[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
మన చిన్ననాటి ప్రేమ జ్ఞాపకాలు..ఈ రోజు మన పేరెంటింగ్‌పై ప్రభావం!!
పిల్లల భావోద్వేగాలు మనకు అసౌకర్యంగా అనిపించినప్పుడు, దానికి కారణం చాలాసార్లు మన పిల్లలు కాదు. చాలాసార్లు మనలో ఏదో కదిలినట్టుంటుంది. మనకు తెలియని ఒక పాత భావన మెల్లగా పైకి వస్తుంది. అది
- ఒక చిన్న భయం.
- ఒక పరిచయమైన బాధ.
- లేదా ఒక మాటలేని జ్ఞాపకం.
గత వారం మనం పిల్లల భావోద్వేగాల గురించి మాట్లాడుకున్నాం. ఈ వారం మాత్రం, ఆ అసౌకర్యం మొదట ఎక్కడ మొదలైందో చూడాలి. అది మన చిన్నప్పటి రోజుల్లో అంటే మీరు నమ్ముతారా?
మనలో చాలామంది ఇలా అనుకుంటాం “నేను నా పిల్లలను చాలా ప్రేమిస్తున్నాను.”
“నా పేరెంట్స్ ఎలా పెంచారో అలా కాదు, నేను బాగా చేస్తాను.”
అది నిజమే కావచ్చు. కానీ మనం మర్చిపోయిన ఇంకో చిన్న నిజం కూడా అందులో ఉంది.
పేరెంటింగ్‌ని మనం పూర్తిగా కొత్తగా నేర్చుకోము. మన చిన్ననాటి అనుభవాల నుంచే దానికి ఒక్క రూపం వస్తుంది.
మన తల్లితండ్రులు మనకి
- ప్రేమ ఎలా చూపించారో,
- ఎలా మాట్లాడారో,
- మన బాధకు ఎలా స్పందించారో?
అదే మెల్లగా మన పేరెంటింగ్‌లోకి మనకు తెలియకుండానే వస్తుంది.
మన చిన్ననాటి ప్రేమ జ్ఞాపకాలు ఎలా ఉండేవి?
ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం.
మన చిన్నప్పటి రోజుల్లో అనుభవించిన మన తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉండేది?
- వారి మాటల్లోనా?
- వారి చర్యల్లోనా?
- లేక మన అవసరాల వరకేనా?
- మనం ఏడ్చినప్పుడు ఎవరు పక్కన కూర్చున్నారా? లేదా “ఇలా ఏడవద్దు” అని ఆపేశారా?
- మనం తప్పు చేసినప్పుడు ఎవరు అర్థం చేసుకున్నారా? లేదా వెంటనే సరిదిద్దారా?
నాకు తెలుసు, మనలో చాలామంది ఇలా అంటారు –
“నాకు ఏ లోటూ లేదు.”
“నా పేరెంట్స్ చాలా మంచివాళ్లు.”
“నన్ను బాగా చూసుకున్నారు.”
ఇది నిజమే కావచ్చు. కానీ బాగానే పెరిగిన పిల్లలకూ భావోద్వేగ లోపాలు ఉండొచ్చు.
ఎందుకంటే ప్రేమ ఉండటం ఒక విషయం. ఆ ప్రేమను ఎలా అనుభవించామో అన్నదే ఇంకో ముఖ్యమైన విషయం.
తల్లిదండ్రులు మన మాటలకు విలువ ఇచ్చారా? లేక నిర్ణయాలు మన తరఫునే తీసుకున్నారా?
ఇవన్నీ మనలో మనకే తెలియని చిన్న చిన్న ముద్రలుగా మిగిలిపోతాయి. అవే మన పేరెంటింగ్‌లో రిఫ్లెక్సులుగా మారుతాయి.
ఉదా:
- పిల్లలు ఏడిస్తే మనం వెంటనే టెన్షన్ పడటం.
- పిల్లలు ఫెయిల్ అయితే మనలో భయం పెరగటం.
- పిల్లలు మాట వినకపోతే మనకు కోపం రావటం.
ఇవన్నీ ఆ క్షణంలో పిల్లల వల్ల వచ్చినట్టు అనిపిస్తాయి. కానీ లోతుగా చూస్తే, అవి మన చిన్ననాటి అనుభవాల ప్రతిధ్వనులు.
- ఎప్పుడైతే మనకి, తప్పు చేయడానికి చోటు లేకపోయిందో, అప్పుడుమన పిల్ల తప్పు చేస్తే భయపడతాం.
- ఎప్పుడైతే మన ఏడుపును ఎవరూ వినలేదో అప్పుడు మనం పిల్లలు ఏడిస్తే టెన్షన్ పడతాము
- ఎప్పుడైతే మనము మాట వినకపోతే దెబ్బలు తిన్నామో అప్పుడు పిల్లలు మాట వినకపోతే మనకు కోపం రావడం సహజం
- ఎప్పుడైతే మన భావోద్వేగాలు వినిపించబడలేదో, అప్పుడూ పిల్లల భావోద్వేగాలు మనకు అసౌకర్యంగా అనిపిస్తాయి.
మనకు దొరకని ప్రేమ.. మనం ఇవ్వాలనుకునే ప్రేమ
ఇక్కడ ఎవరు గమనించని కానీ నిశ్శబ్దంగా దాగుండే ఒక నిజం ఉంది.
