Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిండివంటకాల పొడుపు కథలు

[బాలబాలికల కోసం పిండివంటకాల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]


1.
ఈ పూత చెట్టు మీద కాదు కుండమీద
పేరులోని రేకు విచ్చుకోదు, గుచ్చుకోదు

2.
చెట్టుకు కాయని కాయ
పైన పెంకు, లోన ఇసుక

3.
బెల్లపు పాకం బియ్యప్పిండి
జేగురురంగు గుండ్రని రూపు
సంక్రాంతికి వచ్చే వంటకం

4.
చుట్టలు చుట్టలుగా ఆకారం
చుట్టల్లో పాకం ప్రసారం

5.
అనేక మడతలు పెట్టి
అండాకారంలో చుట్టి
కాకినాడకు పేరుతెచ్చి
కమ్మగా నోరూరిస్తుంది

6.
మెత్తదనం, తియ్యదనం
నునుపుదనం, కొత్తదనం
పానకంలో ఈదే గోళీలు

7.
బంగారు రంగు పూసలు
లేత పాకంతో ముద్దలు

8.
పిడి కాని పిడి
పుల్లల్లాంటి పిల్లలు

9.
మైసూరు నుంచి మనకోసం వచ్చింది
పాకు, పాకు అంటుంది గాని నడవమనదు!

10.
మహరాజని పిలుపులు
మైదాపిండి వంటకాలు

11.
నూనెలో పొంగి
పిల్లల బుగ్గల్లా
కొబ్బరితో కలిసి
తీపి అప్పచ్చుల్లా

12.
ఒళ్ళంతా నొక్కులు
పంచదార పాకాలు
పేరులో సముద్రజీవులు

13.
మెత్తగా ముద్ద ముద్దగా
పచ్చగా తియ్యతియ్యగా
నోట్లో వేసుకుంటే కరిగెగా

14.
కడుపుతున్న వాళ్ళకు పెడతారు
సీమంతానికి ఒళ్ళో పెగతారు
హుషారుగా లేని వాళ్ళను
ఈ తీపి పదార్థంతో పిలుస్తారు

జవాబులు:
1. పూతరేకు 2. కజ్జికాయ 3. అరిశ 4. జిలేబి 5. కాజా 6. గులాజ్ జామ్ 7. లడ్డు 8. పాపిడి 9. మైసూరుపాక్ 10. బాదుషా 11. బూరెలు 12. గవ్వలు 13. బర్ఫీ 14. చలిమిడి.

Exit mobile version