[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
సంక్రాంతి వేళ.. మన పిల్లలకు నేర్పాల్సిన జీవన పాఠాలు
జనవరి మొదటి వారం దాటగానే ప్రతి ఇంట్లోని సంక్రాంతి హడావిడి మొదలవుతుంది. ఎందుకంటే, అది మన తెలుగువారి పెద్ద పండగ కదా! పండగ షాపింగ్, పిండివంటలు ఏర్పాట్లు, రోజులు ఎంత బిజీగా గడిచిపోతుందో కదా! మన మనసు మట్టుకు ఎంతో ఆశలతో, ఎప్పుడు ఎప్పుడు ఊరికి వెళ్దామా అని అడుగుతూ ఉంటుంది.
ఈ పండగని మనం ఎలా మన మూలాల్లోకి వెళ్లి, మన ఊరిలో అందరితోనే కలిసి గడుపుదామని చూస్తామో, అలాగే, ఈ సంక్రాంతి మనం పిల్లల జీవితంలోని ఒక కనపడని జీవిత పాఠశాల అని మీరు ఎప్పుడైనా గుర్తించారా?
పిల్లలు సంక్రాంతి రోజుల్లో ఏం కూడా ఏం నేర్చుకుంటారు ఎంజాయ్ చేస్తారు అంతే కదా అని అనుకుంటున్నారా? మనము వాళ్లకు చెప్పేదానికన్నా, మనము ఎలా ఉంటామో, మన బంధుమిత్రులతో ఎలా ప్రవర్తిస్తున్నామో అన్నది చూసి, అక్కడి నుంచే ఎక్కువ నేర్చుకుంటారు.
భోగి మంట – వదిలేయడం అంటే ఏమిటో నేర్పే క్షణం
భోగి మంట అంటే పాత వస్తువులు కాల్చడం అని మనం అనుకుంటాం.
ఎండిపోయిన కర్రలు, పనికిరాని విరిగిపోయిన ఇంట్లో సామాన్లు, పాత పుస్తకాలు, బొమ్మలు ఇంకా ఇలాంటివి ఎన్నో మంటలలో పడుతాయి. మన పిల్లల మనసులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది.
“ఇవి ఎందుకు వదిలేస్తున్నారు?”
అదే మనకి ఒక మంచి అవకాశం.
“పనికిరాని దాన్ని పట్టుకుని ఉండకూడదు.”
“పాతదాన్ని వదిలితేనే కొత్తదానికి స్థలం దొరుకుతుంది.”
అది మనలోని ఎమోషన్స్ అయినా, వస్తువులైనా, పాతదాన్ని వదిలి కొత్త వాటిని ఉపయోగించటం మొదలు పెట్టాలి, అన్నది ఈ భోగి పండుగ యొక్క పరమార్థం అని మనం మన పిల్లలకి చెప్పగలగాలి.
ఇవి పెద్ద పెద్ద నీతివాక్యాల్లా చెప్పాల్సిన అవసరం లేదు.
భోగి మంట దగ్గర నిలబడి, పిల్లాడి చేయి పట్టుకుని, సాధారణంగా ఇలా అనడం చాలు:
“కొన్ని విషయాలు మన జీవితంలో కూడా ఇలా వదిలేయాలి.”
ఆ మాట వాళ్లలో ఎక్కడో నిలిచిపోతుంది.
పంట పండుగ – ఫలితాలకన్నా ప్రయాణం ముఖ్యం అని చెప్పే రోజు
సంక్రాంతి అంటేనే పంటల పండగ ఎందుకంటే పంటలు పండిన ఆనందంలో మనం జరుపుకుంటున్న పండగ కదా!
కానీ పిల్లలకి ఆ పంట వెనుక ఉన్న ప్రయాణం ఎక్కువగా కనిపించదు.
విత్తనం ఎప్పుడూ ఒక్కరోజులో పంటగా మారదు. ముందు నేల సిద్ధం చేయాలి, తరువాత విత్తనం వేయాలి, నీళ్లు పోయాలి, ఎరువులు వేయాలి, కలుపు మొక్కలు తీయాలి, ఎండ, వాన అన్నింటినీ ఎదుర్కోవాలి, అంతా అయిపోయాక.. ఓపికగా ఎదురు చూడాలి.
ఈ దృశ్యం మన పిల్లల జీవితానికీ చాలా దగ్గరగా ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లలు తక్షణ ఫలితాలకు అలవాటుపడ్డారు.
మార్కులు, ర్యాంకులు, బహుమతులు – అన్నీ త్వర, త్వరగా కావాలనిపిస్తుంది.
కానీ మన పంటల పండుగ నిశ్శబ్దంగా ఒక మాట చెబుతుంది:
ఫలితాలకన్నా ప్రయాణం ముఖ్యం. ప్రయత్నం కూడా ఒక విజయమే.
