Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పెంపకం

[శ్రీమతి శ్రావణి జన్నాభట్ల రచించిన ‘పెంపకం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“ఇంటి ఆడపడుచు అంటే అలగచ్చు, పెత్తనం చెలాయించొచ్చు, ఎన్నైనా మాటలు అనొచ్చు కానీ కోడలు మాత్రం ఏమీ మాట్లాడకుండా అన్నిటినీ భరిస్తూ ఉండాలి. అంతేగా!” అంటూ వంటింట్లోంచి అరుస్తోంది.

“అబ్బా! జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకా విషయాన్ని వదిలేసేయ్” అన్నాను.

“ఏంటి వదిలేసేది? ఇదేమైనా చిన్న విషయమా? నేనేదో కావాలని పెళ్లి సంబంధం చెడికొట్టినట్టు అన్ని మాటలు అంటుంటే మీరు అన్ని విని ఊరుకున్నా రు. కనీసం ఏం జరిగిందో కూడా వాళ్లకి..” మాట పూర్తిచేసే లోపలే..

“ఇంకా చాలు. ఈ పెళ్లి జరగట్లేదని వెళ్లి మాట్లాడొచ్చాము కదా! ఇంకా విషయం అంతటితో అయిపోయినట్టే” అంటూ సీరియస్‌గా చెప్పి ఇంట్లోంచి వరండాలోకి వచ్చేశాను.

***

రెండేళ్ల తర్వాత..

“ప్రతీ పని నేనే చేయాలంటే నా వల్ల కావడం లేదు. ఇంక రమ్య ఇక్కడ ఉండి ఏర్పాట్లు చేయకపోనూ అక్కడ ఎక్కడో అమెరికాలో కూర్చుని దాని పిల్ల ఓణీల ఫంక్షన్‌కి ఇది కావాలి అది కావాలి అని ఆర్డర్లు. ఇక్కడ పనులు ఎవరు చేస్తారు? మీరు ఇంట్లో ఇటు పుల్ల తీసి అటు పెట్టరు కదా!” ఓపిక లేక వస్తున్నాయి ఆమె మాటలు.

“వాళ్లు బాగా చదువుకొని అంత మంచిగా అక్కడ సెటిల్ అయినందుకు ఆనందించాలి” అంటూ పిల్లల్ని సపోర్ట్ చేశాను.

ఆమె నుంచి తిరిగి ఎటువంటి జవాబు రాకపోయేసరికి వంటింట్లోకి వెళ్లి ఏమిటా అని చూసేసరికి..

“విజయ.. విజయకి మనకి మధ్యన సంబంధాలు బాగుండి ఉంటే ఈపాటికి మన ఇంట్లో ఈ ఫంక్షన్‌కి దాని హడావిడే ఎక్కు వగా ఉండేది కదండీ” అంటూ ఆడపడుచు గురించి తలుచుకొని బాధపడిన రోజులు గుర్తుకొస్తున్నాయి.

ఇంతలో.. “సార్! సార్!” అంటూ పక్క నుంచి పిలుస్తున్నాడు కాంపౌండర్.

ఏమైంది అన్నట్టు ఎర్రబడిన కళ్ళతోటి అతని వైపు చూశాను.

“డాక్టర్ గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారండి”.

లోపలికి వెళ్లి డాక్టర్ని కలిశాను. డాక్టర్ విషయం మొత్తం వివరించాడు. తట్టుకోలేని నిజం. అందరికీ చెప్పాల్సిన విషయం. నిజానికి నాకే ఇప్పుడు ధైర్యం చెప్పే మనుషులు కావాలి.

బరువెక్కిన గుండెతో, చెమ్మగిల్లిన కళ్ళతో ఫోన్‌లో పిల్లల పేర్లు కోసం వెతుకుతున్నాను. చెప్పలేక చెప్పలేక ఉన్న విషయాన్ని పిల్లలకు తెలియజేశాను.

“మేము వెంటనే బయలుదేరుతాము నాన్నా. చెల్లికి కూడా ఈ విషయాన్ని నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి” అంటూ నాకు ధైర్యాన్ని చెప్తున్నాడు రఘు.

