[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పిన్నల పెద్దరికం’ అనే నాటిక అందిస్తున్నాము. ఇది 1వ భాగం.]
(తెర తీయగానే స్టేజి మీద సోఫా సెట్టు ఉంటుంది. సెంటరు టేబులు మీద న్యూస్ పేపరు ఉంటుంది. రిటైర్డ్ ప్రిన్సిపల్ ఛీఫ్ కంజర్వేటర్ అఫ్ ఫారెస్ట్, జగదీష్ ప్రవేశిస్తూ చేతిలోని బేగును సెంటరు టేబులు మీద చిరాకుగా పడేసి సోఫా మీద వాలుతాడు)
జగదీష్ – (ఇంటిలోపలికి చూస్తూ) ‘జానకీ, ఓ గ్లాసుతో మంచినీళ్లు తెస్తావా.’
(కొద్దిసేపట్లో జానకి మంచినీళ్ల గ్లాసుతో ప్రవేశించి భర్తకు అందిస్తుంది. అతడు నీళ్లు త్రాగి గ్లాసును సెంటర్ టేబుల్ మీద పెడతాడు.)
జానకి – ‘ఏమండీ, ఆ గిరీశం గాడు ఏమేనా ఇచ్చేడా.’
జగదీష్ – ‘వాడో స్కౌండ్రల్ జానకీ. ఎప్పటి నాటకమే. వాడికేవో.. కొన్ని లక్షలు.. రావాలిట. ఆ డబ్బు రాగానే మనకు రావలసింది పువ్వుల్లో పెట్టి ఇస్తానని మన చెవిలో వాడు పువ్వు పెడుతున్నాడు.’
జానకి – ‘అయ్యో ఖర్మ. వాడేదో పెద్దమనిషి అనుకొని నిక్షేపం లాంటి ఇల్లు వాడికి ఆద్దెకిచ్చేమ్.’
జగదీష్ – ‘అదే మనం చేసిన పొరబాటు. పెద్ద వేషంతో దర్జాగా కారులో వచ్చి, ఏదో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేస్తున్నానని పెద్ద కబుర్లు చెబితే, నమ్మి ఇల్లు అద్దెకిచ్చేమ్.’
జానకి – ‘అయ్యో ఖర్మ. లేకపోతే, కనీసం వాడు అప్పటికి ఎక్కడ ఉంటున్నాడో; ఆ ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నాడో మీరు కనుక్కుని ఉంటె, వాడి టోపీలో మనం పడకపోయేవాళ్ళం.’
జగదీష్ – ‘సరి, ఇదొకటా. ఆ దగుల్బాజీ వెధవ మోసం చేస్తే, తప్పంతా నాదన్నట్లు మాట్లాడుతున్నావ్. వాడితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నా ప్రక్కనే ఉన్నావు కదా. ఇప్పుడున్న ఆ తెలివితేటలు అప్పుడు నీకెందుకు లేకపోయేయి. నువ్వే వాణ్ణి అడిగి ఉండవలసింది.’
జానకి – ‘అయ్యో ఖర్మ. ఇదివరకు మీరే చీవాట్లు పెట్టేరు. పెద్దమనుషులతో మాట్లాడుతున్నప్పుడు నన్ను కలుగజేసుకోవద్దని గట్టిగా చెప్పేరు. ఇప్పుడు నువ్వెందుకు అడగలేదని తప్పు నా మీద పడేస్తున్నారు.’
(అంతలో జగదీష్ సెల్ మోగింది.)
జగదీష్ – ‘ఆఁ. అమ్మగారు ఇక్కడే ఉన్నారు. ఇస్తున్నాను. (ఫోను భార్యకు అందిస్తూ) ‘పనిమనిషి కనకం. నీతో మాట్లాడాలిట.’
జానకి – ‘అయ్యో ఖర్మ. ఇప్పుడు ఫోన్ చేసిందంటే ఏదో బాంబు పేలుస్తున్ది. ..ఆఁ. చెప్పు, కనకం.. అయ్యో.. ఎప్పుడు పోయింది.. నిన్న రాత్రా.. ఏమిటయింది.. నిద్దట్లో పోయిందా.. అవును, కనకం. నువ్వు వెళ్ళాలి. కాదనను. కానీ, నీకు తెలుసుగదా కనకం. రేపు మన ఇంట్లో పార్టీ ఉంది. అంతా పెద్దవాళ్లొస్తున్నారు. ఇప్పటికిప్పుడు కేన్సిల్ చెయ్యలేం. బాగుండదు. ఒక్కరోజు గడిప్పెట్టమ్మా. నువ్వు వెంటనే వెళ్లినా, అప్పటికి అంతా అయిపోతుంది. ఒక్కరోజు ఆలస్యంగా వెళ్లొచ్చు.. కనకం నువ్వు రేపు పనికి రాకపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది.. అవును. నిజమే.. కాని, నా సంగతి ఆలోచించు. అయ్యో ఖర్మ. మొన్ననే డాక్టరు చెప్పేడు. బరువయిన పనులేవీ చెయ్యొద్దని. రేపొక్కరోజు నాకు గడిప్పెట్టమ్మా తల్లీ. రేపటి పనికి నీకు ఎక్స్ట్రా డబ్బిస్తాను. కాదనకు.. ..పోనీ, అలా చెయ్యమ్మా. పోలితో మాట్లాడు. నువ్వు వచ్చిన దాకా మన ఇంట్లో పని చెయ్యమను. రేపటి పనికి ఎక్స్ట్రా, అది ఎంత అడిగితే అంతా ఇస్తాను. నువ్వు పోలితో మాట్లాడి నాకు వెంటనే ఫోన్ చెయ్యి.’
