[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
“అమ్మా.. నాకు ఏమీ కాలేదు” అన్నాడు. కానీ అతని మౌనం చాలా చెప్పింది..
రోజూ ఇంట్లోకి అడుగుపెట్టగానే స్కూల్లో జరిగిన విషయాలన్నీ చెప్పే పిల్లాడు.. ఆ రోజు మాత్రం నిశ్శబ్దంగా తన బ్యాగ్ను ఒక మూలన పెట్టాడు. అమ్మకు ఏదో తేడాగా అనిపించి, అడిగితే, ఏమీ కాలేదు అమ్మా, అని తన గదిలోకి వెళ్లిపోయాడు.
అమ్మ మరోసారి అడిగింది, “స్కూల్లో ఏమైనా జరిగిందా?” అని. కానీ, ఆ పిల్లవాడు మాత్రం “లేదమ్మా.. ఏమీ కాలేదు,” అంటూ మౌనం వహించాడు.
మాటల్లో ఏమీ లేదు. కానీ ఆ మౌనంలో మాత్రం చాలా దాగి ఉంది.
ఆ రోజు అతని ముఖంలో కనిపించిన నిరుత్సాహం, మామూలుగా ఉండే ఉత్సాహం లేకపోవడం, భోజనం చేస్తున్నప్పుడు కూడా ఏదో ఆలోచనలో ఉండటం.. ఇవన్నీ అమ్మకు ఒక విషయం చెబుతున్నాయి.
“ఏదో జరిగింది.” కానీ ఏమైంది?
అది తెలుసుకోవడానికి ఆమె ఇంకా ఎన్ని ప్రశ్నలు అడగాలి? లేక.. ప్రశ్నలు అడగడం ఆపి, కొంచెం వేచి చూడాలా?
“ఏమీ కాలేదు” అన్న మాట వెనుక.. ఏముంది?
మన పిల్లలు ఇలా చెప్పడం మనం చాలా సార్లు వింటూనే ఉంటాం.
- “ఏమైంది?” – “ఏమీ కాలేదు.”
- “ఎందుకు మౌనంగా ఉన్నావు?” – “ఏమీ లేదు.”
- “ఎవరైనా ఏమైనా అన్నారా?” – “లేదు.”
మనకు మాత్రం అర్థం కాదు. “ఏమీ కాలేదంటే.. మరి ఎందుకిలా ఉన్నాడు?”
అక్కడే మనలోని పేరెంట్ నిద్రలేచి మా పిల్లవాడికి ఏమైంది ఎందుకు ఇలా అయింది అని ఆలోచనలో పడి మన పిల్లల మీద ప్రశ్నల వర్షాన్ని కురిపించడం మొదలు పెడతాము.
ఎవరైనా ఏమైనా అన్నారా, టీచర్ మందలించారా, స్నేహితులతో ఏమైనా గొడవ జరిగిందా, మార్క్స్ తగ్గాయా, ఎవరైనా నవ్వారా?
ఇలా ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మన ఉద్దేశం తప్పు కాదు. పిల్లవాడి బాధ తెలుసుకోవాలి, అతనికి సహాయం చేయాలి.
కానీ..
మన ప్రశ్నల వేగానికి, పిల్లవాడి మనసు సిద్ధంగా ఉండకపోవచ్చు.
ఆ రోజు అసలు ఏం జరిగింది?
ఆ రోజు స్కూల్లో టీచరు ఆ పిల్లవాడికి ఒక యాక్టివిటీ ఇచ్చారు. యాక్టివిటీలో భాగంగా, అతను అందరి ముందు మాట్లాడాల్సి వచ్చింది.
అందరి ముందు మాట్లాడటం వల్ల కలిగిన చిన్న బెరుకు కారణంగా, అతను ముందుగా సిద్ధం చేసుకున్న కొన్ని విషయాలను మర్చిపోయాడు. దాంతో కొంచెం తడబడ్డాడు. ఆ తడబాటును చూసి అతని స్నేహితుల్లో ఇద్దరు నవ్వారు.
