Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రంగుల హేల 48: పెరుగుతున్న భక్తులూ – కనపడని ప్రపత్తులూ

“ఏదో బాహ్యాడంబరంగా కాకుండా ప్రపత్తితో కూడిన భక్తి మంచిది” అని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల’ కాలమ్‌లో.

రోజుల్లో ఎక్కడ చూసినా భక్తులే. మన చిన్నప్పుడు ఈ దేవుడి ధ్యాస ముఖ్యంగా నానమ్మలకు, అమ్మమ్మలకు, తాతయ్యలకు మాత్రమే ఉండేది. వాళ్లే మధ్యాహ్న వేళల్లో భారతం, భాగవతం, గీత లాంటివి చేతుల్లో పెట్టుకొని ఎవరో ఒకరు చదువుతూ ఉంటే మిగిలిన వాళ్ళు వింటూ ఉండేవారు. అమ్మలెప్పుడూ ఇంటిపనులతో బిజీ. వాళ్ళు పండగొస్తుందంటే వారం ముందునుంచే ఇల్లంతా శుభ్రం చేసుకుని, తీపీ, కారాలు చేసి డబ్బాల్లో పోసి పండగ రోజున నోముపూజకి అన్ని రెడీగా పెట్టుకొని, నైవేద్యాల కోసం పిండివంటలు వండి పురోహితుడు గారిని పిలిచి ఆయన ఆధ్వర్యంలో నోము నోచుకుని అయ్యాక ఆయన కాళ్లకు దండం పెట్టి దక్షిణ ఇచ్చి అక్షింతలు వేయించుకునేవారు. గుళ్లో పురాణం కాలక్షేపానికి మాత్రం అమ్మలు కూడా, పెద్దవాళ్ళ వెంట వెళ్లేవారు. అంతవరకే వారి భక్తి.

ఒక్క వినాయక చవితి మాత్రం పిల్లలు కూడా పూజ చేసుకోవాలనేవారు. ఆ రోజు చక్కగా స్నానం చేసి కొత్త బట్టలేసుకుని మనం పూజ దగ్గర కూర్చునే వాళ్ళం. మనకు కూడా పసుపు, కుంకుమ, పువ్వులు, ఆకులు ఇచ్చి వినాయకుడి మీద వెయ్యమనే వారు. ‘ఆహా! మేం కూడా పూజ చేసుకుంటున్నాం’ అని మురిసిపోయే వాళ్ళం. పూజ కథ మనకెంతో ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉండేది. వినాయకుడికి దండం పెట్టుకుంటే చదువు వస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. మన పుస్తకాలు తెచ్చి మొదటి పేజీలో కాస్త పసుపు, కుంకుమ రాసి దేవుడి దగ్గర పెట్టుకునేవాళ్ళం. “ఈ పుస్తకాలకి పూజ జరిగింది కాబట్టి మీకు చదువు బాగా వస్తుంది. మంచి మార్కులు వస్తాయి” అని చెప్పేవారు పంతులు గారు. మనం ఎప్పుడూ కష్టమైన ఇంగ్లీష్, లెక్కల్లాంటి బుక్కులు అక్కడ పెట్టి పూజ అయ్యాక బ్యాగ్‌లో పెట్టుకొని ఇంకేం ఈ సబ్జెక్ట్‌లో మనకి ఫస్ట్ వచ్చేస్తుంది పూజ చేసుకున్నాము కదా అని సంతోష పడేవాళ్ళం. అది మన భక్తి.

ఇప్పుడు పిల్లలు, పెద్దలు అన్ని వయసుల వాళ్లూ ఎంతో భక్తితో ఉంటున్నారు. ఏ గుడికి వెళ్ళినా విపరీతమైన భక్తజన సందోహం. అతిశయోక్తి కాదు, నిజంగానే ప్రజలందరికీ భక్తి పెరిగింది. నిత్యం నిరంతర భక్తి ఛానెల్స్ పురాణాలు మొదలుకొని భక్తి శతకాల వరకూ చెబుతూ, సందేహాలు తీరుస్తూ, ఇంకా అనేకానేక కార్యక్రమాలతో జనంలో దైవ ధ్యాసను నిస్సందేహంగా పెంచాయి. టూరిజం డిపార్ట్‌మెంట్ వాళ్ళు ప్రమోషన్ పేరిట, అనేక పుణ్య స్థలాల విశేషాలు, మహిమలూ టీవీలో చూపించి, వివరించడం వల్ల మన వాళ్ళు పక్క రాష్ట్రాలకి పోయి అనేక ప్రదేశాలు చూస్తున్నారనీ, మన రాష్ట్రంలో ఉన్నవి ఎప్పుడైనా చూద్దాంలే అని అనుకుంటున్నారనీ అని ఒక టూరిజం పీఆర్వో వాపోయాడు.

