Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-65

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

స్కూల్ మళ్లీ మొదలైంది.. కానీ పిల్లల మనసు సిద్ధంగా ఉందా?

“అమ్మా.. ఇంకో వారం సెలవులు ఉంటే బాగుండేది..” కొత్త బ్యాగ్‌ను భుజానికి వేసుకుని అద్దం ముందు నిలబడ్డ నా కొడుకు నెమ్మదిగా అన్న మాట అది.

కానీ అతని మనసు మాత్రం ఇంకా సెలవుల్లోనే ఉంది. ఆ మాట విన్నప్పుడు ఒక్కసారిగా నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. వేసవి సెలవులు చివరి రోజుల్లో మనకూ ఇలాగే అనిపించేది కదా!

తాతయ్య ఇంటి మామిడి చెట్టు.., స్నేహితులతో ఆడిన ఆటలు.., మధ్యాహ్నం నిద్రలు.., అమ్మమ్మ చెప్పిన కథలు.. ఇవన్నీ ఒక్కసారిగా ముగిసిపోతున్నాయనే చిన్న బాధ మనసులో ఉండేది. అయితే ఆ రోజుల్లో స్కూల్ ప్రారంభం అంటే కొత్త పుస్తకాల సువాసన, కొత్త స్నేహితులు, కొత్త కలలు కూడా ఉండేవి.

ఈ రోజు కూడా పిల్లల మనసు పెద్దగా మారలేదు, కానీ కాలం, మన జీవనశైలి మారింది.  దాంతో, స్కూల్ అంటే మనం చూసే విధానం కూడా మారింది.

స్కూల్ ప్రారంభం అంటే పిల్లలకు ఏమిటి?

జూన్ నెల వచ్చిందంటే చాలా ఇళ్లలో ఒక ప్రత్యేకమైన సందడి మొదలవుతుంది.

ఈ పనులన్నింటిలో మనం అంతగా మునిగిపోతాం కాబట్టి ఒక విషయం మర్చిపోతాం. మనం మన పిల్లల స్కూల్ ప్రారంభానికి సిద్ధమవుతున్నాం, కానీ పిల్లలు ఒక భావోద్వేగ మార్పుకు సిద్ధమవుతున్నారు.

రెండు నెలల వేసవి సెలవుల తర్వాత మళ్లీ స్కూల్ జీవితం ప్రారంభమవుతుంది.

పిల్లలు కూడా బయటకు చూస్తే ఉత్సాహంగానే కనిపిస్తారు. కొత్త క్లాస్, కొత్త టీచర్, కొత్త పుస్తకాలు – ఇవి అన్నీ వారికి ఒక కొత్త అనుభవాన్ని తీసుకువస్తాయి. కానీ ఈ హడావుడి మధ్య మనం తరచుగా మర్చిపోయే ఒక విషయం ఉంది.

స్కూల్‌కి వెళ్లడానికి బ్యాగ్ సిద్ధమైంది. కానీ పిల్లల మనసు కూడా సిద్ధమైందా?

సెలవులు అనేవి కేవలం స్కూల్ నుంచి బ్రేక్ మాత్రమే కావు. సెలవులు అనేవి పిల్లలకి సంవత్సరానికి ఒకసారి దొరికే విరామ సమయం.

సెలవులు అంటే వారికి స్వేచ్ఛ. అవి వారు నెమ్మదిగా లేచే రోజులు, వారు  స్వేచ్ఛగా ఆడుకునే సమయం, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం, కొన్నిసార్లు తాతయ్య, అమ్మమ్మల ఇంట్లో మధురమైన జ్ఞాపకాలు సృష్టించుకునే సమయం.

అలాంటి రోజులు ఒక్కసారిగా ముగిసి మళ్లీ క్రమశిక్షణతో కూడిన స్కూల్ జీవితంలోకి అడుగుపెట్టడం కొంతమంది పిల్లలకు సులభంగా ఉండవచ్చు. మరికొందరికి మాత్రం అది ఒక చిన్న భావోద్వేగ మార్పు.

అందుకే ఈ కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో పిల్లల బ్యాగ్ మాత్రమే కాదు, వారి మనసును కూడా సిద్ధం చేయడం తల్లిదండ్రులుగా మన బాధ్యత.

పిల్లలు స్కూల్‌కి వెళ్లడానికి ఎందుకు కొన్నిసార్లు ఆసక్తి చూపరు?

