[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
మన చిన్నప్పటి వర్షాలు.. మన పిల్లల వర్షాలు?
(వర్షం మారలేదు.. కానీ వర్షాన్ని ఆస్వాదించే బాల్యం మారిపోయిందా?)
నిన్న సాయంత్రం వర్షం పడుతోంది.
బాల్కనీలో నిలబడి ఆ వర్షాన్ని చూస్తుంటే, ఎదురింట్లోని ఒక చిన్న బాబు వర్షం చూసి బయటికి రావడానికి వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు. కాని, ఆ బాబు వాళ్ల అమ్మ తనతో “బయటికి వెళ్లకు, జలుబు వస్తుంది” అని చెబుతోంది.
ఆ మాట విన్న వెంటనే నాకు నా చిన్నప్పటి వర్షాలు గుర్తొచ్చాయి.
మబ్బులు కమ్ముకుంటే స్కూల్ నుంచి ఇంటికి పరిగెత్తడం..
బురదలో జారి పడటం..
పేపర్ పడవలు వదలడం..
తడిసిన యూనిఫామ్‌తో అమ్మ దగ్గర తిట్లు తినడం..
కరెంట్ పోతే అందరం కలిసి కూర్చుని కథలు చెప్పుకోవడం..
వేడి వేడి బజ్జీల వాసన..
మన చిన్నప్పటి వర్షాలు కేవలం వర్షాలు కావు. అవి ఒక అనుభవం. ఒక బాల్యం. ఒక జీవితం.
అయితే మన పిల్లల వర్షాలు ఎలా ఉన్నాయి?
వర్షం అదే.. కానీ ప్రపంచం మారిపోయింది
మన చిన్నప్పుడు వర్షం పడితే బయటకు పరుగెత్తేవాళ్లం. మనకు వర్షం అంటే ప్రకృతి ఇచ్చే ఒక్క పెద్ద వరం, ఆటలు అడుకునే సమయం, బురదలో నవ్వులు, ఇంట్లో వాళ్లతో తిట్లు, వేడి వేడిగ బజ్జిలు, పునుకులు, వగైరా మరుపురాని మధురిమలు. అప్పటి సినిమాల్లో కూడా ఈ వర్షాకాలం గురించి మంచి మంచి మధురమైన పాటలు ఉండేవి.
కాని మరి ఇప్పుడో? ఇప్పుడు వర్షం పడితే తల్లిదండ్రులు ముందుగా ఆలోచించేది:
- జలుబు, ఫ్లూ, వైరల్ ఫీవర్లు వస్తాయేమో అన్న ఆందోళన..
- పిల్లలు తడిస్తే స్కూల్ మిస్ అవుతారేమో అన్న టెన్షన్..
- వర్షపు నీరు మురుగు కాలువలతో కలిసిపోతుందేమో అన్న భయం..
- చిన్నపాటి వర్షానికి మొదలయ్యే ట్రాఫిక్ జామ్లలో ఎక్కడ ఇరుక్కుపోతామో అన్న కంగారు..
మెట్రో నగరాల్లో ఒక వర్షం పడితే గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఇంటికి చేరుకోవడమే ఒక పెద్ద ప్రయాణంగా మారుతుంది. స్కూల్ బస్సులు ఆలస్యం అవుతాయి. పవర్ కట్లు మొదలవుతాయి, జనరేటర్లు పనిచేస్తాయో లేదో తెలీదు.
ఇది పిల్లల తప్పు కాదు. వాళ్లు పెరుగుతున్న ప్రపంచం పూర్తిగా భిన్నంగా ఉంది. అపార్ట్‌మెంట్లు, ట్రాఫిక్, కాలుష్యం, ఆరోగ్య భయాలు, ట్యూషన్లు, కోచింగ్లు, స్క్రీన్లు, సమయాభావం.. ఇవన్నీ కలిసి పిల్లల బాల్యాన్ని మారుస్తున్నాయి.
