతో మంది చదువుకున్న, సాంప్రదాయ కుటుంబాలు నుంచి వచ్చిన సంబంధాలను తృణప్రాయంగా వదిలేసిన అనేక సందర్భాలు పరంధామయ్యకు గుర్తుకు వచ్చాయి. తన కొడుకు సాధించిన ప్రగతికి తగ్గ ఆర్థిక హోదా మరియు స్తోమత తనకు లభించాలన్న ఆశ శాంత పాలిటి శాపంగా మారిందన్న సత్యం పరంధామయ్యకు తెలియందికాదు. అందుకే శాంత చెప్పింది వినడం తప్ప ఏమి సమాధానం చెప్పలేదు.
“బంగారంలాంటి కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోయింది. జరిగిన పరిణామాలుతో కాంతి ఇంటికి రావడమే మానేసాడు. పలకరిస్తే ఛిరాకు పడుతున్నాడు. ఆయనకు ఆలోచనలుతో హార్ట్ యటాక్ వచ్చింది. అంతా అయోమయంగా ఉంది పరంధామయ్యగారు.”
“అంతకు తగ్గ బొంత అని మన వాళ్ళు ఊరికే అనలేదు. మీకు మీ కుటుంబానికి తగ్గ సంబంధాలు ఎన్నో ఏరి కోరి తెచ్చాను. మీరు మీ ఆలోచనలు అప్పడప్పుడు నన్ను భాధించిన, సరే నా పరిధినికి మించినది ఈ విషయమని,.. నేనే మౌనంగా ఉండిపోయాను అనేక పర్యాయాలు. మీ చదువులు, మీ ఆలోచనలు ముందు నా అభిప్రాయాలు పొరపాటు ఏమోనని చాలా సార్లు మీ మాటలుకు అడ్డు చెప్పలేదు. ఇరువైపుల వారు చదువు సంస్కారం ఉన్నవాళ్ళు, అన్ని అవే సర్ధుకుంటాయి అని అనుకున్నా. కాని మీరు చేసిన నిర్ణయాలు ఈ విధంగా వికటిస్తాయని నేను ఏ నాడు ఊహించలేదు. వినడానికే చాలా భాధగా ఉంది అమ్మా శాంత.” పరంధామయ్య శాంతకు సానుభూతి చూపించడం తప్ప మరేంచేయలేకపోయాడు.
“ఏం చేస్తాం ఏనాడో చేసిన పాపం?” శాంత మాటలలో వైరాగ్యం, పశ్చాత్తాపం కనిపించాయి.
“అయినా విడాకులు తీసుకోవడం అమ్మాయి వాళ్ళకు బాధే కదా”.. పరంధామయ్య సంశయం వ్యక్తపరిచాడు.
“అదే నేను అనుకున్నా. కాని వాళ్ళు మాటలలో విడాకులు అన్న విషయంపై కించత్తు బాధను కూడా వ్యక్త పరచలేదు. ‘విడాకులు తీసుకుంటే అమ్మాయిని పెళ్ళిచేసుకోవడానికి చాలా మంది రడీగా ఉన్నారన్న’.. వాళ్ళ తల్లి తారకాదేవి మాటలు మా వాడిని ఇంకా కుంగ తీసాయి. ‘మా అమ్మాయికి మీ వాడు మ్యాచ్ కాలేదు. షి ఈజ్ నాట్ కంఫర్టబుల్ విత్ యువర్ సన్’ అంటూ వాళ్ళ తండ్రి మావాడికి నా ఎదురుగానే నిర్మొహమాటంగా చెప్పి ఆ అమ్మాయికి దూరం చేసాసేడు. దీనతో మా వాడు మానసికంగా కృంగి పోయాడు.”
“వినడానికే చాలా బాధగా ఉంది.”
“పెళ్ళి ఘనంగా చేసారు. కావలసిన కట్నకానుకలు అన్నీ ఇచ్చారు. అవే జీవితానికి ముఖ్యం అని నేను అపోహ పడ్డాను. కాని పెళ్ళి అయిన మూడు నెలలు లోపే అసలు రంగు బయటపడిపోయింది. డబ్బు ఉందన్న మదంతో వాళ్ళు చూపిన నిరాదరణ, కోడలు చిన్నచూపు మమ్మల్ని చాలా మానసిక క్షోభకు గురిచేసింది. అబ్బాయి కోసం సర్ధుకు పోదామని అని అనుకున్నా మా వల్లకాలే. మేం చేసిన తప్పు మాకు అర్థమయింది. చివరకు మనకు తగ్గ సంబంధం కాదు అని మాకు తెలిసింది. కేవలం ఆస్తిపాస్తులు, అంతస్తులు, ఆర్థిక స్తోమతులను చూసి, అవే మనకు అవసరమని మూర్ఖంగా నమ్మి నా పిల్లవాడి భవిష్యత్‌ను పాడుచేసాను.” శాంత వస్తున్న ఏడుపును ఆపుకోలేక భోరుమని ఏడవ సాగింది.