స్కూల్ ప్రారంభానికి ముందు కొన్ని పిల్లలు ఇలా అంటుంటారు. అబ్బా, “ఇంకా కొంచెం సెలవులు ఉంటే బాగుండేది..”, “మళ్లీ బోరుగా హోంవర్క్ మొదలవుతుంది..”,  “నాకు స్కూల్‌కి వెళ్లాలని లేదు..”, మొదలగునవి.

ఇది విన్న వెంటనే కొందరు పెద్దలు ఇలా అనేస్తారు.

కానీ నిజానికి ఇది బద్ధకం కాకపోవచ్చు. ఎప్పుడైతే వారు ఒక కొత్త మార్పుని స్వీకరించాలో అప్పుడు, పిల్లలు మనసులో కొంచెం ఆంగ్సైటి అన్నది మొదలవుతుంది.

ఉదా:

ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వారి మనసులో తిరుగుతుంటాయి. పిల్లలు తమ భావాలను మాటల్లో చెప్పలేకపోవచ్చు. కానీ ఆ భావాలు మాత్రం వారికి నిజంగానే ఉంటాయి. అందుకే, మనం గమనించాల్సింది వారి ప్రవర్తన కాదు..

దాని వెనుక ఉన్న భావం.

మనం పిల్లల్ని సిద్ధం చేస్తున్నది స్కూల్కా.. లేక పోటీ ప్రపంచానికా?

స్కూల్ మొదలయ్యే మొదటి రోజు ఉదయం చాలా ఇళ్లలో ఒకే రకమైన సంభాషణలు వినిపిస్తాయి.

ఇక్కడ మన ఉద్దేశం మంచిదే. కానీ పిల్లలు వింటున్న సందేశం వేరుగా ఉండవచ్చు.

కొన్నిసార్లు పిల్లల బ్యాగ్ లోని పుస్తకాల కంటే.. వారి చిన్న మనసులోని అంచనాల బరువే ఎక్కువగా ఉంటుంది. నిజానికి కొత్త విద్యాసంవత్సరం పిల్లలకు ఒక కొత్త అవకాశం.

ఉదా:

కానీ మనం తెలియకుండానే ఆ ప్రయాణాన్ని ఒక పందెంగా మార్చేస్తుంటాం.  ఒకసారి మన చిన్నతనాన్ని గుర్తు చేసుకుందాం. మనకు స్కూల్ అంటే కేవలం పరీక్షలే గుర్తున్నాయా? కాదు కదా!

మొదటి రోజు కొత్త క్లాస్‌రూమ్‌లోకి అడుగు పెట్టిన ఆనందం, కొత్త పుస్తకాల సువాసన, స్నేహితులతో పంచుకున్న టిఫిన్, మనల్ని ప్రోత్సహించిన ఒక టీచర్, ఇవే ఎక్కువగా గుర్తుంటాయి. ఎందుకంటే విద్య అంటే కేవలం మార్కులు కాదు కదా!

విద్య అంటే ఒక్క ఎదుగుదల, ఒక్క అనుభవం. విద్య అంటే మనిషిగా రూపుదిద్దుకోవడం. అందుకే ఈ కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో పిల్లలను అడగాల్సిన మొదటి ప్రశ్న..

“ఎన్ని మార్కులు తెస్తావు?” అని కాకపోవచ్చు.

బహుశా..

“ఈ ఏడాది ఏమి కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నావు?”, “ఏ విషయంలో ఎదగాలనుకుంటున్నావు?”, “ఈ సంవత్సరం నీకు ప్రత్యేకంగా ఎలా ఉండాలని అనిపిస్తోంది?” అనే ప్రశ్నలు కావచ్చు.

ఎందుకంటే పిల్లలకు అవసరమయ్యేది మరో పోటీ కాదు. తమ ప్రయాణంలో తమను నమ్మే ఒక తోడు.

మొదటి వారం రోజుల్లో తల్లిదండ్రులు చేయగలిగే మాయ

స్కూల్ ప్రారంభమైన మొదటి వారం రోజులు పిల్లలకు మాత్రమే కాదు, తల్లిదండ్రులకు కూడా ఒక కొత్త సర్దుబాటు కాలం. రోజంతా పరుగులు పెడుతూ సాయంత్రానికి అందరూ అలసిపోతారు.

అలాంటి సమయంలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మనం అడిగే మామూలు ప్రశ్నలు వారి చదువు గురించి హోంవర్క్‌ల గురించి కాకుండా వారి మనసులో ఏముంది వాళ్ళు ఏం అనుభవించారు అన్న రీతిలో అడిగితే, మీరు తల్లిదండ్రులుగా చేయగలిగే అతి ముఖ్యమైన గొప్ప పని అవుతుంది.

