[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
మనం పిల్లలకు చదువు నేర్పిస్తున్నాం.. కానీ జీవితం నేర్పిస్తున్నామా?
మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు.. సాధారణంగా మన మనసులో తిరిగే ఆలోచనలు:
- మన పిల్లలు బాగా చదవాలి.
- మంచి మార్కులు తెచ్చుకోవాలి.
- మంచి ర్యాంకులు రావాలి.
- మంచి కాలేజీలో చేరాలి.
- మంచి ఉద్యోగం సంపాదించాలి.
అందుకే వాళ్ల కోసం మంచి స్కూల్ వెతుకుతాం, మంచి ట్యూషన్ పెడతాం, అవసరమైతే అదనపు క్లాసులు కూడా పెట్టిస్తాం, వాళ్లకు ఏ లోటూ లేకుండా చూసుకుంటాం.
ఎందుకంటే..
“మన పిల్లల జీవితం బాగుండాలి” అనేది ప్రతి తల్లిదండ్రి కోరిక. కానీ ఒకసారి ఆగి మనల్ని మనం ఒక ప్రశ్న అడుగుదామా?
మంచి జీవితం కోసం మన పిల్లలను సిద్ధం చేస్తున్నామా..
లేక మంచి చదువు, మంచి ఉద్యోగం కోసం మాత్రమే సిద్ధం చేస్తున్నామా?
ఎందుకంటే..
చదువు వాళ్లకు ఒక వృత్తిని ఇవ్వగలదు.
కానీ జీవితం ఎలా జీవించాలో అది ఒక్కటే నేర్పదు.
పాఠ్యపుస్తకాల్లో లేని పాఠాలు
మన పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. వాళ్లకు ప్రపంచం గురించి ఎన్నో విషయాలు తెలుసు.
కానీ..
- ఓడిపోయినప్పుడు ఎలా నిలబడాలో తెలుసా?
- తప్పు చేసినప్పుడు దాన్ని ఎలా ఒప్పుకోవాలో తెలుసా?
- తనకు బాధగా ఉన్నప్పుడు ఆ బాధను ఎలా చెప్పాలో తెలుసా?
- ఎవరైనా తనను బాధపెడితే తన హద్దులను ఎలా చెప్పుకోవాలో తెలుసా?
- ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. “అందరూ ఇదే చేస్తున్నారు” అని కాకుండా, “నాకు ఏది సరైనది?” అని ఆలోచించగలడా?
- ఎవరైనా తనతో ఏకీభవించకపోయినా ఆ వ్యక్తిని గౌరవించగలడా?
- డబ్బు విలువ తెలుసా?
- బాధ్యత అంటే ఏమిటో తెలుసా?
- తన జీవితంలో వచ్చే సమస్యలన్నింటినీ ఎవరో ఒకరు వచ్చి పరిష్కరించరని అర్థం చేసుకున్నాడా?
ఇవన్నీ కూడా జీవితానికి అవసరమైన పాఠాలే. కానీ వీటికి ప్రత్యేకంగా ఒక పాఠ్యపుస్తకం ఉండదు.
జీవితంలో ఎదురయ్యే సంఘటనలే మన పిల్లలకి ఒక విలువైన పాఠ్యపుస్తకంగా మారుతాయి. అందుకే మనమే వాళ్లకి మొట్టమొదటి గురువుగా మారాల్సిన అవసరం ఉంది.
జీవితం ఎదురైనప్పుడు.. మన పిల్లలు తమ కాళ్ల మీద నిలబడగలరా?
మన పిల్లలు జీవితంలో ప్రతి సమస్యను ఎదుర్కొన్నప్పుడు.. మనం వెంటనే వాళ్ల పక్కన నిలబడతాం.
ఉదాహరణకి:
♤ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయా?
“ఎందుకు తగ్గాయి?” “ఇంకొంచెం చదివితే వచ్చేవి కదా!” “ఇతర పిల్లలకు ఇన్ని వచ్చాయి చూడు.” అంటాం.
♤ స్నేహితులతో గొడవ జరిగిందా?
మనమే ఆ స్నేహితులతో మాట్లాడుతాం.
♤ టీచర్లతో సమస్య వచ్చిందా?
మనమే ఆ టీచర్లకు ఫోన్ చేసి సర్ది చెప్తాం.
మన ఉద్దేశం ఒక్కటే, మన పిల్లవాడు బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు, విఫలం కాకూడదు. అది ప్రేమే. కానీ కొన్నిసార్లు..