“అమ్మా ఏడవకండి. ధైర్యంగా ఉండండి అన్నీ అవే సర్ధుకుంటాయి”. పరంధామయ్య శాంతకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసాడు.
అర్ధగంటకు పైగా జరిగిన సంభాషణలలో విషయాలన్నిటిని శాంత పరంధామయ్య ముందు ఏకరువు పెట్టింది.
తాను సంబంధాలు చూపించినపుడు చర్చించిన అన్ని విషయాలు శాంతకు ఇప్పుడు అనుభవంలోకి వచ్చినట్లుగా అవగతమైంది పరంధామయ్యకు. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు తెలుసుకున్నా చేయగలిగింది ఏమి లేదు. జరగవలసిన నష్టం జరిగిపోయింది. పెళ్లి అయ్యింది, కాని ఆరు నెలలు కాకుండానే విడాకులుకు ప్రయత్నాలు జరిగి పోతున్నాయి. కలికాలం, కాదు పోయే కాలం. తాను ఇటీవల చూసిన పెళ్ళిల్లో పదికి పైగా పెళ్ళిళ్ళు కాళ్ళ పారాణి ఆరకుండానే విడాకులు వరకు రావడం చాలా శోచనీయం అని అనిపించింది పరంధామయ్యకు.
వందకు పైగా పెళ్ళిళ్ళు కుదిర్చిన అనుభవం ఉన్నపరంధామయ్యకు పరిస్ధితులు అర్ధం కాక కాదు. అవగాహన లేక కాదు. మనుషులలో ఆశ అత్యాశగా మారింది. కోరికలు గుర్రాలయ్యాయి. స్వార్ధం పెరిగింది. అడ్డదారులలో అందలం ఎక్కి, అవకాశం దక్కించుకుని, సుఖసౌఖ్యాలను అనుభవించాలన్న అత్యాశ మనుషులలో పెరిగి పోయింది. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మానవత్వాలు మంటకలసి, వ్యాపార ధోరణులు పెరిగి, తన అభివృద్దే అభివృధ్ధి అన్న భావన పెరిగిపోయింది. వెరసి పవిత్రమైన వివాహవ్యవస్ధ పతనావస్ధకు చేరువయ్యింది. నైతిక, సామాజిక విలువలుకు కాలం చెల్లి, సంకుచిత భావనలు మనసులలో ప్రవేశించాయి. ఆలోచనలలో కాలుష్యం పెరిగి పోయింది. వీటి అన్నిటి ఫలితం వివాహ వ్యవస్ధ, తద్వారా కుటుంబవ్యవస్ధ కుప్పకూలుతోంది. పరిస్ధితిని ఇలాగే వదిలేస్తే.. పరంధామయ్య శరీరంలో తెలియని కంపనం, మనసులో ఒక్కసారిగా భయం చేరి వళ్ళు అంతా చమటలు పట్టాయి.
“అమ్మా శాంత వస్తాను. మరల కలుస్తాను..” వెళ్తున్న పరంధామయ్య కళ్ళముందు ఆ రోజలులో కాంతి పెళ్ళికై జరిగిన అన్నీ విషయాలు ఒక్కటొక్కటిగా గుర్తుకొచ్చాయి.
***
“ఈ రోజులలో పెళ్ళి కుదర్చడం మహా కష్టం అంటే నమ్మండి. పెళ్ళి కుదరడం అంటే అది బ్రహ్మాండమే. పెళ్ళి పీటలు దాకా వెళ్ళడం, వాళ్ళ చేత కాపురం చేయించడం చాలా పెద్ద టాస్క్ గా మారింది. అవునండి. ఇటు మగ పెళ్ళివారు, అటు ఆడ పిల్లవాళ్ళు కోరుతున్న గొంతమ్మ కోర్కెలకు అసలు వీళ్ళకు పెళ్ళి అవుతుందా? అని సందేహం రాక మానదు”.. చేతిలోని ముక్కు పొడెం డబ్బాలోని ముక్కు పొడెంను ముక్కునిండా దట్టించి, పీల్చి, ఒక్కసారిగా బిగ్గరగా తుమ్మి అందరివైపు చూసాడు పెళ్ళిళ్ళ పేరయ్య పరంధామయ్య.
