పద్య ప్రియులకు నిజమైన నిధి ‘పెన్నిధి’: ప్రముఖుల ప్రశంస
ఆగస్టు 9, ఆదివారం రోజున హైదరాబాదులోని ప్రగతి నగర్‌లో ఉన్న సుందరయ్య భవన్ వేదికగా శ్రీ కోడీహళ్ళి ఫణి ప్రసన్న కుమార్ రచించిన విశిష్ట పద్య కావ్యం ‘పెన్నిధి’ గ్రంథావిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా, కవిత్వ ప్రియుల కరతాళ ధ్వనుల మధ్య శోభాయమానంగా నిర్వహించబడింది.
మొదట అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్ అతిథులను సభావేదికపైకి ఆహ్వానించారు.
ప్రముఖ సినీగేయకవి, స్వర్ణ నంది పురస్కార గ్రహీత శ్రీ సాదనాల వేంకటస్వామి నాయుడు ఈ సాహిత్య సమారంభానికి అధ్యక్షత వహించారు. తమ అధ్యక్షోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ.. పద్య రచనలో వస్తు వైవిధ్యం, శిల్పసౌందర్యం తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో ఫణి ప్రసన్న కుమార్ ‘పెన్నిధి’ ద్వారా సాంప్రదాయ పద్య రీతులకు నూతన శోభను తీసుకువచ్చారని, ఇది పద్య ప్రియులకు లభించిన నిజమైన నిధి అని కొనియాడారు.
అనంతరం ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు, లేపాక్షి ఓరియంటల్ కాలేజీ విశ్రాంత ఉపన్యాసకుడు డా. వింజమూరి విశ్వనాథమయ్య సభాముఖంగా ‘పెన్నిధి’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాచీన, ఆధునిక భావాల సమ్మేళనంగా సాగిన ఈ కావ్యంలోని ప్రతి పద్యం తెలుగు భాషా పరిమళాలను వెదజల్లుతోందని, ఇటువంటి రచనలు రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రశంసించారు.
ఈ కావ్య విశేషాలను సభకు వివరిస్తూ.. అణుఇంధన సంస్థ విశ్రాంత శాస్త్రవేత్త, యువభారతి సంస్థ అధ్యక్షుడు, ప్రముఖ కవి డా. ఆచార్య ఫణీంద్ర కావ్య పరిచయ ప్రసంగం చేశారు. “ఈ కావ్యాన్ని చదువుతుంటే ఒక ఉత్కంఠభరితమైన, సస్పెన్స్ చలనచిత్రాన్ని చూస్తున్న భావన కలుగుతుంది. సన్నివేశాల కల్పన, కథానడక, శైలి పాఠకుడిని చివరి వరకు మంత్రముగ్ధులను చేస్తాయి” అని ఆయన అభినందించారు.
కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన డా. రాధశ్రీ తమ ప్రసంగాన్ని వినూత్నంగా పద్య రూపంలోనే అందించి సభను ఆకట్టుకున్నారు. కావ్యకర్త నైపుణ్యాన్ని, వస్తుస్వీకారాన్ని మనసారా అభినందిస్తూ ఆయన చేసిన పద్యప్రసంగం సదస్యుల విశేష ఆదరణను పొందింది. అలాగే సుందరయ్య భవన్ కార్యదర్శి మల్లయాచారి తదితర ప్రముఖులు ప్రసంగిస్తూ, ప్రగతి నగర్‌లో ఇటువంటి విలువైన సాహిత్య కార్యక్రమం జరగడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం గ్రంథకర్త కోడీహళ్ళి ఫణి ప్రసన్న కుమార్ వేదికపైనున్న పెద్దలను సాదరంగా సత్కరించి, వారి అమూల్యమైన సూచనలకు, ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తమ ‘పెన్నిధి’ కావ్యంలోని కొన్ని ముఖ్యమైన పద్యాలను, దండకాన్ని స్వయంగా రాగయుక్తంగా చదివి వినిపించి, సభాసదులను పరవశింపజేశారు.
ప్రధాన ఆవిష్కరణ కార్యక్రమానికి ముందుగా నిర్వహించిన కవి సమ్మేళనంలో పలువురు నగర కవులు, రచయితలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విభిన్న అంశాలపై వారు వినిపించిన కవితలు, పద్యాలు, గేయాలు సభలో ఆహ్లాదకరమైన సాహిత్య వాతావరణాన్ని నింపాయి. చివరగా వందన సమర్పణతో ఈ వైభవంగా జరిగిన సాహిత్య వేడుక విజయవంతంగా ముగిసింది.

