[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
స్క్రీన్ యుద్ధాలకి చెక్: కుటుంబాన్ని దగ్గర చేసే డిజిటల్ నియమాలు
ప్రతి ఇంట్లో ఈ రోజుల్లో చూసే దృశ్యమే ఇది. భోజనపు టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు.. కానీ ప్రతి ఒక్కరి చేతిలో ఒక స్క్రీన్. ఒకరు రీల్స్ చూస్తున్నారు, ఇంకొకరు గేమ్ ఆడుతున్నారు, ఇంకొకరు ఆఫీస్ మెయిల్స్ చూస్తున్నారు. అందరూ ఒకే ఇంట్లోనే ఉంటున్నాం. కానీ, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చాలా తక్కువ అయిపోతుంది.
చాలా తల్లిదండ్రులు నన్ను అడుగుతారు: “మేడమ్, ఫోన్ వల్లే మా ఇంట్లో గొడవలు పెరిగిపోయాయా.” అని. అప్పుడు నేను వారికి చెప్తాను, “సమస్య నిజంగా ఫోన్‌లో లేదు, అది మన వాడటంలో ఉంది” అని.
స్క్రీన్ అంటే శత్రువు కాదు. కానీ అవగాహన లేకుండా వాడితే అది కుటుంబ సంబంధాల్ని బలహీనపరుస్తుంది. అవగాహన లేకపోవడం అంటే:
- స్పష్టమైన నియమాలు లేకపోవడం:
ఇంట్లో ఎవరికీ ఒక స్పష్టమైన స్క్రీన్ టైం లిమిట్స్ లేవు. ఎంతసేపు వాడాలి?, ఎప్పుడు ఆపాలి? దాంతో, ప్రతిసారి ఒక గొడవ మొదలవుతుంది – నువ్వు ఎక్కువ వాడావు, అంటే, నువ్వు ఎక్కువ వాడావు అని.
- “నువ్వు ఎప్పుడూ..” అనే మాట:
“నువ్వు ఎప్పుడూ ఫోన్లోనే ఉంటావ్!” అని ఒకరినొకరు తిట్టుకోవడంతోనే మొదలవుతుంది. దానితో ప్రతి ఒక్కళ్ళు వాళ్లని వాళ్ళు రక్షించుకోవడం కోసం, ఎదుటివారిని బ్లేమ్ చేయటం మొదలు పెడతారు.
- తల్లిదండ్రులే మోడల్ కాకపోవడం:
తల్లితండ్రులు మొదటగా వాళ్ళ పిల్లల్ని బ్లేమ్ చేస్తుంటారు. మా పిల్లవాళ్ళు రోజస్తమానం ఫోన్లోనే ఉంటారు, లేదు కంప్యూటర్ లోనే ఉంటారు, అని చెప్పి. కానీ, వాళ్లు తాము ఎంతగా తమ మొబైల్‌ని వాడుతున్నారో గమనించుకోరు.
- స్క్రీన్‌ను శిక్ష/బహుమతిగా వాడటం:
పిల్లల బిహేవియర్‌ని బట్టి, చాలామంది తల్లిదండ్రులు వాళ్లకి స్క్రీన్‌ని ఒక శిక్షగా, లేదా, బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. హోంవర్క్ చేస్తేనే ఫోన్ ఇస్తాము, లేదా, చెడు మార్కులు వస్తే ఫోన్ తీసేస్తాo అని. కాని , ఇలా చేయటం వల్ల పిల్లలకి ఫోన్ దొరికినప్పుడు ఇంకా దాని వదిలిపెట్టరు.
“స్మార్ట్ స్క్రీన్ హాబిట్స్” అంటే ఏమిటి?
స్క్రీన్ వాడొద్దు అనడం సులువు. ఎంతసేపైనా వాడుకో అనడం కూడా సులువు. కానీ మధ్యలో ఉండే సమతుల్యతనే, స్క్రీన్ టైం పట్ల అవగాహన అని చెప్పొచ్చు.
