[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
టీనేజ్ వయసులో ఫ్రెండ్స్ ప్రభావం: తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి?
టీనేజ్ వయసు అంటే మార్పుల కల్లోల సముద్రం. శరీరంలో మార్పులు, మనసులో కొత్త భావాలు, ప్రపంచంలోని ఏదో తెలియని కొత్తలు వింతలు కనిపించడం మొదలవుతుంది. వారి జీవితంలో స్నేహితులు ముఖ్య కేంద్రంగా మారిపోతారు. చుట్టూ ఉన్న స్నేహితులలో తనే పాపులర్‌గా ఉండాలి అందరూ తననే చూడాలి అన్న ఆలోచనల్లోకి వెళ్తారు.
దానితో, ఇప్పటివరకు అమ్మా నాన్న మాటే నిజమని నమ్మిన పిల్లలు; ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్పింది మాత్రమే సరైనదని భావిస్తారు.
“మా పిల్లాడు చాలా మారిపోయాడు.. ఇప్పుడతనికి ఫ్రెండ్స్ తప్ప ఎవరూ అవసరం లేరు..” అంటూ చాలా తల్లిదండ్రుల హృదయంలో మౌన ఆందోళన ప్రారంభమవుతుంది.
కానీ నిజానికి, ఇది ఎదుగుదలలో సహజ దశ. ఇప్పుడు తల్లిదండ్రులు తడబడకూడదు..
సర్దుబాటు నేర్చుకోవాలి.
టీనేజ్ వయసులో స్నేహితుల ప్రాముఖ్యత
చిన్నప్పటివరకు పిల్లలకు ఫ్యామిలీనే ప్రపంచం.
కానీ టీనేజ్ లోకి అడుగుపెట్టగానే వారి ఆలోచనల్లో కొత్త మార్పులు మొదలవుతాయి.
ఇప్పుడు వారికి తల్లిదండ్రులు మాత్రమే కాదు – “నా ఫ్రెండ్స్ నన్ను ఎలా చూస్తారు?” అనే ప్రశ్న ఎక్కువ ప్రాముఖ్యత పొందుతుంది.
ఈ వయసులో పిల్లలు తమ సొంత గుర్తింపు (identity) కోసం వెతుకుతుంటారు.
“నేను ఎవరు?”, “నాకు ఎవరు అర్థం చేసుకుంటారు?” అనే ప్రశ్నలు వారి మనసులో తిష్ట వేసుకుంటాయి. అప్పుడు ఫ్రెండ్స్ వాళ్లకు సమాధానాలుగా కనిపిస్తారు.
వాళ్లు ఇచ్చే acceptance, understanding, belonging భావన పిల్లల హృదయానికి తాకుతుంది.
ఫలితం – వాళ్లు ఫ్రెండ్స్‌తో ఎక్కువగా ఉండాలనుకుంటారు.
కానీ అన్ని స్నేహాలు ఒకేలా ఉండవు. మంచి ఫ్రెండ్స్ మన పిల్లల్లో విలువలు, ధైర్యం, సహకారం పెంచుతారు. తప్పుడు ఫ్రెండ్స్ మాత్రం దారితప్పించే అవకాశం ఉంది. ఇదే తల్లిదండ్రుల ఆందోళనకు మూలం.
స్నేహం వల్ల వచ్చే రెండు వైపుల ప్రభావం
టీనేజ్ వయసులో స్నేహం అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా కావాల్సిందే. అది వారి ఎమోషనల్ నీడ్స్‌ని తీరుస్తుంది, వారికి ఒక ఎమోషనల్ స్టెబిలిటీని ఇస్తుంది.
వాళ్లు స్నేహితులతో నవ్వుతారు, రహస్యాలు పంచుకుంటారు, కలలు చెప్పుకుంటారు. ఆ బంధం వాళ్లకు సురక్షితమైన స్థలం లాగా అనిపిస్తుంది. అయితే ఈ స్నేహాలు అన్ని సమయాల్లో సానుకూలంగా ఉండవు; కొన్ని సందర్భాల్లో అవి పిల్లల మనస్తత్వం, ప్రవర్తన, దిశ అన్నిటినీ ప్రభావితం చేస్తాయి.
♡ సానుకూల ప్రభావం — మానసిక బలం ఇచ్చే స్నేహం
సానుకూల స్నేహాలు పిల్లల ఎదుగుదలలో అద్భుతమైన శక్తిని ఇస్తాయి.
