Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-72

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

ప్రియమైన తల్లిదండ్రులకు.. మీ పిల్లలు మాట్లాడటం మానేయడానికి ముందు

ఒకప్పుడు..

“అమ్మా.. ఇవాళ స్కూల్లో ఏమైందో తెలుసా?”

“నాన్నా.. మా క్లాస్లో ఈరోజు ఎంత ఫన్నీగా జరిగిందో చెబుతా!”

“అమ్మా.. ఒక విషయం చెప్పాలి..”

అంటూ చిన్న చిన్న విషయాలకైనా మీ చుట్టూ తిరిగే మీ పిల్లలు..

ఒక రోజు.. “ఏం లేదు”, “బాగానే ఉంది”, “పర్లేదు.”

అనే మూడు మాటలకే పరిమితమైపోతారు. మొదట్లో అది పెద్దగా కనిపించదు.

“పెద్దవాళ్లు అవుతున్నారు..”

“వాళ్ల ప్రపంచం వాళ్లది..”

“ఈ వయసులో అంతే..”

అని మనమే మనల్ని ఓదార్చుకుంటాం. కానీ, ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. పిల్లలు నిజంగా మాట్లాడటం మానేస్తారా? లేక..

ఎవరితో మాట్లాడితే తమను అర్థం చేసుకుంటారో.. వాళ్లను మాత్రమే ఎంచుకోవడం మొదలుపెడతారా?

ఈ ప్రశ్నకు సమాధానం దొరికిన రోజు..

పేరెంటింగ్ గురించి మనం అనుకున్న ఎన్నో విషయాలు కొత్త అర్థాన్ని సంతరించుకుంటాయి.

మన పిల్లలు మనతో ఎంత మాట్లాడుతున్నారన్నది కంటే.. వాళ్లు మనతో ఏ విషయాలు మాట్లాడడానికి సురక్షితంగా భావిస్తున్నారన్నదే ఒక బలమైన సంబంధానికి అసలు కొలమానం.

పిల్లలు ఒక్కరోజులో మాట్లాడటం మానేయరు..

చాలామంది తల్లిదండ్రులు ఒకే మాట చెబుతుంటారు.

“చిన్నప్పుడు అన్నీ చెప్పేవాడు.. ఇప్పుడు ఏమీ చెప్పడు.”

నిజానికి, ఈ మార్పు ఒక్కరోజులో జరగదు. ఏ పిల్లవాడూ ఒక ఉదయం నిద్రలేచి.. “ఇప్పటి నుంచి అమ్మానాన్నలతో మాట్లాడకూడదు.” అని నిర్ణయించుకోడు.

అది చాలా నెమ్మదిగా జరిగే ప్రయాణం.

ఒక రోజు.. తాను చెప్పిన కథ మధ్యలోనే ఆపి, “సరే.. తర్వాత?” అని తొందరపెట్టినప్పుడు.

మరో రోజు.. తాను చేసిన చిన్న తప్పుకు.. పూర్తిగా వినకముందే మందలింపు ఎదురైనప్పుడు.

ఇంకో రోజు.. తన భావం వినటానికి బదులు, సలహా మాత్రమే దొరికినప్పుడు.

మరొకసారి..”నీ వయసులో నేను..” అనే పోలిక మొదలైనప్పుడు.

అలా.. ప్రతి చిన్న అనుభవం తన మనసులో ఒక చిన్న ప్రశ్నను వదిలి వెళ్తుంది.

“ఇది చెప్పడం నిజంగా సురక్షితమేనా?”

ఆ ప్రశ్నకు సమాధానం ఒక్క సంఘటనతో రాదు. రోజూ జరిగే వందల చిన్న చిన్న సంభాషణలు, ఆ సమాధానాన్ని నెమ్మదిగా రాస్తుంటాయి. అందుకే, పిల్లలు మాట్లాడటం మానేయరు.

ఎక్కడ తమ మాటకు విలువ ఉంటుందో.. అక్కడే తమ మనసును తెరవడం మొదలుపెడతారు.

పిల్లలు మన మాటలు గుర్తుపెట్టుకోరు..

