[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
కుటుంబ ఆనందానికి చిన్న చిన్న మార్గాలు: చిన్న ప్రయత్నాలు, పెద్ద జ్ఞాపకాలు!
ఈమధ్య మనం అందరం బిజీగా ఉన్నాం. తల్లిదండ్రులు పనుల్లో మునిగిపోయి ఉంటారు (డెడ్‌లైన్లు, మీటింగులు, బిల్లులు). పిల్లలు కూడా అంతే, స్కూల్ ప్రాజెక్టులు, ట్యూషన్లు, క్లాసులలో. ఒకే ఇంట్లో ఉండి కూడా, మనం ఒక్కరినొకరు చూడటానికి సమయం దొరకడం కష్టమైపోయింది. ఇక కలిసి ఆనందముగా గడపడం అన్న మాటే అరుదైపోయింది.
రాత్రి అందరూ ఒకే టేబుల్ వద్ద భోజనం చేస్తున్నా, ఒక్కోరి చేతిలో ఒక్కో మొబైల్ ఉంటుంది.
మాటలు తక్కువ, సైలెన్స్ ఎక్కువ. పిల్లల నవ్వులు కూడా ఇప్పుడు వాట్సాప్ స్టికర్లలో మాత్రమే కనిపిస్తున్నాయి.
ఈ మౌనమైన బిజీ జీవనంలో, మన కుటుంబం దగ్గరగానే ఉన్నా, ఆ అనుబంధం కొద్దిగా దూరమైపోతోంది.
కానీ నిజంగా చూసుకుంటే, కుటుంబ ఆనందం అనేది, పెద్ద పెద్ద ప్లాన్స్‌లో, ఖరీదైన ట్రిప్స్‌లో లేదా ఫ్యాన్సీ గిఫ్ట్స్‌తో దొరికేది కాదు. ఆ ఆనందం దొరికేది చిన్న క్షణాల్లో – చిన్న ప్రయత్నాల్లో.
ఉదాహరణకు: ఒక తల్లి ఉదయం బిజీగా ఉన్నప్పటికీ, తన కుమార్తెను చూసి “ఇవాళ నువ్వు ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నావు!” అని చెప్పింది.
ఆ చిన్న మాట ఆ అమ్మాయి రోజంతా చిరునవ్వుతో గడిపేలా చేసింది.
ఇదే కుటుంబ ఆనందం యొక్క అసలు రూపం.
మన ప్రేమను, మన ప్రాధాన్యతను చూపించడానికి పెద్ద పనులు అవసరం లేదు.
ప్రేమ ఆప్యాయతతో కూడిన చిన్న మాటలు, శ్రద్ధతో కూడిన చిన్న క్షణాలు మన ఇంట్లో వెలుగులు నింపగలవు.
ఆనందం అంటే సమస్యలేని జీవితం కాదు
పరిపూర్ణ జీవితం లేదా సమస్యలు లేకుండా ఉన్న జీవితం వాస్తవానికి లేదు. ప్రతి కుటుంబంలో ఆర్థిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, స్కూల్-రిలేటెడ్ స్ట్రగుల్స్, మరియు వ్యక్తిగత భావోద్వేగ తేడాలు వస్తుంటాయి. ఆనందం అంటే ఇవన్నింటిని గుర్తించకపోవటం కాదు, వాటిని అంగీకరించి, కలిసి ఎదుర్కోవడం.
కానీ వీటన్నింటిలోనూ కూడా మనం కలసి నవ్వగలగడం, ఒకరికొకరు అండగా ఉండగలగడం అన్నదే సంతోషకర జీవితం.
మన పిల్లలు ఇలాంటి వాతావరణంలో పెరిగితే వాళ్లలో ఆత్మవిశ్వాసం, సాంత్వన, మరియు సహనశక్తి పెరుగుతుంది.
కుటుంబ ఆనందానికి చిన్న చిన్న మార్గాలు
మనందరి జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలు ఉంటాయి – మంచి ఇల్లు, మంచి విద్య, మంచి స్థాయి. కానీ ఈ అన్ని విజయాల మధ్య, ‘కుటుంబం’ అనే చిన్న లోకాన్ని ఆనందంగా ఉంచడమే నిజమైన విజయం. అది పెద్ద పెద్ద ప్రణాళికలతో కాదు, చిన్న చిన్న మార్పులతోనే సాధ్యమవుతుంది.