అందుకే మొదటి వారం రోజుల్లో తల్లిదండ్రులు చేయగలిగే గొప్ప పని.. సలహాలు ఇవ్వడం కాదు, వినడం.

ప్రతి రోజు కేవలం ఐదు నిమిషాలు కేటాయించండి. అంతే, ప్రత్యేక కార్యక్రమాలు అవసరం లేదు. వాళ్ల పక్కన కూర్చోండి, ఫోన్ను పక్కన పెట్టండి, టీవీని ఆపేయండి. వాళ్ల కళ్లలోకి చూస్తూ మాట్లాడండి. అప్పుడు ఈ మూడు ప్రశ్నలు అడగండి:

1. “ఈరోజు నీకు బాగా నచ్చిన విషయం ఏమిటి?”

ఈ ప్రశ్న పిల్లలను రోజు మొత్తంలో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకునేలా చేస్తుంది. వాళ్ల దృష్టిని ఆనందాల వైపు మళ్లిస్తుంది.

2. “నీకు ఏదైనా కష్టం అనిపించిందా?”

ఈ ప్రశ్న ఇంకా ముఖ్యమైనది. ఎందుకంటే చాలామంది పిల్లలు తమ ఇబ్బందులను తాము చెప్పరు.

ఎవరైనా ఆటపట్టించి ఉండవచ్చు, కొత్త టీచర్ గురించి భయంగా అనిపించి ఉండవచ్చు, కొత్త పాఠం అర్థం కాలేక నిరాశ చెందిన ఉండవచ్చు.

ఈ ప్రశ్న వాళ్లకు ఒక సందేశాన్ని ఇస్తుంది. “నీ సమస్యలు కూడా నాకు ముఖ్యమే.” అని.

3. “రేపు ఏం కోసం ఎదురు చూస్తున్నావు?”

ఈ ప్రశ్న పిల్లల మనసును భవిష్యత్తు వైపు ఆశతో చూడడం నేర్పిస్తుంది.

రేపు స్పోర్ట్స్ పీరియడ్ ఉండొచ్చు, స్నేహితుడిని కలవడం కావొచ్చు, డ్రాయింగ్ క్లాస్ కావొచ్చు, ఏదైనా చిన్న విషయం కావొచ్చు. కానీ ఎదురు చూడడానికి ఒక కారణం ఉండటం పిల్లల భావోద్వేగ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఈ మూడు ప్రశ్నలు బయటకు చూస్తే చాలా సాధారణంగా కనిపిస్తాయి. కానీ వాటి వెనుక ఒక గొప్ప సందేశం దాగి ఉంటుంది.

కొన్నిసార్లు పిల్లలకు సమస్యలకు పరిష్కారాలు అవసరం ఉండవు. వారిని పూర్తిగా వినే ఒక మనిషి అవసరం. మనం వెంటనే సలహాలు ఇవ్వకుండా, వెంటనే తీర్పులు చెప్పకుండా, వెంటనే పరిష్కారాలు సూచించకుండా, కేవలం వింటే చాలు. వారి మనసులో ఒక సురక్షితమైన స్థలం ఏర్పడుతుంది. అక్కడ వారు తమ విజయాలను పంచుకుంటారు. ఎందుకంటే వారికి ఒక విషయం అర్థమవుతుంది.

“నేను ఎలా ఉన్నా.. ఇంట్లో నన్ను వినే వాళ్లు ఉన్నారు.”

ఒక కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో పిల్లలకు లభించే గొప్ప బహుమతుల్లో అది కూడా ఒకటి.

చివరి మాట

ఈరోజు సాయంత్రం మీ పిల్లవాడు లేదా పిల్ల స్కూల్ బ్యాగ్ సర్దుకుంటూ ఉంటే.. ఒక్కసారి వారి పక్కన కూర్చోండి.

బ్యాగ్‌లో పుస్తకాలు ఉన్నాయా లేదా అని చూసే ముందు.. వారి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా ఒక ప్రశ్న అడగండి.

“నీ బ్యాగ్ సిద్ధమైంది.. కానీ నీ మనసు ఎలా ఉంది?”

ఆ ప్రశ్నకు వచ్చే సమాధానం.. కొత్త విద్యాసంవత్సరం గురించి మాత్రమే కాకుండా.. మీ పిల్లల మనసు గురించి కూడా మీకు చాలా విషయాలు చెబుతుంది.

ఎందుకంటే..

స్కూల్‌కు సిద్ధం కావాల్సింది కేవలం పిల్లల బ్యాగ్ కాదు. వారి మనసు కూడా.

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version