టీచర్ మాత్రం “బాగానే చెప్పావు” అని అన్నారు. అంతకుమించి పెద్దగా ఏమీ మాట్లాడలేదు.
బయటి నుంచి చూస్తే.. నిజంగా చెప్పాలంటే, అదేమీ పెద్ద సమస్య కాదు.
అందరి ముందు మాట్లాడేటప్పుడు కలిగిన చిన్న సంకోచం.. దాని వల్ల తడబడటం.. స్నేహితులు నవ్వడంతో కొంచెం ఇబ్బందిగా, అవమానంగా అనిపించడం.. అంతే.
మామూలుగా చూస్తే, కొన్ని నిమిషాల్లో మర్చిపోయే ఒక చిన్న సంఘటన.
కానీ పిల్లవాడి మనసులో మాత్రం అది అక్కడితో ఆగలేదు.
- “అందరూ నా గురించి ఏమనుకున్నారో?”
- “నేను ఎందుకు ఇలా చేశాను?”
- “నేను బాగా చేయలేకపోయాను.”
- “మళ్లీ అందరి ముందు మాట్లాడమంటే?”
ఇలా ఎన్నో ఆలోచనలు అతని మనసులో తిరగసాగాయి. ఒక చిన్న సంఘటన.. అతని మనసులో ఒక పెద్ద కథగా మారసాగింది.
ఎందుకంటే, సంఘటన చిన్నదే కావచ్చు. కానీ ఆ సంఘటన వల్ల పిల్లవాడి మనసులో కలిగిన భావన మాత్రం లోతైనదై, అతని ఆలోచనలను, ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేసేదిగా మారవచ్చు.
మౌనం వెనుక ఉన్న భయాన్ని అమ్మ ఎలా వినగలిగింది?
ఆ రోజు అమ్మకు తన కొడుకు మౌనం ఏదో చెబుతున్నట్టే అనిపించింది. అతను ఏమీ కాలేదన్నాడు. కానీ.. అతను ఎందుకు అలా ఉన్నాడు?
స్కూల్లో జరిగిన ఆ చిన్న సంఘటన గురించి అమ్మకు తెలియదు. ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే – తన కొడుకు మనసులో ఏదో జరుగుతోంది.
అయితే ఆ సమయంలో ఆ అమ్మకు తెలియని విషయం మరొకటి ఉంది. ఆ పిల్లవాడిని బాధపెట్టింది ఆ రోజు జరిగిన సంఘటన మాత్రమే కాదు. ఆ సంఘటన చుట్టూ అతని మనసు నిర్మించుకున్న కథ కూడా.
“నేను అందరి ముందు నేను తడబడ్డాను, స్నేహితులు నా గురించి నవ్వారు, నేను ఇలా చేస్తే అందరూ ఏమనుకుంటారు, మళ్లీ అందరి ముందు మాట్లాడమంటే నేను చేయగలనా?”
అతని మనసులో తిరుగుతున్న అసలు ప్రశ్నలు ఇవే.
ఆ పిల్లవాడికి తన మనసులో తిరుగుతున్న ప్రశ్నలన్ని వాళ్ళ అమ్మతో పంచుకోవాలని ఉంది కానీ, అమ్మకు చెబితే?
“అంత చిన్న విషయానికే ఎందుకు బాధపడుతున్నావు?” అంటుందేమో, లేకపొతే, “ఇంకాస్త బాగా సిద్ధమై ఉండాల్సింది కదా!” అంటుందేమో.
లేదా, “ఇలా ఉంటే ఎలా?” అని నిరాశపడుతుందేమో, అన్న ఆలోచనలలో అతను తన మనసులోని మాటను బయటకు తీసుకురాకుండా..
“అమ్మా.. నాకు ఏమీ కాలేదు” అని చెప్పేశాడు.
అమ్మ అతన్ని మళ్లీ అడగాలనుకుంది, కానీ ఆమెకు అనిపించింది తన ప్రశ్నలకు సమాధానం చెప్పించుకోవడం కంటే..