విషయం చుట్టుపక్కల ఉన్న బంధువులు, స్నేహితులకు కూడా తెలియడంతోటి హాస్పిటల్‌కి వచ్చి పరామర్శించి వెళ్తున్నారు. అందరితోటి బయటికి ధైర్యంగా మాట్లాడుతూనే ఉన్నా మనసు, మెదడు మటుకు నా స్వాధీనంలో లేనట్టే అనిపిస్తోంది.

“ఏరా కృష్ణ! ఏమిట్రా ఇదంతా!” అంటూ పరామర్శిస్తున్నాడు ఒక స్నేహితుడు.

“40 ఏళ్లపాటు నాతోనే కలిసి ఉంది. కష్టమో, సుఖమో అన్నిటినీ భరించింది. ఇక ఈరోజు నావల్ల కాదన్నట్టు..” బయటికివస్తున్న బాధని ఆపుకున్నాను స్నేహితుడి ముందర.

“పిల్లలు విమానం దిగారా?” అడిగాడు స్నేహితుడు.

“వచ్చేస్తున్నారు. ఇక్కడే దగ్గరలో ఉన్నారు”.

***

పిల్లల కోసం ఎదురుచూస్తూ అతి కష్టం మీద ఆ సమయం గడిచింది. వాళ్ళు రానే వచ్చా రు.

“నాన్నా! ఉన్నట్టుండి ఏమైంది అమ్మకి? నిన్న రాత్రి కూడా నాతో బాగానేమాట్లాడింది కదా!” అంటూ నన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తోంది నా కూతురు రమ్య.

వస్తూనే డాక్టర్ దగ్గరికి వెళ్లి విషయాన్ని తెలుసుకుని భార్యని ఇంకా చెల్లెల్ని మాట్లాడటం కోసం పక్కకి పిలిచాడు రఘు.

“డాక్టర్లైతే ఇక చేయగలిగేదిఏమీ లేదంటున్నారు. సడన్‌గా బీపీ పెరగడం వల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ అయిందట. వెంటిలేటర్ మీద కొన ఊపిరితో ఉందంటున్నారు”.

వాళ్లు వచ్చిన కాసేపటికి..

“నాన్నా! నాన్నా! డాక్టర్ ఇప్పుడే వచ్చి చెప్పారు. అమ్మ.. అమ్మ చనిపోయిందని” దీనంగా ఉంది వాడి మాట.

జరిగేది ఇదే అని ముందుగానే తెలుసు. అయినా సరే ఆ మాట వినేసరికి తట్టుకోలేక రఘుని, రమ్యని పట్టుకొని పెద్దగా ఏడ్చేశాను.

అనుకున్నంతలోనే అంతా అయిపోయింది. చుట్టూ ఉన్న బంధువుల, స్నేహితుల సహాయంతో జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిగిపోయాయి. చివరిచూపు కోసం రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చా రు. ఒక్క ఆ వ్యక్తి తప్ప.

అందరూ వెళ్లిపోయాక కాసేపు నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు రఘు.

“మీరు ధైర్యంగా ఉంటేనే మేము ధైర్యంగా ఉండగలుగుతాము. మీరు మిగిలిన పనులన్నీ త్వరగా పూర్తి చేసేసుకొని సిద్ధంగా ఉండండి. మీ వీసా పని అవ్వగానే మా దగ్గరికి వచ్చేదురుగాని” అన్నాడు.

***

పిల్లలు ఉన్న 15 రోజులు ఎంతో ధైర్యంగా ఉన్న నన్ను, వాళ్లు తిరిగి వెళ్ళాక ఊహించని ఒంటరితనం విపరీతంగా ఇబ్బందిపెడుతోంది. నిద్రపట్టనివ్వదు, కుదురుగా ఒక పనిమీద బుర్రని ఉంచనివ్వదు.

పొద్దునే లేచి స్టవ్ దగ్గరికి వెళ్ళంగానే లక్ష్మీ పెట్టి ఇచ్చే కాఫీ గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.

