Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘పీకే’ చిత్రం హిందూ మతాన్ని కించపరిచిందా?

[‘పీకే’ అనే హిందీ సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

2014లో వచ్చిన ‘పీకే’ చిత్రం అప్పుడూ చూశాను, ఈ మధ్యనే మళ్ళీ చూశాను. అప్పట్లో చాలామంది ఈ చిత్రం మీద గుర్రుగా ఉండేవారు. ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రం వచ్చినపుడు మళ్ళీ ‘పీకే’ చిత్రం చర్చలోకి వచ్చింది. హిందూ మతాన్ని కించపరిచారని అభియోగం వేశారు. నిజానికి నాకు అప్పుడూ ఈ అభియోగం సరైనది అని అనిపించలేదు. ఇప్పుడూ అనిపించలేదు.

ముందు కథ చెప్పుకుందాం. ఒక గ్రహాంతరవాసి వ్యోమనౌకలో భూమి మీదకి వస్తాడు. అతని మెడలో ఒక మణి లాంటిది ఉంటుంది. వ్యోమనౌకకి సందేశం పంపే సాధనమది. భూమి మీద దిగిన కాసేపటికే ఆ మణిని ఒక మనిషి దొంగిలించి పారిపోతాడు. ఆ గ్రహంతరవాసి ఆ మణి కోసం వెతకడమే చిత్ర కథ. అతనికి పీకే అని పేరు స్థిరపడుతుంది (ఎందుకో తర్వాత చెప్పుకుందాం). అమాయకుడు. మన భాషలేం రావు. వాళ్ళ గ్రహం మీద మెదడు నుంచి మెదడుకి కమ్యూనికేషన్ జరిగిపోతుంది. భోజ్‌పురి భాష నేర్చుకుంటాడు (ఇదీ తర్వాత చెప్పుకుందాం). తన మణిని అతను రిమోట్ అంటాడు. అది ఒక సాధనం అంతే. భూమి మీద దాని విలువ ఎక్కువని అతనికి తలియదు. నా రిమోట్ పోయింది అని అందరినీ అడుగుతాడు. ఇంకే వివరాలూ తెలియవు. అందరూ “ఆ దేవుడే నీకు సాయం చేయాలి” అంటారు. అతను దేవుడికి మొరపెట్టుకుంటాడు. అయినా లాభం ఉండదు. కాబట్టి దేవుడు కనిపించుటలేదు అని కరపత్రాలు పంచుతాడు. జగజ్జనని (ముద్దుపేరు జగ్గు) అనే టీవీ రిపోర్టర్‌కి తారసపడతాడు. ఆమె అతని కథ తెలుసుకుంటుంది. అతనికి సాయం చేస్తుంది.

తపస్వి అనే స్వామీజీ దగ్గర పీకే మణి ఉందని తెలుస్తుంది. ఆయన అది శివుడి డమరుకం నుంచి హిమాలయాల్లో ఊడిపడిన మణి అని ప్రచారం చేస్తాడు. జగ్గు తండ్రికి తపస్వి అంటే అమిత భక్తి. జగ్గుకి మాత్రం ఆయన పద్ధతులు నచ్చవు. ఆయన తన భక్తుల సమస్యలు విని దేవుడిని ప్రార్థించి ‘తీర్థయాత్ర చేయండి’, ‘దానం ఇవ్వండి’ అని పరిష్కారాలు చెబుతాడు. పీకే మనుషుల పద్ధతులు తెలుసుకుంటాడు. మనుషులు ఒకోసారి రాంగ్ నంబర్ వస్తే సరదాకి అబద్ధాలు చెబుతారని తెలుసుకుని తపస్వి దేవుడితో మాట్లాడటం లేదని, దేవుడి బదులు రాంగ్ నంబర్‌లో ఎవరో తపస్వికి తప్పుడు సలహాలు ఇస్తున్నారని పీకే అంటాడు. జగ్గు వల్ల ఇది దేశవ్యాప్తంగా ప్రచారం అవుతుంది. ఒకరోజు అనుకోకుండా దొంగ జాడ తెలుస్తుంది. అతనే నలభై వేలకి మణిని తపస్వికి అమ్మాడు. అయితే నిజం ప్రపంచానికి తెలిసే లోపే ఒక బాంబు పేలుడులో దొంగ మరణిస్తాడు. చివరికి తపస్వికి, పీకేకి టీవీలో ముఖాముఖి జరుగుతుంది. అందులో జగ్గు ప్రేమ వ్యవహారంలో తపస్వి తప్పుడు జోస్యం చెప్పాడని తెలియటంతో పందెంలో మణి పీకే చేతికి వస్తుంది. అతను తన గ్రహానికి వెళ్ళిపోతాడు.

