Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-51

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

 

సమానత్వాన్ని గౌరవించే పిల్లలు – సాధికారతను అర్థం చేసుకునే తరాన్ని ఎలా పెంచాలి?

ప్రతి కాలానికి తన సవాళ్లు ఉంటాయి. ఒకప్పుడు అవకాశాలు పరిమితం. ఇప్పుడు అవకాశాలు అపారం.

కానీ ఒక ప్రశ్న మనం మనల్ని మనమే అడగాలి..

మన పిల్లలు సమానత్వాన్ని అర్థం చేసుకుంటున్నారా? లేక కేవలం పదంగా వినిపించుకుంటున్నారా?

మార్చి 8 – International Women’s Day.

ఈ రోజు మహిళల విజయాల గురించి మాట్లాడతాం. సోషల్ మీడియాలో ప్రేరణాత్మక కోట్స్, పుష్పగుచ్ఛాలు కనిపిస్తాయి.  కానీ మన ఇంట్లో పెరుగుతున్న పిల్లల మనసులో ఏ సందేశం నాటుకుపోతుందో ఆలోచిస్తామా?

ఒక ఇంట్లో ఉదయం సన్నివేశం.

అమ్మ వంటింట్లో బిజీగా ఉంది. నాన్న ఫోన్లో మెసేజ్ చూస్తున్నారు. అబ్బాయి బయట క్రికెట్కు రెడీ అవుతున్నాడు. అమ్మాయి మాత్రం అమ్మకి సహాయం చేస్తోంది.

ఎవ్వరూ ఈ విషయాన్ని తప్పు అనుకోవడం లేదు. కానీ పిల్లల మనసులో నిశ్శబ్దంగా ఒక పాఠం రాయబడుతోంది.

“ఇది అమ్మ పని. ఇది అమ్మాయిల పని.”

మనము మాటల్లో సమానత్వం గురించి మాట్లాడకపోయినా, మన జీవన విధానం వాళ్లకు పాఠం చెబుతోంది. పిల్లలు మాటలు కాదు.. జీవనశైలిని నేర్చుకుంటారు.

సమానత్వం (Equality) – సాధికారత (Empowerment) అంటే ఏమిటి?

సమానత్వం అంటే అందరికీ ఒకేలా పని ఇవ్వడం కాదు. ప్రతి ఒక్కరికీ అవసరమైన గౌరవం, అవకాశం, ఎంపిక స్వేచ్ఛ ఇవ్వడం.

సాధికారత అంటే పెద్ద పదం కాదు..

ఇది కేవలం అమ్మాయిలకే సంబంధించిన విషయం కాదు. అబ్బాయిలకు కూడా ఇదే అవసరం.

ఎందుకు అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకూ నేర్పాలి?

మన సమాజంలో చాలా అమ్మాయిలు “మంచి పిల్ల”గా ఉండేందుకు తమ భావాలను దాచుకుంటారు. వారు ఎప్పుడూ ఒకే మాట వింటూ ఉంటారు:

ఇలా చిన్నప్పటినుంచే వారికి ఒక మౌన ఒత్తిడి. కాబట్టి అమ్మాయిలకి నేర్పాలిసింది:

అంటే.. భావోద్వేగాలు బలహీనత అని నేర్పుతున్నామా? వారికి నేర్పాల్సింది:

గౌరవం నేర్చుకున్న అబ్బాయి, భవిష్యత్తులో మంచి భాగస్వామి, మంచి తండ్రి, మంచి నాయకుడు అవుతాడు.

ఇంట్లోనే మొదలయ్యే సమానత్వ పాఠాలు

సమానత్వం పాఠం స్కూల్లో కాదు, ఇంట్లో మొదలవుతుంది.

“నువ్వు అబ్బాయి కాబట్టి..” లేదా  “నువ్వు అమ్మాయి కాబట్టి..”

ఈ రెండు వాక్యాలు మనకు చిన్నవిగా అనిపించినా, పిల్లల మనసులో అజ్ఞాత గీతలు గీస్తాయి. కాబట్టి ఆ వాక్యాలని వాడకుండా ఉండటం.

తల్లితండ్రుల మధ్య ఉండే పరస్పర గౌరవం, వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ప్రవర్తించే విధానం, పిల్లల భవిష్యత్తు సంబంధాలకి మోడల్ గా పనిచేస్తుంది

పిల్లలు సంబంధాల విలువ నేర్చుకుంటారు. సమానత్వం పాఠం ఒకరోజులో రాదు.అది ప్రతి రోజు మన సంభాషణల్లో, మన ప్రవర్తనలో నెమ్మదిగా పెరుగుతుంది.

సోషల్ మీడియా & సమాజ ప్రభావం

ఈ రోజుల్లో పిల్లలు సోషల్ మీడియా, సినిమాలు, ప్రకటనల ద్వారా స్టీరియోటైప్స్ నేర్చుకుంటున్నారు.

మనం గమనించకపోయినా, పిల్లలు గమనిస్తున్నారు.

ఉదా:

ఒక 13 ఏళ్ల అమ్మాయి, స్కూల్ నుంచి వచ్చాక ఫోన్ తీసుకుని రీల్స్ చూస్తోంది.

అక్కడ వరుసగా తనకి కనిపిస్తున్నవి;  స్లిమ్ ఫిగర్ ఉన్న అమ్మాయిలు, మేకప్ ట్యుటోరియల్స్, ‘గ్లో అప్’ వీడియోలు.