పిల్లాడు చదువులో కష్టపడుతున్నప్పుడు, లేదా ఆటల్లో ఓడిపోయినప్పుడు, లేదా ప్రయత్నించినా ఫలితం రాకపోయినప్పుడు, లేదా ఓటమితోనో లేదు నిరుత్సాహంతోనో ప్రయత్నించటం ఆపేసినప్పుడు..
ఈ పండుగ మనకి ఒక మంచి అవకాశం ఇస్తుంది.
పిల్లలకి ఇలా చెప్పవచ్చు:
“రైతు కూడా ప్రతి రోజు పంట ఎలా పెరుగుతుందో చూడడు, కానీ తన పని మాత్రం ఆపడు.”
ఇది పెద్ద ఉపదేశంలా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఊరు వెళ్లినప్పుడు పంట పొలాల దగ్గరికి వాకింగ్‌కి తీసుకెళ్లినట్టు తీసుకెళ్లి సాధారణంగా చెప్తే చాలు!!
అప్పుడు పిల్లల మనసుకి ఒక్క సాంత్వన దొరుకుతుంది.
ఫలితం రాకపోయినా ప్రయత్నం వృథా కాదు, అని తెలుసుకుంటారు ఈ ఒక్క ఆలోచన వాళ్ల జీవితంలో ఓపికగా ముందుకు నడిచే శక్తిగా మారుతుంది.
హరిదాసులు, గంగిరెద్దులు – కృతజ్ఞత & వినయాన్ని నేర్పే క్షణాలు
సంక్రాంతి ఉదయాలు హరిదాసుల పాటలతో మొదలవుతాయి. ఇంటిముందు గంగిరెద్దు నిలబడితే పిల్లలు కుతూహలంగా చూస్తారు.
వాళ్లకి ఇవి ఒక చిన్న ప్రదర్శనలా అనిపించవచ్చు. కానీ ఆ దృశ్యం వెనుక ఒక లోతైన భావం దాగి ఉంటుంది. దానినే మనం మన పిల్లలకి తెలియ చెప్పాలి.
హరిదాసులు ఇంటింటికీ తిరిగి, పాటలు పాడతారు, ఆశీర్వచనాలు ఇస్తారు, ప్రతిఫలం పెద్దగా ఆశించరు.
గంగిరెద్దు కూడా అంతే. నిశ్శబ్దంగా నిలబడి, మన చేతి నుంచి వచ్చే గింజలను స్వీకరిస్తుంది.
ఇవి పిల్లలకి ఏమి నేర్పుతాయి?
- అందుకున్నదానికి కృతజ్ఞత చెప్పడం
- ఇచ్చేవాడిగా ఉండటం
- వినయంగా ఉండటం
ఈ పాఠాలు పిల్లలకి ఉపదేశంలా చెప్పాల్సిన అవసరం లేదు.
హరిదాసుడికి దానం ఇస్తూ, పిల్లాడి చేతిలో ఒక చిన్న నాణెం పెట్టి “ఇవ్వడం కూడా ఆనందమే” అని మెల్లగా చెప్పడం చాలు.
అప్పుడు పిల్లలు నేర్చుకుంటారు:
సంతోషం అంటే తీసుకోవడం మాత్రమే కాదు – ఇవ్వడంలోనూ ఉంటుంది.
ఈ అనుభవం వాళ్లలో ఎక్కడో ఒక మృదువైన విలువగా నిలిచిపోతుంది.
గాలిపటాలు – గెలుపు కాదు, అనుభవమే ముఖ్యం
సంక్రాంతి వచ్చిందంటే గాలిపటాలు తప్పనిసరి. రంగురంగుల పటాలు, గట్టిగా పట్టుకున్న దారం, పైకి చూస్తూ పరుగులు..
పిల్లల ముఖాల్లో ఆ ఉత్సాహం చూసినప్పుడు మనకూ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకురావడం సహజం.
కానీ ఆ గాలిపటాల సందడిలోనే. ఎగిరేసే పందాలలోనే, మనకి పేరెంటింగ్కి ఒక చిన్న అవకాశం దొరుకుతుంది.
పటం తెగిపోయినప్పుడు,
లేదా గెలవలేకపోయినప్పుడు,
పిల్లాడి ముఖంలో కనిపించే నిరాశ..
పిల్లలను నిరాశను పోగొట్టడానికి మనం వెళ్లి వాళ్ళతో ఆడుతాం కదా! అదే క్షణంలో మనము పిల్లలలో వాళ్ళ భావి జీవితానికి కావాల్సిన ఓపిక అనే విత్తనాన్ని నాటాల్సిన సమయం కూడా.
ఆ సమయంలో
“పర్వాలేదు, మళ్లీ ఎగరేద్దాం” అని మనం అన్న ఒక్క వాక్యం చాలు.
వాళ్లలో ఓపికను నాటుతుంది.
“గెలిచావా లేదా?” అని కాకుండా, “ఎలా ఎగరేసావు?” అని అడిగినప్పుడు,
పిల్లలు అనుభవాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటారు.
