[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
‘నాకు స్కూల్‌కి వెళ్లాలని లేదు’ – ఒక 11 ఏళ్ల బాలుడి కథ
ఉదయం 6:30.
అమ్మ వంటగదిలో టిఫిన్ సిద్ధం చేస్తోంది. నాన్న ఆఫీసుకు వెళ్లడానికి తయారవుతున్నారు. స్కూల్ బస్సు రావడానికి ఇంకో నలభై నిమిషాలే ఉంది. ఇంతలో ఆ బాబు వచ్చి వాళ్ళ అమ్మతో:
“అమ్మా.. ఈరోజు స్కూల్‌కి వెళ్లాలని లేదు.”
అమ్మ: “ఏమైంది? జ్వరం ఉందా?”
బాబు: “లేదు.”
అమ్మ: “హోంవర్క్ చేయలేదా?”
బాబు: “లేదు.”
“అయితే ఎందుకు వెళ్లవు?”
ఆ బాలుడు సమాధానం చెప్పలేదు. తన రూంలోకి వెళ్లి, దుప్పటి కప్పుకుని తిరిగి పడుకున్నాడు.
అతనికి 11 సంవత్సరాలు. ఆరో తరగతి చదువుతున్నాడు.
అతని తల్లిదండ్రులు ఆందోళనపడ్డారు. కొంచెం కోపం కూడా వచ్చింది.
“ఇలా ఎలా కుదురుతుంది? ప్రతిరోజూ స్కూల్‌కి వెళ్లాల్సిందే కదా!”
ఆ రోజు బలవంతంగా పంపించారు.
మరుసటి రోజు/వారం మళ్లీ అదే మాట.
“అమ్మా.. నాకు స్కూల్‌కి వెళ్లాలని లేదు.”
మన ఇళ్లలో ఇలాంటి మాటలు వినిపించినప్పుడు మనం వెంటనే కారణాలు వెతకడం ప్రారంభిస్తాం.
- సోమరితనం.
- మొబైల్ ఎక్కువైంది.
- చదువు మీద ఆసక్తి తగ్గింది.
- కొత్త స్నేహితులు.
- క్రమశిక్షణ లేకపోవడం, మొదలగునవి.
కానీ కొన్నిసార్లు పిల్లలు చెప్పే “స్కూల్‌కి వెళ్లాలని లేదు” అనే మాటను మనం నేరుగా స్కూల్ సమస్యగా భావిస్తాం. కానీ నిజానికి ఆ మాట వెనుక ఉన్న కారణం స్కూల్ మట్టుకే కాకపోవచ్చు – అది వాళ్లు అనుభవిస్తున్న ఒక చిన్న బాధ, ఒక భయం, లేదా ఎవరికీ చెప్పలేని ఒక భావం కావచ్చు.
ఉదాహరణకు:
- కొన్ని నెలల క్రితం ఒక తల్లి నాతో మాట్లాడుతున్నారు. “మేడం, నా కొడుకు స్కూల్‌కి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ముందు చాలా బాగుండేవాడు. ఇప్పుడు ఉదయం లేవడం కూడా ఇష్టం ఉండటం లేదు.”
ఆ బాలుడితో మాట్లాడినప్పుడు మొదట ఏమీ చెప్పలేదు.
“అన్నీ బాగానే ఉన్నాయి” అన్నాడు.
కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా చెప్పాడు.
“టీచర్ అడిగిన ప్రశ్నకు తప్పుగా చెప్పాను. అందరూ నవ్వారు.”
మరొకసారి అన్నాడు:
“నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు ఇంకో గ్రూప్‌లో ఉన్నాడు.”
ఇంకొక మాట:
“నేను ఎంత చదివినా 95% రావడం లేదు.”
ఈ మూడు మాటలు పెద్దవాళ్లకు చిన్నవిగా అనిపించవచ్చు.
కానీ ఒక 11 ఏళ్ల పిల్లవాడి ప్రపంచంలో అవి చాలా పెద్ద విషయాలు.
- ఇంకో బాలుడి కథ.