మన దగ్గర ఎలా అనిపించేదో మాత్రం ఎప్పటికీ మర్చిపోరు.

మనం చాలాసార్లు అనుకుంటాం..

“నేను తన మంచికే చెప్పాను.”

అది నిజమే కావచ్చు. కానీ..

పిల్లలు ప్రతి సంభాషణ తర్వాత మన మాటలను మాత్రమే గుర్తుపెట్టుకోరు.

ఆ సంభాషణలో.. మన దగ్గర తమకు ఎలా అనిపించిందో కూడా గుర్తుపెట్టుకుంటారు.

తమ మాట పూర్తిగా వినబడిందా?

తప్పు చేసినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా?

భయపడకుండా నిజం చెప్పగలిగారా?

లేక..

మాట పూర్తయ్యేలోపే తీర్పు వచ్చేసిందా?

ఈ ప్రశ్నలకు పిల్లలు మాటల్లో సమాధానం చెప్పకపోవచ్చు.

కానీ..

వారి మనసు మాత్రం ప్రతి సంభాషణ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది.

“మరోసారి కూడా ఈ విషయం అమ్మతో చెప్పొచ్చా?”

“నాన్నతో ఇలా మనసు విప్పి మాట్లాడటం సురక్షితమేనా?”

అని నిశ్శబ్దంగా తమలో తాము నిర్ణయించుకుంటారు.

అదే వారికి కావాల్సిన భావోద్వేగ భద్రత.

భయపడకుండా, తప్పుగా అర్థం చేసుకుంటారేమో అనే ఆందోళన లేకుండా,

తీర్పు తీర్చేస్తారేమో అనే భయం లేకుండా, తన మనసులోని మాట చెప్పగలననే నమ్మకం.

ప్రతి పిల్లవాడికి ఈ నమ్మకం అవసరం.

ఎందుకంటే, పిల్లలకు ప్రతిసారీ పరిష్కారం అవసరం ఉండదు. చాలాసార్లు..

తమ మాట పూర్తయ్యే వరకు వినే ఒక మనిషి చాలు.

పిల్లలు మన దగ్గర నిజం చెప్పడానికి ధైర్యం చేస్తే..అది మన పేరెంటింగ్ విజయానికి మొదటి గుర్తు.

చిన్న చిన్న సంభాషణలే.. పెద్ద పెద్ద నమ్మకాలకు పునాది

ఒక తండ్రి ప్రతిరోజూ తన కొడుకుని క్రికెట్ ప్రాక్టీస్‌కి తీసుకెళ్లేవాడు.

ప్రాక్టీస్ ముగిసాక, ఇంటికి వెళ్లేటప్పుడు, ఆ తండ్రి ఒకే ఒక ప్రశ్నను అడిగేవారు.

“ఈరోజు ప్రాక్టీస్ ఎలా జరిగింది?”

కొడుకు కూడా ఒకే సమాధానం.

“బాగుంది.”

మరుసటి రోజు కూడా అదే.

మళ్లీ..”ప్రాక్టీస్ ఎలా జరిగింది?”,

“బాగుంది.”

రోజులు గడిచిపోయాయి.

ఒకరోజు ఆ తండ్రి ఏ ప్రశ్నా అడగలేదు.

కారు నడుపుకుంటూ వెళ్తూ..”ఈరోజు రోడ్డంతా ట్రాఫిక్‌గా ఉంది కదా..” అని అన్నాడు.

అంతే. కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత..

కొడుకే మాట్లాడటం మొదలుపెట్టాడు.

“ఈరోజు కోచ్ ఒక కొత్త డ్రిల్ చేయించాడు., మొదట బాగా రాలేదు, కాని ఆ తర్వాత మాత్రం బాగానే చేశాను. అసలు ఏమి జరిగిందో తెలుసా..”  అంటూ..

ఆ రోజు జరిగిన విషయాలన్నీ తనంతట తానే చెప్పడం మొదలుపెట్టాడు.

ఆ తండ్రి ఆ రోజు ఒక విషయం అర్థం చేసుకున్నాడు.

పిల్లలు ప్రతిసారీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలనుకోరు.

కొన్నిసార్లు.. మాట్లాడడానికి ఒక ప్రశాంతమైన స్థలం మాత్రమే కోరుకుంటారు.