ఒక మంచి స్నేహితుడు అంటే,
- వాళ్లు తప్పు చేసినప్పుడు మందలించి,
- విజయాన్ని చూసి నిజంగా ఆనందించి,
- తమ కలల కోసం ప్రోత్సహించే వ్యక్తి.
ఉదాహరణకి:
ఒక 14 ఏళ్ల అమ్మాయి తన స్కూల్లో ప్రెజెంటేషన్‌కి భయపడుతోంది.
ఆమె ఫ్రెండ్ “నీకు ఇది సాధ్యమే, నీకు మంచి వాయిస్ ఉంది నువ్వు ధైర్యంగా చెప్పగలవు!” అని చెప్పి ప్రాక్టీస్ చేయడంలో సాయం చేస్తే
అది కేవలం స్నేహం కాదు, ఆత్మవిశ్వాసానికి ఆరంభం అవుతుంది.
అలాంటి స్నేహితులు పిల్లల్లో సహానుభూతి, టీమ్ స్పిరిట్, ప్రత్యేకతను అంగీకరించడం వంటి విలువలను పెంచుతారు. వాళ్లు “ఎవరికీ తగ్గకుండా, ఎవరి పైన కూడా అహంకారం చూపకుండా” ఉండడం నేర్చుకుంటారు.
మంచి స్నేహితులు పిల్లల మనసుకు అద్దం లాంటివారు.
వాళ్లు ఎలా ప్రవర్తిస్తారో, అది మన పిల్లల్లో కూడా ప్రతిబింబిస్తుంది.
అందుకే, ఇలాంటి స్నేహాలు పిల్లల జీవితంలో సెల్ఫ్ ఈస్టీమ్ బూస్టర్లా పనిచేస్తాయి.
♡ ప్రతికూల ప్రభావం – ఒత్తిడికి దారి తీసే స్నేహం
ఇక మరో వైపు; కొన్ని స్నేహాలు పిల్లలపై
- మనోవైజ్ఞానిక ఒత్తిడి, తప్పు ప్రవర్తన, లేదా తప్పు నిర్ణయాలకు దారి తీస్తాయి.
- స్వీయగౌరవం తగ్గడం, అనవసరమైన ఆందోళనకు దారి తీస్తుంది
- ఇది ఎక్కువగా కనిపించేది ‘కూల్‌గా కనిపించాలి’ అనే ఒత్తిడితో.
ఉదాహరణకి:
ఒక టీనేజ్ బాయ్ తన ఫ్రెండ్స్ స్మోక్ చేస్తున్నారని చూసి,
‘వాళ్లతో ఫ్రెండ్‌గా ఉండాలంటే నేనూ అలాగే చేయాలి’ అని అనుకోవచ్చు.
ఆ సమయంలో అతనికి అది స్నేహం అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది ఆమోదం కోసం చేసే త్యాగం.
ఇలాంటి ప్రతికూల స్నేహాలలో పిల్లలు:
- తమ వ్యక్తిత్వాన్ని దాచేస్తారు
- ‘నాకోసం’ అనే మాట మరిచిపోతారు
- ఇతరుల అభిప్రాయాలనే తమ విలువగా భావిస్తారు
దీని ఫలితంగా వారు తల్లిదండ్రులతో మాట్లాడడం తగ్గిస్తారు, అలసటగా, నిరుత్సాహంగా మారిపోతారు, కొన్నిసార్లు ‘ఎవరు నా నిజమైన ఫ్రెండ్?’ అనే సందేహంతోనే గందరగోళంలో పడిపోతారు.
తల్లిదండ్రుల ప్రతిస్పందన – ఇక్కడే అసలు కీ ఉంది!
చాలా సార్లు మనం అజాగ్రత్తగా చేసే తప్పులు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తాయి.
ఉదాహరణకి:
“ఆ ఫ్రెండ్ మంచోడు కాదు”, “అతనితో తిరగకూడదు” అని చెప్పడం.
పిల్లల దృష్టిలో ఇది విమర్శగా కాకుండా, వ్యతిరేకతగా కనిపిస్తుంది.
ఫలితం:
వాళ్లు మరింత దూరం అవుతారు. మరియు ఆ స్నేహం.. మరింత రహస్యంగా మారుతుంది.
అందుకే, పిల్లల స్నేహాలపై తల్లిదండ్రులు అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇదే.