వాళ్లను కాపాడుతూ, వాళ్లు తమను తాము ఎలా కాపాడుకోవాలో నేర్చుకునే అవకాశాన్ని మనమే తీసుకుంటున్నామేమో.
ఒక పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినప్పుడు..
“ఈసారి అనుకున్నట్టు రాలేదు. పరవాలేదు. ఎక్కడ తప్పిందో కలిసి చూద్దాం.” అని చెప్పగలిగితే..
పిల్లవాడు మార్కుల కంటే గొప్ప విషయం నేర్చుకుంటాడు:
ఓటమి అంటే ముగింపు కాదు, అది తర్వాతి ప్రయత్నానికి ఒక సమాచారం.
జీవితంలో ప్రతి ప్రయత్నంలో విజయం రాదు. ఎక్కడో ఒకచోట మన పిల్లలు విఫలమవుతారు.
ఆ సమయంలో వాళ్లకు మనం ఇచ్చిన మార్కులు, మెడల్స్ కంటే..
“నేను పడిపోయినా మళ్లీ లేవగలను” అనే నమ్మకమే ఎక్కువ అవసరం.
అదే విధంగా, పిల్లవాడికి ఏదైనా సమస్య వచ్చిన ప్రతిసారీ మనమే పరిష్కారం చెప్పేస్తే.. అతను తన సమస్యలను తానే పరిష్కరించుకోవడం ఎప్పుడు నేర్చుకుంటాడు?
అందుకని మనం వాళ్లను ఒంటరిగా వదిలేయాల్సిన అవసరం లేదు, వాళ్ల చేతిని పట్టుకుని నడిపించాలి.
అంతే కానీ, వాళ్ల బదులు నడవకూడదు.
అందుకే కొన్ని సందర్భాల్లో సమాధానం చెప్పడం కంటే, “నువ్వైతే ఏం చేస్తావు?” అని అడగడం మంచిది.
ఎందుకంటే ప్రతి సమస్యకు పరిష్కారం మనమే చెప్పడం కంటే.. సమస్యను ఎలా ఆలోచించాలో నేర్పినప్పుడు వాళ్లు జీవితాన్ని ఎదుర్కోవడం నేర్చుకుంటారు.
జీవితాన్ని నేర్పడానికి మరో క్లాస్ అవసరం లేదు
జీవిత పాఠాలు నేర్పడానికి ప్రత్యేకంగా మరో కోచింగ్ సెంటర్ అవసరం లేదు.
అవి మన ఇంట్లోనే మొదలవుతాయి.
- పిల్లవాడికి పాకెట్ మనీ ఇచ్చి, డబ్బు ఎలా ఖర్చు చేయాలో నేర్పొచ్చు.
- తన వస్తువులు తానే సర్దుకునేలా చేసి, బాధ్యత నేర్పొచ్చు.
- వయసుకు తగ్గ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇచ్చి, నిర్ణయ సామర్థ్యం పెంచొచ్చు.
- మనమే తప్పు చేసినప్పుడు, “క్షమించు, నేను తప్పు చేశాను” అని చెప్పి, తప్పును ఒప్పుకోవడం నేర్పొచ్చు.
- ఇంట్లో అందరితో గౌరవంగా మాట్లాడి, సంబంధాల విలువ చూపించొచ్చు.
- ఇతరుల పరిస్థితిని అర్థం చేసుకునేలా చేసి, సానుభూతి నేర్పొచ్చు.
- ప్రతి చిన్న సమస్యకు మనమే పరిష్కారం చెప్పకుండా, తనకు తానే ఆలోచించే అవకాశం ఇవ్వొచ్చు.
ఇవన్నీ పెద్ద పెద్ద లెసన్స్ కావు. రోజూ మన ఇంట్లో జరిగే చిన్న చిన్న సందర్భాలే. ఎందుకంటే పిల్లలు మనం చెప్పిన మాటల కంటే..
మన జీవన విధానాన్ని చూసి ఎక్కువగా నేర్చుకుంటారు.
- పిల్లలకు “అబద్ధం చెప్పకూడదు” అంటాం. కానీ ఫోన్లో ఎవరో అడిగితే, “నేను ఇంట్లో లేనని చెప్పు” అంటాం.
- “అందరినీ గౌరవించాలి” అంటాం. కానీ మనకు నచ్చని వ్యక్తి గురించి పిల్లల ముందే అవమానకరంగా మాట్లాడతాం.