చిత్రంలో కథాబలం పెద్దగా లేదు. జగ్గు ప్రేమ వ్యవహారం మీద అంతా ఆధారపడటం చాలా బలహీనంగా అనిపిస్తుంది. అది అలా ఉంచితే తపస్వి పాత్ర ద్వారా హిందువులని కించపరిచారని చాలామంది అంటారు. ఒక సన్నివేశంలో శివుడి వేషం వేసుకుని ఉన్న ఒకతన్ని చూసి పీకే అతడే శివుడనుకుని వెంటపడటం, అతను పారిపోవటం – ఇది కూడా చాలామందికి నచ్చలేదు. నిజమే, ఈ సన్నివేశం మరీ సాగదీయటం వలన కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఆ వ్యక్తి తపస్వి సభలోకి వెళ్ళటం, అతని వెనక వెళ్ళిన పీకేకి అక్కడ మణి కనపడటం కూడా జరుగుతాయి. శివుడి వల్లే మణి కనిపించిందని పీకే ఆనందపడతాడు.

హిందువుల దేవతలందరూ కనపడటం లేదని పీకే కరపత్రాలు పంచటం – హిందువులకి ఎందరో దేవుళ్ళు అనే అంశాన్ని హైలైట్ చేసినట్టు అనిపిస్తుంది. హిందువులకి ఎందరో దేవుళ్ళు ఉన్నా ఏ దేవుడూ తక్కువ కాదు. శివ స్తోత్రాలలో బ్రహ్మ, విష్ణువు శివుడిని అర్చించారని ఉంటుంది (బ్రహ్మ మురారి సురార్చిత లింగం). వేంకటేశ్వర సుప్రభాతంలో లక్ష్మిని బ్రహ్మ భార్య, శివుడి భార్య అర్చించారని ఉంటుంది (విధి శంకరేంద్ర వనితాభిరర్చితే). ‘యా కుందేందు’ శ్లోకంలో సరస్వతికి బ్రహ్మ, విష్ణువు, శివుడు వందనం చేస్తారని ఉంటుంది (యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా వందితా). ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ఏ దేవతని ప్రార్థించినా సర్వం ఆయనే/ఆమే అనుకోవాలి. పండితులు సరస్వతిని సర్వంగా భావించవచ్చు. ధనవంతులు లక్ష్మిని పరదేవత అనుకోవచ్చు. విరాగులు శివుడిని ఆశ్రయించవచ్చు. ఆర్తులు విష్ణువుని ప్రార్థించవచ్చు. ఒకే దేవుడికి అనేక రూపాలే హిందువుల దేవతలు. ఆ ఒక్క దేవుడూ నిరాకార నిరంజన పరబ్రహ్మమే. ఏ దేవుడిని ఆరాధించినా చివరకి నిరాకార తత్వం తెలుసుకోవలసిందే. ఇది తెలియనివారు అనేక దేవుళ్ళు అనుకుంటారు.