తను ఆరో తరగతి చదువుతున్నాడు. ఉదయం స్కూల్‌కి వెళ్లే సమయానికి తరచుగా కడుపు నొప్పి వచ్చేది కొన్నిసార్లు తలనొప్పి కూడా వచ్చేది.
తల్లిదండ్రులు తనని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అన్ని పరీక్షలు సాధారణంగానే వచ్చాయి.
తర్వాత తెలిసింది ఏమిటంటే, క్లాసులో కొందరు పిల్లలు అతన్ని ఎగతాళి చేస్తున్నారు.
ప్రతి రోజు లంచ్ టైంలో ఒంటరిగా కూర్చునేవాడు.
ఎవరూ కొట్టలేదు, ఎవరూ పెద్దగా తిడలేదు.
కానీ ప్రతి రోజు అనుభవిస్తున్న ఆ చిన్న చిన్న బాధలు అతనికి స్కూల్ను భయంగా మార్చేశాయి.
మనం పెద్దవాళ్లం కదా – ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువైతే ఒకరోజు సెలవు తీసుకోవాలని అనిపిస్తుంది. మనల్ని అర్థం చేసుకోని టీమ్‌లో ఉంటే అసౌకర్యంగా ఫీలవుతాం, మీటింగ్లో ఎవరో మన మాటను పట్టించుకోకపోతే లేదా తప్పుగా మాట్లాడితే మనసు నొచ్చుకుంటుంది, సహోద్యోగులతో పోల్చితే మనలో అనుమానాలు మొదలవుతాయి. ఇలాంటి చిన్న చిన్న అనుభవాలే మన రోజును ప్రభావితం చేస్తాయి.
అదే భావాలు పిల్లలకు ఉండకూడదా? ఉంటాయి. కానీ వాళ్ల ప్రపంచంలో ఆ భావాలు ఇంకా గాఢంగా, ఇంకా గందరగోళంగా ఉంటాయి. వాళ్లకు ఏమి జరుగుతుందో అర్థం కాకపోయినా, లోపల ఏదో బరువుగా అనిపిస్తుంది. మాటల్లో చెప్పడానికి సరైన పదాలు ఉండవు, కానీ ఆ భావాలు మాత్రం నిజంగానే ఉంటాయి – భయం, అవమానం, ఒంటరితనం, తాము సరిపోమనే అనుమానం. అందుకే వాళ్లు చెప్పలేకపోతారు, కానీ అనుభవిస్తూనే ఉంటారు.
పిల్లలు “నాకు స్కూల్‌కి వెళ్లాలని లేదు” అని చెప్పినప్పుడు మనము సాధారణంగా అడిగే ప్రశ్నలు:
- “ఎందుకు?”
- “ఏమైంది?”
- “ఎవరు కొట్టారు?”
- “ఏ సమస్య?”
కాని, పిల్లలు చాలాసార్లు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు.
ఎందుకంటే వాళ్లకే అసలు సమస్య ఏమిటో పూర్తిగా అర్థం కాకపోవచ్చు.
అందుకే కొన్నిసార్లు మనం అడగాల్సిన ప్రశ్నలు వేరుగా ఉండాలి.
- “ఈ మధ్య నువ్వు చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు.”
- “స్కూల్లో ఏదైనా కష్టంగా అనిపిస్తోందా?”
- “నేను నిన్ను వినడానికి ఉన్నాను.”
- “మనం కలిసి ఆలోచిద్దామా?”
ఈ ప్రశ్నలు పిల్లల మనసుకు తలుపులు తెరుస్తాయి. ఎందుకంటే, అందరూ స్కూల్‌కి వెళ్లనని చెప్పే పిల్లలు:
- అందరూ బద్ధకస్తులే కాదు.
- అందరూ మొబైల్‌కి బానిసలే కాదు.
- అందరూ చదవాలనుకోనివాళ్లు కాదు.
- కొంతమంది పిల్లలు భయపడుతుంటారు.
- కొంతమంది పిల్లలు ఒత్తిడితో అలసిపోతారు.
- కొంతమంది పిల్లలు స్నేహితులను కోల్పోయి బాధపడుతుంటారు.
- కొంతమంది పిల్లలు తమపై పెట్టుకున్న అంచనాలను మోయలేకపోతుంటారు.