మనం అడిగే ప్రశ్నల కంటే.. మన దగ్గర వారికి కలిగే అనుభూతే ఎక్కువ మాట్లాడిస్తుంది.

ఎందుకంటే.. పిల్లలు పెద్ద సమస్యలతో ఒక్కసారిగా మన దగ్గరకు రారు.

ముందు.. చిన్న చిన్న విషయాలతో వస్తారు.

చిన్న చిన్న సంభాషణలను మనం ఎలా స్వీకరిస్తామో.. పెద్ద పెద్ద విషయాలను పిల్లలు మనతో పంచుకోవాలా వద్దా అన్నది అదే నిర్ణయిస్తుంది.

పెద్ద విషయాలు చెప్పే పిల్లలు, ముందుగా చిన్న విషయాలు చెప్పడం నేర్చుకుంటారు.

మనలో చాలామంది ఇలా అనుకుంటుంటాం. “పిల్లలు పెద్ద సమస్య వచ్చినప్పుడు చెబుతారు.”  కానీ, అది చాలాసార్లు నిజం కాదు.

పిల్లలు తమ జీవితంలోని పెద్ద సమస్యలతో ఒక్కసారిగా మన దగ్గరకు రారు. ముందు..

ఆ చిన్న చిన్న సంభాషణలు, మనకు సాధారణంగా అనిపించవచ్చు. కానీ, పిల్లలకు అవి సాధారణ సంభాషణలు కావు.

అవి తమ మనసు తలుపులు కొద్దికొద్దిగా తెరిచే ప్రయత్నాలు. ఆ సమయంలో..

మొదలగునవి రేపు మరింత పెద్ద విషయంతో కూడా మన దగ్గరకు రావాలా వద్దా అన్న నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది.  అందుకే..

చిన్న చిన్న సంభాషణలను ఎప్పుడూ చిన్నవిగా చూడకండి. అవి..

ఒక బలమైన సంబంధానికి మొదటి మెట్లు.

ఒకరోజు..

మీ పిల్లలు తమ జీవితంలోని అత్యంత క్లిష్టమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకున్నప్పుడు..

ఆ నిర్ణయం ఆ రోజు తీసుకున్నది కాదు.

అది.. ఇలాంటి వందల చిన్న చిన్న సంభాషణల్లో నెమ్మదిగా ఏర్పడిన నమ్మకం.

పిల్లలు తమ జీవితంలోని పెద్ద విషయాలను ఒక్కసారిగా మనతో పంచుకోరు. ముందు.. చిన్న విషయాలతో మన స్పందనను అర్థం చేసుకుంటారు.

చివరగా.. ఒక చిన్న మనవి

ప్రియమైన తల్లిదండ్రులారా..

ఈరోజు మీ పిల్లలు మీతో ఏదైనా చెప్పడానికి వస్తే, అది ఎంత చిన్న విషయమైనా, ఒక్కసారి ఆగి వినండి.

కొన్నిసార్లు..

మన పిల్లలకు కావలసింది సమాధానం కాదు.

తమ మాట పూర్తయ్యే వరకు వినే ఒక మనిషి.

ఈరోజు మీరు వారికి ఇచ్చే ఆ కొన్ని నిమిషాల సమయం..

రేపు వారు తమ జీవితంలోని అత్యంత ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ధైర్యాన్ని ఇవ్వవచ్చు. ఎందుకంటే, పిల్లలు మనతో మాట్లాడాలని నిర్ణయించుకునేది..

మన దగ్గర అన్ని సమాధానాలు ఉన్నాయని కాదు.

తమ మాటలకు మన దగ్గర విలువ ఉందనే నమ్మకం ఉన్నప్పుడు.

ఆ నమ్మకాన్ని, ప్రతి రోజూ, ప్రతి చిన్న సంభాషణలో, మనమే నిర్మించాలి.

ఎందుకంటే, ఒకరోజు పిల్లలు మాట్లాడటం మానేయడానికి ముందే…

వాళ్లు మనతో మాట్లాడటం సురక్షితమని మనమే వారికి అనిపించాలి.

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version