“స్నేహితులతో ఫోన్‌లో కబుర్లు చెప్పుకోడాలు, కంప్యూటర్‌లో ఏవో పనులు చేయడం కాదు. స్టవ్ ఆన్ చేసి ఒక్కపూటైనా కాఫీ పెట్టారా? ఎప్పుడు చూసినా సరే బాగున్నా బాగోలేకపోయినా ప్రతీ పూట లేచి నేనే చేయాలి” అంటూ కోపంగా విసుక్కునే తన మాటలు గుర్తుకు వచ్చాయి.

స్టవ్ ఆన్ చేసి అతి కష్టం మీద కాఫీ కలుపుకోగలిగాను. బయట నుంచి తెచ్చు కున్న టిఫిన్ తినంగానే ఫోన్‌లో మోగింది అలారం. మందులు వేసుకోవాలని గుర్తుచేసే మనిషి లేకపోయేసరికి నేను చేసుకున్న ఏర్పాటు.

***

మందులు వేసుకుని బ్యాంక్ పని కోసం బయలుదేరేలోపల గేటు తీసుకొని లోపలికి వస్తూ కనబడింది విజయ. “ఎలా ఉన్నావు అన్నయ్యా?” అంటూ క్యారేజీ పట్టుకొని లోపలికి వచ్చింది.

“పరవాలేదు” అంటూ కూర్చోమన్నాను.

“విషయం ఇప్పటికి తెలిసిందా?” కొంచెం కఠినంగానే మాట్లాడాను.

“అది.. అది.. ఎందుకు అడుగుతావులే అన్నయ్యా. నా కూతురు గురించి విషయం తెలిసే ఉంటుంది కదా!” అంటూ నసుగుతోంది విజయ.

“అప్పట్లో మనం అనుకున్నట్టుగానే జరిగి ఉండుంటే ఈ పాటికిదాని జీవితం ఇలా అయి ఉండేది కాదు. ఏం చేస్తాం దాని తలరాత అలా ఉంది. సర్లే ఆ విషయాన్ని అలా ఉంచు. నువ్వెలా ఉన్నావు? పిల్లలా ఇక్కడ ఉండట్లేదు. మరి భోజనం మిగతా పనులు అవన్నీ ఎలా చూసుకోగలుగుతున్నా వు?”

ఆమె పదాలలో ఉన్న బాధ కేవలం నోటిమీద నుంచేకానీ మనసులోంచి వచ్చి నట్టుగా అనిపించలేదు. “ఏదో నడుస్తోందిలే” అని పొడిపొడిగానే సమాధానం ఇచ్చాను.

“అంతేలే ఏం చేయగలుగుతావు? పిల్లలా, ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు వదిలి ఇక్కడికి రాలేరు. ఆ రోజు వదిన పిల్లాడికి గట్టిగా నచ్చచెప్పి ఉంటే, మన మధ్య సంబంధాలు బాగుండేవి. నీకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో కదా! ఏదేమైనా పిల్లల్ని బాగా గారాబం చేసి నెత్తి మీద పెట్టుకుంది వదిన”.

ఆ మాట వినంగానే చిర్రెత్తున కోపం వచ్చి ..

“చూడు విజయా! విషయం అంతా నీకే తెలుసు అన్నట్టు మాట్లాడొద్దు” కోపంగానే వస్తోంది నా మాట.

“నేను ఇప్పుడు అన్నదానిలో తప్పేముందని నీకు అంత కోపం వస్తోంది? నీ కొడుకు అమెరికా వెళ్లనంతవరకూ నా కూతురితో తిరిగి, అక్కడికి వెళ్ళంగానే మాట మార్చేశాడు. అది తప్పు కాదా?” గట్టిగా వస్తుంది ఆమె మాట.

“మాటలు జాగత్ర్తగా రాని విజయా. మనం సంబంధం కలుపుకుందామనుకున్న తర్వాత కూడా ఎప్పుడు నా కొడుకు నీ కూతురి విషయంలో మితిమీరలేదు”  అంటూ ఆమె వంకర మాటల్ని సరిచేసే ప్రయత్నం చేశాను.

“సంబంధం కుదిరిందని అందరికీ తెలిసిన కొద్దిరోజులకే వదిన వచ్చి ఈ పెళ్లి జరగదని చెప్పేసిందిగా! పోయిన మనిషి గురించి ఇలా అనుకోకూడదు కానీ ఎందుకో తెలియదు వదినకి నేనన్నా, నా కూతురు అన్నా అస్సలు పడదు. అందుకే రఘుకి ఈ పెళ్లి ఇష్టం లేదన్న సాకు తోటి..”