తన ప్రశ్నలకు సమాధానం చెప్పించుకోవడం కంటే, తన కొడుకుకు తనతో మాట్లాడాలనే నమ్మకం కల్పించడం ముఖ్యమని ఆమెకు అనిపించింది. అందుకే అతని పక్కన వెళ్లి కూర్చుంది. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత మెల్లగా అంది..
“సరే నాన్నా.. ఇప్పుడే చెప్పాలని అనిపించకపోతే చెప్పకు. కానీ ఎప్పుడైనా చెప్పాలనిపిస్తే నేను వింటాను. నిన్ను తప్పుపట్టడానికి కాదు.. అర్థం చేసుకోవడానికి.”
అతను ఏమీ మాట్లాడలేదు. అమ్మ కూడా ఇంకేమీ అడగలేదు. అతని దగ్గరే కాసేపు కూర్చుంది. ఆ రోజు జరిగిన విషయాన్ని వెంటనే తెలుసుకోవాలనే ఆత్రుతను పక్కన పెట్టింది.
ఎందుకంటే కొన్నిసార్లు పిల్లల మనసు తెరవడానికి.. ఒక ప్రశ్న కంటే, మనం వాళ్ల పక్కన ఉండటం ఎక్కువ అవసరం.
ఆ రాత్రి పడుకునే ముందు.. అతనే మెల్లగా అమ్మ దగ్గరకు వచ్చాడు.
“అమ్మా..”
“హ్మ్..”
“ఈ రోజు స్కూల్లో..”
అమ్మ ఏమీ అనలేదు, కేవలం అతని వైపు చూసి విన్నది.
అతను ఆ రోజు జరిగిన విషయాన్ని చెప్పడం మొదలుపెట్టాడు.
ఎక్కడ తడబడ్డాడో చెప్పాడు, ఎవరు నవ్వారో చెప్పాడు, తనకు ఎలా అనిపించిందో చెప్పాడు. చివరికి అతను చెప్పిన ఒక మాటలోనే అసలు విషయం మొత్తం బయటపడింది.
“అమ్మా.. నాకు నేను బాగా చేయలేనేమో అనిపించింది.”
అక్కడే అమ్మకు అర్థమైంది. తన కొడుకును బాధపెట్టింది ఆ చిన్న సంఘటన కాదు. ఆ సంఘటన తర్వాత అతను తన గురించి తాను ఏర్పరచుకున్న భావన.
ఆ రోజు అమ్మ ఒక విషయం నేర్చుకుంది.
పిల్లలను మాట్లాడించడానికి ఎప్పుడూ ఎక్కువ ప్రశ్నలు అవసరం లేదు.
వాళ్లు మాట్లాడగలిగేంత భద్రతను కల్పించడం అవసరం.
పిల్లలు మనతో మాట్లాడాలంటే.. ముందు మనం వినడం నేర్చుకోవాలి
పిల్లవాడు మౌనంగా ఉన్నప్పుడు మనం వెంటనే ప్రశ్నల వర్షం కురిపించాల్సిన అవసరం లేదు.
కొన్నిసార్లు.. ఒక చిన్న మార్పు మన పిల్లవాడి మనసులోని ఒక పెద్ద తలుపును తెరవగలదు.
♣ “ఏమైంది? చెప్పు!” అనే బదులు..
“ఇప్పుడే చెప్పాలని అనిపించకపోతే పర్లేదు. నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చెప్పు.”
♣ “ఇంత చిన్న విషయానికే ఎందుకు బాధపడుతున్నావు?” అనే బదులు..
“నీకు అది బాధగా అనిపించిందని నేను అర్థం చేసుకుంటున్నాను.”
♣ “దాన్ని పట్టించుకోకు” అనే బదులు..
“అది నీకు ఎందుకు అంతగా అనిపించిందో నేను వినాలనుకుంటున్నాను.”
♣ “నేను ముందే చెప్పాను కదా!” అనే బదులు..
“ఇప్పుడు నీకు ఏం అనిపిస్తుందో చెప్పు. నేను వింటాను.”
