Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-46

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

మనకు పిల్లల భావోద్వేగాలు అసౌకర్యంగా అనిపించినప్పుడు..

ఇది ప్రతి ఇంట్లో చాలా సాధారణంగా కనిపించే దృశ్యమే,

ఆ క్షణంలో మన పిల్లల రియాక్షన్ ముగిసే లోపల మనలో ఒక భావన కలుగుతుంది.

ఈ ఆలోచనలు మనకు తెలియకుండానే మనలోకి వచ్చేస్తాయి కదు! కానీ ఈ ఆలోచనల వెనకాతల ఉన్న అసలైన కారణాలు ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

అది, ఏంటంటే, మనము పిల్లల ఎమోషన్స్ మూలంగా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నామా? లేదు, వాళ్ల ఎమోషన్స్ మనలో వేరే కొత్త ఎమోషన్స్ ని ఏమన్నా రేకెత్తిస్తున్నాయా అని?

కాని ఈ ప్రశ్నను మనం పెద్దగా అడగం. ఎందుకంటే మన ఉద్దేశం మంచిదే. పిల్లలు బాధపడకూడదు అనేది మన కోరిక. వాళ్లు స్ట్రాంగ్‌గా ఉండాలి, త్వరగా నార్మల్ కావాలి, ముందుకు సాగాలి అనేది మన ఆశ.

కానీ ఆ మంచి ఉద్దేశం మధ్యలో, మనం ఒక చిన్న నిజాన్ని గమనించకుండా పోతాం.

పిల్లల భావోద్వేగాలను నియంత్రించడం కాదు..

మన అసౌకర్యాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నామేమో?

“ఏడవద్దు”, “కోప్పడొద్దు” అన్న మాటల వెనుక..

పిల్లలు ఏడుస్తే మనం వెంటనే చెప్పే మాటలు ఇవే.

“ఏడవద్దు.”

“ఇంత చిన్న విషయానికి ఎందుకు బాధ?”

“అలా ఫీల్ అవ్వాల్సిన పనిలేదు.”

పేరెంట్స్‌గా మన పిల్లలు బాధపడటం చూడలేము. అందుకే, మనము ఏడవద్దు, కోప్పడవద్దు, అని చాలా సాధారణంగా చెప్పేస్తూ ఉంటాం. ఇది తల్లిదండ్రులుగా పిల్లల పట్ల మనలో ఉండే ప్రేమని అలా చూపిస్తాము.

కానీ ఈ మాటలు పిల్లల మనసులో ఎలా నిలుస్తాయో మనం ఒక్కసారి కూడా ఆగి ఆలోచించము.

పిల్ల ఏడుస్తున్నప్పుడు “ఏడవద్దు” అని చెప్పడం అంటే,

వాళ్ల భావోద్వేగాన్ని తప్పుగా చూపించడం కాదు..

కానీ ఆ భావోద్వేగానికి ఇక్కడ చోటు లేదని చెప్పడమే.

పిల్ల కోపంగా ఉన్నప్పుడు “అలా ఫీల్ అవ్వకూడదు” అని చెప్పడం అంటే,

ఆ కోపం వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడం కాదు..

వెంటనే దాన్ని ఆపేయాలన్న మన తొందర మాత్రమే.

పిల్లల భావోద్వేగాలు మనకు అసౌకర్యంగా అనిపించినప్పుడు, మనం వాటిని ఆపాలని చూస్తాం. మార్చాలని చూస్తాం. తొందరగా ‘సరైన స్థితి’లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తాం.

కానీ పిల్లల భావోద్వేగాలు స్విచ్‌లా ఆన్-ఆఫ్ చేయడానికి వచ్చినవి కావు. అవి చెప్పడానికి వచ్చిన సంకేతాలు. ఆ సంకేతాలును మనము సరిగా వినకపోతే, అవి మరింత గట్టిగా వినిపించడానికి ప్రయత్నిస్తాయి.

పిల్లల భావోద్వేగాలు మనకు ఎందుకు అసౌకర్యంగా అనిపిస్తాయి?

ఇక్కడ ఈ ప్రశ్నకి సమాధానం కావాలి అంటే నిజంగా మనము మన మనసులోకి త్రొంగి చూడాలి.

అదే, మన పిల్లల భావోద్వేగాలు మనకు ఎందుకు ఇంత అసౌకర్యంగా అనిపిస్తున్నాయి?

చాలామందికి దీనికి సమాధానం మన చిన్ననాటి అనుభవాల్లోనే దొరుకుతుంది.

మనలో చాలామంది ఇలా పెరిగాం:

“ఇంత సెన్సిటివ్‌గా ఉండకూడదు.”

“అబ్బాయిలు ఏడవకూడదు.”