- “కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి” అంటాం. కానీ మన కోపాన్ని మనమే కంట్రోల్ చేసుకోలేకపోతాం.
- “తప్పు చేస్తే ఒప్పుకోవాలి” అంటాం. కానీ మన తప్పును ఒప్పుకోము.
పిల్లలకు జీవితం నేర్పించాలంటే, వారికి మనము ఇచ్చే లెక్చర్ల కంటే ముందు వారికి సరైన రోల్ మోడల్‌గా అవ్వాలి.
వాళ్లు మన మాట వినడం కంటే, మన ప్రవర్తనను చూస్తున్నారు. అందుకే..
జీవితాన్ని ఎలా జీవించాలో పిల్లలకు నేర్పించే అత్యంత శక్తివంతమైన పద్ధతి.. మనమే దాన్ని జీవించడం.
చివరికి.. మనం వాళ్లకు ఏం వదిలి వెళ్తున్నాం?
ఒకరోజు మన పిల్లలు పెద్దవాళ్లు అవుతారు. ఇల్లు వదిలి బయట ప్రపంచంలోకి అడుగు పెడతారు.
- వాళ్లకి వచ్చే ప్రతి సమస్యను మనం పరిష్కరించలేం.
- వాళ్లు తమ నిర్ణయాలు తామే తీసుకుంటారు.
- తమ సంబంధాలు తామే నిర్మించుకుంటారు.
- తమ విజయాలు, తమ ఓటములు తామే ఎదుర్కొంటారు.
ఆ రోజు మనం వాళ్ల దగ్గర లేకపోయినా.. మనము వారికి ఇచ్చిన కొన్ని విలువలు మటుకు వాళ్లతోనే ఉంటాయి. అవి మన మాటలు కాదు.. మనతో కలిసి వాళ్లు నేర్చుకున్న జీవితం.
- ఎప్పుడుయితే మన పిల్లవాడు తనకు నచ్చని చోట, “లేదు” అని చెప్పగలుతాడో..
- విఫలమైనప్పుడు, “ఇది కూడా దాటిపోతుంది” అని తనను తాను నిలబెట్టుకోగలుతాడో..
- తనకు బాధగా ఉన్నప్పుడు, “నాకు సహాయం కావాలి” అని చెప్పగలుతాడో..
- ఇతరులను గౌరవిస్తూ, తనను తాను కూడా గౌరవించగలుతాడో..
- తన నిర్ణయాలకు తానే బాధ్యత వహించగలుతాడో..
అప్పుడు మనం వాళ్లకు నిజంగా ఏదో ఒక గొప్ప విషయం నేర్పించినట్టే.
ముగింపుగా..
మన పిల్లలకు మంచి చదువు నేర్పిద్దాం, మంచి నైపుణ్యాలు నేర్పిద్దాం. వాళ్ల కలలను నెరవేర్చుకోవడానికి అవసరమైన అవకాశాలు కల్పిద్దాం. విజయం సాధించడం కూడా నేర్పిద్దాం.
కానీ..
విజయం రాని రోజుల్లో ఎలా నిలబడాలో కూడా నేర్పిద్దాం.
వాళ్లకు ప్రపంచాన్ని గెలవడం నేర్పిద్దాం.
దానితో పాటు, ప్రపంచాన్ని గెలుస్తూ తమను తాము కోల్పోకుండా ఉండడం కూడా నేర్పిద్దాం.
ఎందుకంటే..
మన పిల్లలు ఒక ఉద్యోగం కోసం మటుకే జీవించబోవటం లేదు. తమ జీవితాన్ని ఆనందిస్తూ అనుభవించటం కోసం ప్రయత్నిస్తున్నారు
చదువు మన పిల్లలకి ఒక జీవనోపాధిని ఇవ్వొచ్చు. కానీ.. జీవితం ఎలా జీవించాలో తెలిసినప్పుడు మాత్రమే వాళ్లు నిజంగా ఒక జీవితాన్ని నిర్మించగలరు.
అందుకే..
మన పిల్లలను రేపటి ఉద్యోగానికి మాత్రమే సిద్ధం చేయకుండా..
రేపటి జీవితానికి కూడా సిద్ధం చేద్దాం.
ఎందుకంటే మనం వాళ్లకు ఇచ్చే అత్యంత విలువైన విద్య..
తమ జీవితాన్ని తామే నడిపించగల ధైర్యం.
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.