“వెధవది ఎన్ని సంబంధాలు చూపించిన నచ్చితే కదా, ఏదో వంక పెట్టడం, నో అని చెప్పడం. ఏలా అవుతాయి పెళ్ళిళ్ళు. నా వల్లకాదు. మీరు ఏమనుకున్న మీకు సంబంధం వెతకడం నా వల్ల కాదు. నన్ను వదిలేయండి.”.. రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాడు పరంధామయ్య శాంతకు.
“పూర్తిగా మేం అనుకున్న విధంగా నచ్చాలి కదా. ఇది పెళ్ళి. జాగ్రత్తగా చూసి ఆలోచించి చేసుకోవాలి”. శాంత తన మనసులోని మాట మరల పరంధామయ్యకు తెలియజేసింది.
“ఆలోచించండి. ఆలోచించుతోనే ఉండండి. 30 నుంచి 40 వయస్సులోకి వస్తే అప్పుడు ఇంకా బాగా అలోచించవచ్చు.” మరల తనకు తెలియకుండానే బిగ్గరగా తుమ్ము రావడంతో పూర్తిగా మాట చెప్పకుండానే ఆగిపోయాడు పరంధామయ్య.
పరంధామయ్య కబుర్లు వాళ్ళకు కొత్త ఏమి కాదు. అందకే వాళ్ళు సీరియస్‌గా ఆయన మాటలు తీసుకోలేదు.
“మంచి సంబంధాలు చూడండి. టైము వస్తే అన్నీ అవే అవుతాయి. కళ్యాణమొచ్చిన కక్కు వచ్చినా ఆగదంటారు. చూద్దాం.” కాంతి తండ్రి కుటుంబరావు ఎప్పుడు చెప్పినట్లే సమాధానం చెప్పాడు.
“సరే చూద్దాం. వీళ్ళ కోరికలు తీరి అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు కుదురుతుందో. పెళ్ళి ఎప్పుడు అవుతుందో అంతా ఆ పైవాడే చెప్పాలి. పెళ్ళి కుదిరింది.”.. అన్న మాట ఎప్పడికి వింటానో అంటూ ..లోలోపల గొణుక్కుంటు స్కూటరు ఎక్కి కిక్కు నొక్కి బయలుదేరాడు పరంధామయ్య.
***
కుటుంబరావు కొడుకు కాంతి నెలకు రెండు లకారాలకు దగ్గరగా సంపాదిస్తూ మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. ఆ ఊళ్ళో ఉన్న పెళ్ళికొడుకులలో అందం, అంతో కొంత ఆస్తి, మంచి ఉద్యోగం ఉన్నవాడు కాంతి కావడంతో కాంతి తల్లి, అదే కుటుంబరావు భార్య శాంత కొండ ఎక్కి కూర్చుంది. మద్య తరగతినుంటి అప్పర్ మిడిల్ క్లాసుకు ఎదిగారు. తన కొడుకు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని అన్ని విధాల బాగుండే మంచి సంబంధం చూస్తే కాంతి జీవితం ఆర్థికంగా బాగా సెటిల్ అవుతుంది అని పూర్తిగా నమ్మింది శాంత. ఈ ఆలోచన వల్లే ఎంత మంచి సంబంధం వచ్చినా ఏదో వంక పెట్టి చాలా సంబంధాలు వదిలేయడం ఆమెకు పరిపాటిగా మారింది. విషయం ఊర్లో అందరకు తెలిసిందే. శాంతకు ఏమి కావాలో? ఏలాంటి కోడలను తెచ్చు కోవాలో?.. తెలియక కొంత కస్ఫ్యూజన్ లో ఉన్న,.. లేనట్లుగా గాంభీరాన్ని చూపించడం పెళ్ళిళ్ళ పేరయ్య పరంధామయ్యకు తెలియంది కాదు. కాని తప్పదు. చాలా కాలం నుంచి ఉన్న కుటుంబ సంబంధాన్ని వదులుకోలేక సర్దుకుపోతున్నాడు.
కుటుంబరావు ప్రభుత్వశాఖలో ఆఫీసరుగా ఉన్నా, ఫఫక పనిలో బిజీ వల్ల కొడుకు కాంతి పెళ్ళి విషయంలో భార్య శాంతకే పూర్తిగా బాధ్యతను అప్పజెప్పి చేతులు దులుపుకున్నాడు. పెళ్ళి విషయంలో ఇద్దరి ఆలోచనలులో తేడా ఉండడంతో, కొడుకు పెళ్ళి నిర్ణయ భాధ్యత శాంతకే ఇచ్చేసాడు కుటుంబరావు. వారానికి ఒకటో, రెండు సంబంధాలు తీసుకువచ్చి శాంత ముందు ఉంచడం పరంధామయ్య డ్యూటీ. పరంధామయ్య మాత్రం తన డ్యూటీని సక్రమంగానే నిర్వహిస్తున్నాడు.