“చాలు ఆపు. మేనరికం సంబంధం వచ్చింది కదా అని అసలు నిజాన్ని దాచి పెట్టి నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యి పిచ్చి వేషాలేసింది నీ కూతురు”.

“ఈ విషయం లక్ష్మి కంటపడింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ రోజు మీ మాజీ అల్లుడు స్థానంలో రఘుని చూడాల్సి వచ్చేది. ఈ రోజుల్లో ఆడపిల్లనైనా, మగపిల్లాడినైనా సరిగ్గా పెంచి దోవలో పెట్టడంలో ఉంటుంది మన బాధ్యత అంతా. ఆ బాధ్యతని వందకి వంద శాతం కరెక్ట్‌గా నెరవేర్చింది లక్ష్మి.”

“అంతెందుకు నువ్వే నిజం చెప్పు. అది చనిపోయే నాలుగు రోజులు ముందర నీ కూతురికి విడాకులు అవుతోందని తెలిసి నీకు ఫోన్ చేసి మాట్లాడి బాధపడిందా లేదా? కానీ నువ్వు విషయం తెలిసిన 20 రోజులు తర్వాత వచ్చి పరామర్శిస్తున్నావు” అంటూ చాలా ఆవేశంగా మాట్లాడాను.

“అవును, ఇప్పటికైనా పోనీలే, అన్నయ్య కదా అని పరామర్శించడానికి వచ్చాను చూడు తప్పు నాది” అంటూ తను తెచ్చిన క్యారేజీని అక్కడే వదిలి కోపంగా వెళ్ళిపోయింది.

‘బ్రతికి ఉన్నన్నాళ్ళు మనుషుల మధ్య అపార్థాలు కలగడం సహజం. కానీ చనిపోయిందని తెలిసి కూడా ఇలా మాట్లాడే బంధువులు ఉంటారా!’ అని నాలో నేనే అనుకోని విజయ తెచ్చిన క్యారేజీని వాకిట్లోనే వదిలేశాను.

***

“ఎలా ఉన్నారు నాన్నా?” అంటూ రఘు ఫోన్ చేశాడు.

“బానే ఉన్నాను లేరా. మీరు ఎలా ఉన్నారు? కోడలి ఆరోగ్యం బానే ఉందా రెగ్యులర్‌గా చెకప్‌కి వెళ్తున్నారా?”

“డెలివరీకి ఇంకా మూడు నెలలు టైం ఉంది. ప్రస్తుతానికి డాక్టర్ అంత బానే ఉందన్నా రు. అన్నట్టు మీ వీసా అప్రూవల్ వచ్చేసింది నాన్నా. నెక్స్ట్ మంత్‌కి టికెట్ తీసుకుంటున్నాను. మీరు వచ్చే ఏర్పా టు చూసుకోండి” ఎంతో ప్రేమగా చెబుతున్నాడు కొడుకు.

“ఇప్పుడు అంత అర్జెంట్ ఏముందిరా?”

“అలా కాదులే నాన్న! ప్రస్తుతానికి జాగత్ర్తగా ఉండండి. ఈ వీక్ లోనే టికెట్ బుక్ చేసి నేను మీకు వివరాలన్నీ పంపిస్తాను” అని ఫోన్ పెట్టేశాడు.

ఇంకో మూడు నెలల్లో కోడలి డెలివరీ అనంగానే..

“సరే కానీ నాకెందుకో నిన్న కోడలితో మాట్లాడుతుంటే వాళ్ళు పిల్లల్ని కనే ఆలోచనలో ఉన్నారనిపించింది” అంటూ పక్కనే పడుకొని నన్ను పడుకోనికుండా కబుర్లు చెప్తోంది.

“ఓహో! మంచి విషయమేగా” అన్నాను.

“నాకెందుకో మన రఘుకి ఖచ్చి తంగా అమ్మాయే పుడుతుంది అనిపిస్తోంది. ఒకవేళ అలాగే కనుక జరిగితే దానికోసం ఒక బంగారు గొలుసు, పాపిడిబిళ్ళ చేయించొద్దూ!”