స్మార్ట్ స్క్రీన్ హాబిట్స్ అంటే నియంత్రణ కాదు.. అవగాహన. అది నిషేధం కాదు.. సంస్కారం.
ఉదాహరణ:
హైదరాబాద్‌లో నివసించే 14 ఏళ్ల ఒక బాలుడికి గేమింగ్ అంటే ప్రాణం. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అతని చేతిలో ఫోన్ ఉండేది. ప్రతిరోజూ అమ్మ మాట ఒకటే – “ఇంకా ఎంతసేపు ఆ గేమ్? చదువు ఎప్పుడు?” అతను కోపంతో గది తలుపు మూసేసేవాడు. ఇంకా ఇంట్లో దాంతో గొడవలు దానితో అందరి మూడ్స్ పాడయ్యేవి.
ఇంట్లో ప్రతిరోజూ చిన్న చిన్న యుద్ధాలు. ఒకరోజు ఆ అమ్మ తన మాట మార్చింది. “ఫోన్ పెట్టు” అని కాకుండా, “నీకు ఆ గేమ్‌లో ఏమి నచ్చుతుంది?” అని అడిగింది. మొదట అతను మౌనంగా ఉన్నాడు. తరువాత మెల్లగా చెప్పాడు: నేను ఆడుతున్న టీమ్‌లో, నేనే లీడర్‌ని అందరూ నా మాట వింటారు. నేను ప్లానింగ్ చేస్తాను అది నాకు చాలా నచ్చుతుంది అని. ఆ మాట వినగానే ఆ అమ్మకు అర్థమైంది, ఇది కేవలం గేమ్ కాదు; ఇది అతని నాయకత్వ భావన, అతని గుర్తింపు.
ఆ రోజు వాళ్లు కలిసి ఒక చిన్న ఒప్పందం చేసుకున్నారు. రోజుకు 45 నిమిషాలు గేమ్, మిగతా సమయం కుటుంబంతో కలిసి గడపాలి. ఒకరోజు అమ్మతో నడక, ఒకరోజు కలిసి వంట, మరోరోజు తండ్రితో క్రికెట్, మొదలగునవి.
మూడు నెలల తర్వాత ఆ అమ్మ చెప్పింది, ఇప్పుడు గేమ్ టైమ్ తగ్గింది. కానీ ముఖ్యంగా గొడవలు తగ్గాయి. ఇప్పుడు అతనే టైమర్ పెట్టుకుని అంతవరకే గేమ్‌ని ఆడుతున్నాడు.
ఇక్కడ మారింది ఫోన్ కాదు; మారింది సంభాషణ. దీనివల్ల మనం తెలుసుకున్నది ఏమిటి?
స్క్రీన్ వెనుక ఒక అవసరం ఉంటుంది.
- గుర్తింపు కావాలి
- కనెక్షన్ కావాలి
- రిలాక్స్ కావాలి
- గెలిచిన అనుభూతి కావాలి
మనము కేవలం ఫోన్‌ని ఆపితే ఆ అవసరం ఎక్కడికీ పోదు. మనము ఆ అవసరాన్ని అర్థం చేసుకుంటే, స్క్రీన్ మీద ఆధారపడడం సహజంగా తగ్గుతుంది.
స్మార్ట్ స్క్రీన్ హాబిట్స్ అంటే
ఫోన్తో యుద్ధం చేయడం కాదు.. మన పిల్లల ఫోన్ అవసరాన్ని మనం అర్థం చేసుకోవటం. కుటుంబంగా చర్చించి, అంగీకరించి, అందరూ పాటించే ఒక డిజిటల్ సంస్కృతి.
