Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పెండ్లి కొడుకు అమ్మ ఫ్రెండ్స్

ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మా డిగ్రీలు పూర్తయి పెళ్లిళ్ళై పోయి స్నేహితులందరం అత్తగారిళ్ళకు వెళ్ళిపోవడంతో మా స్నేహం ఆగిపోయింది. అలా ఎవరి ఇళ్ళల్లోని బాధ్యతల్లో వారు మునిగిపోయారు. ముప్పై సంవత్సరాలు దాటాక పిల్లలు పెద్దవాళ్ళయి కొంత తీరుబాటు దొరికాక స్నేహితులు ఎక్కడ ఉన్నారు అని వాకబు చేయటం ప్రారంభించి మెల్లగా ఒక్కొక్కరి అడ్రస్ తెలుసుకోవటం ప్రారంభించాం. ఒకరి ఫోన్ నెంబర్ ఒకరు తెలుసుకుని ఫోన్లలో ఉద్వేగంతో మాట్లాడుకొని ఆనంద భరితులమయ్యాం. మీకెంత మంది పిల్లలు, ఏం చదువుతున్నారు, మీ వారేం చేస్తుంటారు? ఇత్యాది కుశల ప్రశ్నలతో ఉత్సాహంగా ప్రశ్నలు గుప్పించుకొని సమాధానాలు విని తృప్తి పడ్డాం.

ఇలా నాలుగైదు సార్లు మాట్లాడుకున్నాక, ఇలా ఎప్పుడో ఒకసారి మాట్లాడుకోవడం కాదు, మనం రోజు టచ్ లో ఉండాలంటే వాట్సప్ గ్రూప్ పెట్టుకుంటే బాగుంటుందనుకుని నిర్ణయం తీసుకున్నాం. అనుకున్న క్షణం లోనే ‘మై ఫ్రెండ్స్’ అంటూ గ్రూపు తయారయ్యింది. మొదటగా ఫ్యామిలీ ఫోటోలు పెట్టి ఒకళ్ళ నొకళ్ళం పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు దానిలో 18 మండి సభ్యులు. గ్రూపును తయారుచేసింది విజయకుమారి.

రోజూ గ్రూపులో మాట్లాడుకోవటం మొదలుపెట్టాక అందరం ఒకసారి ఒకరి నొకరం చూసుకోవాలన్పించింది. అందుకుగాను చీరాలలోని రామాపురం బీచ్ వేదికగా మారింది. ఒకరికొకరం చూసుకోవాలనుకున్న ఉద్విగ్న క్షణాలు దగ్గర పడుతుండగా నాకు వేరే పని ఉండటంతో వెళ్లలేక పోయాను.

ఇలా మరి కొందరికి అనుకూలించకపోయినా 9 మంది స్నేహితులు మొట్టమొదటిసారి బీచ్‍లో కలుసుకుని, సముద్రంలో స్నానాలు చేసి చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు. ప్రస్తుత వయసులో ఉన్న ఆరోగ్య సమస్యల్ని కూడా మర్చిపోయి మరలా బాల్యంలోకి వెళ్ళిపోయారు. నేను వెళ్లలేక పోవడంతో వాళ్ళు పంపిన ఫోటోలు చూసి సంతోషించాను.

ఆ తర్వాత ఓ స్నేహితురాలి కొడుకు పెళ్లి కుదిరింది. అందరం ఆ పెళ్ళికి కలవాలని నిర్ణయించుకున్నాం. అనుకున్నదే తడవుగా ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని తెగ ఎదురుచూశాం. ఆ పెళ్లి విజయవాడలో జరిగింది. మా ఫ్రెండ్స్‌కు ఒక రూము కేటాయించారు. నేను కళ్యాణ మంటపానికి చేరగానే ఫోన్ చేస్తే ఫలానా రూముకు రమ్మన్నారు. అక్కడికి వెళ్తుంటే కాళ్ళు తడబడుతున్నాయి.

రూములోకి వెళ్ళగానే ఏడెనిమిది మండి ప్రెండ్సున్నారు. ముందుగా ఎవరిని పలకరించాలి. ఎవరిని చూసి నవ్వాలి, ఎవరిని హత్తుకోవాలి ఏదో గజిబిజిలో అందరినీ ఒకసారి చూసినట్లనిపించింది. ఆ రోజు అర్ధరాత్రి పెళ్లి ముహూర్తం. చాలాసేపు ఒకళ్ళనొకళ్ళం చూసుకున్నాక మెల్లగా మాటలు మొదలుపెట్టి తర్వాత ఉధృతంగా కబుర్లలోకి దిగిపోయాం. భోజనాల సమయమైంది అని వాళ్ళు పిలిచేదాక ఎవరికి సమయమే తెలియలేదు. ఒక పక్క భోజనాల సందడి సాగుతుండగా మరో పక్క పెళ్ళి వేడుకలు మొదలయ్యాయి.