మన చిన్నప్పటి వర్షాల జ్ఞాపకాలు:
మన చిన్నప్పటి రోజులు గుర్తున్నాయా? ఎక్కువగా మనం స్కూల్‌కి నడుచుకుంటూనే వెళ్లే వాళ్ళం. వర్షం పడింది, అంటే ఒక్క గొడుగు కింద ఇద్దరు ముగ్గురు స్నేహితులు కలిసి పరుగులు పెట్టే వాళ్ళం. ఆ పరుగులో బురదలో జారిపడే వాళ్ళం, మన పుస్తకాలు సంచి తడిసిపోయేది, ఇంటికి వచ్చాక అమ్మ కోప్పడటము అంతా షరా మామూలే. కానీ వెంటనే తల తుడిచి, వేడి వేడి కషాయాలు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా మింగించడం కూడా గుర్తుకొస్తూనే ఉంటుంది కదా!!
ఎవరూ మనకు వర్షంలో తడవద్దు జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది, అని చెప్పలేదు. బట్టలు మురికి అవుతాయి అని కూడా మనకి ఎవరు గుర్తు చేయలేదు. ప్రకృతి మనకి ఎన్నో వింతలను చూపెట్టేది. కొత్త కొత్త పురుగుల్ని, కీటకాలన్నీ బయటికి పంపించేది. అందులో ఎంతమందికి ఆరుద్ర పురుగులు గుర్తున్నాయి? ఎర్రటి ఎరుపులో మిలమిలా మెరిసిపోతూ ఉండే ఆ మెత్తటి పురుగుల్ని పట్టుకోడానికి మనం ఎంత తాపత్రయపడే వాళ్ళమో గుర్తుంది కదా!! మన చిన్నతనంలో ప్రకృతిని మించిన గొప్ప స్నేహితురాలు మనకి ఇంకోళ్ళు లేరు!!
మన పిల్లల వర్షాలు:
ఇప్పటి పిల్లలు చెడు బాల్యం గడుపుతున్నారని కాదు. వాళ్ల బాల్యం వేరుగా ఉంది. ఇది కేవలం వారి ఎంపిక మాత్రమే కాదు.. పరిస్థితుల ప్రభావం కూడా.
అపార్ట్‌మెంట్లు, ట్రాఫిక్, భద్రతా భయాలు, ఖాళీ ప్రదేశాల కొరత, సమయాభావం – ఇవి అన్నీ కలిసి పిల్లలను బయట ప్రపంచం నుంచి కొంచెం దూరం చేస్తున్నాయి.
మనం చిన్నప్పుడు ఉన్నట్లుగా వీధుల్లో ఆడుకునే అవకాశం, చెట్ల కింద కూర్చునే సమయం, వర్షంలో పరుగెత్తే స్వేచ్ఛ- ఇవి ఇప్పుడు చాలా పిల్లలకు అందుబాటులో లేవు.
అందుకే వారు ఇప్పుడు వర్షం పడుతుంటే:
- యూట్యూబ్ చూస్తారు.
- గేమ్స్ ఆడుతారు.
- సిరీస్‌లు చూస్తారు.
- ఆన్లైన్ స్నేహితులతో మాట్లాడుతారు.
వారి ప్రపంచం ఇంటి గోడల మధ్యే ఎక్కువగా జరుగుతోంది. ప్రకృతితో సహజంగా కలిసిపోయే అవకాశాలు తగ్గిపోతున్నాయి.
కొన్నిసార్లు నేను తల్లిదండ్రులను అడుగుతుంటాను:
“మీ పిల్లలు చివరిసారి వర్షాన్ని ఎప్పుడు తాకారు?”
అనేకసార్లు సమాధానం ఉండదు.
వర్షాన్ని చూడటం ఒకటి, వర్షాన్ని అనుభవించడం మరోటి.
ఆ అనుభవం లేకపోతే, వర్షం కేవలం ఒక దృశ్యంగా మాత్రమే మిగిలిపోతుంది.. ఒక జ్ఞాపకంగా కాదు.
