[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
క్యాలెండర్ మారింది.. కానీ పేరెంటింగ్ మారాల్సిన అవసరం ఉందా?
డిసెంబర్ చివరి రోజులు వచ్చేసరికి ఇంట్లో ఒక రకమైన మార్పు కనిపిస్తుంది. ఎన్నెన్నో ప్లాన్ వేసేస్తూ ఉంటాం, పార్టీలు, వెకేషన్లు, లేట్ నైట్ లాంగ్ డ్రైవ్ లని అన్నిటితో మనల్ని మనం బిజీగా ఉంచుకుంటాం. ఎన్నో చేద్దాం అని ఆలోచిస్తాం, కాని కొన్ని చేస్తాం, కొన్ని చేయలేక పోతాం. మొత్తం మీద బిజీ బిజీగా డిసెంబర్ చివరివారం నడిపేస్తాం. 31 రాత్రి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ విష్ చేసేసుకుంటాం.
జనవరి మొదటి తారీకు రాగానే, గోడల మీద కొత్త calendar, ఫోన్లో కొత్త wallpapers, డైరీలో కొత్త పేజీలు, నిర్ణయాలు. ఈ కొత్త సంవత్సరం ఏవేవో సాధించాలని ఆలోచనలు అన్నీ మన డైరీలోని, మనసులోని నింపేసుకుంటాం.
అదేవిధంగా, చాలామంది పేరెంట్స్ కూడా, సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ల పేరెంట్ జర్నీలో రావాలి అన్న మార్పుల్ని గురించి కూడా ఆలోచించుకుంటారు.
ఉదా:
- ఈ ఏడాది కోపం తగ్గాలి.
- ఈ ఏడాది పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి.
- ఈ ఏడాది స్క్రీన్ టైం తగ్గించాలి.
ఇవి తప్పు కాదు, కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించటం లేదు. పిల్లలు కొత్త సంవత్సరం అని మనల్ని కొత్త పేరెంట్స్‌గా మారమని అడగడం లేదు. వాళ్ల జీవితంలో ఎప్పటికీ అదే అమ్మ, అదే నాన్న కావాలి. కానీ వాళ్లతో కలిసి గడపాలి, వాళ్లతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు.
పిల్లలు మన దగ్గరకు వచ్చి ఎప్పుడూ ఇలా అనరు:
“అమ్మా/నాన్న, ఈ ఏడాది నువ్వు ఇంకొంచెం better parent అవ్వాలి అని.” వాళ్లు అడిగేది చాలా సింపుల్. “నువ్వు నాతో ఉంటావా?”
పిల్లల రోజులు క్యాలెండర్ మీద నడవవు. వాళ్ళ టీనేజ్ పిల్లలు అవన్నీ లేదు చిన్న పిల్లలు అయినా వాళ్ల జీవితంలో రోజులు వాళ్ళ ఎమోషన్స్, భావాల మీదనే ఎక్కువగా నడుస్తాయి.
ఉదా:
స్కూల్ నుంచి వచ్చిన పిల్లాడు, బ్యాగ్ పక్కన పెట్టి సూటిగా మీ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. ఏమీ మాట్లాడడు. ఏమీ అడగడు. మీరు మీ ఆఫీస్ వర్క్‌లో బిజీగా ఉంటారు లేదా మొబైల్లో మాట్లాడుతుంటారు.
ఆ బిజీలో కూడా మీరు మీ పిల్లోడికి, మాటలు కాకుండా చేతులతో చూపిస్తున్నారు, బ్యాగ్ పెట్టు, షూలు విప్పు అని. దీంతో మీరు అనుకుంటున్నారు మీ పిల్లోడితో మీరు టైం స్పెండ్ చేస్తున్నారు స్కూల్ నుంచి రాంగానే అని.
కానీ మీ పిల్లవాడికి కావాల్సింది మీ ప్రెజెన్సు. మీరు వర్క్‌తో ఎంత బిజీగా ఉన్నా, ఒక్క ఐదు నిమిషాలు మొబైలు వరకు పక్కన పెట్టి, తనతో మాట్లాడటం కావాలి.