పిల్లలకు ఏ స్నేహం మంచిదో చెడ్డదో నేరుగా చెప్పడం కన్నా, వాళ్లతో చర్చించే వాతావరణం కల్పించాలి.
- “నీ ఫ్రెండ్ నిన్న ఎలా ఫీల్ అయ్యేలా చేశాడు?”
- “ఆ స్నేహం వల్ల నీలో ఏదైనా కొత్తగా తెలుసుకున్నావా?”
ఇలాంటి ప్రశ్నలు అడిగితే పిల్లలు ఆలోచించడం మొదలుపెడతారు. ఒకసారి వారు తమ భావాలు, అనుభవాలు చెప్పడం మొదలుపెడితే, మీరు వారికీ ఒక సురక్షిత స్థలం అవుతారు.
అప్పుడు వారిని ఎవరూ తప్పు దారిలోకి లాగలేరు.
తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిందేమిటి?
పిల్లల స్నేహాలను అర్థం చేసుకోవడం అంటే వాళ్ల వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడం కాదు. వాళ్ల ప్రపంచాన్ని గౌరవిస్తూ, నెమ్మదిగా అందులోకి అడుగుపెట్టడం. ఈ క్రింది సూచనలు తల్లిదండ్రులకు ఆ మార్గాన్ని చూపుతాయి 👇
1. తీర్పు ఇవ్వకుండా వినండి
పిల్లలు ఎవరి గురించి మాట్లాడినా వెంటనే వ్యాఖ్యానించవద్దు.
“అతను ఎవరు?”, “ఏ ఇంటి వాడు?”, “ఏం చదువుతున్నాడు?” అనే ప్రశ్నలకన్నా
“అతనితో ఉన్నప్పుడు నీకు ఎలా ఫీల్ అవుతుంది?” అని అడగండి.
వాళ్లకు మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమైతే, నిజాలు చెప్పడంలో సిగ్గుపడరు.
2. వాళ్ల ఫ్రెండ్స్‌ని తెలుసుకోండి
ఒక సాయంత్రం వాళ్ల ఫ్రెండ్స్‌ని ఇంటికి ఆహ్వానించండి. వాళ్లతో కలిసి మాట్లాడండి, స్నాక్స్ పెట్టండి. గేమ్స్ ఆడండి.
ఈ విధంగా మీరు వారి ఫ్రెండ్స్ గురించి తెలుసుకోగలుగుతారు, పిల్లలు కూడా ఆనందిస్తారు, అమ్మ నాన్న నా స్నేహితులని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని.
3. ఫ్రెండ్ మీద నెగటివ్ కామెంట్స్ చేయొద్దు
పిల్లల ఫ్రెండ్ మీకు నచ్చకపోయినా,
“ఆ వాడు అంత మంచోడు కాదు”, “ఆ అమ్మాయి చెడ్డ ప్రభావం చూపుతుంది” అని నేరుగా చెప్పడం కంటే,
“నువ్వు ఆ స్నేహంలో సంతోషంగా ఉన్నావా?” లేదా “అతనితో ఉన్నప్పుడు నీకు ఒత్తిడి అనిపిస్తుందా?” అని ప్రశ్నించడం మంచిది.
ఇలా అడగడం వల్ల వాళ్లు ఆలోచిస్తారు, రక్షణగా కాకుండా విశ్లేషణగా స్పందిస్తారు.
4. Control కాదు, Guidance ఇవ్వండి
పిల్లలు ఎప్పుడూ మన మాట వినాలి, మనం చెప్పినట్టే చేయాలి, మన కంట్రోల్ లో ఉండాలి అన్న తపన మనలో ఉంటుంది.
కానీ అదే మన పిల్లలకి ఒక పంజరములాగా అనిపిస్తుంది.
వారి గురించి, ఏదైనా విషయం గురించి ఆందోళన ఉంటే, నిన్ను గురించి భయమేసింది అని వారికి చెప్పండి. అది వారికి care గా అనిపిస్తుంది, criticism గా కాదు.
5. సోషల్ మీడియా స్నేహాలపై ఓపెన్ చర్చలు జరపండి
ఇప్పటి పిల్లలకు ‘ఫ్రెండ్’ అంటే కేవలం స్కూల్లో ఉన్నవాడు కాదు, ఇన్స్టాగ్రామ్, గేమింగ్, లేదా ఆన్లైన్ గ్రూప్లలో ఉన్నవాళ్ళు కూడా అవుతారు. ఇలాంటి స్నేహాల గురించి భయంతో నిషేధించకుండా, సహజంగా చర్చించండి.
