[ఆదోని బాషా గారు రచించిన ‘పెంపకం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
“నువ్వు రాంబాబు కొడుకు రాజువి కదూ?” రైల్లో నాకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి ప్రశ్న విని తలెత్తి చూశాను. చూడగానే గుర్తుపట్టాను.
“అరే, కాంతారావు అంకుల్, మీరా?” ఆశ్చర్యంగా అడిగాను.
“అవును రాజు, చాలా కాలం తర్వాత నిన్ను చూడ్డం వల్ల వెంటనే గుర్తుపట్టలేకపోయాను. నువ్వు బెంగళూరులో జాబ్ చేస్తున్నావని మీ నాన్న చెప్పాడు. నిజమేనా?” అన్నాడాయన.
“అవును అంకుల్. ప్రతి నెల రెండో శనివారం ఊరి కెళుతుంటాను. ఇప్పుడలాగే వెళుతున్నాను. మీరూ మన ఊరికేనా?” అనడిగాను.
“అవును. ఓ పని మీద బెంగళూరు కొచ్చాను. పని ముగించుకొని తిరిగి వెళుతున్నాను. నీ ప్యాకేజీ ఎంత అని మీ నాన్నను అడిగితే తనకు తెలీదన్నాడు. నువ్వు చెప్పలేదా?” కాంతారావు అడిగాడు.
“అయన ఎప్పుడూ అడగలేదు అంకుల్” కాస్త చిరాగ్గా అన్నాను.
“అయినా మీ నాన్న అడిగే వరకు చెప్పకూడదా?”
“నాన్న స్వభావం గురించి మీకు తెలియదు అంకుల్. నాతో ఎప్పుడు మాట్లాడినా సిటీలో ఎలా ఉండాలి? ఉద్యోగం ఎలా చెయ్యాలి? అంటూ హితబోధ చేస్తుంటాడు తప్ప జాబ్, ప్యాకేజీల గురించి అడగడు. అడగకపోతే ఎందుకు చెప్పాలి? మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. నా ప్యాకేజీ ఆరు లక్షలు” అన్నాను. నా జవాబు విని కాంతారావు అంకుల్ కాస్సేపు మౌనంగా ఉండిపోయారు.
మా నాన్న, కాంతారావు బాల్య మిత్రులు. ఇద్దరు మా ఊర్లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేసి ఈ మధ్యనే రిటైరయ్యారు. కాంతారావు కొడుకు రవికి నా వయసే ఉంటుంది. మేమిద్దరం మా ఊర్లోని కాలేజిలోనే చదువుకున్నాం. ఇంటర్ అయ్యాక ఇద్దరం ఎంసెట్ పరీక్ష రాశాం. నాకు మంచి మార్కులు రావటంతో హైదరాబాద్ లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు దొరికింది. రవిని కాంతారావు అంకుల్ లక్షలు ఖర్చు పెట్టి చెన్నై లోని ఓ ఖరీదైన కార్పొరేట్ కాలేజీలో చేర్పించారు. ఈపాటికి రవి అమెరికా లేదా ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తూ కోట్లు సంపాదిస్తూ ఉండొచ్చు.
“రాజూ, నీ జీతంలోంచి మీ నాన్నకు ఎంత డబ్బు ఇస్తున్నావ్?” ఉన్నట్టుండి అడిగారు కాంతారావు.
“నాన్న ఎప్పుడూ డబ్బు అడగలేదు అంకుల్. అయినా ఆయనకు డబ్బు ఎందుకివ్వాలి? ఆయన నా చదువు కోసం పెద్దగా ఖర్చు పెట్టలేదు. మీకు గుర్తుందా? మీ అబ్బాయి రవి, నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం. మీరు రవి కోసం కొత్త సైకిల్ కొన్నారు. కాని నాన్న నాకు పాత సైకిల్ కొనిచ్చాడు. మీరు రవికి స్మార్ట్ ఫోన్ కొనిస్తే నాన్న నాకు తన దగ్గరున్న పాత ఫీచర్ ఫోన్ ఇచ్చాడు. రవికి ఎంసెట్ లో తక్కువ ర్యాంక్ వచ్చినా మీరు లక్షలు ఖర్చు పెట్టి అతన్ని మంచి కార్పొరేట్ కాలేజీలో చేర్పించారు. కాని నాకు మంచి ర్యాంక్ వచ్చినా నాన్న కౌన్సిలింగ్ లో దొరికిన ప్రభుత్వ కాలేజీలోనే నన్ను చేర్పించాడు. ప్రభుత్వ హాస్టల్లో ఉండి నేను కష్టపడి చదువుకున్నాను. నాన్న అవసరానికి మించి నాకు ఒక్క రూపాయి కూడా పంపించేవాడు కాదు. సినిమాలు, షికార్లకు వెళ్ళాలన్నా హాస్టల్ వార్డెన్ వద్ద అప్పు చేసేవాణ్ణి. చివరికి ఖర్చుల కోసం కొందరు ఇంటర్ విద్యార్థులకు ట్యూషన్లు కూడా చెప్పాను” ఆవేదనగా అన్నాను.