జగదీష్ – ‘చాలాసేపు మాట్లాడేవ్. ఏమిటంటుంది కనకం.’
జానకి – ‘అయ్యో ఖర్మ. దాని అత్తగారు పోయిందట. నిన్న రాత్రి బొబ్బిలిలో. ఇప్పుడే బొబ్బిలికి ప్రయాణమవుతోందట. రేపటినుండి పది రోజులు పనిలోకి రాలేనంది.’
జగదీష్ – ‘అవును. అత్తగారు పోయిందంటే పది రోజులు కార్యక్రమాలు ఉంటాయి.’
జానకి – ‘అయ్యో ఖర్మ. సుళువుగా చెప్పేసారు, పది రోజులు కార్యక్రమాలు ఉంటాయని. ఆ పది రోజులు ఇంటిడు పన్లు ఎవరు చేస్తారు, చెప్పండి. మీరు, ఇక్కడి చెంచా అక్కడ పెట్టరు. నాకేమో డాక్టర్ చెప్పేడు. బరువయిన పన్లు చేస్తే హర్టటేక్ రావచ్చని.’
జగదీష్ – ‘ఆ పదిరోజులకు ఏదో ఎరేంజ్మెంట్ అవుతున్నట్లుంది.’
జానకి – ‘అయ్యో ఖర్మ. ఓ చెవి ఇటు పారేసి అంతా విన్నారన్నమాట. మీకేం పోయింది. ఏకంగా పాతికమందిని పార్టీకి పిలిచేరు. రేపు పనిమనిషి రాకపోతే పార్టీ ఎలా అవుతుందనేనా ఆలోచించేరా. పనిమనిషిని, అమ్మా, తల్లీ, అని బ్రతిమాలుకోవస్తోంది. వెంకటరమణమూర్తి దయ ఉంటే, పోలి పదిరోజులూ కథ నడిపిస్తుంది. (కొద్ది క్షణాలు ఆగి ) సరే, ఆ గిరీశంగాడి సంగతి ఏమిటయిందో చెప్పండి.’
జగదీష్ – ‘చెప్పడానికి ఏమిటుంది జానకీ. నువ్వు వాడికి కరెక్టైన పేరు పెట్టేవు, గిరీశం, అని. వాడు మన ఇల్లు ఖాళీ చెయ్యడు. అద్దె ఇవ్వడు.’
జానకి – ‘అదేమిటండి అంత సుళువుగా చేప్పేసేరు. కానీయా పరకా; ఏడాది అద్దెండి. మూడు లక్షల అరవైవేలండి. దాని మీద గంపెడాశ పెట్టుకొన్నాను నేను. ఆ డబ్బుతో, వచ్చే నెల మా సుబ్బు పెళ్ళికి వెళ్లే ముందు దండవంకీ ఒకటి కొనుక్కొందామనుకొంటున్నాను.’
జగదీష్ – ‘సుబ్బుగాడి పెళ్ళికి నీకెందుకు దండవంకీ.’
జానకి – ‘నాకెందుకంటారా.. రిటైర్డ్ ప్రిన్సిపల్ ఛీఫ్ కంజెర్వేటర్ అఫ్ ఫారెస్ట్స్ గారి భార్యని. మీ స్టేటస్ నిలబెట్టాలిగా.’
జగదీష్ – ‘స్టేటస్ నిలబెట్టడం మాట ఉంచు. రిటైరయిన అయిదేళ్ల తరువాత కూడా పెళ్ళానికి దండవంకీలు కొంటున్నాడంటే, సర్వీస్‌లో ఉన్నప్పుడు మస్తుగా తినిఉండాలి అని, అనుకొంటారు అందరూ. ఆనెస్ట్ ఆఫీసర్ని అని ఉన్న మంచి ఇమేజ్ కాస్తా గంగపాలవుతుంది.’
జానకి – ‘అయితే ఆ డబ్బు వస్తే అది కూడా బ్యాంకు ఫిక్సడ్ డిపాజిట్లో పడేస్తారా.’
జగదీష్ – ‘ఆ డబ్బు వస్తే.. ఏమిటి చెయ్యడమో ఆలోచించొచ్చు.’
