Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కలం హలంగా సాగిన అక్షర సేద్యం ‘పొలంగట్లవెంట’

[శ్రీ బండ్ల మాధవరావు రచించిన ‘పొలంగట్లవెంట’ అనే కవితాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

దేశ విదేశాలలో ఒక సాహితీప్రక్రియగా కవిత్వం ఎన్నో శతాబ్దాలుగా అజస్రధారగా ప్రవహిస్తోంది. అసలు కవిత్వం ఎందుకు రాస్తారు అని ప్రశ్నించుకుంటే, “People write poetry primarily for self-expression, allowing them to process complex emotions, articulate intangible feelings, and document personal experiences. It serves as a creative outlet to explore ideas, foster empathy, and connect with others through shared human experiences.” అని సమాధానం లభిస్తుంది.

ప్రాథమికంగా భావ వ్యక్తీకరణ కోసం – తమ భావోద్వేగాలను, ఆంతరిక అనుభూతులను, వ్యక్తిగత అనుభావాలను పంచుకోవడం కోసం కవిత్వం వెలువరిస్తారని చెప్పుకోవచ్చు.

క్రమంగా కేవలం భావ వ్యక్తీకరణ కోసమే కాకుండా, సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు ప్రతిస్పందనగా కవిత్వాన్ని సృజించసాగారు కవులు. సంఘంలో జరుగుతున్న అరాచకాల పట్ల గొంతెత్తలేని బలహీనుల పక్షాన నిలిచి, వారి వేదనలను తమ స్వరంలో గట్టిగా వినిపించసాగారు.

కవి అంటే కష్టజీవికి రెండు వైపులా ఉండేవాడని నమ్మి, తమదైన నిబద్ధతతో తెలుగులో కవిత్వం నిజాయితీగా  వెలువరిస్తున్న అరుదైన సమకాలీన కవులలో శ్రీ బండ్ల మాధవరావు ఒకరు.

‘పొలంగట్లవెంట’ వారి ఏడవ కవితాసంపుటి. “అసలు వ్యవసాయానికే దూరమైపోయిన మనిషి ఎటువంటి వెతను అనుభవించాడో, ఆ వెతను మనకు వినిపిస్తున్నాడు” అనీ; “ఈ కవి రైతును కలవరిస్తూ కలత చెందుతూ పలు వెతల్లోంచి పదాల్లోకి దృశ్యాదృశ్యంగా పరుగులు పెడుతున్నాడెందుకు?” అని వ్యాఖ్యానించారు శ్రీ సీతారామ్ తమ ముందుమాటలో.

~

శీర్షిక తెలుపుతున్నట్లే ఈ సంపుటిలో రైతు సంబంధిత కవితలు ప్రధానం. ఆపై నదుల కవితలు; వాన కవితలు. మట్టి, నీరు.. మనిషి జీవితానికి ఎంత కీలకమో ఈ కవితలు చెబుతాయి. ఇవే కావు, ఈ సంపుటిలో వ్యవస్థ లోని లోపాలను ప్రశ్నించే కవితలున్నాయి. మనిషితనాన్ని కోల్పోతున్న వైనంపై ఆవేదన వ్యక్తం చేసే కవితలు కొన్ని ఉన్నాయి. సాటి మనిషి వేదనకి చలించి, మనుషులుగా తోటివారిని కాస్త పట్టించుకోమని సూచించే కవితలున్నాయి. స్నేహాలను, బాంధవ్యాలను దూరం చేసి, బతుకుని ‘తెర’కే పరిమితం చేస్తూ వ్యక్తులని socialization కి దూరం చేస్తూ కొండచిలువలా నలిపేస్తున్న ఆధునిక సాంకేతికత పట్ల హెచ్చరించే చక్కటి కవిత ఉంది.

~

రైతు కవితలు:

పాలకుల విధానాల పట్ల తమ నిరసన వ్యక్తం చేసిన రైతుల పోరాటాన్ని కళ్ళకు కడుతుంది ‘అశబ్ద నినాదం’ కవిత. రైతులది “అన్నానికి ఊపిరిలూదే పరుగు/మట్టిని పతాకంగా ఎగరేసే పరుగు/ఆవలి తీరం చేరేదాకా ఆగని పరుగు” అంటూ వారి నిశ్చయాన్ని దృఢం చేస్తారు కవి.