భక్తుల కష్టాలకి తపస్వి ‘తీర్థయాత్రలు చేయండి’, ‘దానం చేయండి’ అని చెప్పటం తప్పా? తప్పు కాదు. కానీ అధర్మంగా జీవితం గడుపుతూ కేవలం తీర్థయాత్రలు చేసి, దానాలు చేసి కష్టాలు తీరిపోవాలంటే తీరవు. తీర్థయాత్ర శరణాగతి భావంతో చేయాలి, దానం నిరహంకారంగా చేయాలి. ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ఒకవేళ అధర్మంగా అంతవరకు జీవితం గడిపినా మళ్ళీ ధర్మమార్గంలోకి రావటానికి తీర్థయాత్ర ఒక పద్ధతి. మనిషి జీవితం మీద ప్రారబ్ధ కర్మ ప్రభావం కూడా ఉంటుంది. రామకృష్ణ పరమహంస సతీమణి శారదా దేవి వాక్కు ఏమిటంటే శరణాగతి చేస్తే ప్రారబ్ధ కర్మ తీవ్రత తగ్గుతుంది. ఒళ్ళు చీరుకుపోవాల్సిన చోట సూది పోటుతో కర్మ క్షయిస్తుంది. మన కర్తవ్యం మనం ధర్మంగా చేస్తూ దేవుడిని స్మరిస్తే ఫలితం ఉంటుంది. మొక్కుబడిగా చేసే తీర్థయాత్ర, అయిష్టంగా చేసే దానం కష్టాలని తొలగించవు. తపస్వి లాంటి వారు ఈ జ్ఞానాన్ని బోధించరు. వారు కపట సన్యాసులు. డబ్బు గడించటానికి ఏవో చెబుతారు. అసలు వారికి జ్ఞానం ఉందో లేదో కూడా సందేహమే.

పీకే అనేది ఏమిటంటే దేవుడు మనకి తండ్రి. ఆయన దగ్గరకి వెళ్ళి మొరపెట్టుకుంటే ‘ఓ మూడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడి వచ్చి నాకు చెప్పుకుంటే నీ కోరిక తీరుస్తాను’ అంటాడా? తండ్రి కొడుకుతో ఇలా అంటాడా? ఈ వాదనా సరి కాదు. దేవుడికి మమకారం, ద్వేషం ఉండవు. వీడు మొరపెట్టుకున్నాడు కాబట్టి వీడెలాంటివాడైనా వీడి కష్టం తీరుస్తాను అనుకోడు. వీడి కర్మని బట్టే ఫలం ఉంటుంది అనే నియమం ఒకటి దేవుడు పెట్టాడు. ఆ నియమం ఆషామాషీగా ఆయన ఉల్లంఘించడు. మనిషి ధర్మమార్గంలో ఉండి శరణాగతి చేస్తేనే దేవుడు కరుణిస్తాడు. అయినా కష్టసుఖాలు కలిసి ఉండేదే మనిషి జీవితం. కష్టం వస్తే నాకీ కష్టం ఎందుకొచ్చిందని అడుగుతారు కానీ సుఖం వస్తే నాకీ సుఖం ఎందుకొచ్చిందని ఎవరూ అడగరే? సుఖాన్ని ఆస్వాదించినట్టే కష్టాన్ని కూడా భరించాలి. ప్రవచనకర్త గరికిపాటి మాటల్లో చెప్పాలంటే దుఃఖాన్ని తట్టుకున్నట్టే సుఖాన్ని కూడా తట్టుకోవాలి. సుఖం వచ్చినపుడు పొంగిపోకూడదు. పీకేకి కష్టం ఎందుకొచ్చింది? చిత్రనిర్మాతలు, దర్శకుడు ఏమనుకున్నా నాకనిపించినది అతను నిమిత్తమాత్రుడు. తపస్వి దొంగసన్యాసి అని ప్రపంచానికి తెలియటానికే పీకే మణి అతని చేజారిపోయింది.

