[శ్రీ పోలయ్య కూకట్లపల్లి రచించిన ‘ఫలాలు.. జలాలు..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
చెట్లు కదలకపోతేనేం..
చిగురుల చిరునవ్వులతో
చెమటల ఎండలను భరిస్తూ..
చినుకుల చుంబనాలతో
తడిసి తడిసి తేలుతూ..
పుట్టిన పుడమినుంచి
పడిపోయే పర్యంతం..
కొమ్మకొమ్మన
కోటి కానుకలై
ఫలాల్ని
పంచుతాయి..
వసంత వేళల్లో
వెన్నెల విందులు
చిందుతాయి.. కానీ
తామొక్క పండునైనా
తాకవు.. రుచిచూడవు..
ఎందుకని ఏమో..!
గలగల గానం చేసే
సెలయేళ్లు..
పరవళ్ళు తొక్కే
పవిత్ర నదులు..
కళకళలాడే కాలువలు..
గంభీర గర్జనల
సముద్ర సీమలు..
దూకే జలపాతాలు..
జీవరాశికి
జలజీవనాన్నిస్తాయి
కానీ తాము ఒక చుక్కైనా
తాగవు.. దాచవు..
ఎందుకని ఏమో..!
ఫలాలన్నీ..
జలాలన్నీ..
జీవాల జాతరకే
జగమే విందుగా..
పక్షుల కోసం..
పశువుల కోసం..
ప్రాణుల కోసం..
మనుషుల కోసం..
సకల చరాచర సృష్టి కోసం..
ఇంతటి ఉమ్మడి ప్రేమతో
ఇచ్చే ఈ ప్రకృతి
వెనుకనున్న ఆ పరమాత్మ..
కరుణకు కల్పవృక్షం..
దయకు దివ్యసాగరం..
ప్రేమకు పరిమళ పుష్పం..
అట్టి ఆదిదేవునికి
అనుదినం ఆరాధన..
అక్షయంగా అభివందనం..
చేతులు జోడించి చిత్తశుద్ధితో చేస్తున్నా
నమస్కారం.. సాష్టాంగ నమస్కారం..!
శ్రీ పోలయ్య కూకట్లపల్లి హైదరాబాద్ వాస్తవ్యులు. ‘కవి రత్న’, ‘సాహిత్య ధీర’, ‘సహస్ర కవి భూషణ్’ బిరుదాంకితులు.
