Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పెంపకం

[శ్రీమతి కోసూరి జయసుధ రచించిన ‘పెంపకం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

అక్షరం ముక్క రాకపోయినా
అమ్మ నేర్పిన సంస్కారం
లక్కలా అంటిపెట్టుకొనే వుంది.

అమ్మ పొదుగులో చేరిన తువ్వాయి,
ఆనందాన్ని జుర్రుతుంటే..
ఓ తీపి పూతేదో హృదయాన్ని తాకి
అబ్బురపడ్డమేగా పెంపకమంటే..!

సూరీడు చురచురలు
నాన్న వీపుఫై చెళ్ మనిపిస్తుంటే
కాపు కాసిన అమ్మ చీరేగా పెంపకమంటే..!

తంగేడు పూలతో తంపులాడుతూ
చెంగున మిఠాయి,
తమ్ముడి కోసం దాచిపెట్టిన
చిట్టి చెల్లి ప్రేమేగా పెంపకమంటే..!

తలను నిమిరేటప్పుడు
నాన్న చేతుల్లో గుత్తులుగా పూసిన
ప్రేమ ముందు ఉండచుట్టిన
మా దిగులంతా దిగదుడుపేగా..!

వారు నాటిన విజ్ఞతల విత్తు
పెరిగి ఎందరికో నీడనిచ్చే చెట్టయ్యింది.
వద్దనుకున్నా వదలలేనితనాన్ని నేర్పించింది.

ఎన్ని వేల నిద్రలేని రాత్రులో
మా దుఃఖపు ఖాతాలో జమయ్యాయి.
కష్టాన్ని ఇష్టంగా ఓదారుస్తూ పెంచిన పెంపకం..
మా సంతోషపు ఆనవాళ్ళను
ఓ సంతకంగా చేసే రోజు కోసం పరితపించాయి..!

వారి ఒక్కో మాట తేనె ఊఁటై
మనసును తీపి చేస్తుంటే…
పారేసుకున్న బంగారు బాల్యం
గాలిపటమై ఎగిరింది.

ఈ సమాజ దేహానికి
నేనో ఆదరణ వస్త్రమై
చుట్టుకునే వేళ అమ్మ ప్రేమ
కన్నీరై జారింది..!

రాలిన నిన్నల్లో
ఈనాటి ఆశలు
పచ్చగా నవ్వడమేగా
పెంపకమంటే..!!

పరాకుగా నేలరాలిన
ఆ పరిమళాలే…
దాచుకున్న వాక్యాలుగా
సమాజపు పుటల్లో
నెమలీకలై నవ్వాయి..
శిఖరాన్నంటిన
వారి ఆత్మస్థైర్యపు చూపు సాక్షిగా..!!

Exit mobile version