కొత్త సంవత్సరం అంటే పూర్తిగా మారిపోవాల్సిన అవసరము లేదు
కొత్త సంవత్సరం వచ్చిందంటే, మనం పూర్తిగా మారిపోవాలన్న భావన చాలా సహజం. ఇప్పటివరకు చేసినది సరిపోలేదన్నట్టుగా, ఇక నుంచి అన్నీ కొత్తగా చేయాలి అనిపిస్తుంది. కానీ పేరెంటింగ్‌లో మార్పు అంటే ఒక్కసారిగా మరో వ్యక్తిగా మారడం కాదు.
ఉదా:
- పిల్లాడు హోంవర్క్ చేయకుండా టీవీ చూస్తుంటే, గతంలోలాగా వెంటనే గట్టిగా మాట్లాడకుండా ఈసారి ఒక నిమిషం ఆగడం.
- ఉదయం స్కూల్‌కు ఆలస్యం అవుతుంటే, చిరాకు పడకుండా, తనకి తొందరగా తెమలడానికి హెల్ప్ చేయటం.
ఇవి పెద్ద మార్పులు కావు. కానీ ఈ చిన్న చిన్న నెమ్మదైన స్పందనలే పిల్లలకు మనం వారిని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నామనే భరోసాను ఇస్తాయి. కొత్త సంవత్సరం మనల్ని పూర్తిగా మార్చమని అడగదు. మనం చేస్తున్నదానిలో కొంచెం అవగాహన, కొంచెం సహనం జోడించమని మాత్రమే చెబుతుంది. అదే పేరెంటింగ్‌లో నిజమైన మార్పు.
పేరెంటింగ్‌లో చాలా సందర్భాలలో మార్పు అనేది పెద్ద నిర్ణయాల రూపంలో రావాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు ఒక చిన్న అలవాటు, ఒక చిన్న స్పందన పిల్లల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
ఉదా:
పిల్లాడు స్కూల్ నుంచి వచ్చి ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్లిపోయినప్పుడు, వెంటనే “ఏమైంది?” అని అడగకుండా, కొద్దిసేపటికి అతని దగ్గర కూర్చోవడం. ముందుగా ఉపదేశం ఇవ్వకుండా “ఈసారి నీకు కష్టం అనిపించిన చోటు ఏది?” అని అడగడం.
ఇవి చిన్న విషయాల్లా కనిపించినా, పిల్లల మనసులో మాత్రం చాలా పెద్ద అర్థాన్ని మోస్తాయి. “నన్ను గమనిస్తున్నారు”, “నా భావాలకు ఇక్కడ స్థానం ఉంది” అన్న భావన వాళ్లలో నెమ్మదిగా పెరుగుతుంది. పేరెంటింగ్‌లో ఇలాంటి చిన్న మార్పులే పిల్లలతో మన మధ్య బలమైన విశ్వాసాన్ని నిర్మిస్తాయి – అదే దీర్ఘకాలంలో కనిపించే పెద్ద ప్రభావం.
ఇప్పటివరకు మీరు చేసినదంతా ఎక్కడికి వెళ్తుంది?
కొత్త సంవత్సరం దగ్గరపడినప్పుడల్లా, మనలో చాలామంది మన గత సంవత్సరంని ఒక లెక్కల పుస్తకంలా తిప్పి చూస్తాం. ఎక్కడ ఓపిక కోల్పోయాం, ఎక్కడ గట్టిగా మాట్లాడాం, ఎక్కడ పిల్లలకు సరైన సమయం ఇవ్వలేకపోయాం అన్నవి ముందుగా గుర్తొస్తాయి. మనం చేసిన ప్రయత్నాలు, చూపించిన శ్రద్ధ మాత్రం చాలా సార్లు ఆ లెక్కల్లోకి రావు.
పేరెంటింగ్‌ని ఇలా తప్పులు–సరిచూడాల్సిన పనుల జాబితాగా చూసినప్పుడు, మనకు తెలియకుండానే “ఇప్పటివరకు చేసినదంతా వృథా అయ్యిందేమో” అన్న భావన వస్తుంది.