జానకి – ‘అదేమిటండి; ఆ డబ్బు వస్తే.. అని అంత దీర్ఘం తీసేరు.’
(అంతలో జగదీష్ ఫోను మోగుతుంది.)
జగదీష్ – ‘ఆఁ. అమ్మగారు ఇక్కడే ఉన్నారు.’
(ఫోను జానకికి అందిస్తూ)
జగదీష్ – ‘కనకం; నీతో మాట్లాడాలిట.’
జానకి – ‘అయ్యో ఖర్మ. పోలి వస్తానందో లేదో. ..చెప్పమ్మా కనకం. పోలితో మాట్లాడేవా.. ఏమిటంది.. చేస్తానందా.. ఏడుకొండలవాడా నన్ను కాపాడేవు తండ్రీ.. కనకం, చాలా థేంక్స్ తల్లీ నీకు. రేపటి రోజు ఏమిటి చెయ్యడమా అని బెంగతో చస్తున్నాను. గట్టెక్కించేవ్. చాలా థేంక్సమ్మా.. పోలి నీ దగ్గరే ఉందా.. నాతో మాట్లాడాలంటోందా.. ఫోను పోలికియ్యి. మాట్లాడతాను.. అమ్మా పోలీ, కనకం అంతా నీకు చెప్పే ఉంటుంది.. అదే.. ఆ పది రోజులు నాకు సాయం చేసి పెట్టమ్మా.. ఆఁ. చెప్పు. ఏమిటో.. అవునమ్మా. నాకు తెలుసు. వాళ్ళ ఇద్దరు పిల్లలు పొద్దున్నే స్కూలుకు వెళ్ళాలి.. మేమిద్దరమే ఉన్నాం. మాకు అంత తొందర లేదు.. ఒక పని చెయ్యమ్మా. వాళింట్లో పొద్దున్నే వాళ్లకు కావలిసిన పన్లు చేసి, మా ఇంటికి రా. వాళ్ళ బట్టలుతకడం, అవి, కొంత ఆలస్యంగా చెయ్యొచ్చు. నాకు వంటకు గిన్నెలందించేస్తే చాలు. మిగతా పన్లు వాళ్ళింట్లో పన్లన్నీ అయ్యేక వచ్చి చెయ్యొచ్చు. రేపొక్కరోజు మద్యాహ్నం.. కనకం చెప్పిందా.. దానికి వేరే ఇస్తాను.. అయితే రేపు పొద్దున్న గిన్నెలు నీ కోసం ఉంచుతాను.. థేంక్సమ్మా.’
జగదీష్ – ‘నీ సమస్య తీరినట్టుంది.’
జానకి – ‘తీరుతుంది, తీరుతుంది. ఎందుకు తీరదూ. తమరు బుద్ధభగవానుడు లాగ సోఫాలో కూర్చొంటే తంటాలన్నీ నేను పడుతున్నాను.’
జగదీష్ – ‘జానకీ, అది నీ డిపార్ట్మెంట్. అందులో నేను వేలు పెడితే అయ్యే పని కూడా కాదు.’
జానకి – ‘పన్లు తప్పించుకోడంలో ఎక్స్పర్ట్ మీరు.’
జగదీష్ – ‘జానకీ, నేను పన్లు తప్పించుకొంటున్నానా. ఆ శనిగ్రహం దగ్గర అద్దె వసూలు చేసుకోడానికి నేను ఎన్ని తిప్పలు పడుతున్నానో ఆ భగవంతుడికే తెలుసు.’
(అంతలో జగదీష్ ఫోను మోగుతుంది.)
జగదీష్ – ‘ఆ. రండి.. లేదు. లేదు. I am free.’
జానకి – ‘ఎవరండి, ఫోను.’
జగదీష్ – ‘కృష్ణమూర్తిగారు. ఏదో విషయం మాట్లాడాలిట. తీరిగ్గా ఉంటె ఓ పది నిమిషాల్లో ఆవిడతో కలసి వస్తానన్నారు.’
జానకి – ‘ఏమిటో ఆ విషయం. సరే వస్తున్నారు గదా. అదేదో వాళ్లే చెప్తారు. ..ఈ పనిమనిషి మాటల్లో పడి ఆ ఇంటద్దె భాగవతం ఏమిటయిందో తెలీలేదు. మీరు వెళ్లేరుకదా. ఏమిటన్నాడండి వాడు.. పోనీ; అంతా ఒకమారు కాకపొతే రెండు మూడు ఇన్స్టాల్మెంట్సులోనైనా ఇమ్మనవలసింది.’
జగదీష్ – ‘జానకీ నీకు సమస్య బోధపడినట్టులేదు.’
జానకి – ‘బోధపడకపోవడమేమిటండి. వాడికేవో కొన్ని లక్షలు రావాలి; అవొస్తే మన బాకీ తీరుస్తానన్నాడు అని చెప్పేరు కదా. అందుకే అన్నాను. ఒక్కమారు కాకపోతే ఇన్స్టాల్మెంట్సులోనైనా ఇమ్మనవలసింది, అని.’