“నువ్వు నీ చాదస్తం కాకపోతే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎవరే పాపిడిబిళ్ళలు పెట్టుకునేది?”

“మీరు ఊరుకోండి. అప్పుడప్పుడు పండగలకైనా పెట్టుకుంటుంది కనీసం. నేను చెప్తాగా కోడలికి” అంటూ ఇంకా అసలు జరగనటువంటి విషయాన్ని ఊహించుకొని ఎంతో మురిసిపోయిన తన మాటలు గుర్తొచ్చి మళ్ళీ నిద్ర పట్టలేదు.

***

రఘు చెప్పినట్టుగానేకొన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉండడానికి అమెరికా వెళ్ళొచ్చాను. అక్కడ ఉన్న రోజులు వాళ్లతోటి హాయిగా గడిచిపోయింది. రమ్య దగ్గర ఉన్నన్నాళ్ళు వంట చేయడం కొంత నేర్చుకునేసరికి ఇప్పుడు నా అంతట నేనుగా వంటింట్లో ఎంతో కొంత చేసుకోగలుగుతున్నా ను.

డెలివరీ అవ్వంగానే మనవరాలితో కలిసి ఇంటికి వచ్చారు రఘు, ఇంకా హారిక.

“అన్నప్రాసన గురించి పిలుపులు అయిపోయినట్టేనా ఇంకా ఎవరైనా మిగిలారా?” అని ఆలోచిస్తున్నాడు రఘు. “అరే మర్చిపోయాను. అత్త.. విజయ అత్తకి ఫోన్ చేయాలి కదా!” అన్నాడు.

“వద్దు. తనని పిలవాల్సిన అవసరం లేదు” అంటూ కోపంగా చెప్పా ను.

“మీ అమ్మ పోయిన 20 రోజుల తర్వాత వచ్చి ఎన్ని మాటలు అని వెళ్లిందోతెలుసా?”

“నాన్నా! తనేదో కోపంలో అలా మాట్లాడింది కదా అని ఇంటిఆడపడుచుని పిలవకపోతే అమ్మకు నచ్చుతుందా చెప్పండి. కానీ ఈ రోజు మీరు ఇలా అమ్మ కోసం, అమ్మ తరఫున మాట్లాడుతున్నారు చూశారా, ఈ విషయం అమ్మకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇన్నాళ్లుగా అమ్మ కోరుకుంది కూడా ఇదే కదా నాన్నా!”

వాడి మాటల్లో లక్ష్మి పెంపకం కొట్టొచ్చినట్టు కనబడి తను లేని లోటు ఆమె పెంపకంలో నింపి వెళ్ళింది అనిపించింది.

“కానీ ఈ రోజు మీరు ఇలా అమ్మ కోసం, అమ్మ తరఫున మాట్లాడుతున్నారు చూశారా ఈ విషయం అమ్మకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇన్నాళ్లుగా అమ్మ కోరుకుంది కూడా ఇదే కదా నాన్నా!”

***

అనుకున్నట్టుగానే చుట్టాలు, స్నేహితులు అందరూ వచ్చి నా మనవరాలని ఆశీర్వదించి వెళ్లారు. ఫంక్షన్ హడావిడి అంతా పూర్తి చేసుకుని ఇల్లు సర్దుతుండగా వచ్చింది విజయ.

“లోపలికిరా అత్తా!” అంటూ ప్రేమగా పిలుస్తున్నాడు రఘు.

వచ్చి కూర్చుని ఐదు నిమిషాలు అయినా ఏమీ మాట్లాడకుండా మౌనంగానే కూర్చుని ఉంది.

“ఏమైంది అత్తా? అలా ఉన్నావు ఏంటి?” అని అడిగాడు రఘు.

“నన్ను క్షమించు అన్నయ్యా” అంటూ కుర్చీలోంచి లేచి వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతోంది.

“ఆ రోజు విషయం తెలుసుకోకుండా నేనలా మాట్లాడకుండా ఉండాల్సింది. వదిన వల్లే సంబంధం చెడిపోయిందని అనుకున్నా ను. కానీ ఈ రోజు నా కూతురు వల్లే అసలు విషయం తెలిసింది” అంటూ ఏడుస్తోంది విజయ.