“డబ్బు విషయంలో ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నావని నువ్వు మీ నాన్నను ఎప్పుడూ అడగలేదా?” కాంతారావు అడిగారు.
“చాలా సార్లు అడిగాను అంకుల్. కాని ప్రతిసారి అరిగిపోయిన రికార్డులా బాల్యంలో తను పడిన కష్టాల గురించే చెప్పేవాడు. ఇంట్లో కరెంట్ సౌకర్యం లేకపోతే వీధి దీపం వెలుగులో చదువుకున్నాననీ, పుస్తకాలు కొనే స్తోమత లేకపోతే ఇతరుల వద్ద పుస్తకాలు ఇప్పించుకొని చదువుకున్నాననీ.. ఇంకా చాలా విషయాలు చెప్పాడు. అదంతా నిజమే కావచ్చు. తాతయ్య పేదవాడు కాబట్టి నాన్నను చదివించలేకపోయాడు. కాని నాన్న వద్ద డబ్బు వున్నా నా చదువు కోసం ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఎంసెట్‌లో నాకు మంచి ర్యాంక్ వచ్చినా కార్పొరేట్ కాలేజీలో చేర్పించకుండా కౌన్సెలింగ్‌లో ఫ్రీ గా దొరికిన కాలేజీలో ఎందుకు చేర్పించాడు? అక్కడ కూడా ఎక్కువ డబ్బు పంపేవాడు కాదు. నా అవసరాలు తీర్చుకోవటం కోసం హాస్టల్ వార్డెన్ వద్ద అప్పు చేస్తున్నా, ట్యూషన్లు చెబుతున్నానని తెలిసినా నాన్నకు నా పైన జాలి కలగలేదు. దీన్ని బట్టి నాన్న ఒట్టి డబ్బు మనిషి అని తెలుస్తోంది కదా అంకుల్” ఉక్రోషంగా అన్నాను.
“దీన్ని బట్టి నువ్వు మీ నాన్నను సరిగ్గా అర్థం చేసుకోలేదని తెలుస్తోంది రాజు. అయినా ఇందులో నీ తప్పు లేదులే. మీ నాన్నకు బాల్య మిత్రుడైన నేనే అతన్ని అర్థం చేసుకోలేకపోయాను. నువ్వెలా అర్థం చేసుకోగలవు?” నర్మగర్భంగా అన్నాడు కాంతారావు.
“మీరేం చెప్పదల్చుకున్నారు అంకుల్?” అసహనంగా అడిగాను.