మామూలుగా మనకుచిన్నప్పుడు దొరకని వస్తువుల్ని, టాయ్స్‌ని మన పిల్లలకి ఇద్దాం అని ఎలా ట్రై చేస్తామో అలా మనకి చిన్నప్పుడు దొరకని ప్రేమని కూడా మనం పిల్లలకి ఇవ్వాలని ప్రయత్నిస్తాము.
ఉదా:
- ఎవరు నా నిర్ణయాన్ని అడగలేదు కాబట్టి ఇప్పుడు నేను నా పిల్లని ప్రతిదీ అడుగుతాను.
- ఎవరు నా మనసులో భావాలని అర్థం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు నా పిల్లల్ని నేను పూర్తిగా అర్థం చేసుకోవాలని చూస్తాను.
- నన్ను ఎవరు ప్రోత్సహించలేదు కాబట్టి నా పిల్లల్ని వాళ్లకు ఇష్టమైన రంగాల్లో ఎప్పుడూ ప్రోత్సహిద్దాం అనుకుంటాను, లాంటివి.
ఇది ప్రేమే. కానీ కొన్నిసార్లు అదే ప్రేమ ఒత్తిడిగా మారుతుంది. మన ఉద్దేశం మంచిదే,
కానీ మన పిల్లకు అది భారంగా మారవచ్చు. ఎందుకంటే, మన ఈ మంచి ఉద్దేశము, మన అతి ప్రేమ పిల్లల పెంపకంలో మనల్ని ఎక్కువ జాగ్రత్త, జోక్యం, అంచనాలు పెంచుకునే లాగా చేస్తుంది.
ఒక్కోసారి, కొన్ని సందర్భాల్లో మన స్పందన చాలా ఎక్కువగా అనిపిస్తుంది.
ఉదా:
- చిన్న విషయానికే మనకు చాలా కోపం రావడం.
- పిల్లలు మాట వినకపోతే వ్యక్తిగతంగా తీసుకోవడం.
- పిల్లలు మన దగ్గర నుంచి దూరంగా వెళ్తే మనం దెబ్బతిన్నట్టు ఫీల్ అవ్వడం.
దీనికి కారణం మనలోని పాత గాయాలు, అనుభవాలు వలన మన మనసు, మన పిల్లల ప్రవర్తన కంటే ఎక్కువగా స్పందించటమే. అది మన తప్పు కాదు, అది మన అనుభవం. కానీ దాన్ని గుర్తించకపోతే, దాని ప్రభావం మన పిల్లల మీద పడుతుంది.
ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి.
- ఇది మన పేరెంట్స్‌ను నిందించడం కాదు.
- ఇది మనల్ని మనమే నిందించుకోవడం కూడా కాదు.
మన పేరెంట్స్ వాళ్లకి తెలిసినంత మంచిగానే చేశారు. వాళ్లకూ వాళ్ల చిన్ననాటి పరిమితులున్నాయి. మన చిన్ననాటి లోపాలు తప్పులు కావు. అవి అర్థం చేసుకోవాల్సిన జ్ఞాపకాలు. ఆ అవగాహన వచ్చిన క్షణంలోనే, మన పేరెంటింగ్‌లో ఒత్తిడి కొంచెం తగ్గుతుంది.
మనకి కావాల్సింది ఒక చిన్న విరామం
ఇప్పుడు మనం అడగాల్సింది ఏం చేయాలి ఏం మార్చాలి అని కాదు తీసుకోవాల్సింది ఒక చిన్న విరామం లేదంటే ఒక చిన్న పాజ్.
పిల్లలు ప్రవర్తన చూసి మనలో స్పందన వచ్చినప్పుడు, ఒక్కసారి ఆగుదాం, ఆలోచిద్దాం.
- “ఇది నా పిల్ల అవసరమా?”
- “లేక నా పాత భయమా?”
- “నేను ఇప్పుడు ప్రేమతో స్పందిస్తున్నానా? లేక పాత అనుభవం వల్లనా?”
ఈ ప్రశ్నలకు సమాధానాలు అవసరం లేదు. అవి అడగడమే చాలూ. ఇలా అడగటం మొదలు పెట్టగానే పేరెంట్ గా మనం హీల్ అయ్యే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే పెద్దగా ఏమీ మార్పులు రావు డ్రమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. కాని,
- మనలో తొందర తగ్గుతుంది.
- కంట్రోల్ అవసరం తగ్గుతుంది.
- పిల్లలపై నమ్మకం పెరుగుతుంది.
- మన ప్రేమ కొంచెం తేలిక అవుతుంది.
- పిల్లలకి శ్వాస తీసుకునే స్థలం దొరుకుతుంది.
ముగింపు: మన చిన్ననాటిని మార్చలేం.. కానీ మన ఇల్లు మార్చగలం
మన చిన్ననాటి ప్రేమ జ్ఞాపకాలను మనం మార్చలేం. కానీ ఆ జ్ఞాపకాలు మన పేరెంటింగ్‌ని ఎలా నడిపించాలో మాత్రం మార్చగలం.
- అవగాహన వచ్చిన చోట, నియంత్రణ తగ్గుతుంది.
- అర్థం చేసుకున్న చోట, భయం తగ్గుతుంది.
మన పిల్లలు మన గతానికి పరిష్కారం కాదు. కానీ మనం మన గతాన్ని అర్థం చేసుకుంటే,
మన పిల్లల వర్తమానం చాలా సురక్షితంగా మారుతుంది.
ఈ వారం మనం పర్ఫెక్ట్ పేరెంట్స్ అవ్వాలని కాదు. మనల్ని మనం కొంచెం మెరుగుగా తెలుసుకోవాలని మాత్రమే ప్రయత్నిద్దాం.
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.