ఇది పెద్ద పాఠంలా చెప్పాల్సిన అవసరం లేదు.
మన మాటలతో కాదు – మన చేతలతో వాళ్లు ఒక విషయం నేర్చుకుంటారు:
జీవితంలో అన్నీ మన చేతిలో ఉండవు.
కానీ మన అనుభవాన్ని ఎలా స్వీకరిస్తామన్నది మన చేతిలో ఉంటుంది.
ఆ భావన వాళ్లలో ఎక్కడో నెమ్మదిగా నిలిచిపోతుంది.
ముగ్గులు, గొబ్బెమలు, పిండివంటలు – కలిసి ఉండడం అంటే ఇదే
సంక్రాంతి రోజుల్లో తెల్లవారితే చాలు, ఇళ్ల ముందర పెద్ద పెద్ద ముగ్గులు వేయబడతాయి.
చిన్నచిన్న గీతలు, మధ్యలో రంగులు, పక్కన గొబ్బెమలు.
పిల్లలు పక్కనే నిలబడి చూస్తారు. కొంతమంది రంగులు ఇస్తారు, కొంతమంది గొబ్బెమలు అమర్చడంలో సహాయం చేస్తారు. ఇవి పెద్ద పనుల్లా కనిపించవు. కానీ సరదా అయినా ఒక అనుభూతిని మటుకు మిగులుస్తాయి. అవే కుటుంబంతో కలిసి ఉన్న అనుభూతులుగా నిలిచిపోతాయి.
ముగ్గు ఒక్కొసారి పూర్తవదు, గీతలు తప్పుతాయి, రంగులు చిందుతాయి, గొబ్బెమలు ఒకసారి పడిపోతాయి. కానీ వాటిని పట్టుదలతో పూర్తిచేసే అమ్మమ్మలు, అత్తయ్యలు. వారి నుంచే మన పిల్లలు నేర్చుకుంటారు:
“ప్రయత్నిస్తే సాధించలేని ఏది ఉండదని.”
పిండివంటలు చేయడంలో కూడా అంతే. పిండిని కలపడం, చిన్న ముద్దలు చేయడం, చేతులు మురికిపడటం..
అమ్మతో, అమ్మమ్మతో కలిసి వంటగదిలో గడిపిన ఆ సమయం, పిల్లలకి “నేను ఈ కుటుంబంలో భాగం” అన్న భావన ఇస్తుంది.
ఇక్కడ మనం పిల్లలకు చెప్పాల్సిన పెద్ద మాటలు ఏవీ ఉండవు. వాళ్లను పక్కన నిలబెట్టుకోవడం, “నువ్వు కూడా చేయి వేసుకో” అని అనడం చాలు. అప్పుడు వాళ్లలో ఒక భావన నెమ్మదిగా పెరుగుతుంది:
కుటుంబం అంటే పనుల పర్ఫెక్షన్ కాదు – కలిసి ఉండే సమయం
ముగ్గులు, గొబ్బెమలు, పిండివంటలు.. ఇవి పండుగ అలంకారాలు మాత్రమే కాదు, పిల్లల జీవితంలో ఇవే, వాళ్లను లోపల నుంచి బలంగా నిలబెట్టే జ్ఞాపకాలు.
ముగింపు:
సంక్రాంతి వచ్చి వెళ్లిపోతుంది, పండుగ సెలవులు ముగుస్తాయి. ఇల్లు మళ్లీ తన సాధారణ రిథమ్ లోకి వస్తుంది.
స్కూల్, ఆఫీస్, బాధ్యతలు.. అన్నీ మళ్లీ మన జీవితాల్లోకి చొరబడి వచ్చేస్తాయి. కానీ ఈ పండుగ మనకి మధురమైన జ్ఞాపకాల్ని మట్టుకు మిగులుస్తుంది.
పిల్లలకు పర్ఫెక్ట్ ప్లాన్లు అవసరం లేదు, పెద్ద మాటలు అవసరం లేదు, ప్రతి రోజు కొత్తగా మారిపోయే పేరెంట్ కూడా అవసరం లేదు.
వాళ్లకు కావాల్సింది: మన ప్రెజెన్సు, మన మాటల్లోని నెమ్మదితనం, మన స్పందనలోని అవగాహన.
సంక్రాంతి మనల్ని పూర్తిగా మార్చమని అడగదు.
కొంచెం ఆగమని,
కొంచెం గమనించమని,
పిల్లలతో ఉన్న ఈ ప్రయాణాన్ని మెల్లగా చూడమని మాత్రమే చెబుతుంది.
పండుగలు గుర్తుండకపోవచ్చు. కానీ పండుగల్లో మనం ఎలా ఉన్నామో
పిల్లలు మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు.
అదే, మన పేరెంటింగ్‌లో మిగిలే నిజమైన విలువ.
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.
