Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల్లో వచ్చే సీజనల్ వ్యాధులు

[బాలబాలికల కోసం ‘పిల్లల్లో వచ్చే సీజనల్ వ్యాధులు’ అనే రచనని అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

కాలాలు మారినప్పుడు వాతావరణం అనేక మార్పులకు గురౌతుంది. అందువల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. చలి కాలాల్లో ఎక్కువగా ఆస్త్మా వంటి వ్యాధులకు లోనవుతుంటారు. అదే విధంగా ఎండాకాలం పోయి వర్షాలు పడే సమయంలో జలుబు, దగ్గు, జ్వరంలతో పాటు అనేక ఆరోగ్య బాధలు కలుగుతాయి. ఇంకా చిన్న పిల్లలైతే త్వరగా జబ్బుల బారిన పడుతుంటారు. పిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటమే కారణం. అందువలన ఇంట్లో పెద్దవారికి జలుబు, జ్వరాలు వచ్చినా పిల్లలకు త్వరగా అంటుంకుంటాయి. వాగులలో, చెరువులలో నీళ్ళు కొత్తగా రావటం వల్ల అనేక సమస్యలు వస్తుంటాలు. నీళ్ళతో పాటు బాక్టీరియా, వైరస్ లు, ప్రోటోజోవన్లు మానవ శరీరంలో దూరి వ్యాధుల్ని కలుగ జేస్తుంటాయి. అందుకే నీళ్ళను మరగ కాచి వాడుకోమని చెపుతూ ఉంటారు. కుళాయిల ద్వారా స్వచ్చమైన నీటినే ఇస్తున్నప్పటికీ ఎక్కడో ఓ చోట కలుషితమై పోతుంటాయి. ఈ వానా కాలంలో ఈగలు, దోమలు కూడా ఎక్కువగా సంతానోత్పతి చేస్తుంటాయి. ఫలితంగా జబ్బులున్న బాక్టీరియాలను మోసుకొచ్చి మనుషులను రోగగ్రస్థం చేస్తుంటాయి.

నవజాత శిశువులు, పిల్లలు ఎక్కువగా వానలు పడే సమయంలో అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు. శిశువులు చాలా సున్నితంగా ఉంటారు. వారిలో రోగ నిరోధక శక్తి అప్పుడపుడే బలపడుతూ ఉంటుంది. అదే సమయంలో అంటువ్యాధులు దాడి చేస్తే ఇబ్బందుల పాలు అవుతూ ఉంటారు. పసివారికి మాటలు వచ్చేంత వరకూ వారికి ఏకష్టం వచ్చినా ఏడవటం తప్ప ఏమీ తెలియదు. కడుపులో నొప్పి వచ్చి ఏడవవచ్చు లేదా ఆకలి అయి ఏడవవచ్చు. ఆదీగాక మనం వేసిన బట్టలలో ఉన్న చీమ కుట్టిన కారణంగా ఏడవవచ్చు. ఇలా ముందుగా ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకోవాలి. పసిపిల్లలను పెంచే తల్లిదండ్రులకు ఇవన్నీ తెలియాలి. తల్లిదండ్రులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉన్నది. పిల్లల్లో వచ్చే కొన్ని సాధారణ సమస్యల్ని గురించి తెలుసుకుందాం!

కడుపునొప్పి:

నెలల వయసులో సాధారణంగా వచ్చే జబ్బు కడుపునొప్పి. అందుకే పిల్లలు ఊరికే ఏడుస్తూ ఉంటారు. బయటి పాలు పట్టడం ద్వారా పిల్లలకు ఎక్కువగా కడుపునొప్పి వస్తుంది. బాటిల్ పీకలు సరిగా కడగకపోవడం వల్ల పాలు విరిగి పోయాక శుభ్రపరచకపోవడం వల్ల ఎక్కువగా కడుపు నొప్పి వస్తుంది. పిల్లలకు ఆహారం అరగక కూడా ఈ సమస్య రావచ్చు. పిల్లలకు ఎక్కువగా పాలు పట్టినా కడుపునొప్పి వస్తుంది. పిల్లలకు పాలు తాగించిన తరువాత భుజం మీద వేసుకుని వీపు మీద తడుతూ కాసేపు ఉంచాలి. పాలు అరగక పోయినా, పాలు ఎక్కువైనా సమస్యలు అనేకం వస్తాయి.