కానీ పిల్లల దృష్టిలో మాత్రం ఈ లెక్కలు వేరేలా ఉంటాయి. మీరు అలసిపోయినా కూడా స్కూల్ ప్రోగ్రామ్‌కి వెళ్లిన రోజు, మీరు సమాధానం తెలియకపోయినా “నాతో చెప్పు” అని అన్న క్షణం, మీరు తప్పు చేశానని ఒప్పుకుని క్షమాపణ చెప్పిన సందర్భం – ఇవన్నీ వాళ్ల మనసులో నిశ్శబ్దంగా నిలిచిపోతాయి. అవి పెద్ద సంఘటనలుగా కనిపించకపోయినా, పిల్లలకు అవే భరోసా ఇచ్చే క్షణాలు. “నేను ముఖ్యం”, “నన్ను గమనిస్తున్నారు” అన్న భావన అక్కడే మొదలవుతుంది.
పేరెంటింగ్‌లో చేసిన ప్రతీ చిన్న ప్రయత్నం వెంటనే ఫలితంగా కనిపించకపోవచ్చు. కానీ అవి ఎక్కడికీ పోవు. అవి పిల్లల భావజాలంలో, వారి స్వభావంలో, వారి భవిష్యత్ సంబంధాల్లో నెమ్మదిగా మార్పు తీసుకువస్తాయి.
గుర్తుపెట్టుకోండి: కొత్త సంవత్సరం వచ్చిందని మన గత ప్రయత్నాలన్నీ రీసెట్ అయిపోవు.
మన ప్రతి చిన్న ప్రయత్నం, మన పిల్లల జీవితంలో ఒక మౌనమైన, బలమైన ఆధారంగా మారుతాయి.
పిల్లలు పెద్ద సంఘటనలను కాదు, చిన్న క్షణాలను గుర్తుపెట్టుకుంటారు. మీరు వారిని స్కూల్‌కు పంపే ముందు అడిగే ఒక చిన్న ప్రశ్న, రాత్రి నిద్రకు ముందు వినే ఒక చిన్న కథ, లేదా వాళ్లు చెప్పేదంతా పూర్తయ్యే వరకు మధ్యలో ఆపకుండా విన్న ఆ క్షణం – ఇవే వారి జ్ఞాపకాలలో నిలిచిపోతాయి. పుట్టినరోజు పార్టీల కంటే, పెద్ద బహుమతుల కంటే, ఈ సాధారణ రోజుల్లోని మామూలు మాటలే పిల్లల మనసులో లోతుగా దూరుతాయి. సంవత్సరాలు గడిచిన తర్వాత వారు ఏ క్లాస్‌లో ఉన్నారు, ఏ సంవత్సరం ఏం జరిగింది అన్నది మరిచిపోవచ్చు. కానీ “ఆ రోజు అమ్మ నన్ను అర్థం చేసుకుంది”, “నాన్న నన్ను తిట్టకుండా నేను చెప్పేది విన్నాడు” అన్న భావన మాత్రం వాళ్లతో పాటు నడుస్తుంది.
పేరెంటింగ్‌లో నిజంగా మిగిలేది ఇదే: పెద్ద సంఘటనలు కాదు, మనం రోజూ సృష్టించే చిన్న కానీ నిజమైన క్షణాలు.
కొత్త సంవత్సరం – కొత్త పేరంట్ కావాల్సిన అవసరం లేదు
కొత్త సంవత్సరం అనేది మనల్ని వెంటనే పరుగెత్తమని చెప్పదు. అది ఒక చిన్న pause button లాంటిది. రోజూ పని, స్కూల్ టైమింగ్స్, బాధ్యతల మధ్య నడుస్తూ, మనం చాలాసార్లు ఆగి చూసుకునే అవకాశం పొందము. కానీ ఈ సమయం మనల్ని ఒక ప్రశ్న అడగమని మెల్లగా ఆహ్వానిస్తుంది: “నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? నా పిల్లలు ఎక్కడ ఉన్నారు?”