1. ఆనందం కోసం ఎదురు చూడడం కాదు – సృష్టించడం నేర్చుకుందాం
చాలా సార్లు మనం ‘ఒకరోజు వీకెండ్ వస్తే..’ లేదా ‘విహారయాత్రకి వెళితే..’ అని అనుకుంటాం.
కానీ నిజమైన కుటుంబ ఆనందం మన రోజువారీ జీవితంలోనే దాగి ఉంటుంది.
ఉదా: ప్రతి సాయంత్రం భోజనం సమయంలో అందరం కలసి కూర్చోవడం.
మొబైల్‌లను పక్కన పెట్టి, పిల్లల స్కూల్ సంగతులు, అమ్మానాన్నల ఆఫీస్ సంగతులు మాట్లాడటం.
ఇది చిన్న చర్యగా కనిపించినా, కుటుంబ బంధాన్ని బలపరుస్తుంది.
2. ‘సమయం ఇవ్వడం’ – ప్రేమను చూపించే పెద్ద మార్గం
పిల్లలు లేదా జీవిత భాగస్వామి మనతో మాట్లాడాలనుకుంటే, “ఇప్పుడు టైమ్ లేదు” అని చెప్పడం మనకు అలవాటు అయిపోయింది. కానీ వారి మాటలుని వినడం, రెండు నిమిషాలు కనీసం మనసుపెట్టి మాట్లాడడం, అన్నది వారికీ భరోసా ఇస్తుంది.
ఉదా: ఒక తల్లి తన కుమార్తెతో రోజూ కేవలం ఐదు నిమిషాల ‘చాట్ టైమ్’ పెట్టుకుంది. ఏ విషయం అయినా, స్కూల్, స్నేహితులు, లేదా కొత్త పాట. ఆ సమయంలో అమ్మ కేవలం వినడం మాత్రమే చేసేది, అది పూర్తిగా మనసు పెట్టి.
ఆ చర్య వారి సంబంధాన్ని అద్భుతంగా మార్చింది.
3. ఒక చిన్న ఆచారం – పెద్ద బంధం
ప్రతి కుటుంబం ఒక ‘సిగ్నేచర్ హ్యాబిట్’ ఉండాలి.
ఆదివారం ఉదయం కలసి అల్పాహారం వండటం, లేదా ప్రతి నెల చివరి శుక్రవారం మూవీ నైట్ జరుపుకోవటం, మొదలగునవి.
ఉదా: ఒక కుటుంబం ప్రతిరోజు భోజనం తర్వాత ‘గ్రాటిట్యూడ్ రౌండ్’ చేస్తుంది.
అంటే ఆ రోజు ఎవరికీ ఏది బాగా నచ్చిందో చెప్పడం. ఈ సాధారణ అలవాటు వలన వారు చిన్న విషయాల్లో ఆనందం కనుగొనడం నేర్చుకున్నారు.
ఈ చిన్న ఆచారాలు పిల్లల మదిలో శాశ్వతమైన జ్ఞాపకాలను సృష్టిస్తాయి.
4. నవ్వులు పంచుకోండి – అది ఉచితమైన థెరపీ
నవ్వులోనే పెద్ద మాయ ఉంది. ఒక చిన్న జోక్, ఒక పాత సంఘటన, ఒక ఫన్నీ వీడియో, వీటన్నింటి వల్ల ఇంట్లోని వాతావరణం లైట్‌గా ఉంటుంది. పిల్లలు కూడా తల్లిదండ్రులతో సౌకర్యంగా మెలుగుతారు.
5. ‘ధన్యవాదం’ అనే పదం మాయ
మనం చిన్న చిన్న కృతజ్ఞతలను చెప్పడం మొదలుపెట్టాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరి సహాయానికి ఓ చిన్న ‘థ్యాంక్యూ’ పలకడం సంతోషాన్ని పెంచుతుంది.
ఉదా: “నువ్వు నీ ప్లేట్ చక్కగా కడిగి పెట్టావు – థ్యాంక్యూ!”, అని మీరు అన్న మాట, పిల్లలో గొప్ప ఆత్మగౌరవాన్ని పెంచుతుంది.
తల్లిదండ్రులుగా మనం ఎప్పుడూ ‘మంచి భవిష్యత్తు’ గురించి ఆలోచిస్తాం, కానీ ‘ఇప్పటి క్షణం’లో ఉండడం కూడా అంతే ముఖ్యం. చిన్న క్షణాల్లో ఆనందం గుర్తించడం, పిల్లలతో చిన్న చర్చలు జరపడం – ఇవే మైండ్‌ఫుల్ పేరెంటింగ్ యొక్క మొదటి అడుగులు.