కాంతారావు ఓసారి దీర్ఘంగా నిట్టూర్చి చెప్పారు. “మీ నాన్న గురించి నాకు తెల్సినంతగా బహుశా మీ అమ్మకు కూడా తెలీదేమో. ఎందుకంటే మేమిద్దరం బాల్య మిత్రులం. చిన్నప్పుడు మా ఇళ్ళు పక్కపక్కనే ఉండేవి. నాది మధ్య తరగతి కుటుంబమైతే మీ నాన్నది పేద కుటుంబం. పైగా నలుగురు ఆడపిల్లల తర్వాత మీ నాన్న పుట్టాడు. దాంతో మీ తాతయ్య మీ నాన్నను స్కూలుకు కూడా పంపలేకపోయాడు. మీ నాన్నను స్కూల్లో చేర్పిస్తేనే నేను కూడా స్కూలుకి వెళతానని నేను ఇంట్లో మారాం చేశాను. అప్పుడు మా నాన్న నా కోసం మీ నాన్నను కూడా స్కూల్లో చేర్పించి పుస్తకాలు ఇప్పించాడు. అలా ఇద్దరం కలసి మెలసి చదువుకున్నాం. నా పాత దుస్తులు, పాత చెప్పులు మీ నాన్నకి ఇచ్చేవాణ్ణి. మీ తాతయ్య ఇంట్లో ఒక్కోసారి ఉదయం టిఫిన్ కూడా వండేవారు కాదు. అప్పుడు మీ నాన్న కోసం మా ఇంట్లోంచి టిఫిన్ తెచ్చి ఇచ్చేవాణ్ణి. ఇద్దరం కాలేజీలో చేరాక మా నాన్న నాకు కొత్త సైకిల్ ఇప్పించాడు. అప్పుడు ఇద్దరం జంటగా సైకిల్ పై కాలేజీకి వెళ్ళేవాళ్ళం. నేను వద్దన్నా వినకుండా ప్రతిసారి మీ నాన్నే సైకిల్ తొక్కేవాడు. కాలేజీ రోజుల్లోనే మీ నాన్న ఉదయం పూట దిన పత్రికలు అమ్ముతూ, సాయంత్రం పదో తరగతి విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ తన చదువును కొనసాగించాడు. ఇద్దరం బీఎడ్ వరకు చదువుకున్న తర్వాత మంచి మార్కుల వల్ల మీ నాన్నకు వెంటనే ఉద్యోగం దొరికింది. నేను ఎమ్మెల్లే సిఫార్సుతో ఉద్యోగం తెచ్చుకున్నాను” అంటూ చెప్పటం ఆపారు కాంతారావు.
“నాన్న బాల్యంలో కష్టపడి చదువుకున్నాడని ఒప్పుకుంటాను అంకుల్. కాని ఆయన కష్టాలకు నేను కారకుణ్ణి కాదు కదా. విధి చేసిన దానికి నాపైన ఎందుకు కసి తీర్చుకున్నాడు?” చిరాగ్గా అన్నాను.
“అది కసి కాదు, అభద్రతా భావం. నేను చిన్నప్పుడు ఏ లోటు లేకుండా పెరిగాను కాబట్టి నాకు అలాంటి అభద్రతా భావం లేదు. అందువల్ల నేను కూడా నీలాగే ఆలోచించాను. పిల్లల్ని ఏ లోటు లేకుండా పెంచాలని మీ నాన్నతో వాదించేవాణ్ణి. మా రవిని అలాగే పెంచాను కూడా. లక్షలు డొనేషన్ కట్టి మంచి కాలేజీలో చేర్పించాను. హాస్టల్‌కి బదులు అన్ని సౌకర్యాలున్న ఓ అద్దె గది ఇప్పించాను. తిరగటానికి బైకు, కాలక్షేపం కోసం స్మార్ట్ ఫోన్ కొనిచ్చాను. మీ నాన్నలా కాకుండా మా వాడు అడిగినంత పాకెట్ మనీ ఇచ్చాను. కాని నా పధ్ధతి మీ నాన్నకు నచ్చలేదు. మన వద్ద ఎంత డబ్బు వున్నా పిల్లల్ని ఆడంబరంగా పెంచకూడదు అనేవాడు. కాని పిల్లల సరదాలు తీర్చకపోతే రేపు పెద్దయ్యాక మనల్ని శత్రువుల్లా చూస్తారని నేను వాదించేవాణ్ణి. మొత్తానికి పిల్లల పెంపకం విషయంలో ఇద్దరం పరస్పరం భిన్నంగా ఆలోచించాం. మా ఆలోచనలకు తగ్గట్టు పిల్లల్ని పెంచాం. ఆ పెంపకం ఫలితాలు ఇప్పుడు మా కళ్ళ ముందున్నాయి. నేను ఏ లోటు లేకుండా పెంచినందుకు మా వాడికి నేనంటే ప్రాణం. నా కోసం ప్రాణం ఇమ్మన్నా ఇస్తాడు. మరో పక్క నిన్ను డబ్బుకు ఇబ్బంది పెట్టి చదివించిన మీ నాన్న పట్ల నీకు ప్రేమ లేదు. మా ఇద్దరి పెంపకం భిన్నంగా ఉండటం వల్ల కన్న తండ్రి పట్ల మీ ఇద్దరి వైఖరి కూడా పరస్పరం భిన్నంగా వుంది” అన్నారు కాంతారావు.
