Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-48

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

మాతృభాషలో ఉన్న ఓదార్పు

మన జీవితంలో చాలాసార్లు అనుకొని సంఘటన జరిగినప్పుడు, వెంటనే మన నోట్లోంచి కొన్ని మాటలు బయటికి వస్తాయి. ఆ మాటలు మన మాతృభాషలోనే ఉండటం అన్నది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. రీసెర్చ్ కూడా అదే ప్రూవ్ చేసింది. మనిషి మనసుతో ఎప్పుడైతే మాట్లాడుతాడో అప్పుడు మాతృభాషలోనే మాట్లాడుతాడు అని చెప్పి. అంత ఎందుకండి? చిన్న పిల్లవాడు పడిపోయినప్పుడు అమ్మా అని ఏడుస్తాడు కానీ మమ్మీ అని ఏడవడు కదా!!!

మాతృభాష అనేది కేవలం మాట్లాడటానికి ఉపయోగపడే భాష మాత్రమే కాదు. మనకి ఏ క్షణంలో ఆలోచించకుండానే మాట బయటికి వస్తుందో, ఆ లోతైన అనుభవమే మాతృభాష. భయపడినప్పుడు, బాధపడినప్పుడు, మనసు మాట్లాడాలనుకున్నప్పుడు, మనం వాడే భాష మాతృభాష.  మనకు మొదటిసారి భద్రతగా అనిపించిన భావం, ఓదార్పు, అనుబంధం యొక్క పునాది మన మాతృభాష.

భాష నేర్చుకోక ముందే కలిగే అనుభవం

మనకు అక్షరాలు రాకముందే, వ్యాకరణం తెలియకముందే, సరిగా మాట్లాడటం కూడా రాకముందే మనం ఒక భాషను అనుభవించాం. ఆ అనుభవం మనకి జీవితాంతం గుర్తు ఉంటుంది అది ఎక్కడ అనుభవించామంటే:

ఆ భాషలోనే మనం మొదటిసారి “ఇక్కడ నేను సురక్షితం” అని తెలుసుకున్నాము, అర్థం కావడం అంటే ఏమిటో నేర్చుకున్నాం, ఒంటరితనం ఎలా తగ్గుతుందో అనుభవించాం.

అందుకే మాతృభాష అనేది మన మెదడుకన్నా ముందే మన హృదయంలో, నాడీ వ్యవస్థలో నిలిచిపోయిన అనుభవం. అది ఒక భాషగా కంటే ఒక అనుభవంగా మిగిలిపోయే జ్ఞాపకం.

మనలోని ఎమోషన్స్ చాలా ఎక్కువగా వచ్చినప్పుడు, సహజంగా మనలోని మాటలు మాతృభాషలోనే బయటకు వస్తాయి. ఎందుకంటే, అప్పుడు మన హృదయం మాట్లాడుతుంది మన బ్రెయిన్ కాదు.

ఇతర భాషలలో మనం ఆలోచించి మాట్లాడవచ్చు కొన్నిసార్లు సరైన పదం కోసం వెతుక్కోవచ్చు. మన భావాలను కొంచెం నియంత్రించి, లేదా పాలిష్ చేసి, స్టైల్ గా చెప్పవచ్చు. కానీ, అదే మన మాతృభాషలో అయితే మన ఎమోషన్స్ ఆగకుండా ఒక నదిలాగా గలగల ప్రవహిస్తాయి.

ఇది మనకే కాదు పిల్లలకు కూడా వర్తిస్తుంది!

చిన్ననాటి భాష అంటేనే మన భవిష్యత్తుకి ఒక పెద్ద పునాది

పిల్లలు మాతృభాషలో మాటలు నేర్చుకోవడం అంటే, కేవలం పదాలు పలకడం కాదు.

వాళ్లు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టే మొదటి మెట్టు అది.

చిన్నపిల్లలకు “ఇది వేడి”, “ఇది నొప్పి”, “ఇది భయం” అని ఎవరు క్లాస్ తీసుకుని చెప్పరు.

అమ్మ మాటల్లోనే ఆ అర్థాలు వాళ్ల మనసులో పడతాయి.

పడిపోయినప్పుడు వినిపించిన “అయ్యో బంగారం” అనే మాట, భయపడినప్పుడు వినిపించిన “ఏమి కాదు, నేను ఉన్నాను” అనే ఓదార్పు మొదలగునవి పిల్లలకి భావాల అర్థం నేర్పించే మొదటి పాఠాలు.

ఈ చిన్న చిన్న మాటల ద్వారానే పిల్లలు, భావాలు అంటే ఏమిటో, సంబంధాలు ఎలా ఉంటాయో, నమ్మకం అంటే ఏమిటో నేర్చుకుంటారు.

అందుకే చిన్ననాటి మాతృభాష పిల్లలకి కేవలం ఒక భాష కాదు.