మనం కోల్పోయింది వర్షమా? లేక అనుభవమా?
ఈ ప్రశ్న కేవలం ఒక భావోద్వేగం కాదు, మన జీవనశైలిపై ఒక ఆలోచన. మనం నిజంగా కోల్పోయింది వర్షం కాదు, వర్షాన్ని అనుభవించే సామర్థ్యం. ప్రకృతితో కలిసిపోయే ఆ చిన్న చిన్న క్షణాలు. ఈ అనుభవాలు పిల్లల ఎదుగుదలలో ఎంతో ముఖ్యమైనవి. వర్షంలో తడవడం, మట్టిలో ఆడుకోవడం, ప్రకృతిని దగ్గరగా చూడడం వంటి అనుభవాలు పిల్లలకు కేవలం ఆనందం మాత్రమే కాదు, వారి శారీరక, మానసిక, భావోద్వేగ వికాసానికి కూడా అవసరం.
ఇలాంటి అనుభవాలు పిల్లలకు ఎందుకు అవసరం అంటే:
- ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది, ఇది వారి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.
- స్క్రీన్ల నుంచి దూరంగా ఉండే అవకాశం లభిస్తుంది, ఇది వారి దృష్టి మరియు ఆరోగ్యానికి మంచిది.
- సృజనాత్మకత పెరుగుతుంది – పేపర్ పడవలు, బురదలో ఆటలు వంటి చిన్న విషయాలు కూడా ఊహాశక్తిని పెంచుతాయి.
- ఒత్తిడి తగ్గుతుంది – ప్రకృతిలో గడిపే సమయం పిల్లలలో ఆనందాన్ని, ఉల్లాసాన్ని పెంచుతుంది.
- కుటుంబంతో గడిపే సమయం పెరుగుతుంది, ఇది బంధాలను బలపరుస్తుంది.
అందుకే, మనం కోల్పోయింది వర్షం కాదు – ఆ వర్షాన్ని ఆస్వాదించే మనసు. ఆ అనుభవాలను మన పిల్లలకు అందించడం మన బాధ్యత.
ఒకసారి ఒక తల్లి తన పదకొండేళ్ల కుమారుడి గురించి చెప్పింది.
“వర్షం పడుతోంది. బయటకు రా అన్నాను. ‘ఎందుకు?’ అని అడిగాడు.”
ఆ ప్రశ్నలోనే తరం మార్పు కనిపిస్తుంది.
మనం బయటకు వెళ్లడానికి కారణం వెతకలేదు.
వర్షమే కారణం, ప్రకృతే ఆహ్వానం.
ఇప్పుడు పిల్లలకు ప్రతి పనికీ ఒక కారణం కావాలి. ఎందుకంటే, వారికి అనుభవాల కంటే సమాచారం ఎక్కువైంది.
మనం ఏమి చేయగలం?
ఈ ప్రశ్నకు ఒకే ఒక సరైన సమాధానం ఉండదు. కానీ చిన్న చిన్న మార్పులతో మన పిల్లల బాల్యంలో కొంత ప్రకృతి, కొంత అనుభవం, కొంత నెమ్మదితనం తిరిగి తీసుకురాగలం.
మనకు గుర్తుండే వర్షపు జ్ఞాపకాలు ఎలా సహజంగా వచ్చాయో, అలాగే మన పిల్లలకు కూడా కొన్ని అనుభవాలు ఇవ్వడానికి మనం ప్రయత్నించవచ్చు.
• సమయం ఇవ్వడం
పిల్లలతో గడిపే సమయం కేవలం “హోంవర్క్ చూసుకోవడం” లేదా “ట్యూషన్‌కి తీసుకెళ్లడం” మాత్రమే కాకుండా, కలిసి ఏమీ చేయకుండా కూర్చునే సమయంగా కూడా ఉండాలి.
• ప్రకృతితో పరిచయం చేయడం
వర్షం పడుతుంటే కిటికీ మూసేయకుండా, కొద్దిసేపు తెరిచి ఉంచండి. చినుకులు పడుతున్న శబ్దం వినిపించనివ్వండి. మట్టి వాసనను అనుభవించనివ్వండి.