జగదీష్ – ‘జానకీ, వాడికి ఇచ్చే ఉద్దేశం ఉన్నట్టు లేదు. గత నాలుగు నెలలనుండి, ఆ లక్షల పాటే పడుతున్నాడు. అవి ఎప్పుడొస్తాయని అడిగితే, గవర్నమెంటు నుండి రావలిసింది; ఏవో బడ్జెట్ సేంక్షన్లు అవి కావాలి అంటున్నాడు.’
జానకి – ‘గవర్నమెంటునుండి అయితే, వాళ్లకేదో ముట్టపెడితో, ఏ సేన్క్షన్లు లేకుండా ఇస్తారు. డబ్బులు ఖర్చు పెట్టకపోతే గవర్నమెంటులో పన్లు ఎలా అవుతాయి.’
జగదీష్ – ‘ఆ విషయం తెలీని దద్దమ్మ ఎవడూ ఉండడు.’ (అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటె, యాభైల్లో ఉన్న దంపతులిద్దరు ప్రవేశిస్తారు. వారిని చూడగానే)
జగదీష్ – ‘రండి, రండి మూర్తిగారు, రండమ్మా రండి. ఇలా కూర్చోండి.’ అని ఆహ్వానిస్తారు.
(జానకి కూడా ఇద్దరిని ఆహ్వానిస్తుంది. నలుగురూ ఆసీనులవుతారు.)
జానకి – ‘రమణమ్మగారూ, మీ అత్తగారికి ఎలా ఉందండి.’
రమణమ్మ – ‘చాలా వరకు నయమయిందండి. చేతికర్ర లేకుండా నడవగలుగుతున్నారు.’
జానకి – ‘ఆవిడ అదృష్టవంతురాలు. వేగిరం కోలుకున్నారు. ఆ వయసులో కాలు విరిగితే చాలామంది మంచం పట్టేస్తున్నారు.’
రమణమ్మ – ‘అవునండి. మాకూ అదే బెంగ ఉండేది. ఏదో, ఆవిడ, మేము, అదృష్టవంతులం.’
జగదీష్ – (కృష్ణమూర్తితో) ‘ఎవరండి, డాక్టరు.’
కృష్ణమూర్తి – ‘గోపినాథ్ రెడ్డిగారండి.’
జగదీష్ – ‘ఓ, ఆయనా. He is a reputed ortho.’
జానకి – ‘రమణమ్మగారూ, ఆ పెళ్ళివారినుండి ఏదయినా కబురొచ్చిందా .’
రమణమ్మ – ‘ఆ విషయం చెప్పడానికే వచ్చేమండి. పొద్దున్నే ఫోనొచ్చిందండి. వాళ్లకు పిల్ల నచ్చిందని. వీలయినంత త్వరలో పెళ్లి ముహూర్తం పెట్టించమన్నారు.’
జానకి – ‘కంగ్రాచులేషన్స్. పూర్ణిమ చాలా అదృష్టవంతురాలు.’
రమణమ్మ – ‘థేంక్సండి. దేముడి దయ. మీవంటి పెద్దల ఆశీర్వచనాలు.’
జగదీష్ – (మూర్తిగారికి హేండ్ షేక్ ఇచ్చి) ‘కంగ్రాచులేషన్స్, మూర్తిగారూ.’
మూర్తి – ‘థేంక్సండి.’
జానకి – (రమణమ్మతో) ‘త్వరలో మీరు బూర్లు పెడతారన్నమాట.’
రమణమ్మ – ‘ఆ ప్రయత్నాల్లోనే ఉన్నామండి.’
జానకి – ‘మీరు మాట్లాడుతూ ఉండండి. ఆ లోగా నేను టీ చేసి తెస్తాను.’
రమణమ్మ – ‘మీరు కూర్చోండి, జానకిగారూ. మేము ఇప్పుడే టీ తాగి వచ్చేము.’
కృష్ణమూర్తి – ‘మేము మా అమ్మాయి పెళ్లి విషయంలో మీ సలహాలు తెలుసుకోడానికి వచ్చేమండి, సార్.’
జగదీష్ – ‘అలాగా. మోస్ట్ వెల్కమ్. చెప్పండి; ఏమిటో.’
కృష్ణమూర్తి – ‘పెళ్లి ముహూర్తం విషయం అవధానిగారితో మాట్లాడేమండి. ఆయన సాయంత్రం మన ఇంటికొచ్చి మాట్లాడతానన్నారు.’
జానకి – ‘ఆయన పెట్టే ముహూర్తాలు చాలా బలవయినమండి.’
జగదీష్ – ‘మూర్తిగారూ, అన్నింటికన్నా top priority – పెళ్ళికి ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలి. లేటయితే అవి దొరకడం చాలా కష్టం. అవధానిగారిని ముహూర్తం త్వరగా పెట్టమనండి. డేట్ తెలీగానే హాల్ బుక్ చేసుకోవచ్చు.’