మేము భోజనాలు చేసి వచ్చేసరికి మొదటి రెండు లైన్ల కుర్చీలు మా కోసం అట్టి పెట్టారు. ఏదో విఐపి గెస్టుల్లా ఫీలవుతూ వెళ్ళి మొదటి వరస కుర్చీల్లో కూర్చొని పెళ్లి వేడుకలు వీక్షించాము. టీచర్ రాణి క్లాస్ రూమ్ లోని పిల్లల్లా ఒకటే మాట్లాడుకోవటం, ఒకటే నవ్వుకోవటం, ఒకటే కేరింతలు, తుళ్ళింతలు. అలా ఉన్న మా అల్లరి చూసి ఎవరో ఒక పెద్దాయన వచ్చి అడిగారు “అమ్మా మీరు ఎవరి తరపు” అంటూ. “మేము పెళ్ళి కొడుకు అమ్మ ఫ్రెండ్సుమి” అని చెప్పాము. ఎక్కడైనా పెళ్ళిళ్ళలో పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్ గొడవ చేస్తారు లేదా పెళ్ళి కూతురు ఫ్రెండ్స్ గొడవ చేస్తారు. ఇదేమిటి విచిత్రం గకపోతే పెళ్ళి కొడుకు అమ్మ ఫ్రెండ్స్ ఇలా గొడవలు, అల్లరి చేయటం అని ఆయన విస్తుపోతూ వెళ్లిపోయాడు. ఆయనను చూసి మేమింకా గట్టిగా నవ్వుకుంటూ ఇంకా జోకులు వేయటం మొదలుపెట్టాము.

ఒకవైపు ఈవెంట్ ఆర్గనైజర్స్ పాటలు, డ్యాన్సులు, పజిల్స్, ర్యాంప్ వాక్ అంటూ రకరకాలుగా చేస్తున్నారు. యువతీయువకులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అంతలో సడెన్‍గా మంచి మ్యూజిక్, పాట పెట్టి ఇప్పుడు ఎంతో దూరం నుంచి వచ్చి పెళ్ళి వేడుకలలో పాల్గొంటున్న పెళ్ళి కొడుకు తల్లిగారి ఫ్రెండ్స్ డ్యాన్స్ చేస్తారు అని ఎనౌన్స్ చేశారు. మా బుర్రలకు ఏమి అర్థం కాకముందే మమ్మల్నందర్ని స్టేజీ మీదకు తీసుకువెళ్ళిందా అమ్మాయి. మనమేంటి డ్యాన్స్ ఏమిటి అనుకుంటూ సిగ్గు పడుతూ నిలబడ్డాం మేము.

యాంకర్ అమ్మాయి మమ్మల్ని ఎంతగానే ఉత్సాహపరిచి కన్విన్స్ చేసి చివరికి మా చేత డ్యాన్స్ చేయించింది. పెళ్ళిలోని పిల్లా పెద్దా అందరూ చప్పట్లు కొడుతూ బాగా ఎంకరేజ్ చేశారు. పిల్లలైతే సెల్లులు పట్టుకొని ఒకటే వీడియోలు తీశారు. యాంకర్ అమ్మాయి మధ్యలో పెళ్ళి పీటల మీద ఉన్న పెళ్ళికొడుక్కు తల్లి అయిన మా స్నేహితురాల్ని కూడా లాక్కొచింది. అందరం కలిసి వచ్చీ రాని స్టెప్పులతో ఏదో కాళ్ళూ చేతులు కదుపుతుంటే పిల్లలంతా ఈలలు, అరుపులతో కళ్యాణ మండపం దద్దరిల్లింది. ఇదో అద్భుతమైన అనుభవం. కాలేజీలో ఉన్నప్పుడూ కూడా ఇంతగా ఎంజాయ్ చేయలేదు అనిపించింది.

ఇలా వాట్సప్ గ్రూపు పెట్టుకొని అందరం ఒకరి విషయాలు మరొకరు షేర్ చేసుకోవటం చాలా బాగుంది మాకందరికి. పెళ్ళిళ్ళు, పెరంటాళ్ళలో  కలిసి ఆనందించటమే గాకుండా ఎవరైనా బాధల్లో ఉంటే మిగతా స్నేహితులు సలహాలు ఇవ్వటం సూచనలు అందించటం చేస్తున్నారు.

మా అబ్బాయికి యాక్సిడెంట్ అయినందువల్ల నేను డిప్రెషన్‍కు గురయినపుడు బంధువర్గం కన్నా స్నేహితులు ఎక్కువ భరోసానిచ్చారు. రోజూ ఎంత పనిలో ఉన్న ఒకసారి ‘మై ఫ్రెండ్స్’ గ్రూప్ ను చూసి అందరూ ఏం చేస్తున్నారో చూసి వాటికి సరియైన సమాధానాలు ఇవ్వటం ఎంతో ఊరట కలిగిస్తుంది. వాట్సప్ వలన ఎన్నో నష్టాలు ఉన్న ప్రయోజనాలు కూడా ఎక్కువే. మాకయితే ఈ సమూహం పెట్టిన దగ్గర నుంచి ఏ విసుగూ, బోర్ ఫీలవలేదు.

Exit mobile version