చూస్తుండగానే కాంతి 30 వ సంవత్సరం నిండి 31 లోకి ప్రవేశించాడు. కాంతితో పెళ్ళి సంబంధాలు చూసిన వాళ్ళందరికి పెళ్ళిళ్ళు అవ్వడమే కాదు పిల్లా పాపలతో చక్కగా కాపురాలు చేసుకుంటున్నారు. పెళ్ళి కుదిరితే తనకు రావలసిన మొత్తం వస్తుందని పరంధామయ్య ఆశ. అప్పుడప్పుడు తృణమో ఫలమో దక్కిన పెళ్ళి కుదిరితే దక్కే ఎక్కువ మొత్తం గురించే ఆశ పడుతున్నాడు. ‘పెళ్ళి కుదిరింది’.. అన్న మాట వినే, ఆ సమయం గురించి పరందామయ్య కూడా వేచి చూస్తున్నాడు.
మరో వైపు పైకి గంభీరంగా ఉన్న తన కొడుకు కాంతి పెళ్ళి ఆలస్యమవ్వడం శాంతకు కొంత మానసిక ఒత్తిడి కలుగ జేస్తోంది. అందం, చదువు, ఉద్యోగం ఉండి, తల్లితండ్రుల ఆర్థిక, సామాజిక స్తోమత ఉండే అమ్మాయి కావాలని అందరు తల్లులలాగే శాంత ఆశించింది. చాలా మంచి చదువుకున్న అమ్మాయిలు ముందుకు వచ్చినా, చూద్దాం ఇంకా మంచి సంబంధం వస్తుందేమో అన్న ఆశతో వచ్చిన సంబంధాలను పెండింగులో పెట్టేసింది. ఆడపిల్లలకు ఉన్న డిమాండ్ అంచనా వేయడంలో శాంత కొంత మేరకు తప్పటడుగు వేసిందని చెప్పక తప్పదు. ఇటు కాంతి తనకు తానుగా కొంచం ఎక్కువగానే ఊహించుకున్నాడేమో అని అనిపిస్తుంది. వివాహం అనేది ఒక అద్భుతమైన సంస్కారమని, మనం సమాజంలో ఆనందంగా, హాయిగా జీవించడానికి, కుటుంబ వ్యవస్ధ చిగురించి సమాజాభివృద్దికి తోర్పడడానికి అవసరమైన పవిత్రమైన ప్రక్రియ పెళ్ళి. ఈ విషయాన్ని మరచి, కేవలం ఆర్థిక సంబంధమైన స్వార్ధ కార్యంగా పెళ్ళిని అర్ధం చేసుకోవడంతో కాంతి చాలా నష్టపోయాడని అవగతమవుతోంది. అయన వాళ్ళకు తెలియజేయలేని పరిస్ధితి పరంధామయ్యది. అందుకే మౌనంగా వాళ్ళు చెప్పినట్లు ముందుకు నడిచాడు పరంధామయ్య.
“కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం ఉన్నందుకు నాకు ఈ గౌరవం ఇస్తున్నారు, డిమాండు ఉన్నప్పుడు మంచి ఛాయిస్ తీసుకోవడంలో తప్పేముంది”.. అన్నది కాంతి ఆలోచన. డిమాండ్ సప్లై సూత్రం పై తన కున్న అవగాహన కారణంగా తాను తీసుకున్న నిర్ణయం కాంతికి తప్పు అనిపించలేదు. తను సాధించిన తన వ్యక్తిగత అభివృద్ధితో తన వివాహం ద్వారా ఆర్థిక అబివృద్ధి సాధించాలని కలలు కంటున్నాడు. ఆస్తిపాస్తులు, ఉద్యోగం ఉన్న అమ్మాయి అయితే తన జీవిత లక్ష్యాలను సులువగా చేరుకోవచ్చు అని కాంతి అభిప్రాయం. అందుకే తల్లి శాంత ఆలోచనలకే తన సపోర్టు చేసాడు కాంతి.
తండ్రి కుటుంబరావు చేసేది లేక తల్లి కొడుకుల నిర్ణయానికి ఓకే చెప్పి మౌనంగా ఉండి పోయాడు.
30కి పైగా సంబంధాలు వచ్చాయి. విశ్లేషించి పరికించి చూసిన ఒక్కటి నచ్చలేదు. పెళ్ళి ద్వారా తన భవిష్యత్‌ను, ఆర్థిక పరిపుష్టిని పటిష్టం చేసుకోవాలని కాంతి బలంగా ఆలోచిస్తున్నాడు. వెరసి కాంతి 31 లోకి అడుగిడిన, పెళ్ళకొడుకుగానే ఉండిపోయాడు.