ఈ విషయాలన్నీ పీకేకి ఎవరూ చెప్పరెందుకు? చెప్పటానికి ముందు తెలియాలి కదా? దేశమంతా ప్రచారం జరిగినపుడు ఎవరో ఒక జ్ఞాని ఈ విషయం పీకేకి చెప్పాలి కదా? జ్ఞానులు ఈ ప్రచారాలు పట్టించుకోరు. వారి స్థితి బ్రాహ్మీస్థితి. అయినా అరకొర జ్ఞానం ఉన్న నాలాటి వాడు చెప్పడా? ఇలాంటివన్నీ సినిమాలో పెడితే సినిమా తీసిన వాళ్ళకి డబ్బులు రావు. అందుకే వారు పెట్టరు. ‘తపస్వి జనాలని మోసం చేస్తున్నాడు, పీకే అడిగిన ప్రశ్నలకి తపస్వి దగ్గర సమాధానం లేదు’. అదే ఈ సినిమా పరిధి. దొంగ సన్యాసి పాత్రని పెట్టి సినిమా ఎందుకు తీయాలి అని అడిగేవారున్నారు. సమాజంలో దొంగ సన్యాసులు లేరా? మరి సినిమాలో పెడితే తప్పేంటి?

చిత్రంలో ఇంకో విషయం – భయం కారణంగా మనుషులు దేవుడిని పూజిస్తారని పీకే అంటాడు. పరీక్షల భయంతో విద్యార్థులు ఏ రాయికైనా మొక్కుతారు. ఇది జరుగుతున్న విషయమే. కష్టపడాలి. కష్టపడకుండా దేవుడికి మొక్కితే లాభం లేదు. ఏడాదంతా పైలాపచ్చీసుగా తిరిగి పరీక్షల సమయంలో దేవుడికి మొక్కితే ఏం లాభం? కష్టపడిన వాడికి దేవుడి అండ ఉంటుంది. కానీ ఇది చెప్పేవాళ్ళు తక్కువ. పేపర్లు లీకు చేసి అనర్హులకి సీట్లు వచ్చేలా చేసేవారున్నంతవరకు కష్టపడకుండా ఫలితం కోరుకునేవారు కూడా ఉంటారు. మరి అధర్మం చేసేవారికి శిక్ష ఉండదా? తప్పకుండా ఉంటుంది. దేవుడి న్యాయత్రాసు సూచీ ఖచ్చితమైనది. ఆలస్యమైనా అది కర్మ సిద్ధాంతం గీసిన గిరిలోనే ఉంటుంది.

ఈ చిత్రం దొంగ సన్యాసుల మీద వేసిన అస్త్రమే కానీ హిందూ మతం మీద కాదు. కానీ వ్యాపార పరిధుల వల్ల కొన్ని ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. అయినా చివరికి పీకే కోరిక తీరింది కదా? అలా చూసుకున్నా అమాయకులకి దేవుడు సాయం చేస్తాడు అని చెప్పకతప్పదు. ఈ క్రమంలో పీకే తపస్వి దొంగ సన్యాసి అని నిరూపిస్తాడు. దాని కోసం దేవుడు పీకేని వినియోగించుకున్నాడు. పీకే ఎంత అమాయకుడంటే తపస్వి నిజంగానే దేవుడితో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడని, అతనిని మధ్యలో ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారని అనుకుంటాడు. దొంగ దగ్గర మణిని కొన్నాడని తెలిశాక గానీ తపస్వి దొంగ సన్యాసి అనే విషయం అతనికి బోధపడదు. క్రిస్టియన్ ఫాదర్లు మతమార్పిడులు చేయటానికి ప్రయత్నిస్తారని, ముస్లిం మతపెద్దలు ఆడపిల్లలని చదువుకోనివ్వరని కూడా ఈ చిత్రంలో ప్రస్తావించారు.