కొద్ది రోజుల తర్వాత ఆమె అద్దం ముందు ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టింది.

“అమ్మా.. నేను బ్లాక్‌గా ఉన్నానా?” అని ఒక రోజు అడిగింది.

ఇక్కడ సమస్య ఫోన్ కాదు. అక్కడి నిశ్శబ్ద సందేశం. అదే “నీ విలువ నీ రూపంలో ఉంది.”

అదే ఇంట్లో ఒక 14 ఏళ్ల అబ్బాయి గేమింగ్ వీడియోలు చూస్తున్నాడు.

అక్కడ హీరోలు ఎప్పుడూ గెలుస్తారు, ఎప్పుడూ బలంగా ఉంటారు, ఎప్పుడూ భావోద్వేగం చూపించరు.

కొద్ది రోజుల తర్వాత అతను ఓడిపోయినప్పుడు అసహనంగా ఫోన్ విసిరేస్తాడు. ఎందుకంటే అతను నేర్చుకున్న సందేశం: “ఓటమి అంటే బలహీనత.”

సోషల్ మీడియా పెద్దగా చెప్పదు, కానీ చిన్న చిన్న చిత్రాల ద్వారా పిల్లల మనసులో ఒక రూపకల్పన చేస్తుంది.

ఇది ఒక్కరోజులో జరగదు, నెమ్మదిగా, మౌనంగా, పునరావృతంగా జరుగుతుంది.

అప్పుడు మన పాత్ర ఏమిటి? సంభాషణ మొదలుపెట్టడం, ఫోన్ తీసేసేయడం కాదు.

ఈసారి ఆ అమ్మాయి రీల్ చూస్తున్నప్పుడు, అమ్మ పక్కనే కూర్చుని, “నీకు ఈ వీడియోలో ఏమి నచ్చింది?” అని అడిగింది. ఆ పాప చెప్పింది, “ఆమె అందంగా మారింది కదా.”

అంటే అమ్మ “అందం అంటే ఏమిటి? కేవలం బయట రూపమేనా? లేక ధైర్యంగా మాట్లాడటం కూడా అందమేనా?” అని అడిగింది.

ఆ సంభాషణ పెద్దది కాదు, కానీ ఆ అమ్మాయి ఆలోచించడం మొదలుపెట్టింది.

అదే క్రిటికల్ థింకింగ్.

స్క్రీన్‌ను శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు, కానీ దాన్ని మౌన గురువుగా వదిలేయకూడదు. మనమే స్క్రీన్ కి మన పిల్లలకి మధ్యలో నిలబడి, ప్రశ్నలు అడగాలి.

ఆలోచించే పిల్లలు, అనుకరించే పిల్లలకంటే బలమైనవారు. సోషల్ మీడియా వారికి సమాచారం ఇస్తుంది. మన సంభాషణలు వారికి దిశ ఇస్తాయి.

International Women’s Day నుంచి..

మార్చి 8.

ఈ రోజు మనం మహిళల విజయాలను సెలబ్రేట్ చేస్తాం. కానీ ఆ రోజు సాయంత్రం మన ఇంట్లో ఏమి జరుగుతోంది?

ఒక చిన్న సంఘటన ఊహించండి.

International Women’s Day సందర్భంగా స్కూల్లో స్పీచ్ ఇచ్చి వచ్చిన ఒక 11 ఏళ్ల అమ్మాయి ఇంటికి వచ్చి, “అమ్మా, టీచర్ చెప్పింది.. గర్ల్స్ కెన్ డూ ఏనీథింగ్!” అని చెప్పింది.

అమ్మ చిరునవ్వు నవ్వింది, వెంటనే, తమ్ముడు సోఫాలో కూర్చుని ఉండగా అమ్మాయినే ప్లేట్లు తీసుకురమ్మని పిలిచింది. ఇక్కడ ఎవరూ ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదు. కానీ ఒక మౌన సందేశం వెళ్లిపోయింది.

స్పీచ్లో సమానత్వం, జీవితంలో పాత అలవాట్లు.

మార్పు పెద్ద నినాదాలతో రాదు. చిన్న అవగాహనతో మొదలవుతుంది.

అదే రోజు రాత్రి, ఆ అమ్మ ఆలోచించింది. రేపటినుంచి ఒక చిన్న మార్పు చేద్దామా?

1. పనులు పంచుకోవడం.

2. ఒక చిన్న సంభాషణ మొదలుపెట్టడం.

ఈ ప్రశ్నలు పెద్దవి కావు, కానీ పిల్లల మనసులో ఒక కొత్త కిటికీ తెరుస్తాయి.

సమానత్వం ఒక రోజుకి సంబంధించినది కాదు, అది ఒక సంస్కారం.

సాధికారత ఒక నినాదం కాదు, అది ఒక భావన.

మన పిల్లలు భవిష్యత్తులో:

మన ఇంట్లోనే ఆ విత్తనం వేయాలి. ఈ వారం ఒక చిన్న నిర్ణయం తీసుకుందామా? పిల్లలకు పెద్ద ఉపన్యాసం ఇవ్వకుండా, మన ప్రవర్తనలో ఒక చిన్న మార్పు చేయాలని. ఎందుకంటే, భవిష్యత్తు సమాజం ఈ రోజు మన ఇంట్లోనే కూర్చుంది. మన పిల్లల రూపంలో.

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version