ఈ మాటలు సమస్యను వెంటనే పరిష్కరించకపోవచ్చు. కానీ, పిల్లవాడి మనసులోని తలుపును మాత్రం తెరవవచ్చు.
మనలో చాలామంది తల్లిదండ్రులుగా ఒక కోరిక కలిగి ఉంటాం. అదే, “నా పిల్లాడు ఏ సమస్య వచ్చినా నాతో చెప్పాలి.”
అది చాలా సహజమైన కోరిక. కానీ దానికంటే ముఖ్యమైన ప్రశ్న మరొకటి.
“ఏం జరిగినా నాతో చెప్పొచ్చనే భద్రత నా పిల్లవాడికి ఉందా?”
- అతను తప్పు చేసినప్పుడు?
- అతను ఓడిపోయినప్పుడు?
- అతను భయపడినప్పుడు?
- అతను మన అంచనాలను అందుకోలేనప్పుడు?
- అతను మనకు నచ్చని నిర్ణయం తీసుకున్నప్పుడు?
అప్పుడు కూడా..
“అమ్మా.. నాన్నా.. నేను ఇది నీతో చెప్పవచ్చు” అనే నమ్మకం అతనిలో ఉందా?
ఆ నమ్మకమే పిల్లలతో మన సంబంధానికి బలమైన పునాది. ఎందుకంటే, పిల్లలు మనతో తమ విజయాలను పంచుకోవడం చాలా సులభం.
కానీ..
తమ వైఫల్యాలను, భయాలను, తప్పులను, బలహీనతలను కూడా మనతో పంచుకోగలగడం — అదే నిజమైన నమ్మకానికి గుర్తు.
అయితే పిల్లవాడు చివరకు మన దగ్గరకు వచ్చి తన సమస్యను చెప్పినప్పుడు కూడా మనం మరో చిన్న పొరపాటు చేసే అవకాశం ఉంది. అతను చెప్పడం మొదలుపెట్టగానే, మనం వెంటనే పరిష్కారం వెతకడం మొదలుపెడతాం.
అలా చేయాల్సింది, ఇలా చేస్తే సరిపోయేది, మళ్లీ అలా జరగకుండా చూసుకో, ఇంకాస్త బాగా సిద్ధమవ్వాలి, మొదలగునవి.
ఇవన్నీ నిజమే కావచ్చు, కానీ ఆ క్షణంలో పిల్లవాడికి కావాల్సింది పరిష్కారం కాకపోవచ్చు.
ముందుగా అతని భావనలకు ఒక స్థలం కావాలి.
అతను బాధపడవచ్చు, తప్పు చేయవచ్చు, ఓడిపోవచ్చు, సిగ్గుపడవచ్చు, భయపడవచ్చు.
మనకు అవి చిన్న విషయాలుగా అనిపించినా..అతనికి అవి ఆ క్షణంలో నిజమైన భావాలే. వాటిని వెంటనే తొలగించాల్సిన అవసరం లేదు. వాటికి:
- వెంటనే “ఇలా ఆలోచించకు” అని చెప్పాల్సిన అవసరం లేదు.
- వెంటనే “దీనికి పరిష్కారం ఇదిగో” అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
కొన్నిసార్లు,
“నువ్వు ఇలా అనుకోవడం కూడా సహజమే” అని అంగీకరించడమే మొదటి సహాయం.
- అతని మాట పూర్తయ్యే వరకు వినడం..
- అతని భావనను చిన్నచూపు చూడకుండా అర్థం చేసుకోవడం..
- అతనికి వెంటనే తీర్పు ఇవ్వకుండా అతని పక్కన ఉండడం..
పరిష్కారం గురించి తర్వాత కూడా మాట్లాడవచ్చు. కానీ..
మన పిల్లవాడు తన మనసు విప్పి మాట్లాడిన ఆ క్షణంలో మనం ఇచ్చే స్పందన..
“నా పేరంట్స్ తో మాట్లాడటం సురక్షితం” అనే నమ్మకాన్ని పెంచవచ్చు.