కుటుంబ తగాదాలను తగ్గించే 7 స్మార్ట్ స్క్రీన్ అలవాట్లు:
1. Family Screen Agreement
ఒక సెలవ రోజు ఇంట్లో ఉన్న అందరూ కలిసి కూర్చొని స్క్రీన్‌ల గురించి మాట్లాడుకోండి. ఎవరెవరు మొబైల్ ఎంత సేపు వాడుతున్నారు? ఎందుకోసం వాడుతున్నారు, వివరాలు అడిగి తెలుసుకోండి. దానిని బట్టి ఎవరు ఎంత సేపు వాడాలి అని ఒక ప్లాన్ లేదు ఒక అగ్రిమెంట్‌ని రాసుకోండి. పిల్లల అభిప్రాయం అడిగితే,వాళ్లు కూడా బాధ్యత తీసుకుంటారు.
2. No-Phone Zones
ఇంట్లో కొన్ని రూమ్లలో లేదు భోజనాలు టేబుల్ దగ్గర ఫోన్ వినియోగాన్ని పూర్తిగా కంట్రోల్ చేయండి.
ఉదా: భోజన సమయం, పడుకునే ముందు ఒక గంట, బెడ్రూంలో ఫోను నిషేధించండి.
3. Parents Go First Rule:
మొదట తల్లిదండ్రులు మారాలి. పిల్లల్ని అడగడానికి ముందు మనం చూపించాలి. “ఇప్పటి నుంచి డిన్నర్ టైమ్‌లో నా ఫోన్ పక్కన పెడతాను” అని చెప్పండి. పిల్లలపై ప్రభావం అద్భుతంగా ఉంటుంది.
4. Screen-Free Rituals:
పిల్లలకు స్క్రీన్ కంటే ఆసక్తికరమైన అనుభవం ఇవ్వాలి. అందుకే, రోజు ఇంట్లో అందరూ ఫోన్లు కాసేపు పక్కనపెట్టి కుటుంబంగా కలిసి గడపండి. ప్రతిరోజు కాకపోతే వారానికి ఒక్కసారి అయినా ఈ పద్ధతిని ట్రై చేయండి.
ఉదా: ఆదివారం ఉదయం వాకింగ్, శుక్రవారం బోర్డ్ గేమ్స్, మొదలగునవి.
5. Co-Viewing & Co-Playing:
పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం ఆడుతున్నారు అనేది దూరంగా నిలబడి విమర్శించడం కంటే, కొంతసేపు వాళ్లతో కలిసి ఆ ప్రపంచంలోకి వెళ్లండి. పిల్లల స్క్రీన్ అనుభవాన్ని పంచుకున్నప్పుడు అది గొడవకు కారణం కాకుండా సంభాషణకు అవకాశంగా మారుతుంది.
వాళ్లు చూస్తున్న వీడియోలో ఏమి నచ్చిందో అడగండి. ఆ గేమ్‌లో ఎలా గెలుస్తారో చెప్పమని అడగండి. మీరు ఆసక్తి చూపితే పిల్లలు కూడా ఓపెన్ అవుతారు.
ఉదా: వారాంతంలో కలిసి ఒక సినిమా చూడటం, పిల్లలు ఆడే గేమ్‌లో ఒక లెవల్ మీరు కూడా ట్రై చేయడం, వీడియో చూసిన తర్వాత “ఈ కథలో నీకు ఏం బాగా అనిపించింది?” అని చర్చించడం మొదలగునవి.
6. Emotional Check-in Before Screen:
పిల్లలు ఫోన్ తీసుకున్న ప్రతిసారి వెంటనే “ఇంకా ఫోన్ అవసరమా?” అని ప్రశ్నించడం బదులుగా, ముందుగా వారి భావాన్ని గుర్తించండి. స్క్రీన్ చాలా సార్లు భావోద్వేగానికి ఓ తాత్కాలిక ఔషధం మాత్రమే. అందుకే , “ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తోంది?” అని అడగడం వారికి భద్రతను ఇస్తుంది.
ఉదా: “ఇప్పుడే గేమ్ ఆడాలనిపించడం వెనుక ఏమైనా జరిగిందా?”, “స్కూల్లో ఏమైనా టెన్షన్ ఉందా?”, “కొంచెం రిలాక్స్ కావాలనిపిస్తోందా?” అని మృదువుగా మాట్లాడటం మొదలగునవి.