పీకే అమాయకపు ప్రశ్నలతో జనాన్ని విసిగిస్తుంటే ‘పీకే హై క్యా?’ అని అడుగుతారు. అంటే ‘తాగి ఉన్నావా?’ అని అర్థం. క్రియాపదాన్ని నామవాచకంగా తీసుకుంటే ‘పీకేవా?’ అని అర్థం. అందుకే అతనికి పీకే అనే పేరు స్థిరపడిపోతుంది. ఇది రచయితలు చేసిన చమక్కు. విధు వినోద్ చోప్డా, రాజ్‌కుమార్ హిరానీ స్క్రీన్ ప్లే రాశారు. హిరానీ దర్శకత్వం వహించాడు. ఆమిర్ ఖాన్, అనుష్కా శర్మ, సౌరభ్ శుక్లా ముఖ్యపాత్రలు పోషించారు. ఆమిర్ ఖాన్ అనుష్కా శర్మ కన్నా పొట్టిగా ఉంటాడు. అయినా ఏ భేషజం లేకుండా అతను నటించటం ముచ్చట గొలిపే విషయం. చిత్రంలో పీకే భోజ్‌పురీ భాష నేర్చుకోవటం ఇంకో సృజనాత్మకమైన సన్నివేశం. పీకే గ్రహంలో అందరికీ ఒక శక్తి ఉంటుంది. చేతులు పట్టుకుని కొన్ని గంటలు కూర్చుంటే ఒకరి మేధస్సులో ఉన్నవన్నీ మరొకరికి బదిలీ అయిపోతాయి. పీకే మూగగా ఉండటం, ఎవరి చేతులైనా పట్టుకోవాలని ప్రయత్నించటం చూసిన అతని మిత్రుడొకడు అతనికి శృంగారం కావాలేమోనని అతన్ని ఒక వేశ్య దగ్గరకి తీసుకువెళతాడు. ఆమె భోజ్‌పురి మాట్లాడే స్త్రీ. పీకే ఆమె చేతులు పట్టుకుని కూర్చుని ఆమె భాష నేర్చుకుంటాడు. ఆమె దగ్గర నుంచి రాగానే పీకే మాట్లాడటం చూసి అతని మిత్రుడు ‘ఆమెతో గడిపి రాగానే వీడికి మాటలొచ్చాయి’ అనుకోవటం ఒక హాస్యపు మెరుపు. కానీ వేశ్య పాత్ర కీలకం కావటం ఆ పాత్రకి ఒక గౌరవం తీసుకువచ్చింది.

చిత్రంలో మరో లోపం ఏమిటంటే పీకే అసలు భూమి మీదకి ఎందుకొచ్చాడు అనేది స్పష్టంగా ఉండదు. మనం ఇతర గ్రహాల మీదకి పరిశోధనల కోసం వెళతాం. హాలీవుడ్ చిత్రమైతే కనీసం సంభాషణలోనైనా అతను ఎందుకు వచ్చాడో చెప్పేవారు. మనవాళ్ళు ప్రేక్షకులని తక్కువ అంచనా వేస్తారు. సైన్స్, రీసెర్చ్ అంటే ప్రేక్షకులకి నచ్చదు అనుకుంటారు. పీకే కూడా పరిశోధన కోసం వచ్చాడనుకుందాం. మరి పరిశోధన ఏమీ చేయకుండా మణి కోసం వెతకటమే సరిపోతుంది. పైగా పీకే జగ్గుని ప్రేమించినట్టు కూడా చూపించారు. ప్రతీదీ ప్రేమకథే కావాలా? జగ్గు ప్రేమకథ కూడా పేలవంగా ఉంటుంది. ఆమె బెల్జియంలో ఉండగా ఒక పాకిస్థానీ యువకుడిని ప్రేమించింది. అతను ముస్లిం కాబట్టి మోసం చేస్తాడని తపస్వి జోస్యం చెబుతాడు. ఒక అపార్థం (ఈ అపార్థం కూడా హాస్యాస్పదంగా ఉంటుంది) వల్ల జగ్గు అతను మోసం చేశాడని అనుకుంటుంది. చివరికి అతను మోసం చేయలేదని, ఆమె కోసం వేచి ఉన్నాడని తెలియడంతో తపస్వి జోస్యం విఫలమైందని చెప్పి తపస్వి దొంగ సన్యాసి అని తేలుస్తారు. ఇంత కన్నా మంచి ముగింపు పెట్టకపోవటం ఒక పెద్ద లోపం.

Exit mobile version