లేదా.. “ఇకపై నా విషయాలు నేను నాలోనే ఉంచుకుంటాను” అనే భావనను కూడా కలిగించవచ్చు.
అందుకే పిల్లలు మనతో మాట్లాడాలంటే, ముందుగా మనం వాళ్లను వినడం నేర్చుకోవాలి.
~
ముగింపుగా.. మనం గుర్తుంచుకోవాల్సింది
ఆ రాత్రి తన కొడుకు నిద్రపోతున్నప్పుడు అమ్మ ఆలోచించింది. “ఈరోజు నేను మొదట అడిగినప్పుడు అతను చెప్పలేదు. నేను ఇంకొన్ని ప్రశ్నలు అడిగినా బహుశా చెప్పేవాడు కాదు.
కానీ నేను ప్రశ్నించడం ఆపి, తనకు ఎప్పుడైనా చెప్పొచ్చనే నమ్మకాన్ని కల్పించినప్పుడు.. అతనే వచ్చి చెప్పాడు.”
దానితో,
పిల్లలను మాట్లాడించాల్సిన అవసరం లేదు. వాళ్లు మాట్లాడగలిగేలా మనం ఉండాలి.
పిల్లలు పెద్దయ్యాక మనం వాళ్లకు ఇచ్చిన ప్రతి సలహా గుర్తుంచుకోకపోవచ్చు. ఏ సంవత్సరం ఏ పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయో కూడా గుర్తుండకపోవచ్చు.
కానీ..
వాళ్లు తమ జీవితంలోని కష్టమైన రోజుల్లో మన దగ్గరకు వచ్చినప్పుడు..
“అమ్మా.. నేను ఇది చెప్పినా నన్ను అర్థం చేసుకుంటుంది, నాన్నకి చెప్పినా ముందుగా నన్ను తప్పుపట్టరు.” అనే భావన వాళ్లలో ఉంటే, అదే మనం తల్లిదండ్రులుగా సాధించిన గొప్ప విజయం.
ఎందుకంటే మన పిల్లలకు మనం ఇచ్చే భద్రత అంటే వాళ్ల సమస్యలన్నింటినీ మనం పరిష్కరించడం కాదు.
వాళ్ల సమస్యలతో వాళ్లు మన దగ్గరకు రావచ్చనే నమ్మకాన్ని ఇవ్వడం.
పిల్లలు ప్రతిసారీ..
“అమ్మా.. నాకు బాధగా ఉంది, నేను విఫలమయ్యానని అనిపిస్తోంది.” అని చెప్పరు.
కొన్నిసార్లు వాళ్లు కేవలం.. ఏమీ కాలేదు. అని అంటారు.
ఆ మాటను వెంటనే నమ్మేయాల్సిన అవసరం లేదు. అలాగే ఆ మాటను వెంటనే అబద్ధంగా కూడా భావించాల్సిన అవసరం లేదు. దాని వెనుక ఉన్న మనసును గమనించాలి.
వారికి కొంచెం సమయం ఇవ్వాలి, కొంచెం దగ్గరగా ఉండాలి, మాట్లాడమని బలవంతం చేయకుండా..
“నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు నేను వింటాను” అని తెలియజేయాలి.
ఎందుకంటే..
పిల్లల మౌనాన్ని చెదరగొట్టడం మన పని కాదు. ఆ మౌనం కరిగిపోయేంత భద్రతను వారికి ఇవ్వడం మన పని.
ఎప్పుడైతే పిల్లలు తమ మనసు తెరిచి మనతో చెప్పడం మొదలు పెడతారో అప్పుడే మన అనుబంధం మన పిల్లలతో దృఢపడుతుంది. అదే మనం తల్లిదండ్రులుగా నిర్మించాల్సిన నమ్మకం.
వాళ్లు మనతో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే కాదు..
వాళ్లు మాట్లాడలేక మౌనంగా ఉన్నప్పుడు కూడా మనం వాళ్లతోనే ఉన్నామని వాళ్లకు అనిపించడం.
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.