జానకి – ‘కట్నకానుకలేమిటండి.’
రమణమ్మ – ‘కట్నాలేవీ అక్కరలేదు గాని, పెళ్లి తాజ్‌లో చెయ్యాలన్నారండి. మగపెళ్ళివారికి, వాళ్ళ గెస్ట్‌లకు ఉండడానికి తాజ్ లోనే ఏర్పాటు చెయ్యమన్నారు.’
జగదీష్ – ‘కట్నాల కన్నా ఫైవు స్టార్ హోటళ్లలో పెళ్లిళ్లకే ఖర్చులు ఎక్కువవుతాయి.’
కృష్ణమూర్తి – ‘అది నిజమేనండి. కాని సంబంధం మంచిది; పిల్ల జీవితంలో సుఖపడుతుందని ఆలోచించి, అన్ని డిమేండ్సు ఒప్పుకోవలసి వస్తోంది.’
జానకి – ‘మనవాళ్ళు, దానమిచ్చిన వారిది పై చేయి, పుచ్చుకొన్న వారిది దిగువ చెయ్యి అంటారు. కాని పెళ్లిళ్ల విషయంలో చూడండి, కన్యాదానం పుచ్చుకొన్న వాళ్ళది పై చేయి, ఇచ్చిన వాళ్ళది దిగువ చెయ్యి అవుతోంది.’
జగదీష్ – ‘మన పిల్లలు అంత తెలివిమీరలేదు కాని, ఈ రోజుల్లో ఉద్యోగాలు చేస్తున్న కొందరు ఆడపిల్లలు నిర్మొహమాటంగా మగపిల్లలిని, ఇంటిపన్లు ఇద్దరం కలసి చేసుకోవాలి. నీకు వంట వచ్చునా, లాండ్రీ చేతనవునా, డిష్వాషర్ లోడ్ చేయగలవా, అని అడుగుతున్నారట. వాళ్ళూ వాళ్ళ డిమేండ్స్ పెడుతున్నారు. అదో శుభసూచకం.’
రమణమ్మ – ‘తాపీగా వస్తాయండి, మార్పులు.’
కృష్ణమూర్తి – ‘సార్, మీ అమ్మాయి పెళ్ళికి, డెకొరేషను, కేటరింగ్ అవీ ఎక్కడ ఎరేంజ్ చేసేరండి.’
జగదీష్ – ‘మూర్తిగారూ, డెకొరేషను, కేటరింగు.. అలా ఒక్కొక్కటి వేరువేరుగా ఎరేంజ్ చేసుకొంటే, వాళ్ళ వెనక పరుగులు పెట్టేసరికే మీకు టైము అయిపోతుంది.’
కృష్ణమూర్తి – ‘అవును సార్. ఇంట్లో ఫ్రిజ్ పనిచెయ్యడం లేదని, ఆ కంపెనీ వాడికి అయిదు రోజులయింది; రోజూ ఫోన్ చేస్తే, ఇదిగో, అదిగో, మెకానిక్‌ని పంపిస్తున్నాని అంటున్నాడు. అలా ఉంది పరిస్థితి.. అయితే మీ సలహా ఏమిటి సార్.’
జగదీష్ – ‘మనకు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యడానికి, all in one – event management వాళ్ళుంటారండీ. వాళ్లతో మాట్లాడితే, ప్రతీది మనకు కావలసినట్టు ఏర్పాట్లు చేస్తారండి. మా అమ్మాయి పెళ్ళికి ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్లకే అన్నీ కాంట్రాక్ట్ ఇచ్చేమండి. They did a good job. నా ఉద్దేశంలో మీరు కూడా అదే పని చెయ్యడం మంచిది. మీకు చాలా టైము కలిసొస్తుంది. ముఖ్యంగా టెన్షన్లు ఉండవ్.’
కృష్ణమూర్తి – ‘వాళ్ళ ఛార్జెస్ ఎలా ఉంటాయి సర్ .’
జగదీష్ – ‘మేము కాంట్రాక్ట్ ఇచ్చిన తిరుమల ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళ చార్జెస్ చాలా రీజనబుల్‌గా ఉంటాయండి. వాళ్ళు ప్రతీ ఈవెంటుకు డిఫరెంట్ ప్రయిస్ రేంజెస్‌లో మూడు నాలుగు ఆప్క్షన్స్ ఇస్తారండి. వాటిలో మన అవసరాలు, బడ్జెట్ ను బట్టి మన ప్రిఫరెన్స్ ఇవ్వొచ్చునండి.’
కృష్ణమూర్తి – ‘ఓ, అలాగా. బాగుందండి.’
రమణమ్మ – ‘సార్. వాళ్ళ ఎడ్రసు, ఫోన్ నంబరు మీ దగ్గర ఉన్నాయా.’