“అమ్మాయిలు ఓర్పుగా ఉండాలి.”

“బలంగా ఉండాలి.”

మనకు భావోద్వేగాలను అర్థం చేసుకోవడం కన్నా, నియంత్రించడం నేర్పించారు. వ్యక్తపరచడం కన్నా, దాచడం నేర్పించారు. మన బాధను మాటల్లో పెట్టడం కన్నా, మౌనంగా ఉండడం నేర్పించారు. మన కోపాన్ని వినడం కన్నా, దాన్ని తప్పుగా చూడడం నేర్పించారు.

అందుకే మన పిల్లలు స్వేచ్ఛగా కోపపడినప్పుడు, ఏడ్చినప్పుడు, బాధపడినప్పుడు – మనలోని పాత జ్ఞాపకాలు మెల్లగా కదులుతాయి. మనకు అలవాటు లేని భావప్రపంచం మన ముందు నిలబడుతుంది.

ఆ అసౌకర్యం మనకి కలుగుతున్నది మన పిల్లల వల్ల కాదు. మనకు భావోద్వేగాల దగ్గర కూర్చోవడం నేర్పించబడకపోవడం వల్ల.

భావోద్వేగాలు సమస్యలు కావు.. అవి సంకేతాలు

అందుకే పిల్లల భావోద్వేగాలను చాలాసార్లు మనం సరిచేయాల్సిన సమస్యగా చూస్తాం.

కానీ భావోద్వేగాలు ఇక్కడ సమస్య కాదు అవి మనకి ఏదో సమాచారం అందిస్తున్నాయి.

మనము వారి భావోద్వేగాన్ని వెంటనే సరి చేయాల్సిన అవసరం లేదు వాటిని అర్థం చేసుకుంటే చాలు. పిల్లలకి ప్రతిసారి సమాధానం అవసరం ఉండకపోవచ్చు. కానీ వారి ఎమోషన్స్‌ని విని అర్థం చేసుకునే పెద్ద మనసు మటుకు అవసరం.

ఆ క్షణంలో పిల్లలకు నిజంగా కావాల్సింది ఏమిటి?

పిల్లల భావోద్వేగాలు ఉప్పొంగినప్పుడు వాళ్లకు కావాల్సింది:

దానికి, మనము

పిల్లలు తమ భావోద్వేగాలను బయటపెట్టినప్పుడు, మనం వాటిని సరిదిద్దకుండా అంగీకరించిన క్షణం – వాళ్లలో ఒక బలమైన భావన ఏర్పడుతుంది. “ఇక్కడ నేను నేనుగా ఉండొచ్చు.”

ఎప్పుడైతే మనము వాళ్లకి ఆ ఎమోషనల్ భద్రతను కలిగిస్తామో, వాళ్లు అప్పుడు మనతో అన్ని విషయాలు పంచుకోవడం మొదలు పెడతారు.

ముగింపు:

మనలోని ఈ ఎమోషనల్ ఇన్‌సెక్యూరిటీ లేదా భావోద్వేగాల పట్ల మనలో కలిగి అసౌకర్యాన్ని అర్థం చేసుకున్న క్షణం నుంచే, మన పిల్లల భావోద్వేగాల పట్ల మన స్పందన మారుతుంది. ఆ మార్పు ఒక్కరోజులో కనిపించకపోవచ్చు. కానీ మనకి ఒక పెద్ద రిలీఫ్‌ని ఇస్తుంది అదే.

పిల్లల భావోద్వేగాలను మేనేజ్ చేయాల్సిన బాధ్యత మన మీద లేదు అని.

పిల్లలు మనం చెప్పే మాటల నుంచి కాదు, మనము మన ఎమోషన్స్ ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నామో ఎలా మేనేజ్ చేస్తున్నామో చూసి మన పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు.

ఈ వారం మనం పిల్లల భావోద్వేగాలను సరిచేయాలని కాదు..

మన అసౌకర్యాన్ని అర్థం చేసుకోవాలని మాత్రమే ప్రయత్నిద్దాం.

పిల్లల భావోద్వేగాలు మనకు అసౌకర్యంగా అనిపించినప్పుడు, అది మనం తప్పు చేస్తున్నామన్న సూచన కాదు.

అది మనలో ఎదుగుదలకు ఒక అవకాశం.

ఆ అవకాశాన్ని మెల్లగా స్వీకరిస్తే,

పిల్లలకి ఒక ముఖ్యమైన బహుమతి ఇస్తాం.  అదే భయంలేని భావోద్వేగ స్థలం.

అదే పేరెంటింగ్‌లో నిజమైన బలం.

అది చాలు, అదే మొదటి అడుగు.

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version