***
“అమ్మా శాంత. రోజులు మారి పోయాయి. మన రోజులు కాదు. ఇదుగో ఈ అమ్మాయి పేరు తన్మయి. వయస్సు 30 సంవత్సరాలు. కాంతి మరియు ఆ అమ్మాయి జాతకాలు నప్పాయి. అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తోంది. 20 లక్షల పేకేజి. పీజీ చదువుకుంది. తండ్రి మంచి ఉద్యోగం. తల్లి హౌస్ వైప్. మీరనుకున్నట్లుగానే ఆస్తి, అందం, ఉద్యోగం ఉన్న అమ్మాయి. ఆలోచించి చెప్పండి”.. పరంధామయ్య తన చేతిలోని కాగితాన్ని ఫోటోను శాంత చేతిలో పెట్టాడు. అబ్బాయికి చూపించి తొందరగా చెబితే నేను ముందుకు తీసుకు వెళ్తా. పరంధామయ్య వెళ్ళి పోయాడు.
ఆ రోజు వీకెండు కావడంతో కాంతి ఇంటికి వచ్చాడు. తన్మయి ఫోటో చూపించింది శాంత కొడుకు కాంతికి. శాంత కాంతి చాలా సేపు చర్చించుకున్నారు. వాళ్ళకున్న ఆస్తిపాస్తులు, ఉద్యోగం, ఆర్థిక స్తోమత ఇలా ఆ పెళ్ళి వల్ల వచ్చే అన్ని ఆర్థిక లావాదేవీలును గురించి చాల విపులంగా మాట్లాడుకున్నారు. తల్లి, కొడుకులు తన్మయి తమకు నచ్చిందని తెలియజేసారు.
పరంధామయ్యకు ప్రాణం లేచి వచ్చినట్లు అయ్యింది. పరంధామయ్య రెక్కలు కట్టుకుని తన్నయి ఇంటికి బయలు దేరి వెళ్ళాడు.
***
“మా అమ్మాయికి 20 లక్షల ప్యాకేజి. ఐఐటీలు చదివివ లక్షల సంపాదన ఉన్న పెళ్ళికొడుకులు ఇదిగో చూడండి ఏలా లైనులో ఉన్నారో?”.. తన దగ్గర ఉన్న ఫైలును పరంధామయ్యకు అందచేసింది తన్మయి తల్లి తారకాదేవి. చెప్పకుండానే ఫైలు అందజేసి తన కూతురు తన్మయికి ఉన్న డిమాండ్‌ను గురించి తెలియ జేసింది తెలివిగా తారాకాదేవి.
పరంధామయ్య తారకాదేవి అందజేసిన ఫైలు చూసి ఆశ్చర్యపోయాడు. కొంత సేపటి వరకు నోటంపట మాటరాలేదు. చదువుకున్న వాళ్ళ ట్రీట్‌మెంటు ఇలా ఉంటుందేమో అని అనిపించింది పరంధామయ్యకు.
“మీరనుకున్నట్లుగా అబ్బాయికి నెలకు రెండు లక్షల ప్యాకేజి ఉంది. హ్యేండసమ్‌గా ఉంటాడు, పీజీ చదివాడు, అంతో కొంత ఆస్తి ఉంది. కాని ఆ ఒక్క విషయం వాళ్ళు అంగీకరిస్తారా అన్నదే నా డౌటు”. నీళ్ళు నములుతూ సంశయం వ్యక్త పరిచాడు పరంధామయ్య.
“వాళ్లు ఒప్పుకుంటేనే మనం ముందరకు వెళ్ళుతాం, లేదంటే లేదు”.. తన నిర్ణయాన్ని నిర్మొహమాటంగా మద్యవర్తి పరంధామయ్య ముందు ఉంచింది తారకాదేవి.
“అది”..
“మాకు తన్మయి ఒక్కగానొక్క కూతురు. మా అమ్మాయి ఆనందం మేము కోరుకుంటాం. మాకు కావలసినంత ఆస్తిపాస్తులు ఉన్నాయి. అమ్మాయికి అందం, చదువు మరియు ఉద్యోగం ఉంది. మేమెందుకు తగ్గాలి?”.. ఏదో సర్ధిచెబుదామని అనుకున్న పరందామయ్యతో మరింత మొహమాటం లేకుండానే చెప్పింది తారకాదేవి.
“అవును మీరు అన్నది కరక్టే”.. పరంధామయ్య ఏమి మాట్లాడలేక పోయాడు.