ఆమె అంతలా ఏడుస్తున్నా నేనైతే ఏమీ మాట్లాడలేదు. రఘు మాత్రం “ఏమైందత్తా?” అని అడుగుతూనే ఉన్నా డు.

“ఆ రోజు హాస్పిటల్‌లో మీ అమ్మకి అనిత కనబడిందట కదా! ఆ రోజు.. ఆ రోజు అబార్షన్ చేయించుకోవడానికి అక్కడికి వెళ్లిందట. ఏమిటి ఇదంతా అని మీ అమ్మ అడిగేసరికి, ఈ రోజుల్లో ఇవన్నీ మామూలేగా. రఘు ఇలాంటి విషయాలు పట్టించుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు అందట”.

“రఘు గురించి నీ కన్నా నాకే బాగా తెలుసు. అయినా ఇదంతా మా అందరి దగ్గర దాచిపెట్టి నువ్వు ఈ పెళ్లి చేసుకుందామనుకుంటున్నావా అని మీ అమ్మ అడిగేసరికి, అనుకోకుండా ఇప్పు డు నువ్వు చూశావు కాబట్టి విషయం తెలిసింది. లేదంటే అసలు ఈ విషయం బయటికివచ్చేదే కాదు కదా అని మీ అమ్మతో చాలా అసహ్యంగా మాట్లాడిందది”.

విజయ చెప్పిన విషయం రఘుకి, నాకు ముందుగానే తెలియడం వల్ల వాడికి ఏమంత ఆశ్చర్యంగా అనిపించలేదు. కానీ నాకు మాత్రం మరొకసారి నా మేనకోడలు ఇలా తయారయిందే అని బాధగా అనిపించింది.

“నన్ను క్షమించు అన్నయ్య. నిజం తెలుసుకోకుండా పోయిన వదిన గురించి ఇష్టం వచ్చి నట్లు మాట్లాడాను” అంటూ ఏడుస్తూ నా ఒళ్ళో తలవాల్చింది.

“మంచినీళ్లు తాగండి” అంటూ గ్లాస్ ఇచ్చింది హారిక.

మంచినీళ్లు తాగి కుదుటపడిన కాసేపటికి రఘు తన కూతురిని తీసుకువచ్చి చూపించాడు తన అత్తకి.

“బంగారు తల్లిలా ఉందిరా నీ కూతురు. మీ అమ్మ మిమ్మల్ని పెంచినట్టే దీన్ని కూడా చక్కగా పెంచండి” అంటూ చేతిలో బహుమతిని పెట్టింది.

“ఇవన్నీ ఎందుకు అత్తా?” అన్నా డు రఘు.

“తీసి చూడరా” అంది విజయ.

“పాపిడిబిళ్ళ!” అంటూ ఆశ్చర్యంగా చూశాను.

“అవును అన్నయ్య! వదిన నాతో మాట్లాడినప్పుడల్లా రఘుకి ఆడపిల్ల పుడితే గొలుసు, పాపిడిబిళ్ళ చేయించాలనుకుంటున్నానని చెప్తూ ఉండేది. గొలుసు చేయించేంత స్తోమత లేకపోయినా కనీసం ఈ చిన్న పాపిడిబిళ్ళ అయినా చేయిస్తే వదిన కోరికని కొంత తీర్చిన దాన్ని అయినా అవుతాననిపించింది. అందుకే..”

వెంటనే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాకు.

“మీ వదిన కోరికను గుర్తించుకున్నావు. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పు” అంటూ ప్రేమగా తన తలని నిమిరాను.

“నేను ఈ రోజు ఇలా నా తప్పు తెలుసుకొని ఇంటికి రావడం, నీ మనవరాలిని ఆశీర్వదించడం ఇదంతా చూడడానికి నువ్వు ఉండుంటే ఎంతో బాగుండేది వదినా” అంటూ లక్ష్మిని విజయ తలుచుకోగానే నా కళ్ళల్లోంచి నీళ్లు వచ్చాయి.

Exit mobile version