అది వాళ్లకి, భవిష్యత్తులో వాళ్లు కొత్త విషయాలు, కొత్త భాషలు, కొత్త అనుభవాలు నేర్చుకునేలా చేసే బలమైన పునాది. అదే వాళ్ళకి భవిష్యత్తుకు కావాల్సిన ఎమోషనల్ రెజీలియన్స్ కూడా నేర్పిస్తుంది.

ఈ పునాది మీదే మన పిల్లల్లో ఒక భద్రత పుడుతుంది. ఆ భద్రత నుంచే నేర్చుకోవడం మొదలవుతుంది. అందుకే మాతృభాషలో చెప్పిన మాటలు, పిల్లల మనసులో గట్టిగా తాకుతాయి.

పిల్ల భయపడ్డప్పుడు చెప్పిన “ఏమి కాదు, నేను ఉన్నాను” అన్న ఒక్క వాక్యంతో, వాళ్ల మనసును పూర్తిగా శాంతింపజేస్తుంది. పరీక్ష ఫలితాల తర్వాత, లేదా ఏదైనా తప్పు చేసిన తర్వాత, మాతృభాషలో చెప్పిన “నువ్వు నాకు ముఖ్యం, నీ విలువ మార్కులతో కాదు” అన్న మాటలు వాళ్లకి ఒక పెద్ద ఊరటగా మారుతాయి.

ఎందుకంటే మాతృభాష, పిల్లలకి కేవలం కమ్యూనికేషన్ సాధనం కాదు. అది వాళ్ల చిన్ననాటి జ్ఞాపకాలతో, భావోద్వేగ అనుభవాలతో ముడిపడి ఉంటుంది.

అందుకే, పిల్ల ఏదైనా తప్పు చేసినప్పుడు, మనము మాతృభాషలో గట్టిగా చెప్పిన ఒక్క మాట, వాళ్ల మనసులో చాలా కాలం నిలిచిపోతుంది. అదే మాట వేరే భాషలో చెప్పినప్పుడు, అంతగా లోపలికి వెళ్లకపోవచ్చు.

మాతృభాషలో మనం మాట్లాడే మాటలు మన పిల్లల హృదయాన్ని సూటిగా తాకుతాయి. అందుకే అవి బాధించగలవు, అవే లోతుగా ఓదార్పు కూడా ఇస్తాయి. ఇక్కడే పిల్లల భావోద్వేగ భద్రత మొదలవుతుంది.

ఎందుకంటే మాతృభాషలో పిల్లలు మాటలు వెతకాల్సిన అవసరం ఉండదు. భావాన్ని అనువదించాల్సిన ఒత్తిడి ఉండదు. మనసులో ఉన్నదాన్ని ఉన్నట్లే చెప్పగలిగే అవకాశం ఉంటుంది.

ఒక పిల్లవాడు తన మాతృభాషలో భావాలను వ్యక్తపరచలేకపోతే, ఆ భావోద్వేగ భద్రతలో ఒక ఖాళీ మెల్లగా ఏర్పడుతుంది.  వాళ్లకు బాధ ఉన్నా, దాన్ని చెప్పడానికి సరైన మాటలు దొరకవు.

కోపం ఉన్నా, అది అర్థమయ్యేలా చెప్పలేక, అరుపులుగా, మౌనంగా, లేదా తప్పు ప్రవర్తనగా బయటకు రావచ్చు.

ఇలా భావాలను సులభంగా చెప్పలేని పిల్లలు, తమ భావాలను లోపలే దాచుకోవడం, నేర్చుకుంటారు. లేదా, వాటిని ఇతరులు అర్థం చేసుకునేలా, వ్యక్తపరచడంలో తడబడతారు.

ఉదా:

పిల్లలు కోపంగా ఉన్నప్పుడు, మాతృభాషలో అడిగిన “నీకు ఇలా ఎందుకు అనిపిస్తోంది?” అన్న ప్రశ్న వాళ్లని తమ భావాల దగ్గరకు తీసుకువస్తుంది.

బాధలో ఉన్నప్పుడు, మాతృభాషలో చెప్పిన “ఇలా ఫీల్ అవ్వడం తప్పు కాదు” అన్న మాట వాళ్లకి భయం లేని స్థలాన్ని ఇస్తుంది.

అప్పుడు పిల్లలు మాటలు వెతకాల్సిన అవసరం లేకుండా, తమ  భావాలను నేరుగా బయట పెట్టగలుగుతారు. అది తమ మాతృభాషలో అయితే, ఇంకా సులువుగా చేప్తారు.

అందుకే పిల్లల భావోద్వేగ నియంత్రణకి, ముందుగా నేర్పించాల్సింది స్కిల్స్ కాదు, వాళ్లు ముందుగా నేర్చుకోవాల్సింది మన మాతృభాష. ఆ భాషలోని ఉండే భద్రత, మరియు ఆప్యాయత.

ఆ భద్రత ఏర్పడినప్పుడు, పిల్లలు మెల్లగా తమ భావాలను తాము అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. అదే అసలైన భావోద్వేగ బలం.

మాతృభాష దూరమవుతున్న ఇళ్లలో..

ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో ఒక నిశ్శబ్దమైన నిజం ఉంది.

పిల్లలతో మాతృభాషలో మాట్లాడాలని మనసులో ఉంటుంది.. కానీ మాటలు బయటికి రావు.

“ఇంట్లో ఇంగ్లీష్‌కి అలవాటు అయిపోయాం, పిల్లలకు తెలుగు సరిగా రాదు. ఇప్పుడు మొదలుపెడితే వింతగా అనిపిస్తుందేమో.”

ఈ ఆలోచనలు చాలామంది పేరెంట్స్ మనసులో తిరుగుతూనే ఉంటాయి. ఇది తప్పు కాదు. ఇది ఈ కాలం నిజం. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మనం గుర్తు పెట్టుకోవాలి.

మాతృభాష అనేది, ఇతర భాషలకు పోటీ కాదు. ఏ భాష యొక్క గొప్పతనం ఆ భాషకు ఉంటుంది.

అందుకే, మనం మిగతా భాషల్ని వదిలేయాల్సిన అవసరం కూడా లేదు.

ఇది కేవలం, పిల్లల హృదయాలను తాకుతూ వాళ్ళని భావోద్వేగ పరంగా, వారిని స్థిత్తప్రజ్ఞులుగా చేయటానికి ఒక చిన్న ప్రయత్నం మటుకే.

పిల్లలు మీతో ఇంగ్లీష్లోనే మాట్లాడినా, మీరు మాతృభాషలో మాట్లాడటం మొదలుపెడితే, వాళ్లలో ఏదో నిశ్శబ్దంగా మారుతుంది. అది పదాల వల్ల కాదు. ఆ భాషతో ముడిపడిన భావోద్వేగ జ్ఞాపకాల వల్ల. మీ పిల్లలు ఏ ఏజ్‌లో ఉన్నా, వాళ్ళ హృదయానికి, నాడీ వ్యవస్థకు దగ్గరైన ఈ భాష వారికి ఒక తెలియని భద్రతను కల్పిస్తుంది.

ఇలా చెప్పగానే కొంతమంది పేరెంట్స్ లోని కొన్ని అభద్రతా భావాలు చోటు చేసుకుంటాయి అవి ఎలాగంటే:

ఇవన్నీ సహజమైన భయాలే. కానీ పిల్లలు మీ ఉచ్చారణను గుర్తుపెట్టుకోరు. మీ వ్యాకరణాన్ని మార్కులేసి పరీక్షించరు. వాళ్లు గుర్తుంచుకునేది:

కొన్నిసార్లు ఒక్క వాక్యం చాలూ. రోజూ అంతా మాతృభాషలో మాట్లాడాల్సిన అవసరం లేదు.

ఈ చిన్న మాటలే పిల్లల మనసులో ఒక పెద్ద భావనను నాటుతాయి, ఇక్కడ నేను సురక్షితం అని.

మనకి ఏ భాషలో మనము మనలా అనిపిస్తామో;  అదే భాష మన పిల్లలకి కూడా మెల్లగా అందుతుంది. పిల్లలు మనం ఏం చెప్తున్నామో కన్నా, మనకి ఏ భాషలో మనసు తెరవబడుతుందో ఎక్కువగా గమనిస్తారు.

ఈ నెలలో, ప్రపంచ మాతృభాషా దినం సందర్భంగా మనం పెద్దగా సంకల్పాలు చేయాల్సిన అవసరం లేదు.

భాషని కాపాడాలనే బాధ్యతగా కాకుండా, బంధాన్ని మృదువుగా ఉంచుకోవాలనే కోరికగా కూడా మాతృభాషని చూడగలిగితే చాలూ.

ఈ రోజు నుంచి, లేదా ఈ వారం నుంచి, లేదా ఈ ఒక్క సందర్భం నుంచే;  పిల్లలతో మాతృభాషలో ఒక్క మాట అయినా ఎక్కువగా మాట్లాడుదాం.

ఇప్పటివరకు చేయలేకపోయామన్న guilt అవసరం లేదు. ఇప్పటివరకు ఆలస్యం అయిందన్న భావన కూడా కాదు. మాతృభాషలో అనుబంధం ఆరంభించడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు.

ఇది మాతృభాషను బోధించాలనే ప్రయత్నం కాదు. ఇది పిల్లల మనసు మాట్లాడే భాషను మనం మరోసారి వినేందుకు తీసుకునే ఒక చిన్న విరామం మాత్రమే.

ఇప్పటివరకు మాట్లాడలేకపోయామన్న బాధ అవసరం లేదు. ఇప్పుడైనా ఒక్క మాట ఎక్కువగా వినిపిస్తే చాలు. పిల్లలు పరిపూర్ణ మాటలు కాదు కోరుకునేది. వాళ్లు కోరుకునేది; తమ భావాలను భయంలేకుండా చెప్పగలిగే స్థలం.

అది దొరికిన చోట మాతృభాష మెల్లగా తిరిగి ఇంటికి వస్తుంది.

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version