జగదీష్ – ‘ఉన్నాయమ్మా. ఇప్పుడే ఇస్తాను.’ (జగదీష్ తన ఫోనులో ఏదో టైపు చేసి) మూర్తిగారూ, వాళ్ళ ఎడ్రసు, కాంటాక్ట్ నంబరు మీకు ఫర్వార్డ్ చేసేను. చూసుకోండి.’
కృష్ణమూర్తి – (తన ఫోను చూసుకొని) ‘వచ్చింది సార్. థేంక్సండి.’
రమణమ్మ – ‘సార్. వాళ్ళతో బార్గైన్ చెయ్యొచ్చా.’
జగదీష్ – ‘తప్పకుండానమ్మా. బార్గైన్ చెయ్యొచ్చు. టెన్ టు ఫిఫ్టీన్ పెర్సెంట్ దాకా దిగి వస్తారు.’
రమణమ్మ – ‘సార్, మీ అమ్మాయి పెళ్ళికి కేటరింగు కూడా వాళ్ళే చేసేరా.’
జగదీష్ – ‘వాళ్ళే చేసేరమ్మా. A to Z అన్నీ వాళ్ళే చేసేరమ్మా. ఒక్క పురోహితుడు సర్వీస్ తప్ప, మిగిలినవన్నీ వాళ్ళే ఏర్పాటు చేసేరు. అవసరమయితే ఆ సర్వీస్ కూడా ఉందన్నారు. మనకి మన అవధానిగారు ఉన్నారు కదా; అందుచేత అది అవసరం లేదన్నాము.’
రమణమ్మ – ‘మీ అమ్మాయి పెళ్లి చూసేం కదా. బాగా జరిగింది. ముఖ్యంగా భోజనాల ఏర్పాట్లు అందరు మెచ్చుకొన్నారండి. విస్తరివేసి వడ్డించేరు. కుర్చీల్లో కూర్చొని సదుపాయంగా తిన్నాం. (భర్తనుద్దేశించి) ఏమండీ, మనం కూడా అటువంటి ఎరేంజ్మెంటే చెయ్యాలండి.’
కృష్ణమూర్తి – ‘అలాగే చేద్దాం. వచ్చిన గెస్ట్‌లకు సదుపాయమవుతుంది.’
జానకి – ‘గౌరీగంప కూడా వాళ్ళే ఏర్పాటు చేసేరండి.’
రమణమ్మ – ‘అలాగా.. (భర్తనుద్దేశించి) చాలా బాగుందండి వాళ్ళ సర్వీసు.’
కృష్ణమూర్తి – ‘అవును, రమణీ. వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తే, మనకు చాలా టైము కూడా కలిసొస్తుంది.’
కృష్ణమూర్తి – ‘సార్, వాళ్ళు ఎడ్వాన్సు అడిగితే ఇవ్వొచ్చునా.’
జగదీష్ – ‘ఇవ్వండి. ఫరవాలేదు. మేము టు లేక్స్ ఎడ్వాంస్ ఇచ్చేమ్.’
రమణమ్మ – (జానకితో) ‘మీరు మాకొక పెద్ద సాయం చెయ్యాలండి.’
జానకి – ‘అయ్యో.. సాయం ఏమిటండి. అదేమిటో చెప్పండి. తప్పక చేస్తాం.’
రమణమ్మ – (జానకితో) ‘మేము మా తరఫు బంధువులందరికి ఉండడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అవసరం పడితే మీ ఇంట్లో ఓ గది ఆ రెండు రోజులకు ఇవ్వగలరా.’
జానకి – ‘అదేం భాగ్యం. తప్పకుండానండి. మీకు ఎప్పుడు కావాలో, నాకు రెండు రోజుల ముందు చెబితే గది తయారుగా ఉంచుతాను.’
జగదీష్ – ‘మీకు అవసరం పడితే మరో గది కూడా ఇవ్వగలమమ్మా. మొహమాటపడకండి.’
రమణమ్మ – ‘మెనీ మెనీ థేంక్సండి.’
జగదీష్ – ‘మూర్తిగారూ, పూర్ణిమ పెళ్లి విషయంలో మేము చేయగలిగినది ఏదున్నా, మాతో నిర్మొహమాటంగా చెప్పండి. We will do it with pleasure.’
కృష్ణమూర్తి – ‘ Sir, we are thankful to you both. మీతో మాట్లాడేక మాకు బాగా ధైర్యం వచ్చింది.’
రమణమ్మ – ‘ పెద్దవారు. మీ ఆశీర్వచనాలు ఉంటే కార్యం నిర్విఘ్నంగా జరుగుతుందని మా నమ్మకం.’
కృష్ణమూర్తి (నిలబడి) ‘మీరు ఏ పనిలో ఉండేవారో . చాలా టైం తీసుకొన్నాం. శలవిప్పించండి.’
( రమణమ్మ కూడా నిలబడి శలవు తీసుకొంటుంది. జగదీష్, జానకి, మర్యాదగా అతిథులతో తలుపు వరకు వెళ్లి, మరల వారి సోఫాలో ఆసీనులవుతారు.)