శరీరంలో ప్రతి అంగానికీ ఎక్సపర్ట్ డాక్టర్లు వచ్చేసినట్టే ప్రజల కోరికలకు కూడా కొందరు దేవుళ్ళని మనమే నిలబెట్టి విభజించేసాం. పరీక్షలు అనగానే విద్యార్థులు ప్రత్యేకించి కొన్నిగుళ్ళకి వెళ్తున్నారు. మరి చదువయ్యాక పెద్ద చదువులకు, ఉద్యోగాలకు విదేశాలు వెళ్లడానికి వీసాలు తెచ్చిపెట్టే వారిగా కొందరు దేవుళ్ళు ప్రసిద్ధికెక్కారు. మరి కొందరు దేవుళ్ళు పెళ్లిళ్లు చేయడానికీ, ఇంకొందరు సంతానాభివృద్ధికీ, సకల దోషాల నివారణకీ స్థిరపడ్డారు.

మన చిన్నప్పుడు అమ్మవారి పూజలు అంటే చాలా నిష్ఠతో చేయాలనీ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యకపోతే అమ్మవారికి కోపం వస్తుందనీ ఇంట్లో పెద్దవాళ్ళు భయపెట్టేవాళ్ళు. ఇప్పుడావిడా ఈ కాలం టీచర్స్ లాగే అంత స్ట్రిక్ట్‌గా ఉండట్లేదనుకుంటాను. విజయవాడ అమ్మవారు తన ఉద్యోగ భక్తులు చేసే ఎన్నో అవకతవక పనుల్ని చూసీ చూడనట్టే వదిలేయటం మనం గమనిస్తున్నాం. అమ్మవారు కూడా శాంతంలో పడి, తన దగ్గర పనిచేసే వాళ్లని తన బిడ్డలుగా భావించి వాళ్లు తప్పులు చేసినా ధృతరాష్ట్ర ప్రేమతో క్షమించేస్తున్నదని నా అనుమానం. ఎందుకంటే, ఆ మధ్య ఆవిడ స్టాఫ్ అమ్మవారి వెండి బిందెలు, ఇతర పూజా సామాగ్రి తీసుకుపోయి ఎంచక్కా తాకట్టు పెట్టుకుని ఆడిట్ వాళ్ళు పట్టుకున్నపుడు వాటిని విడిపించి తిరిగి తెచ్చి పెట్టేసినా ఆవిడ ఏమీ అనలేదు.

పర్వదినాల్లో అమ్మవారికి గాజుల అలంకారం చేసి వచ్చిన స్త్రీ భక్తులందరికీ రెండేసి రెండు గాజులు ఇస్తారు. ఆ అలంకారం కోసం ఖర్చు చెయ్యాల్సిన సొమ్ములో స్టాఫ్ కొంత కైంకర్యం చేసి దొంగ బిల్స్ పెట్టారనీ మిగిలిన సొమ్ముతో గాజులు కొన్నారనీ వార్తా పత్రికల్లో చదివాము. అప్పుడు కూడా దుర్గమ్మకు కోపం రాలేదు. పోనీలే నా దగ్గర పనిచేసే ఉద్యోగస్తులే కదా ఆవిడ క్షమించేసింది. ఒకాయన శ్రీ బాలాజీగారి పరకామణిలో కూర్చుని పనయ్యాక ఓ నోట్లకట్ట పట్టుకుని లేచి వెళ్లిపోతుంటే సెక్యూరిటీ వాళ్ళు పట్టేసుకుని, తదనంతర హడావిడి చేసారు కానీ ‘నాయనా నీ కష్టాలు తీరాలంటే ఇదే మంచి పద్ధతి అని శ్రీవారే కల్లో కనబడి ఆ ఐడియా ఇచ్చి ఉండొచ్చుకదా’ ఎందుకంటే భగవంతుని కృప అనేక రకాలు. అలా రౌతు కొద్దీ గుర్రం. దేవుడే అలా చూసీ చూడనట్టు ఉంటుంటే క్రిందివాళ్ళు జాగ్రత్తగా ఎందుకుపని చేస్తారు, ‘ఏం పర్లేదులే, మన అమ్మేకదా, మన స్వామే కదా ఏమీ చేయడులే ’ అని గుండెధైర్యంతో ఉంటారేమో వాళ్ళు.

భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులు కలిగి, శరణాగతి పొంది పారలౌకిక చింతనతో ముక్తికై తపించడం అనేది చాలా లాంగ్ రూట్ ప్రయాణం. అసలా స్వర్గం, మోక్షం అవన్నీ ఉన్నాయోలేదో ఖచ్చితంగా తెలీదు కదా! షార్ట్‌కట్‍లో దేవుడికి ఈ లోక సుఖాలకోసం మొక్కుకోవడం అనేది తక్షణ ఫలితం ఇచ్చేది కనక మనకిదే బావుంటుంది. ఆయనకి కూడా మనకొచ్చే చిన్న చిన్న సమస్యలకి పరిష్కారాలూ, ఇళ్ళు కట్టుకునేట్టుచేయడం, పెళ్లిళ్లు చేయించడం, పిల్లల్ని పరీక్షల్లో నెగ్గించడం లాంటి చిట్టి పొట్టి కోరికలు తీర్చడం ఉభయతారకంగా ఉంటుంది కాబట్టి అలా నడిచిపోతోంది. ఆయనకీ ఆదాయం, మనకీ ధైర్యం ఆయన చల్లగా చూస్తున్నాడూ, ఆదుకుంటున్నాడూ అని.

మన లాంటి సామాన్యులు వేలు ఖర్చు పెట్టుకుని, రానూ పోనూ నాలుగు రోజులు ప్రయాణం పెట్టుకుని తిరుపతి వెళ్తే దేవుడు సర్వదర్శనం అంటూ మనల్ని దూరంగా ఉండమంటాడు. దేవుడిని చూసేది మూడంటే మూడే సెకన్లు. అక్కడుండే వాలంటీర్లు మన భుజాల మీద చేతులేసి ఆడవాళ్లని ఆడవాళ్ళు మగవాళ్ళని మగవాళ్ళు చటుక్కున పక్కకి జరిపేస్తుంటారు. తిరిగి వచ్చాక రూమ్‌లో పడుకుంటే అసలు స్వామి దర్శనం అయిందా?చూశామా? అన్న సందేహంలో పడతాము. అప్పుడు మనకి కొంచెం దుఃఖం వస్తుంది. మరికొంతసేపు చూడనివ్వొచ్చుకదా అని బాధ కూడా కలుగుతుంది. కానీ ఏం చేస్తాం? జనాభా ఎక్కువ. మనకేమో డబ్బులు తక్కువ అని ఊరుకోవాలంతే.

ఎడాపెడా అధికంగా సంపాదించే వాళ్లు ఖరీదైన పూజలు చేస్తారు. అలా భగవంతుడికి బాగా టచ్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళ కోరికలు తీరతాయి. వాళ్ల పిల్లలకి విదేశాల్లో చదవడానికి సీట్లు వస్తాయి. చదువయ్యాక అక్కడే పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా వస్తాయి. మన కోరికలన్నీ దూరంగా నిలబడి చెప్పుకోవడం వల్ల దేవుడికి సరిగా వినపడదు. అయినా మనం ఏమిస్తాం? తలనీలాలూ నూటపదహార్లూ తప్ప. అందుకే వినిపించుకోడేమో కూడా! మన పిల్లలకు చదవడానికి సీట్లు దొరకవు. రకరకాల గ్రూపుల కోటా తర్వాత అంటే అంతా తిన్న తర్వాత మిగిలిన అడుగు బొడుగు సీట్లు మిగులుతాయి. మళ్ళీ అందులో పోటీ. ఏవో పిచ్చి గ్రూపుల చదువులు చదువుకోవాలంతే!

సినిమా హాల్లో రెండు మూడు తరగతులు టిక్కెట్లు ఉన్నట్టే దేవుడి దర్శనానికి కూడా ఉంటాయి. ధనవంతులు గర్భగుడిలో దేవుడికి దగ్గరగా వెళ్లి ఆయన చెవిలో తమ కష్టాలు చెప్పుకోవచ్చు. అసలిప్పుడు కోటి రూపాయలు ఇస్తే ‘ఓపెన్ హార్ట్ విత్ భగవంతుడు’ అనే కొత్త ఆఫర్ వచ్చింది తెలుసా! ఒక రోజంతా ఆయనతో ఉండి ఆ భాగ్యవంతుడు గారు తన సమస్యలన్నీ పూస గుచ్చినట్టు చెప్పేసుకోవచ్చు. ఒక్కసారే అన్నీ తీరిపోతాయి. కష్టపడి సంపాదించాడు కాబట్టి ఆయనకి ఆ వెసులుబాటు ఉండడం న్యాయం మరి. ఆయన్ని చూసి మనం కుళ్ళుకోవడం తప్పు తప్పు.