“ఇష్టమైతే మా వారితో మీటింగ్ ఏర్పాటు చేస్తా”. మరి మారు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు తారకా దేవి.
“సరే వారితో మాట్లాడి మీ దగ్గరకు వస్తా”. పరంధామయ్యకు పరిస్ధితి పూర్తిగా అర్ధమైంది.
బయటకు వెళ్తున్న పరంధామయ్యకు ఆలోచనలతో బుర్ర వాచి పోయింది.
“ఎవరు తగ్గేటట్లుగా లేరు. ఎవరికి వారు వారి అహాన్ని ప్రదర్శించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. వివాహ వ్యవస్ధలో స్వార్ధం రాజ్య మేలుతోంది. తమ పిల్లల కంఫర్టును, బాగోగులనే చూసుకుంటున్నారు. రోజులు మారిపోయాయి. నమ్మకం, అవగాహనతో కూడిన వివాహబంధంలో ఒకరిపై మరొకరికి అపనమ్మకం, అవగాహనా రాహిత్యంతో పాటు అహంకారం చోటు చేసుకున్నాయి. స్వార్థం సంకుచితతత్వం చోటు చేసుకుంటోంది. అంతా కలికాలం”.. మనసులో ఆలోచనలు పరుగులు పెడుతుంటే పరంధామయ్య శాంతమ్మ ఇంటివైపు బయలు దేరాడు.
***
“అమ్మా శాంత బాగా చెప్పి చూసాను. అమ్మాయి మాత్రం తల్లి తండ్రులు ఉన్న ఊరు వదిలి రాదుట, వాళ్ళు పంపడానికి ఇష్టపడుట లేదు. అంటే ఒకరకంగా మన మాటలలో ఇల్లరికం అన్న మాట. కాని ఒకటి మాత్రం నిజం. వాళ్ళు చాలా మంచి ఆస్తిపరులు. డబ్బు ఉండడం వల్ల ఆ మాత్రం బింకం ఉండడం సహజమే అని నాకు అనిపించింది”.
“అంటే?”..
“అమ్మా శాంత, మన రోజులు కాదు. పెళ్ళి కుదుర్చుకునేటప్పుడు అటు ఆరు తరాలు ఇటు ఆరు తరాలు చూసి కుదుర్చుకునే వాళ్ళం. కాని ఇప్పుడు ప్యాకేజీలు, ఆస్తులు అంతస్తులు తప్ప మనుషుల మంచితనం, ప్రేమ అభిమానాలు ఏమి చర్చల లోకి రావటం లేదు. మీరు ఆలోచించి తెలియజేస్తే నేను వారికి మీ సహమతిని తెలియజేస్తాను. సరేనా”.
***
ఆ రాత్రి శాంత, భర్త కుటుంబరావు తన్మయి సంబంధం గురించి బాగా చర్చించారు. తాము ఆశించిన అంశాలన్నీ ఈ సంబంధంలో ఇంచుమించు తమకు అందుబాటులో ఉండడం శాంతకు బానే నచ్చింది. తన కొడుకు భవిష్యత్‌కు లోటు ఉండదు. వాడి ఆర్థిక స్తోమతకు ఎటువంటి ఢోకా ఉండదన్న పూర్తి నమ్మకం శాంతకు కుదరడంతో ఆటు ఇటుగా ఊగిసలాడుతున్న భర్త కుటుంబరావును తన మాటలతో ఒప్పించగలిగింది శాంత. అన్ని విషయాలు ఒకే అయినప్పుడు పిల్లవాడు వాళ్ళదగ్గరే ఉండాలి అన్న విషయం శాంతకు పెద్దగా అడ్డుపడలేదు. ఎక్కడ ఉన్నా తన కొడుకు సుఖంగా ఉంటే చాలదా?
తాను కాంప్రమైజు అయ్యి, భర్తను కాంప్రమైజు చేయగలిగింది శాంత.
శాంత ఐడియాలజీతో ఏకీభవించే కాంతి తల ఊపాడు.
***
కాంతి మరియు తన్మయి ఒకరు నొకరు కలిసారు. చర్చించుకున్నారు. కాంతికి తన్మయితో మాటలలోను కాంప్రమైజు కాక తప్పలేదు. ఇద్దరు ఇష్టపడ్డారు. లేదు కాంతి ఇష్ట పడవలసి వచ్చింది. కారణం కాంతికి పరిస్ధితులు పూర్తిగా అర్ధమైయ్యాయి. తాను ఆశించిన భవిష్యత్‌కు ఈ కాంప్రమైజు తప్పదని కాంతికి అవగతమైంది. పెళ్ళి కుదరడము అంత తేలిక కాదన్న విషయం అప్పడికే అర్ధమైంది. వాస్తవం తెలిసొచ్చింది. వచ్చిన ఛాన్స్‌ను వదులుకుంటే జరిగే పరిణామాలు బాగా అవగతమైయ్యాయి. ఇద్దరు ఒకే అనుకున్నారు. కుటుంబరావు మౌనంగా ఉన్నా శాంత మాత్రం తన మనసులోని గుబులును దాచి పైకి గాంభీర్యాన్ని ప్రదర్శించింది. విషయం పెళ్ళి మాటలు వరకు వెళ్ళింది.