పిల్లల మనసు సున్నితంగా ఉంటుంది. వాళ్ళు ఇంట్లో ప్రేమను ప్రేమను అనుభవిస్తూ అమ్మానాన్నలతో కలిసి సమయం గడిపితే, బయటి ఒత్తిడులను సులభంగా ఎదుర్కొంటారు.
ఇంట్లోని ఆనందకర వాతావరణం వారికి emotional safety ఇస్తుంది, ఇది వారి వ్యక్తిత్వ అభివృద్ధికి బలమైన పునాది.
చిన్న చిన్న మార్పులు – పెద్ద పెద్ద ఫలితాలు
ప్రతీ కుటుంబం తనదైన పద్ధతిలో సంతోషాన్ని సృష్టించుకోవచ్చు. దానికి పెద్ద ప్రణాళికలు అవసరం లేదు, చిన్న మార్పులు చాలు. వాటిని రోజువారీ జీవితంలో చేర్చినప్పుడు – కుటుంబం మొత్తం ఒక కొత్త ఉత్సాహంతో నిండిపోతుంది.
• మొబైల్ లేని భోజన సమయం
ఇప్పటి కుటుంబాల్లో భోజనం కూడా స్క్రీన్ తోనే సాగుతుంది. ఒక్కసారి ఆ మొబైల్స్‌ను టేబుల్ పక్కన పెట్టి చూడండి, అక్కడే ఒక కొత్త అనుబంధం మొదలవుతుంది.
• వారంలో ఒకరోజు ‘ఫ్యామిలీ ఫన్ అవర్’
జీవితంలో ఆనందం రావాలంటే, దానికి సమయం కేటాయించాలి. వారంలో ఒకరోజైనా కలసి ఆడటం, నవ్వటం, కొత్తదేదైనా చేయటం మొదలుపెట్టండి. ఈ సులభమైన ఆచారం కుటుంబాన్ని మరింత దగ్గర చేస్తుంది.
• రోజూ ఒక ‘ధన్యవాదం’ క్షణం
ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఒక్క కృతజ్ఞత చెప్పే అలవాటు మొదలుపెడితే, మన దృష్టి సమస్యల మీద కాకుండా ఆశీర్వాదాల మీద ఉంటుంది.
“నాన్న ఇవాళ నా ప్రాజెక్ట్‌లో సహాయం చేశారు, థ్యాంక్యూ!”
“అమ్మ నాకో ఫేవరెట్ డిష్ వండింది, ధన్యవాదాలు!”
అని పిల్లలు చెప్పినప్పుడు, వారు కృతజ్ఞతతో కూడిన మనసు పెంచుకుంటారు.
• పిల్లలతో కలసి ఇంటి పనులు చేయడం
ఇది కేవలం సహాయం కాదు – ఇది బంధాన్ని బలపరచే శ్రద్ధాభావం.
పిల్లలు వయస్సుకు తగ్గట్టు చిన్న పనులు చేయనివ్వండి – ప్లేట్లు పెట్టడం, మొక్కలకు నీళ్లు పోయడం, వస్తువులు సర్దడం వంటివి. వాళ్లకు బాధ్యతా భావం నేర్పించటమే కాకుండా, కుటుంబం అనే టీమ్‌లో భాగమనే భావన కలుగుతుంది.
ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు, అన్నీ కలిసి మన ఇంటిని ఆనందపు ఆలయంగా మారుస్తాయి. రోజువారీ జీవితంలో ఈ చిన్న మార్పులు తెస్తే, మన ఇంటి వాతావరణం స్వయంగా హాయిగా, వెలుగుగా మారుతుంది. మన ఇల్లు గోడలతో కాదు, మన ప్రేమతో నిండిన క్షణాలతో నిలుస్తుంది.
ఏళ్ల తర్వాత పిల్లలు గుర్తుపెట్టుకునేది మన ఇచ్చిన గిఫ్ట్స్ కాదు, మన కలసి నవ్విన క్షణాలు, మన ప్రేమతో చెప్పిన మాటలు. కుటుంబ ఆనందం కోసం మనం బయట వెతకాల్సిన అవసరం లేదు – మన హృదయంతో, మన సమయంతోనే దాన్ని సృష్టించవచ్చు.
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.