“సరళరేఖలా సాగాల్సిన కొండ్ర/వంకరటింకరగా సాగుతోంది” అంటారు కవి ‘మట్టిదాహం’ కవితలో. వ్యవసాయ రంగంలోని అస్తవ్యస్తతకి దర్పణాలు ఈ వాక్యాలు. “మట్టిలో పండిన అన్నం/మట్టిలో పడి పనికిరానిదవుతోంది” అనే వాక్యాలలోని ఆర్తి – ఆహార వృథాని ప్రశ్నిస్తుంది.

వ్యవసాయ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సాగిన పోరుకై ఓ మహిళా రైతు నడిచిన తీరుని, ఆమె నడకలోని ధైర్యాన్ని, పట్టుదలని ఒడిసిపట్టిన కవిత ‘ఆమె నడుస్తూనే ఉంది’. “ఎకరాల పొలాలు గజాలుగా మారాకా/మట్టిని తనని తవ్వుకుపోతున్న/సరికొత్త రాక్షస మూకల్ని ఎదుర్కోడానికి/అపరకాళికలా మళ్ళీ నడుస్తోంది” అనే వాక్యాలలో సాగుభూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతున్న చేదునిజం గోచరిస్తుంది.

సాగుకి అననుకూలమైన పరిస్థితుల మధ్య ‘పొల్లాల్లో ఆకలి విరగకాస్తోంద’ని, “మట్టిమెతుకుల ముద్ద/ఎవరి పొట్టా నింపడం లేదు” అని వాపోతారు కవి ‘యాత్ర’ కవితలో. తీవ్రమైన వేదన నిండిన కవిత.

పుస్తకానికి శీర్షికగా నిలిచిన ‘పొలంగట్లవెంట’ కవిత గట్ల వెంబడి విశ్రాంతి లేని నడక ఎందుకో చెబుతుంది. “గింజ మీద ఆశలన్నింటిని/కళ్ళల్లో పెట్టుకుని నడక” అన్న వాక్యాలలో రైతుల ఆశలని; “చెమటతో తడిసిన/ఆరుగాలపు పంట/ఆరు కాలాలు/కంచంలో అన్నమవుతుందో లేదో” అన్న భయాన్నీ; “మట్టిని నమ్ముకున్నాక/ఈ రోజో రేపో ఎప్పుడైనా/ అక్కున చేర్చుకోకపోదు” అన్న నమ్మకాన్నీ వ్యక్తం చేస్తుందీ కవిత.

ఎండమావుల్లో జమ్మిచెట్టు’ కవిత ఆహార/వాణిజ్య పంటల రైతల వ్యథలను చాటుతుంది. మిర్చి, పత్తి, పొగాకు రైతుల దుస్థితిని కళ్ళకు కడుతుంది. దళారీల మోసాలను ప్రదర్శిస్తుంది. “ఎలపల దాపట ఎద్దులు రెండు/జీవితాన్ని చెరో వైపు లాక్కెళ్ళిపోయాయి” అనడంలో రైతు జీవితంలో సంశయాలు, నిస్సహాయతలు ప్రతిబింబిస్తాయి.

ఆకుదీసిన ఈనెలు’ కవిత పొగాకు శ్రామిక మహిళల కష్టాన్ని కళ్ళకు కడుతుంది. “చూర్ణమైపోతున్న బతుకులు/ఆకుదీసిన ఈనెల్లా/చెత్త కుప్పలు చేరుతున్నాయి” అనడంలో కవి ఆవేదన పాఠకుల హృదయాలను తాకుతుంది.