ఉదా:
ఉదయం స్కూల్‌కు రెడీ అవుతూనే చిరాకు పెరిగినప్పుడు, ఒక క్షణం ఆగి పిల్లాడి ముఖం చూడటం; లేదా రాత్రి ఫోన్ పక్కన పెట్టి ఐదు నిమిషాలు అతని రోజు గురించి వినడం, మొదలగునవి. ఇవి పెద్ద నిర్ణయాలు కావు.
అందుకే ఈ కొత్త సంవత్సరం మనం పెట్టుకునే కఠినమైన లక్ష్యాలకంటే వాటి వెనకాతల ఉండే ఇంటెన్షన్స్ని గుర్తు చేస్తుంది.
ఉదా:
“ఈ ఏడాది నేను మారాలి” అన్న కఠినమైన లక్ష్యాల కంటే, “ఈ ఏడాది నేను కొంచెం నెమ్మదిగా స్పందిస్తాను”, “నా పిల్లల మాట పూర్తయ్యే వరకు వింటాను” అన్న మృదువైన ఉద్దేశాలు చాలు.
పిల్లలకు కావాల్సింది కొత్తగా రూపుదిద్దుకున్న పేరంట్ కాదు; వాళ్లకు అవసరమైనది పరిచయమైన భరోసా. అదే స్వరం, అదే శ్రద్ధ, అదే ప్రేమ – ఇవి స్థిరంగా ఉంటే, మార్పులు చుట్టూ ఎంత జరిగినా పిల్లలు సురక్షితంగా అనిపించుకుంటారు.
కొత్త సంవత్సరం మనల్ని కొత్త పేరంట్ గా మార్చాలని అడగదు; మనం ఇప్పటికే ఉన్న పేరెంటింగ్‌లో కొంచెం స్పష్టత, కొంచెం నెమ్మదితనాన్ని జోడించమని మాత్రమే సూచిస్తుంది.
ముగింపు: క్యాలెండర్ మారింది.. కానీ ఇది ఒక Continuation
కొత్త సంవత్సరం ముగిసిన మొదటి కొన్ని రోజులు గడిచాక, జీవితము మళ్లీ తన సాధారణ రిథమ్ లోకి వెళ్లిపోతుంది. స్కూల్ టైమింగ్స్, ఆఫీస్ కాల్స్, ఇంటి పనులు అన్నీ మళ్లీ అలవాటైనట్టే జరుగుతాయి.
క్యాలెండర్లో కొత్త తేదీలు ఉన్నా, మన ఇంట్లోని రోజులు మాత్రం ఎప్పటిలాగే ముందుకు సాగుతాయి. ఇదే సమయంలో ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి:
పేరెంటింగ్ అనేది ప్రతి జనవరిలో కొత్తగా మొదలయ్యే ప్రయాణం కాదు. ఇది మన పిల్లలతో కలిసి నడిచే ఒక నిరంతర ప్రక్రియ.
పిల్లలకు కావాల్సింది పరిపూర్ణమైన పేరంట్ కాదు, ప్రతి సంవత్సరం మారిపోయే పేరంట్ కూడా కాదు. వాళ్లకు అవసరమైనది స్థిరమైన శ్రద్ధ, తెలిసిన స్వరం, నమ్మకమైన ప్రెజెన్సు. మనం అప్పుడప్పుడు ఆగి, మన పిల్లలతో ఉన్న ఈ ప్రయాణాన్ని గమనించగలిగితే చాలు.
క్యాలెండర్ మారుతుంది, సంవత్సరాలు మారుతాయి. కానీ,
- మనం మన పిల్లల జీవితాల్లో నింపే ప్రేమ, నెమ్మదితనము, ఆప్యాయత ఇవి మారాల్సిన అవసరం లేదు.
- వాళ్లతో గడిపే సమయం ఎక్కువ అవ్వాల్సిన అవసరం ఉంది.
- అదే పేరెంటింగ్‌లో మిగిలే నిజమైన విలువ.
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.