“ఆ ఫ్రెండ్ నీకు ఎలా తెలిసాడు?”, “అతనితో మాట్లాడితే నీకు సేఫ్‌గా అనిపిస్తుందా?”
అని అడిగితే, వాళ్లు తమ ఆన్లైన్ అనుభవాలను మీతో పంచుకుంటారు.
6. వారిని తమ విలువల ఆధారంగా స్నేహాలు ఎంచుకునేలా నేర్పండి
“ఫ్రెండ్ అనే వ్యక్తి నీకు ప్రోత్సాహం ఇస్తున్నాడా? నీకు నచ్చని పనులు చేయమని ఒత్తిడి చేస్తున్నాడా?”
అని ప్రశ్నలు అడిగుతూ, పిల్లలు స్నేహాల గుణాత్మకతను అంచనా వేయడం నేర్పించండి.
దీంతో వారు భవిష్యత్తులో కూడా స్వయంగా సరిదిద్దుకునే సామర్థ్యం పెంపొందించుకుంటారు.
7. Trust & Freedom సమతుల్యం చేయండి
నమ్మకం ఉన్న చోటే నిజాయితీ పెరుగుతుంది. పిల్లలు సేఫ్‌గా ఫీలవ్వాలి.
అధిక ఆంక్షలు అనుమానం పెంచుతాయి. అధిక స్వేచ్ఛ కూడా ప్రమాదం.
ఇద్దరి మధ్యే సమతుల్యం కీలకం. పిల్లలపై నమ్మకం ఉంచి, అదే సమయంలో boundaries సున్నితంగా వివరించండి.
ఉదా: “నువ్వు ఎక్కడికైనా వెళ్తే ముందే చెప్పు, నాకు సేఫ్‌గా అనిపిస్తుంది” అని చెప్పడం.
8. ఫ్రెండ్స్ ద్వారా విలువలు నేర్పించడం
స్నేహం అంటే Loyalty, Respect, Empathy అని వాళ్లతో మాట్లాడండి. తమ ఫ్రెండ్స్ influence గురించి మాట్లాడండి.
“ఒక ఫ్రెండ్ తప్పు చేసినప్పుడు నువ్వు ఏం చేస్తావు?” లాంటి ప్రశ్నలతో వాళ్ల ఆలోచన దారిని గుర్తించండి. వాళ్ల ఫ్రెండ్స్ వల్ల నేర్చుకున్న పాజిటివ్ విషయాలను ప్రశంసించండి.
ఉదా: “నీ ఫ్రెండ్ చాలా helping nature ఉన్నాడని అనిపిస్తోంది, నువ్వు కూడా అలాగే ఉన్నావ్.”
ముగింపు:
మొత్తం మీద, పిల్లల స్నేహాలను అర్థం చేసుకోవడం అనేది వారిని గమనించడం కాదు,
టీనేజ్లో ఫ్రెండ్స్ ప్రభావం తప్పించలేము. పిల్లలు ఎవరితో కలుస్తున్నారో కంట్రోల్ చేయడం కాదు, ఎవరితో ఎలా కలవాలో అర్థం చేసుకునే శక్తి ఇవ్వడం ముఖ్యం. కానీ, వారు ఎలాంటి స్నేహితులని ఎంచుకోవాలో అని నేర్పిచటమే తల్లిదండ్రులుగా మన బాధ్యత.
పిల్లల స్నేహాల గురించి మనం ఓపెన్‌గా ఉంటే, వాళ్లు మనతో నిజాయితీగా ఉంటారు.
వాళ్ల ఫ్రెండ్స్‌ని తెలుసుకోవడం అంటే వాళ్ల హృదయానికి దగ్గర కావడం.
చివరికి మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే,
ఫ్రెండ్స్‌ని మార్చడం కాదు, పిల్లల పిల్లలకి సరైన మార్గం చూపించటం.
వాళ్లు ఫ్రెండ్స్ మధ్యన ఉంటూ కూడా మన ప్రేమను సురక్షితంగా ఫీలవుతుంటే,
అప్పుడు మనం నిజంగా మంచి తల్లిదండ్రులమని చెప్పొచ్చు.
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.