• చిన్న అనుభవాలను సృష్టించడం
పేపర్ పడవలు చేయడం, బాల్కనీలో కూర్చుని వర్షం చూడడం, వేడి బజ్జీలు కలిసి తినడం – ఇవి చిన్న విషయాలే అయినా, పెద్ద జ్ఞాపకాలుగా మారతాయి.
• స్క్రీన్లకు కొద్దిసేపు విరామం ఇవ్వడం
వర్షం పడుతున్నప్పుడు “ఇంకో వీడియో” కాకుండా “ఇంకో క్షణం” ఇవ్వండి. ఫోన్లు పక్కన పెట్టి, ఆ క్షణాన్ని కలిసి ఆస్వాదించండి.
• భయాల్ని కొంచెం తగ్గించడం
పూర్తిగా నియంత్రించలేని ప్రపంచంలో ఉన్నప్పటికీ, ప్రతి చిన్న విషయానికి “జలుబు వస్తుంది”, “మురికి అవుతుంది” అని ఆపకుండా, సురక్షితంగా ఉండే పరిమితుల్లో పిల్లలను అనుభవించనివ్వాలి.
• మన కథలు చెప్పడం
మన చిన్నప్పటి వర్షాల గురించి చెప్పండి. మనం ఎలా ఆడుకున్నామో, ఎలా తడిసామో, ఎలా నవ్వుకున్నామో చెప్పండి. ఆ కథలు పిల్లల్లో ఆసక్తిని రేపుతాయి.
• బోర్ అయ్యే అవకాశం ఇవ్వడం
ప్రతి క్షణం ప్లాన్ చేయకుండా, కొన్నిసార్లు పిల్లలు ఏమీ చేయకుండా ఉండనివ్వండి. అదే సమయంలో వారు కొత్తగా ఏదో కనుగొంటారు.
ఇవి పెద్ద మార్పులు కావు. కానీ ఈ చిన్న ప్రయత్నాలే పిల్లల బాల్యంలో ఒక కొత్త రంగు నింపగలవు. మన చిన్నప్పటి వర్షాలను తిరిగి తీసుకురాలేము. కానీ మన పిల్లల వర్షాలను కొంచెం అందంగా, కొంచెం అనుభవాలతో నింపగలం.
ముగింపుగా:
ఇరవై సంవత్సరాల తర్వాత మన పిల్లలు ఏమి గుర్తు పెట్టుకోవాలి అని మీరు అనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి:
- “ఆ వర్షం రోజు అమ్మతో కలిసి బజ్జీలు తిన్నాం..”
- “నాన్నతో కలిసి పేపర్ పడవలు వదిలాం..”
- “అందరం కలిసి బాల్కనీలో కూర్చున్నాం..”
అని చెబుతారా?, లేక,
“ఆ రోజు కూడా ఫోన్ చూసుకుంటూ గడిచిపోయింది” అని చెబుతారా?
ఈ ప్రశ్నకు సమాధానం మన చేతుల్లోనే ఉంది. గుర్తుపెట్టుకోండి:
వర్షం మారలేదు, మేఘాలు మారలేదు, చినుకులు మారలేదు,
మారింది మన జీవనశైలి, మారింది బాల్యం.
మన చిన్నప్పటి వర్షాలు ఇప్పుడు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.
మన పిల్లల వర్షాలు మాత్రం ఇంకా రాయబడాల్సిన కథలు.
ఆ కథల్లో కొంచెం మట్టి వాసన, కొంచెం బజ్జీల సువాసన, కొంచెం కుటుంబపు నవ్వులు, కొంచెం వర్షపు చినుకులు ఉండేలా మనం చూసుకోగలిగితే..
ఒక రోజు వారు కూడా చెప్పవచ్చు:
“మా చిన్నప్పటి వర్షాలు చాలా అందంగా ఉండేవి..”
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.