“అంతే కదా అంకుల్. మనం ఒకరికిచ్చేదే తిరిగి మనకు లభిస్తుంది అంటారు పెద్దలు. మీరిద్దరి విషయంలో అదే జరిగింది” అన్నాను.
“కాని అది నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు దీనికి పూర్తి భిన్నమైన ఫలితం దాగి వుంది. నేను మా వాడికి డబ్బుతో కొనగలిగే సౌకర్యాలను, సుఖాలను ఇచ్చాను కాని డబ్బుతో కొనలేని విద్యనూ, ఆత్మ విశ్వాసాన్ని ఇవ్వలేకపోయాను. వాడు కోరింది ఇస్తే నా పట్ల కృతజ్ఞతా భావంతో శ్రద్ధగా చదువుతాడనుకున్నాను. కాని వాడు విలాసాలకు అలవాటు పడి చదువును నిర్లక్ష్యం చేశాడు. తక్కువ మార్కులతో పాసయ్యాడు. అంత మంచి కాలేజీలో చదివినా వాడికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. దాంతో తీవ్రమైన నిరాశకు గురై ఆత్మహత్యా యత్నం చేశాడు. మీ నాన్న సలహాపై ఇప్పుడు వాణ్ణి ఓ సైకియాట్రిస్ట్‌కి చూపిస్తున్నాను” బాధగా అన్నారాయన.
నేను నివ్వెరబోయాను. “ఇందులో మీ తప్పేమీ లేదు అంకుల్. మీరిచ్చిన స్వేచ్ఛను రవి దుర్వినియోగం చేశాడు” అన్నాను.
“లేదు రాజు, తప్పు నాదే! నేను మీ నాన్న మాట వినలేదు. మీ నాన్న నీకు కష్ట సుఖాలు తెలిసేలా పెంచాడు. అందుకే నీలో కష్టాలకు తట్టుకొనే శక్తి, ఆత్మ విశ్వాసం పెంపొందాయి. అందుకే కష్టపడి చదివి మంచి ఉద్యోగం తెచ్చుకున్నావు. మరోపక్క నేను మా వాడికి కష్టం తెలియకుండా పెంచాను. అందువల్ల వాడిలో కష్టపడే గుణం, ఆత్మవిశ్వాసం పెంపొందలేదు. జీవితంలో వైఫల్యాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇప్పుడు చెప్పు, మా ఇద్దరిలో ఎవరి పెంపకం సరైనది?” సూటిగా అడిగారు కాంతారావు.
నేను జవాబు చెప్పలేక తల దించుకున్నాను. కాంతారావు అంకుల్ చెప్పటం కొనసాగించారు. “నీలాగే నేను కూడా మీ నాన్నను అపార్థం చేసుకున్నాను. పిసినారి, స్వార్థపరుడు అనుకున్నాను. మీ నాన్న చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. చిన్నప్పటి నుంచే పిల్లలకు కష్టాల్ని అలవాటు చెయ్యాలనేవాడు. తప్పటడుగులు వేసే పిల్లవాడు కింద పడి ఏడుస్తుంటే జాలిపడి వాణ్ణి వెంటనే లేపకూడదు. వాడంతట వాడు లేచి నిలబడేలా వాణ్ణి ప్రోత్సహించాలి. రెండు మూడు ప్రయత్నాల తర్వాత వాడు లేచి నిలబడతాడు. అప్పుడు వాడిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మరోసారి కింద పడితే ఎవరూ లేపరని జాగ్రత్తగా నడుస్తాడు. ఒకవేళ మళ్ళీ కింద పడ్డా ఏడవకుండా ధైర్యంగా లేచి నిలబడతాడు. అలా చిన్నప్పుడే పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెరిగితే వారు పెద్దయ్యాక జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుంటారు అనేవాడు మీ నాన్న. అందుకే నీకు కష్ట సుఖాలు తెలిసేలా పెంచాడు. అవసరానికి మించి డబ్బు ఇవ్వలేదు. తను చిన్నప్పుడు పడిన కష్టాల వల్ల అభద్రతా భావానికి గురైన మీ నాన్న నీ విషయంలో అతిగా జాగ్రత్తలు తీసుకున్న మాట నిజమే. కాని నువ్వు అనుకుంటున్నట్టు మీ నాన్న పిసినారి కాడు. ఆయన ఎంతో మంది పేద విద్యార్థులకు సాయం చేయటం నేను కళ్ళారా చూశాను. అంతెందుకు? మా వాడి చదువు కోసం నేను చేసిన అప్పు తీర్చలేక తాకట్టు పెట్టిన ఇంటిని అమ్మబోతుంటే అడ్డుకొని తను సేవింగ్స్ చేసిన డబ్బుతో నా అప్పు తీర్చి నా కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకున్నాడు. ఆ విధంగా చిన్నప్పుడు నేను చేసిన సాయానికి బదులు తీర్చుకున్నాడు. అలాంటి వ్యక్తి పిసినారి ఎలా అవుతాడు? తను చేసిన మంచి పనుల్ని సైతం చెప్పుకోవటానికి ఇష్టపడని నిస్వార్థ జీవి మీ నాన్న” ఉద్వేగంగా పలికాడు కాంతారావు.