- కొంతమంది పిల్లలు కేవలం “ఎవరైనా నన్ను అర్థం చేసుకుంటారా?” అని ఎదురుచూస్తుంటారు.
పిల్లవాడు స్కూల్‌కి వెళ్లాలని లేదంటే వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. కానీ నిర్లక్ష్యం కూడా చేయకూడదు. మనము
- వినాలి.
- గమనించాలి.
- అతని టీచర్లతో మాట్లాడాలి.
- అతని దినచర్యను చూడాలి.
- అతని స్నేహితుల గురించి తెలుసుకోవాలి.
- ముఖ్యంగా, అతనికి ఒక సందేశం ఇవ్వాలి, “నువ్వు ఒంటరివి కాదు.” అని.
ఆ 11 ఏళ్ల బాలుడి ఉదాహరణను మళ్లీ గుర్తు చేసుకుందాం.
ఆ ఉదయం అతను “స్కూల్‌కి వెళ్లాలని లేదు” అన్నప్పుడు, తల్లిదండ్రులు వెంటనే కోపపడకుండా, కాస్త ఆగి అతని పక్కన కూర్చుంటే ఎలా ఉండేది?
“సరే, ఈరోజు వెళ్లకపోయినా పర్లేదు. కానీ నువ్వు ఇలా అనిపించడానికి కారణం ఏమిటో మనం కలిసి తెలుసుకుందాం” అని చెప్పి ఉంటే?
అతనికి ఒక చిన్న విరామం ఇచ్చి, ఆ రోజు అతనితో సమయం గడిపి, నెమ్మదిగా మాట్లాడి ఉంటే? వారికి, వాళ్ల భావాలను అంగీకరించే ఒక పెద్ద మనిషి అవసరం ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలకు వెంటనే పరిష్కారం అవసరం ఉండదు.
తల్లిదండ్రులు ఇలా స్పందించవచ్చు:
- “నువ్వు ఇలా అనిపించుకోవడం సరే.”
- “ఏదైనా కష్టం ఉంటే మనం కలిసి ఎదుర్కొందాం.”
- “నువ్వు చెప్పాలనిపించినప్పుడు నేను వినడానికి ఉన్నాను.”
ఈ మాటలు పిల్లలలో భయాన్ని తగ్గిస్తాయి, వాళ్లకు భద్రతను ఇస్తాయి.
అప్పుడు పిల్లలు నెమ్మదిగా తమ మనసులో ఉన్నదాన్ని బయటపెడతారు. అక్కడి నుంచే నిజమైన పరిష్కారం ప్రారంభమవుతుంది.
ఆ 11 ఏళ్ల బాలుడు కొన్ని వారాల తర్వాత తన తల్లితో ఒక మాట చెప్పాడు.
“అమ్మా.. నాకు స్కూల్‌కి వెళ్లాలని లేదని కాదు. అక్కడికి వెళ్లే ముందు కొంచెం ధైర్యం కావాలి.”
అతనికి అవసరమైంది కొత్త స్కూల్ కాదు, కొత్త ట్యూషన్ కాదు, ఇంకా ఎక్కువ ఒత్తిడి కాదు.
కేవలం తన మాట వినే ఒక పెద్ద మనిషి. తనకి అవసరమైనప్పుడు ధైర్యాన్ని ఇచ్చి, భుజం తట్టి ముందుకు నడిపించే తల్లిదండ్రులు.
అందుకే, ప్రతి “నాకు స్కూల్‌కి వెళ్లాలని లేదు” వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కథను మనం వినగలిగితే.. పిల్లలు మళ్లీ స్కూల్‌కి మాత్రమే వెళ్లరు తమ జీవితాన్ని కూడా తిరిగి నడవడం ప్రారంభిస్తారు,
ఎందుకంటే తల్లిదండ్రులు తనకిచ్చిన ధైర్యంతో వాళ్లు తన మీద ఉంచిన నమ్మకంతో వాళ్ళు ప్రపంచాన్నే గెలవగలమన్న నమ్మకంతో జీవితంలో ముందుకు వెళ్లడం ప్రారంభిస్తారు.
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.