మనుషులతో బాగా క్లోజ్ అయ్యాక దేవుడు కూడా మన ట్రిక్కులు నేర్చుకున్నాడు. ఆయనతో స్నేహ సంబంధాలు నెరిపి దేవుణ్ణి కూడా మనం క్విడ్ ప్రోకోకి ఒప్పించేసాం. ఓ బడా కాంట్రాక్టర్ గారు మొక్కుకుంటే ఆయనకి కాంట్రాక్టుల్లో కోట్లొస్తాయి. ఆనక దేవుడికి వజ్రాల కిరీటం దక్షిణగా వస్తుంది. బిజినెస్ అభివృద్ధి, ప్రమోషన్ అనేది ఈ రోజుల్లో దేవుళ్ళకి కూడా కావాలి. ఫలానా దేవుడు భక్తుల కోరికలు తీరుస్తాడని పేరు తెచ్చుకోవాలి. అప్పుడే గుడికి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే గుడికి అలంకరణలు పెరుగుతాయి, తద్వారా గుడిపైన భక్తులకు ఆకర్షణ కూడా పెరుగుతుంది. అందమైన దేవుడి దగ్గరికి, అందమైన గుడికి వెళ్లాలని అందరికీ కోరిక కలుగుతుంది కదా!

నేటికాలంలో అన్ని నిత్యావసర సరుకులతోపాటు భక్తి రేట్ కూడా పెరిగింది. మనూర్లో గుళ్లో పంతులుగారిని అడిగినట్టు ‘అర్చన చెయ్యండీ,కుంకుమ పూజ చెయ్యండీ’ అని అడిగేసి తోచినంత దక్షిణ ఇస్తే కుదిరే రోజులు కావు. అన్నిటికీ తడిసి మోపెడు ఫీజులే. దేవుడు చూస్తే ధనవంతుడు. ఆయన్ని చేరుకోవడం కాస్ట్లీ వ్యవహారం. మనలాంటివాళ్ళకి అందుబాటులో ఉండడం ఆయనకి కష్టం. అప్పట్లా మనకిప్పుడు సిటీల్లో ఊరి పురోహితులు లేరు, ఇంట్లో ఆడాళ్ల చేత వరలక్ష్మీ పూజలూ, త్రినాథ వ్రతాలూ చేయించడానికి. అదంతా ఇప్పుడు వేలతో కూడిన వ్యవహారం. సినిమా ప్రారంభోత్సవం పూజలూ, ఆడియో రిలీజ్ పూజలూ, ఇంకా ధనవంతుల ఇళ్లలో అనేకానేక హోమ పూజలూ వంటి వాటితో పురోహితులది మంచి గిరాకీ ఉన్న ప్రొఫెషన్. దేవుడికీ మనకీ అనుసంధానించే పంతుళ్ళకిప్పుడు పదివేళ్ళకీ పది ఉంగరాలూ, రుద్రాక్షలతో పాటు బంగారు గొలుసులూ, ఐ ఫోన్లూ ఉంటున్నాయి. దేవుడి దోస్తులు కాబట్టి వాళ్ళూ రిచ్చే.

ఇప్పుడు అనేక చోట్ల ఆశ్రమాలూ, గురువులూ, స్వాములూ బాగా వర్దిల్లారు. అక్కడ ప్రవేశ రుసుము కూడా ఎక్కువే. అక్కడ చలువ బిల్డింగుల్లో ధ్యానాలు నేర్పే, ఆసనాలు వేయించే గురువులూ, ఆరోగ్య వ్రతాలూ, మౌన వ్రతాలూ చేయించే ఇన్‌హౌస్ ప్యాకేజీలూ బోలెడున్నాయి. ఇక భక్తి సందేశాలూ, సువార్తలూ చెప్పే పండితులూ ధనవంతులైపోయారు. పురాణ ప్రవచనాలకి జనం పోటెత్తుతున్నారు. గ్రౌండ్లు క్రిక్కిరిసి పోతున్నాయి.ఇక టీవీల్లో, రేడియోల్లో, ఆడియో, వీడియో క్యాసెట్లలోనూ అవే. ప్రాచీన గ్రంధాల భాష్యాలూ, వివరాలూ, అంతరార్ధాలూ చెప్పగలిగే వాళ్ళకి మరీ గిరాకీ. చివరాఖరికి మనకి పక్క ఫ్లాట్ వాడి పేరూ, ఊరూ తెలీదు కానీ, కౌరవ పాండవుల వంశవృక్షాలు బట్టీ పట్టాం నిత్యం విని విని.