~

నదుల కవితలు:

“నన్ను నిండా ముంచెత్తిన/నీరు లేని నది గురించే చెప్పాలి” అంటారు ‘నది – నేను’ కవితలో. నీరు లేని నది ఎలా ముంచేసింది అని ఓ క్షణం అనిపించినా, నీరు ముంచేయడం కాదు, నీరు లేక, పంటలు పండక, కష్టాలు రైతుని ముంచేసాయని స్ఫురిస్తుంది. “నది పక్కనే నడుస్తున్న జీవితాన్ని/ఎప్పటికీ తడపలేని నది గురించే/నాలుగు వాక్యాలు రాయాలి” అంటారు కవి.

ఏడాదికొకసారైనా’ కవిత పక్కనే నది పారుతున్నా, వర్షాధారమైన వ్యవసాయం కష్టాలను చాటుతుంది. “ఏ రూపంగా నైనా నదికి నమస్కరించాల్సిందే” అంటారు కవి. అలా ఎందుకన్నారో మాధవరావుగారి ఇంటర్వ్యూలో చదవండి.

~

వాన రాదారుల్లో’ కవితలో అకాలంలో కురిసే వర్షాలు రైతులకెంత నష్టం కలగజేస్తాయో చెబుతారు. “వానంటే మొలలోతు నీళ్ళలో మునిగిన/ఆరుగాలపు కష్టం” అని వ్యాఖ్యానిస్తారు. “నీరింకిపోవాల్సిన చోట/మనిషింకిపోవడమే విషాదం” అన్న కవి వాఖ్యలోని వేదన మనసు బరువెక్కిస్తుంది.

మనుషుల వంతెన నిలవాలి అంటూ తరచు మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తుంది ‘విడివిడిగా’ కవిత.

“ఎవరినైనా నమ్మించడం పెద్ద విషయమేమీ కాదు/కొనసాగించడమే అత్యంత క్లిష్టతరం” అంటూ జీవన సత్యాన్ని చాటుతుంది ‘అబద్ధం’ కవిత.

~

జీవితం గురించి కవి గొప్పగా చేసిన ఒక వ్యాఖ్యని పంచుకుంటాను. “తరిగిపోతున్న దాని చుట్టూనో/తగ్గాల్సిన దాని చుట్టూనో/జీవితం పదే పదే తిరుగుతూనే ఉంటుంది” అంటారు ‘తగ్గేదేలే’ కవితలో. ఓ సినిమాలోని డైలాగ్ పై వేసిన సెటైర్ అని పైకి అనిపించినా, అంతకు మించిన లోతు, గాఢత ఉన్న కవిత.

~

కవిత్వం గురించి, Alice Osborn అనే కవయిత్రి చెప్పిన మాటలు – “Poetry, if we let it and embrace it, can offer us a way to empathize with one another. In its immediacy, poetry is a counselor helping us to understand one another.” ఎంతో నిజమనిపిస్తాయి ఈ సంపుటిలోని కవితలు చదివాకా.

కవి కలాన్ని హలంగా చేసి, అంతరంగాన్ని మథించి చేసిన అక్షరసేద్యం ఈ కవితా సంపుటి.

పుస్తకం తయారీలో చిన్న పొరపాటు దొర్లింది. కొన్ని కవితలకి సంబంధించి ఇండెక్స్‌లో ఉన్న పేర్లు, పేజీ నెంబర్లు టాలీ కాలేదు. ముందు అనుకున్న క్రమాన్ని మార్చినప్పుడు బహుశా ఇండెక్స్ అప్‌డేట్ అయి ఉండదు. అంతే! ఈ పొరపాటు ప్రభావం కవితలపై ఏ మాత్రం లేదు. కవితలు చదివిస్తాయి, ఆలోచింపజేస్తాయి.

***

పొలంగట్లవెంట (కవిత్వం)
రచన: బండ్ల మాధవరావు
ప్రచురణ: సాహితీమిత్రులు, విజయవాడ
పేజీలు: 143
వెల: ₹ 150/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
డా. కె. ఉమా రాణి,
#305, రెయిన్‍బో ఎన్.ఎం. స్క్వేర్,
జయప్రకాశ్ నగర్,
విజయవాడ 520008
ఫోన్: 8897623332

~
బండ్ల మాధవరావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-bandla-madhava-rao/

Exit mobile version