జానకి – ‘ఆ గిరీశం గాడి వ్యవహారం మాట్లాడ్డం ఏ ముహూర్తాన్న మొదలుపెట్టేమో; ఆ విషయం ఏమిటయింది తేలలేదు. ఏమండీ, వాడిదగ్గరనుండి మన డబ్బు వసూలు అవుతుందా, లేదా.’
జగదీష్ – ‘జానకీ, ఆ సంగతి భగవంతుడికే తెలియాలి. నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను కానీ నాకు ఏమీ ఆశ కనిపించడం లేదు.’
జానకి – ‘అదేమిటండి. అంత సొమ్ము ఎలా వదిలేసుకొంటామండి.’
( అంతలో పది, పన్నెండేళ్ల వయసు ఇద్దరు పిల్లలు వడి వడిగా ప్రవేశిస్తారు.)
జగదీష్ – (చిరాకుగా) ‘ఏమిట్రా ఎందుకొచ్చేరు మీరు ఇక్కడికి.’
(ఇద్దరు పిల్లలూ ఒకరి ముఖం లోకి ఒకరు చూస్తారు.)
ఒక కుర్రాడు -(బితుకు బితుకు మంట ) ‘అంకుల్, మా క్రికెట్ బాలు మీ పెరట్లో పడిపోయింది.’
జగదీష్ – (వ్యంగ్యంగా) ‘పడిపోయిందా.. అది ఎలా పడిందిరా.’
జానకి – ‘మీకు ఎన్ని మార్లు చెప్పేం. బాలు ఎవరింట్లోనూ పడకుండా జాగ్రత్తగా ఆడండని. ‘
మొదటి కుర్రాడు – ‘మేము ఎంతో జాగ్రత్తగానే ఆడుతున్నాం, ఆంటీ.’
జగదీష్ – ‘అయితే బాలు మా ఇంట్లో ఎలా పడ్డాదిరా.’
రెండో కుర్రాడు – ‘ఆ గోపీగాడు వద్దని చెప్పినా సిక్సరు కొట్టేడు అంకుల్.’
జగదీష్ – ‘వాడెవడో ఆ కోహిలీ గాణ్ణి ఇంక ఆడించకండి.’
మొదటి కుర్రాడు – ‘అంకుల్..’
జగదీష్ – ‘ ఏమిటి గొణుగుతున్నావ్.’
రెండో కుర్రాడు – ‘అంకుల్ వాడు.. మా లెక్కలు టీచరు కొడుకు.’
జగదీష్ – (చిరునవ్వుతో , జానకిని చూస్తూ) ‘ఈ వయసునుండీ వీళ్లకు ఎన్ని రాజకీయాలో చూడు.’
( కుర్రాళ్లతో ) ‘సైడు గేటులోనుండి వెళ్లి మీ బాలు తీసుకోండి.’
జానకి – ‘వెళుతున్నప్పుడు, గేటు వేసి మరీ వెళ్ళండి. లేకపోతే పశువులు పెరట్లో జొరబడతాయి.’
ఇద్దరు పిల్లలు – ‘థేంక్ యు అంకుల్.. థేంక్ యు ఆంటీ.’
(ఇద్దరు పిల్లలూ నిష్క్రమిస్తారు)
జానకి – ‘ఈ లోపల మరెవరూ రాకుండా ఆ గిరీశంగాడి విషయం జరిగిందంతా చెప్పండి.’
జగదీష్ – ‘వాడి వ్యవహారం చూసి, బాకీ అద్దె మాట అటుంచి, వీలయినంత తొందరగా వాడిచేత మన ఇల్లు ఖాళీ చేయించడం మంచిదనిపించింది.’
జానకి – ‘అయ్యో, ఖర్మ. మనకివ్వాల్సిన బాకీ వసూలు చేసుకోకుండా ఖాళీ చేయిస్తే, వాడు మనకు ఆ బాకీ సొమ్ము ఎందుకిస్తాడండీ.’
జగదీష్ – ‘జానకీ, వాడు ఇంకా ఉన్నట్టయితే, కాగితం మీద రాసుకోడానికి బాకీ ఎమౌంటు పెరుగుతుంది తప్ప; వాడు ఎన్నాళ్ళు ఉన్నా అదే పరిస్థితి. వాణ్ణి ఎంత వేగిరం వదిలించుకొంటే అంత మంచిది.’
జానకి – ‘అయ్యో, ఖర్మ. దండవంకీ కాకపోయినా, బ్యాంకులోనైనా ఫిక్సిడు డిపాజిట్లో పెట్టుకోవచ్చనుకొన్నాను. మొదటికే మోసమవుతుందనుకోలేదు.’
జగదీష్ – ‘నువ్వన్నట్టు మన ఖర్మ.’
జానకి – ‘అయ్యో, ఖర్మ. ఏడుకొండలవాడా, వెంకటరమణా, మాకు రావలసిందంతా వసూలయితే, నీ హుండీలో వెయ్యి రూపాయలు సమర్పించుకొంటాను నాయనా. వాణ్ణి మా ఇంట్లోనుండి బయటకు పంపు నాయనా.’
