[బాలబాలికల కోసం ‘ఫోను ద్వారా మానవులను దగ్గర చేసిన గ్రహంబెల్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
ప్రియమైన చిన్నారులూ! మీరు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవాలంటే ఏం చేస్తారు? వెంటనే ఫోన్ చేసి మాట్లాడేస్తారు. ఊర్లో ఉన్న మీ ఫ్రెండ్స్ తోనే కాదు. ఇతర ఊర్లలో, ఇతర దేశాలలో ఉన్నవారితో సైతం ఫోనులో మాట్లాడవచ్చు నేడు. కానీ ఒకనాడు భవిష్యత్తులో ఫోనులాంటి పరికరం రావచ్చన్న ఊహను సైతం ఎగతాళి చేశారు. ఆనాడు ఒకరికొకరు సమాచారం అందించుకోవాలంటే చాలా కష్టమయ్యేది. ఈనాడు మనకు ఆ కష్టాలన్నీ లేకుండా చేసి ఫోనును కనుక్కున్న శాస్త్రవేత్త గురించి తెలుసుకుందాం.
గ్రహంబెల్ 1847వ సం॥ మార్చి 3వ తేదీన స్కాట్లాండులో జన్మించాడు. తండ్రిపేరు అలెగ్జాండర్ మెల్విలే బెల్, తల్లిపేరు ఎలిజాగ్రేస్ సైమండ్స్. బెల్ ఒక ఏడాది ప్రైవేటు స్కూల్లోనూ, తర్వాతి రెండేళ్ళూ ఎండింబరో లోని రాయల్ హైస్కూల్లోనూ చదివి 14 సం॥లకే పట్టభద్రుడైనాడు. గ్రహంబెల్ చిన్నతనం నుండీ శబ్దం, ధ్వని వాటి తరంగాలపై నిశితంగా పరిశీలన జరిపేవాడు.
1864లో గ్రహంబెల్ తొలిసారిగా శబ్దతరంగాలపై పరిశోధనలు మొదలుపెట్టాడు. బెల్ పరిశోధనా కృషిని గమనించిన బోస్టన్ యూనివర్శిటీ వోకల్ ఫిజియాలజీ ప్రొఫెసరుగా అవకాశమిచ్చింది. థామస్ వాట్సన్ సహాయంతో గ్రహంబెల్ మొదటిసారిగా ధ్వని తరంగాలను విద్యుత్ తీగల ద్వారా ప్రసారం చేయవచ్చని కనుగొన్నాడు. చివరకు 1875వ సం॥ ఏప్రిల్ 6వ తేదీన ఆయన కనుక్కున్న టెలిగ్రాఫ్ విధానానికి పేటెంట్ లభించింది. ఆయనకు పేటెంట్ లభించిన సంవత్సరానికల్లా టెలిఫోన్ వాణిజ్య సాధనమై మార్కెట్లో దర్శనమిచ్చింది. వైద్య పరిశోధనలలో ఎంతగానో ఉపయోగపడే ఫోటోఫోన్‌ను, కంఠ ధ్వనులను లక్కప్లేట్లపైకి ఎక్కించి రికార్డు చేసే గ్రాంఫోనునూ గ్రహంబెల్ రూపొందించాడు. 1885లో స్కాట్లండ్‌లో లాబొరేటరీలను స్థాపించాడు. 1893లో గ్రహంబెల్ నేడు ప్రపంచంలోనే అగ్రగామిగా పేరొందిన ‘బోల్టాబ్యూరో సంస్థను’ బోస్టన్‌లో నెలకొల్పాడు. చిత్రపటాల ద్వారా భూగోళ శాస్త్రాన్ని భోదించవచ్చన్న విషయాన్ని కనుక్కున్నారు. గ్రహంబెల్ చేసిన రకరకాల పరిశోధనల్లో 18 రకాలకు పేటెంట్ హక్కు లభించింది.
తన మదిలోని ఆలోచనలన్నిటినీ ఒక పుస్తకంలో వ్రాసే అలవాటున్న గ్రహంబెల్ మరణించే చివరి నిముషాలలో కూడా తనకొచ్చిన ఆలోచన్లను అసిస్టెంట్ చేత పుస్తకంలో వ్రాయించాడు. విశ్వవాప్తంగా ఫోను ద్వారా మానవులను దగ్గర చేసిన గ్రహంబెల్ 1922 సం॥ ఆగస్టు 2వ తేదీన కన్ను మూశాడు.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