సినిమా సక్సెస్ అయ్యాక పుణ్య క్షేత్రాలకి విడివిడిగా హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు వెళుతుంటారు. ఈ మధ్య న్యాయమూర్తులు ఎడాపెడా గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. అది బహుశా అన్యాయానికి గురవుతున్న లేక కేసుల్లో ఇరుక్కున్న అమాయక ప్రజలకు తాము న్యాయం చేయలేదేమో అన్న గిల్టీ వల్ల కలిగిన భక్తి కావచ్చన్నది హేతువాదుల అనుమానం. మొత్తానికి ప్రధానమంత్రి నుండి కార్పొరేటర్ వరకు భక్తిభావంతో ఖరీదైన గుళ్ళలో కూర్చుని భజనలు కూడా చేస్తూ, పూజలు చేస్తున్నారు. దేవుడితో దోస్తానా, ఓట్ల కోసం నటనా రెండూ కలిసి వచ్చేలా.

ఏటా ఒక ఆటవిడుపుగా, అలవాటుగా పుణ్య క్షేత్రాలకు వెళ్లిపోవడం అలా వెళ్లగలగడాన్నికూడా ఒక హోదాగా, లగ్జరీగా భావిస్తున్న రోజులివి. హనీమూన్ ప్యాకేజీలో ఈ ప్రదేశాలు కూడా కలపడం పెద్దవాళ్లకు కూడా ఆనంద దాయకం, అలా అదో బిజినెస్ టెక్నీక్. మనమంతా స్థలాలూ, బిల్డింగులూ, బంగారం, డైమాండ్లూ లాంటి సంపద కూడేసుకున్నట్టుగానే, భక్తినీ కూడేసుకోవాలనే అన్ని పవిత్ర ప్రదేశాలకూ వెళ్లాలనుకుంటున్నామేమో తెలీదు. ఇక కాస్త నిష్ఠగా లేవగానే స్నానం చేసి పూజచేసుకుని, తులసికి నీళ్లు పోసి మిగిలిన పనులు చేసుకుంటూ, నిత్యం ఎంతో కొంత సమయం భక్తి భావనలో గడపడం లాంటివి చేసుకునే సరికి ‘మేం దేవుడి పై భక్తితో ఉంటామండీ. మిగిలిన వాళ్ళలా కాదు’ అంటూ గర్వపడిపోయే వాళ్ళు కొందరుంటున్నారు. ఎన్నో గుళ్లకు ఎంతెంతో విరాళాలు ఇచ్చామని ప్రచారం చేసుకునే భక్తులు తోటి మానవుల పట్ల మనపాటి కనీస కారుణ్యంతో కూడా ఉండకపోవడం ఒక విచిత్రం.

చాలా అనిశ్చితంగా అయోమయంగా మారుతున్న సామాజిక, ఆర్థిక, ఆరోగ్య భయాలవల్ల మనుషులకి నిమ్మళం కనబడక కూడా కొంత భక్తిని ఆసరాగా చేసుకోవలసి వస్తోందేమో. మనకి మరో ఆప్షన్ లేదు. అంతా బాగానే జరుగుతుందిలే అనుకుని స్థిమితంగా ఉండలేకపోతున్నాం. ఆ టెన్షన్‌తో విసుగెత్తి ఇంకేదో మార్గం లోకి వెళ్లకుండా, ఇలా మనం భక్తి పెంచుకుంటే మంచిదే. అలా అన్నా కొందరికి కాస్తలో కాస్త మనశ్శాంతి దొరుకుతుంది. కొన్ని పుణ్య క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ప్రాణ నష్టం కూడా ఉంటోంది. అయినా వెళ్ళేవాళ్ళు ధైర్యంగా వెళుతూనే ఉంటారు. అది వారి ప్రపత్తి.