***
తారకా దేవి తన ఇంటి లాన్స్‌లో ఆరు బయట అందరు కూర్చున్నారు. అర్ధగంట తరువాత తారకాదేవి భర్త కామేశ్వర్ వచ్చాడు. సూటు బూటుతో వచ్చి తన సీటులో కూర్చున్నాడు.
“ఆలస్యం అయ్యింది సారీ”.. కూర్చునే కుటుంబరావుకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు కామేశ్వర్. కుటుంబరావు తన రెండు చేతులు కలిపి నమస్కారం చేసాడు కామేశ్వర్‌కు. అక్కడ ఉన్న సర్వర్లు అన్నీ సర్వచేసారు. కుటుంబరావుకు అక్కడి వాతావరణం కొంత అనీజీగానే అనిపించింది. శాంత మాత్రం తారాకాదేవితో మాట కలుపుతూ బిజీగా ఉంది.
“విషయాలన్నీ తారకాదేవిగారు మాట్లాడారు. ఇచ్చి పుచ్చుకోవడాలు గురించి”.. పరంధామయ్య విషయాన్ని ముందుకు తీసుకు వెళ్దాం అన్నట్లుగా ప్రస్తావించాడు కామేశ్వర్ ముందు.
“నో ఇష్యు. మీకు ఏం కావాలో మా దేవీకి తెలియ జేయండి. అన్నీ ఏర్పాట్లు జరుగుతాయి. కాని ఒక్క మాట”… కామేశ్వర్ ఒక్క నిమిషం మౌనంగా ఉన్నాడు. తరువాత చెప్పాడు. “నాకు తన్మయి ఒక్కగా నొక్క కూతురు. ఆ అమ్మాయికి కావలసినట్లుగానే అన్నీ జరగాలి. నో కాంప్రమైజు. ఆ అమ్మాయి మనసు బాధ పడితే మాత్రం నేను”.. చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పకుండానే లేచి నుంచున్నాడు. “అర్జంటు మీటింగ్ ఉంది. దేవి యు కేరీ ఆన్.. ఒకే” .. షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళి పోయాడు కామేశ్వర్. అతని వెనుక పిఏ మరి కొందరు వెళ్ళి పోయారు. వెళ్తున్న కామేశ్వర్ వైపు చూస్తు ఉండి పోయాడు కుటుంబరావు.
మరో అర్ధగంట అందరు కలిసి మాట్లాడు కున్నారు.
“శుభం, శీఘ్రమేవ కల్యాణమస్తు. అమ్మా కాంతి మరియు తన్మయిల ‘పెళ్ళి కుదిరింది’. మంచి లగ్నం చూసి తాంబూలాలు, పెళ్ళి తదితర మిగిలిన విషయాలు ఫిక్స్ చేసుకుందాం”. పరంధామయ్య ఆనందంగా అందరి ముందు ప్రకటించాడు.
***
అనుకున్నట్లుగానే రంగరంగ వైభవంగా పెళ్ళి జరిగిపోయింది. కామేశ్వర్ గారు అనుకున్నట్లుగానే అనుకున్నవన్నీ తన వంది మాగదులతో ఏర్పాటు చేసి దిగ్విజయంగా పెళ్ళి తంతు పూర్తిచేసారు. ఎంతో హుందాగా జరిగిన కాంతి పెళ్ళిని చూసి శాంత మురిసిపోయింది. తన కొడుకు సాధించిన దానికి తగ్గ సంబంధాన్ని తాను చేయగలిగానని ఆనంద పరవశురాలైంది శాంత. శాంత చెప్పిన దానికి తల ఊపాడు పరమేశ్వరం. పెళ్ళి కుదిర్చినందుకు పరంధామయ్యకు బానే ముట్టింది. ఇటు శాంత, కాంతి అందరు హ్యాపీ.