జగదీష్ – ‘జానకీ ఇంకా విను. వాణ్ణి వెంటనే ఇల్లు ఖాళీ చెయ్యమంటే, దానికి వాడో కండిషన్ పెట్టేడు.’
జానకి – ‘వాడి వల్లకాడు. మన ఇల్లు ఖాళీ చెయ్యడానికి వాడి కండిషనేమిటండీ.’
జగదీష్ – ‘మన ఇల్లు ఖాళీ చెయ్యడానికి, ఆ స్కౌండ్రలుకు మనం యాభై వేలు ఇవ్వాలిట.’
జానకి – ‘ఇదేం విడ్డూరమండి. మనం వాడికి ఎందుకివ్వాలండీ.’
జగదీష్ – ‘వాడి దగ్గర ఇప్పుడు నయాపైసా లేదట. అందుచేత, మనం యాభై వేలు ఇస్తే, అది ఎడ్వాన్సుగా ఇచ్చి, మరో ఇంటికి మారుతాడట.’
జానకి – ‘మరి మన బాకీ మాటేమిటి.’
జగదీష్ – ‘ఎప్పటి పాటే. ఆయనగారికి రావలసింది అందగానే ఇస్తాడట.’
జానకి – ‘వాణ్ణి తగలపెట్టా. మన సొమ్ము మనకు ఇవ్వడం పోయి, వాడికి మనం ఇచ్చుకోవాలా.’
జగదీష్ – ‘రోజులు అలా ఉన్నాయి జానకీ. అటువంటి వాళ్ళే పెద్దమనుషులుగా చలామణీ అవుతున్నారు.’
జానకి – ‘పోనీ, మనకు ఇవ్వవలసిన దాంట్లో పాతికవేలు కొట్టుకొని మిగతాది మనకిచ్చి ఇల్లు ఖాళీ చేస్తే వాణ్ణి వదిలించుకోవచ్చు.’
జగదీష్ – ‘జానకీ, నీకు సమస్య బోధపడినట్టు లేదు. వాడిప్పుడు మనకు నయాపైసా ఇవ్వలేనంటున్నాడు. అదెప్పుడో, వాడి లక్షలు వస్తే ఇస్తాడట. ఈ లోగా వాడు ఇల్లు ఖాళీ చెయ్యాలంటే ఆయనగారికి మనం యాభై వేలు సమర్పించుకోవాలన్నాడు. బోధపడిందా.’
జానకి – ‘అయ్యో, ఖర్మ. అయితే ఏమిటి చేద్దామనుకొంటున్నారండి.’
జగదీష్ – ‘నాకూ ఏమీ తోచలేదు. మా డిపార్టుమెంటులో హనుమంతయ్యగారని ఒకాయన నా దగ్గర పనిచేస్తూ ఉండేవారు. ఆయన ఇప్పుడు సీనియర్ పొజిషనులో ఉన్నారు. ఆయనకు పోలీసు డిపార్టుమెంటులో పెద్దవాళ్ళతో పరిచయముంది. ఆయన్ని కలిసి, విషయం చెప్పేను. ఆయన తనకు తెలిసిన పోలీసు అసిస్టెంట్ కమిషనరుతో మాట్లాడి చెబుతానన్నాడు. చూద్దాం. పోలీసు వాళ్ళు భయపెడితే, డబ్బు వెంటనే వసూలు కాకపోయినా, కనీసం ఇల్లు ఖాళీ చేయిస్తారనుకొంటాను. ఏ సంగతీ రేపు తెలుస్తుంది.’
జానకి – ‘ఏమి రోజులొచ్చేయండి. రేపు తెలుస్తుందన్నారు గదా. చూద్దాం. నేను వెళతాను. తయారయి సుభద్రమ్మగారింట్లో పేరంటానికి వెళ్ళాలి.’
(తెర పడును)
(సశేషం)
శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం నవంబరు, 1936 లో జన్మించారు. M.A. మరియు P.G. Diploma in Personnel Management పాసయ్యారు. ఉద్యోగ పర్వం, హైస్కూలులో ఉపాధ్యాయుడుగా ప్రారంభించి, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఒక ఉన్నతాధికారిగా చేసి, 1994 లో విశ్రాంతి తీసుకొన్నారు. అమెరికా వాసి.
హైస్కూలు విద్యార్థిగా రంగస్థల ప్రవేశం చేసేరు. గడచిన అయిదు సంవత్సరములవరకు, చిన్న నాటికలు రాసి, వాటిలో పాత్రలు ధరించి, దర్శకత్వం చేసేరు.
గత అయిదు సంవత్సరాలనుండి, కథలు, కవితలు రాయడం ప్రారంభించేరు. ఈ నాటికి, 25 కథలు, 3 కవితలు ప్రచురణమయ్యేయి.