ఇలా భావాన్ని అర్థం చేసుకున్నప్పుడు, చాలా సార్లు పిల్లలే “సరే, కొంచెం తర్వాత చూస్తాను” అని నిర్ణయించుకుంటారు.
7. Digital Sunset Routine:
ప్రతిరోజు రాత్రి ఒక సమయం తర్వాత ఇంట్లో ఉన్న అందరూ తమ ఫోన్లు పక్కన పెట్టేసేయాలి. ఇది పిల్లలకే కాదు, తల్లిదండ్రులకూ వర్తించాలి. స్క్రీన్ ఆఫ్ అయిన తర్వాత ఆ ఖాళీని అర్థవంతంగా నింపాలి. లేకపోతే పిల్లలకు అది శిక్షలా అనిపిస్తుంది.
ఉదా: పడుకునే ముందు 20 నిమిషాలు కథలు చెప్పడం, ఆ రోజు జరిగిన మంచి విషయాన్ని ఒక్కొక్కరూ పంచుకోవడం, చిన్న ప్రార్థన లేదా నిశ్శబ్ద క్షణం పాటించడం మొదలగునవి.
కొద్ది రోజుల తర్వాత మీరు గమనిస్తారు, పిల్లల నిద్ర మెరుగవుతుంది, ఉదయం మూడ్ మారుతుంది, ముఖ్యంగా రాత్రి గొడవలు తగ్గిపోతాయి.
ముగింపు: ఫోన్లు సైలెంట్.. మనసులు ఆన్
స్క్రీన్ యుద్ధాలను గెలవడం మన లక్ష్యం కాదు. మన పిల్లల హృదయాన్ని కోల్పోకుండా ఉండటం. మనము ఎంత కఠినమైన నియమాలు పెట్టినా, సంబంధం బలహీనంగా ఉంటే గొడవలు తగ్గవు. కానీ సంభాషణ బలంగా ఉంటే, నియమాలు సహజంగా పాటించబడతాయి.
స్క్రీన్ టైమ్ తగ్గించడం ఒక్కటే పరిష్కారం కాదు. మార్పు కావాల్సింది కుటుంబంతో కలిసి కలిపే సమయాన్ని పెంచడంలోనూ మన కుటుంబంలోని మనుషుల మధ్య అనుబంధాలను పెంచడంలోను.
మన పిల్లలు ఇంట్లో వారిని అర్థం చేసుకునే పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ల మాటలు విని తల్లితండ్రులు ఉన్నప్పుడు అంతగా ఫోన్‌కి ఆకర్షితులు కారు.
ఈరోజే ఒక సమయం నిర్ణయించండి. కుటుంబంగా 15 నిమిషాలు కూర్చోండి. ఈ మూడు ప్రశ్నలు అడగండి:
- మన ఇంట్లో స్క్రీన్ వల్ల ఎక్కువగా గొడవలు ఎప్పుడు వస్తున్నాయి?
- మనం ఏ ఒక చిన్న నియమం వెంటనే ప్రారంభించవచ్చు?
- స్క్రీన్ తగ్గిన సమయంలో మనం కలిసి ఏం చేయాలి?
పెద్ద మార్పులు అవసరం లేదు. ఒక చిన్న నిర్ణయం సరిపోతుంది.
ఉదా: “ఈ వారం డిన్నర్ టైమ్‌లో ఫోన్లు వద్దు” అనేలా.
ఒక వారం తర్వాత మళ్లీ చర్చించండి. ఏం మారింది? ఎలా అనిపించింది?
సంబంధాలు ఒక్కరోజులో బలపడవు. కానీ ప్రతిరోజు తీసుకునే చిన్న నిర్ణయాలు, కుటుంబ సంస్కృతిని మార్చేస్తాయి.
ఈ వారం మీ ఇంట్లో ఫోన్లు కొంచెం సైలెంట్‌గా ఉండనివ్వండి.. మనసులు కొంచెం ఎక్కువగా మాట్లాడనివ్వండి.
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.
