Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-77

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

యశోద కృష్ణుడిని పెంచలేదు.. అతనితో కలిసి ఎదిగింది.

మన పిల్లలు మన జీవితంలోకి వచ్చిన తర్వాత.. మనం కూడా మారిపోయామా?

ఒక్కసారి పాత ఫోటో ఆల్బమ్ తెరిచి చూడండి.

పదిహేను.. ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న మీ ఫోటో కనిపిస్తే, కాసేపు నిశ్శబ్దంగా గమనించండి.

ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి.. ఇప్పటి మీరేనా?

బహుశా ముఖం అదే కావచ్చు. పేరు కూడా అదే కావచ్చు.

కానీ మనసు? అది మాత్రం ఎంతగానో మారిపోయి ఉంటుంది..

♦ ఒకప్పుడు చిన్న విషయానికే కోపం వచ్చేది.

ఇప్పుడు ఆ కోపాన్ని మింగేయడం నేర్చుకున్నారు.

♦ ఒకప్పుడు మీ గురించి మాత్రమే ఆలోచించేవారు.

ఇప్పుడు మీ రోజు మొదలయ్యేది “పిల్లలు లేచారా?” అనే ఆలోచనతోనే.

♦ ఒకప్పుడు విజయాన్ని పెద్ద పెద్ద లక్ష్యాలతో కొలిచేవారు.

ఇప్పుడు పిల్లలు నవ్వితే.. ప్రశాంతంగా నిద్రపోతే.. ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తే.. అదే ఒక గొప్ప విజయంగా అనిపిస్తోంది.

ఎవరూ మనకు ఈ మార్పులను ప్రత్యేకంగా నేర్పలేదు. జీవితమే నేర్పిందని అనుకుంటాం. కానీ నిజంగా ఆలోచిస్తే..

మనల్ని మారమన్నది జీవితం కాదు కానీ మార్చింది మన పిల్లలు.

వాళ్లను పెంచుతున్నామనుకున్న మనల్ని కూడా.. మన పిల్లలే నెమ్మదిగా, కనిపించకుండా, కొత్త మనుషులుగా మలుస్తూనే ఉన్నారు.

యశోద మనకు నేర్పిన గొప్ప సత్యం

ఈ సత్యాన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక తల్లి జీవించింది.

ఆమె పేరు.. యశోద.

ప్రపంచం ఆమెను ‘కృష్ణుడి తల్లి’గా గుర్తుంచుకుంది.

కానీ యశోద గొప్పతనం కేవలం కృష్ణుడిని పెంచడంలో లేదు..

కృష్ణుడితో కలిసి.. తాను కూడా ఎదగడంలో ఉంది.

కానీ ఆమెకు మాత్రం..

అతను.. ‘తన గారాల పట్టి, తన కృష్ణుడు’

అతనిలో ఆమె చూసింది ప్రపంచాన్ని ఏలే పరమాత్మడిని కాదు..

తన బిడ్డనే.. బహుశా అందుకే..

ప్రపంచం వేలాది తల్లుల గురించి మర్చిపోయినా..

యశోదను మాత్రం ఈ రోజుకీ గుర్తుంచుకుంది.

కృష్ణుడు ఎవరో యశోదకు తెలియదు.

ఆయన భవిష్యత్తు ఏమిటో ఆమెకు తెలియదు.

ఒక రోజు ప్రపంచమంతా ఆయనను భగవంతుడిగా పూజిస్తుందన్న విషయం కూడా ఆమెకు తెలియదు.

ఆమెకు తెలిసింది ఒక్కటే.

ఇతను నా బిడ్డ.’

అందుకే, యశోద కృష్ణుడిని గొప్పవాడిని చేయాలని పెంచలేదు. ఆమె చేసిన పని ఒక్కటే..

మిగతాదంతా.. జీవితమే అతనికి నేర్పించింది.

అదే జీవితం.. యశోదను కూడా ఒక గొప్ప తల్లిగా తీర్చిదిద్దింది.

కానీ ఆ ప్రయాణంలో.. కృష్ణుడు కూడా యశోదకు ఎన్నో నేర్పించాడు.

ప్రేమకు హద్దులు ఉండవని..

బిడ్డను పూర్తిగా మనం అర్థం చేసుకోలేమని..

కొన్నిసార్లు పిల్లలను నడిపించడం కంటే, వారితో పాటు నడవడమే గొప్పదని.

యశోద కృష్ణుడి గొప్పతనాన్ని చూసి ప్రేమించలేదు..

ప్రేమించినందువల్లే అతని గొప్పతనాన్ని చూడగలిగింది.

మన ఇంట్లో కూడా ప్రతి రోజూ ఇదే జరుగుతోంది

యశోద కథ వేల సంవత్సరాల క్రితం జరిగింది.

కానీ ఆమె నేర్చుకున్న పాఠాలు మాత్రం ఈ రోజుకీ ప్రతి ఇంట్లో నిశ్శబ్దంగా జరుగుతూనే ఉన్నాయి.

మనం పిల్లలను పెంచుతున్నామని అనుకుంటాం.

అంతా మనమే చేస్తున్నామని అనిపిస్తుంది. కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే..

మన పిల్లలు కూడా మనకు ఎన్నో నేర్పించిన సందర్భాలు గుర్తుకు వస్తాయి.

నేను ఒకప్పుడు అనుకునేదాన్ని..

“నా బిడ్డను మంచి మనిషిగా తీర్చిదిద్దాలి.”

కానీ ఇప్పుడు అనిపిస్తోంది..

నా బిడ్డ కూడా నన్ను ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దుతున్నాడు.

బహుశా..

అదే యశోద మనకు నేర్పిన గొప్ప సత్యం.

పేరెంటింగ్ అంటే పిల్లలను పెంచడం కాదు..
పిల్లలతో పాటు మనం కూడా ఎదగడం..

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version