అంతవరకు నాన్న గురించి నాకు తెలియని ఒక్కో నిజం తెలుస్తున్న కొద్దీ బాధతో నా గుండె బరువెక్కసాగింది. కాంతరావు అంకుల్ చెప్పటం ఆపలేదు. “మీ నాన్న ఓ పక్క నీకు అడిగినంత డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా మరో పక్క అత్యవసర సమయాల్లో నీకు డబ్బు అందే ఏర్పాట్లు కూడా చేశాడు. నీకు అవసరం కలిగినప్పుడు అప్పు ఇవ్వమని ఆ హాస్టల్ వార్డెన్‌కి ముందుగానే మీ నాన్న డబ్బు ఇచ్చాడు. లేకపోతే ఎవరికీ అప్పు ఇవ్వని వార్డెన్ నీకొక్కడికే అప్పు ఎందుకు ఇస్తాడు? తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించే బాధ్యత ఉంటేనే నువ్వు ఆ డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెడతావనే ముందు చూపుతో మీ నాన్న నేరుగా నీకు డబ్బు ఇవ్వకుండా అప్పు రూపంలో డబ్బు అందే ఏర్పాటు చేశాడు. మీ నాన్న చేసింది మూర్ఖత్వం అని అప్పట్లో నాకు అనిపించింది. కాని ఇప్పుడు ఫలితం చూశాక నేను ఆలోచించిందే మూర్ఖత్వమని అర్థమైంది. మరో సంగతి! ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించమని వార్డెన్ చేత నీకు సలహా ఇప్పించింది కూడా మీ నాన్ననే. ట్యూషన్లు చెప్పటం వల్ల డబ్బుతో పాటు జ్ఞానం కూడా లభిస్తుందని మీ నాన్నకు అనుభవపూర్వకంగా తెలుసు. నీకు కనపడకుండా మీ నాన్న నీ కోసం ఇంకా చాలా పనులు చేశాడు. వాటి గురించి నీకు చెప్పలేదు. చాలా మంది పిల్లలు తల్లి ప్రేమను అర్థం చేసుకున్నట్టు తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేరు. ఎందుకంటే తల్లి పిల్లల వర్తమానం గురించి ఆలోచిస్తుంది. కాని తండ్రి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. ఇద్దరి ప్రేమ సమానమే అయినా తల్లి ప్రేమ కనపడినట్టు తండ్రి ప్రేమ కనపడదు. అందుకే చాలా మంది పిల్లలు తండ్రిని అపార్థం చేసుకుంటారు. దానికి నీ జీవితమే ఒక ఉదాహరణ” అంటూ చెప్పటం ముగించారు కాంతారావు.
నా గుండె బ్రద్ధలైంది. అంతవరకు నాన్నను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానో బోధపడగానే పశ్చాత్తాపంతో నా కళ్ళల్లోంచి కన్నీళ్ళు జలజల రాలాయి. ఇప్పుడు నా దృష్టిలో నాన్న హిమాలయాలంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఇంటి కెళ్ళగానే ఆయన కాళ్ళపై పడి క్షమాపణ అడగాలని నిర్ణయించుకున్నాను.