ఏ గుడికి వెళ్లినా, ఆఖరికి చిన్న గల్లీలో ఉండే ఒక బుజ్జి గుడికి వెళ్లినా ఎంతమంది భక్తులో! అన్నివయసుల వాళ్ళూ ఉంటున్నారు. మన చిన్నప్పుడు మనకి ఇంతమంది కనబడలేదు.ఇది నిజంగా మంచి పరిణామం. అయితే

ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి ఉద్యుక్తులమై,ఆ దారిలో వెళుతున్నాం అనుకుంటూనే భక్తి పేరుతో పక్కదారులు పడుతున్నామేమో అని మనల్ని మనం చెక్ చూసుకుంటూ ఉంటే బావుంటుందేమో. ఇంకా మనం నిర్వర్తించవలసిన కార్యాలూ, బాధ్యతలూ సక్రమంగా పూర్తిచెయ్యకుండా మన నుండి ప్రేమాభిమానాలో, ఆదరణో, మరొకటో ఆశిస్తున్న కుటుంబ సభ్యులకో, వృద్ధ తల్లి తండ్రులకో అందివ్వకుండా భక్తి పేరుమీద పలాయన వాదం పఠించడం కూడా ఎంతవరకూ మంచిదో ఆలోచించదగ్గ విషయమే. ఏదో బాహ్యాడంబరంగా కాకుండా ప్రపత్తితో కూడిన భక్తి మంచిది అని పండిత పెద్దల ఉవాచ.

అయితే భక్తులు పెరిగితే క్రైమ్ రేట్ తగ్గాలి. కానీ పెరుగుతోంది. క్రైమ్ అంటే హత్యలూ, దోపిడీలు మాత్రమే కాదు. పక్క వాడిని పీడించడం, వాడి గోడును పట్టించుకోకుండా ఉండడం లాంటివి కూడా. తోటి వారిపై నే కాక ఆఖరికి ధనం కోసం తల్లి తండ్రులపై కూడా దాడులు చేసే సంతానం కనబడుతోంది. ఆడపిల్లలపై అమానుషాలు చెప్పే పనే లేదు. అనేకానేకం. భక్తి దారి భక్తిదే మిగిలిన రాగద్వేషాలు దారి వాటిదేగా ఉంటోంది. ఆత్మస్థైర్యం లేక ఎందరో అమాయకులు ఆత్మహత్యల వైపువెళ్ళిపోతున్నారు. వింటుంటే ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. మనం ఏమీ చేయలేమా అన్న ఆవేదన కలుగుతుంది.

‘రామునిపై భక్తి పేరుమీద ఎన్నికల్లో పోటీ చేసే సమూహం కూడా, తన రాజ్యంలో ఉన్న సామాన్యుడి విమర్శను కూడా గౌరవించాలనుకునే రాముడినుండి, రాజ్య విస్తరణా దురాశలేని రాముడి నుండి ఏమి స్ఫూర్తిని పొందుతున్నారో తెలీదు. ఒక్కసారి వారు ఆ శ్రీ రాముని పట్ల ఎటువంటి ప్రపత్తిని కలిగిఉన్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలేమో!’ అన్నారొక రాజకీయ విశ్లేషకుడు టీవీ చర్చలో. మనం భగవంతునిపై భక్తితో పాటు ఆయన పట్ల ప్రపత్తినీ పెంచుకుని తర్వాత తాపత్రయం కాస్త తగ్గించుకుని మానవసేవ కోసం కొంత ధన, సమయాలు కేటాయిస్తే తోటి వారికీ మంచిది మనకీ మంచిది అని భక్తి మాగజైన్ లలో రాస్తూ ఉంటారు. అంత తీరిక మనకి ఉందా?

మనమంతా స్వకార్య సిద్ధిపై శ్రద్ధతోనే భగవంతునిపై భక్తి ప్రకటిస్తూ ఏదో బండి నడిపించేస్తుంటాం. అంటే అన్నామంటారు కానీ అంతా దైవేచ్ఛ,ఆయనేదిస్తే అది, ఆయనెలా నడిపిస్తే అలా అనుకుంటూ మన బాధ్యతను మరొకరిపై ఉంచే ప్రపత్తి ఎలా కుదురుతుందండీ ఈ కలియుగంలో, నాకు తెలీకడుగుతాను? ఎంత హైరానా పడాలి బతుక్కోసం? సౌకర్యాలతో జీవించడం అంటే మాటలు కాదుకదండీ! ఏమంటారు!

Exit mobile version