***
“పెళ్ళి అయ్యాకా .. వాళ్ళ మద్య సంతోషం నిలవడానికి ఉన్న వాతావరణం సహకరించలేదు. మనుషులు మనస్తత్వాలు కలవలేదు. అగాధాలు ఏర్పడ్డాయి. అపోహలు పెరిగాయి. ఈగోలు డామినేట్ చేసాయి. వెరసి వాళ్ళ మద్య దూరాలు పెరిగాయి, విడాకులు వరకు వెళ్ళాయి.”
శాంత చెప్పిన మాటలును బట్టి పరంధామయ్యకు పరిస్ధితులు విడాకులు వరకు ఎలా వెళ్ళాయో అవగతమైంది.
పరంధామయ్య పెళ్ళి కుదర్చగలిగాడు, కాని వాళ్ళ మధ్య సంధి కుదర్చలేక పోయాడు. అందుకే అసహాయతను వ్యక్తపరిచాడు శాంత ముందర.
తానే కాదు, తనలాంటి వాళ్ళు ఎవరు, చదువుకున్నఇలాంటి వాళ్ళ మద్య సయోద్య కుదర్చలేరు.
ఇది పరంధామయ్యకు అనుభవం నేర్పిన పాఠం.
***
పరంధామయ్యకు శాంత మాటలు విని, ఆమె పరిస్ధితిని చూసిన తరువాత ఇంటికి వెళ్ళినా ఎంత ప్రయత్నించిన నిద్ర రాలేదు. తాను చూసిన ఆనాటి మరియు చూస్తున్న ప్రస్తుత పరిస్ధితులు బేరీజు వేసుకుని ఆలోచనలుతో బుర్ర వేడెక్కింది.
ఈనాటి యువతకు వివాహం గురించి సరియైన అవగాహన లేదు. వివాహం – జీవితానికి ఉన్న సంబంధంపై వివరించి చెప్పే వారు లేరు. చెప్పిన వినే ఓపిక లేని చదువుకున్న యువత, ఎవరికి వారు తమకు మించిన పెద్ద-పెధ్ధ లక్ష్యాలు పెట్టుకుని, వాటిని సాధించడంలోనే తమ యవ్వనం అంతా గడిపేస్తున్నారు. వివాహం చేసుకునే టైముకు వయసు మళ్ళడంతో సమస్యలు ఎదురు అవుతున్నాయి. సమస్యలు అధిగమించే సమయం, ఓపికా యువతకు కరువయ్యి వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఇలా మరి ఎన్నో కారణాలు వివాహ వ్యవస్ధతో పాటు యువతను నిర్వీర్యం చేస్తున్నాయి.
దీనికి తోడు పాశ్చాత్య పోకడలు యువత పై చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
“వివాహ వ్యవస్ధలో వ్యాపార ధోరణులు తొంగి చూడడం మొదలవడంతో ఈ అనార్థాలు దాపురించాయి”.. అన్న కొంత మంది మాటలు పరంధామయ్య చెవులకు చేరాయి.
“అన్ని ఉన్నా పెళ్ళిళ్లు ఆలస్యమైపోతున్నాయి. పెళ్ళిళ్ళు కుదిరినా కాపురాలు కుదురుగా ఉండటల్లేదు. చిన్న చిన్న కారణాలుతోనే విడాకులు వరకు వెళ్ళి కాపురాలు కూలిపోతున్నాయి.” పిల్లల వివాహాలు విషయంలో తల్లడిల్లి పోతున్న తల్లితండ్రుల ఆవేదనలు పరంధామయ్య విన్నాడు.
వెరసి వివాహ వ్యవస్ధ సమాజానికి ఒక ఛాలెంజిగా మారింది పరంధామయ్యకు అవగతమైంది.
వివాహం రెండు కుటుంబాలను కలుపుతుంది. వివాహం ద్వారా కుటుంబ వ్యవస్ధ పటిష్టమవుతుంది. గౌరవం పెరుగుతుంది. నమ్మకం, అవగాహన పెళ్ళి బంధాలను పటిష్ఠ పరుస్తాయి. అవగాహన లోపిస్తే వివాహ మరియు కుటుంబ వ్యవస్ధలు బీటలు వారుతాయి. చాలా మందికి విషయాలు అన్ని తెలుసు. కాని ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవటల్లేదు. ఎవరి వెసులుబాటు వారిది. సమాజంలో హెచ్చుమీరుతున్న పోకడలు, క్షీణిస్తున్న వివాహ వ్యవస్ధ పై వస్తున్న ఆలోచనలు 40 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉన్నపరంధామయ్యకు నిద్ర పట్టనివ్వలేదు. కాని చేయగలిగింది ఏమీ లేదు.
అందుకే నిస్సహాయంగా నిద్రలోకి జారుకోవడానికి చేసిన ప్రయత్నంలో నెమ్మదిగా ఫలించి కునుకు తీసాడు.