జలుబు, దగ్గు:

వానల్లో తడిచే పిల్లలకు జలుబు దగ్గులు త్వరగా వస్తాయి. వానల వల్ల ఇల్లంతా తడిగా అవటం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వస్తుంటాయి. ఎలర్జీ, ఫ్లూ, ఆస్మా వంటి అనేక సమస్యలు పిల్లల్ని తొందరగా ప్రభావితం చేస్తాయి. జలుబు మొదలైన జ్వరాలు ముక్కులు కారడం, శ్వాస ఆడకపోవడం, దగ్గు రావడం వంటి సమస్యలు మొదలౌతాయి. పిల్లలకు శ్వాస ఆడక పోయేంత జులుబు వచ్చిందంటే ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించాలి. ఊపిరాడని దగ్గు కూడా చాలా ప్రమాదకరం. జలుబు దగ్గు ఎక్కువై ఊపిరితిత్తులకు సోకే అవకాశం ఉంటుంది.

వాంతులు, విరేచనాలు:

పసిపిల్లల్లో సాధారణంగా కనిపించే సమస్యలివి. తాగిన పాలు కక్కుతూనే ఉంటారు. పిల్లలకు పాలు తాగించేటపుడు తల ఎత్తుగా ఉండాలి. లేదంటే లోపలికి వెళ్ళాల్సిన పాలు బయటికే వస్తాయి, లేదంటే లోపల ఏదైనా సమస్యలున్నపుడు సైతం వాంతులు అయే అవకాశం ఉంటుంది. వాంతులు చేసుకోవడం సాధారణ సమస్య అయినప్పటికీ ఎక్కువ సార్లు వాంతులు అయితే పిల్లలు నీరసించి పోతారు.

విరేచనాలు కూడా పిల్లల్లో వచ్చే సాధారణ సమస్య ఆహారం అరగక పోయినా, కొత్త ఆహారమైనా పిల్లల్లో విరేచనాలు మొదలవుతాయి. కొన్నిసార్లు సెరిలాక్ వంటి ఉగ్గులు కూడా పిల్లల్లో విరోచనాలకు కారణం అవుతాయి. కొత్త ఆహారాన్ని అలవాటు చేసేటపుడు వాటిని తల్లిదండ్రులు గమనిస్తుండాలి. గోధుమలతో తయారయే ఆహారం కొంత మందికి పడక విరేచనాలు వస్తాయి. ఇన్‌ఫెక్షన్ల వలన కూడా విరేచనాలు సంభవిస్తాయి. దీని వలన పిల్లలు డీహైడ్రేషన్‌కు గురవుతారు.

జ్వరం:

పిల్లల్లో శరీరం వేడెక్కడం సర్వసాధారణం. అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే జ్వరం ఎక్కువగా వచ్చినపుడు పిల్లల్లో ఆ వేడి తట్టుకోలేక ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా జ్వరం అనిపించగానే తడి వస్త్రంతో పిల్లల ఒళ్లంతా తుడవాలి. ఆ తరవాత వెంటనే డాక్టరు వద్దకు తీసుకు వెళ్ళాలి. డాక్టరు పర్యవేక్షణలో తగిన మందుల్ని వాడాలి.

కళ్ళు, చెవుల సమస్యలు:

కళ్ళల్లో పుసులు కారడం, చెవుల నుంచి రసి కారడం వంటి సమస్యలు పిల్లల్ని బాధిస్తాయి. పిల్లలకు శుభ్రంగా స్నానం చేయించి బట్టలు వేయడమే కాకుండా పక్కబట్టలు కూడా పరిశుభ్రంగా ఉంచాలి. కళ్ళలో ముక్కుల్లో, చెవుల్లో కొంతమంది నూనెలు వేస్తుంటారు. అటువంటి పనులు చేయకూడదు. కళ్ళు అంటుకుంటున్నా చెవుల్లో నుంచి ద్రవాలు కారుతున్నా డాక్టర్ను సంప్రదించాలి.

చర్మ సమస్యలు:

పిల్లలకు ఈ మధ్య డైపర్లు వాడుతున్నందున అనేక చర్మ సమస్యలు, ఎలర్జీలు వస్తున్నాయి. వారు మూత్రం పోసిన వెంటనే తడి బట్టలు మార్చి పొడి బట్టలు వేయడం చేయాలి. మల విసర్జన తర్వాత కూడా శుభ్రంగా కడిగి మళ్ళీ బట్టలు తొడగాలి. ఎప్పటి కప్పుడు పొడిగా ఉంచితే ఎక్కువ సమస్యలు రావు.

కొత్త తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచేటపుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటే అనేక జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చినా తీవ్రతరం కాకుండా చూసుకోవచ్చు. ఏదైనా సమస్య అనిపించినపుడు సొంతంగా వైద్యం చేయకుండా డాక్టర్ను సంప్రదిస్తే మంచి ఫలితం ఉంటుంది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇల్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

Exit mobile version