[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన ‘పొన్నగంటి తెలుగన్న పొంగిపొరల్చిన నాటుతెనుగు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
సంస్కృతాన్ని బట్టే మన తెలుగు పలుకుబడుల కూర్పు చాలావరకూ ఏర్పడింది. దాన్ని మనం కాదనలేం. అలాగని, మన మాటల్ని వదులుకుని పూర్తిగా సంస్కృతం మీదే వాలిపోకూడదు. మనమాటలెన్నో ఇలానే మరుగున ఉన్నాయి. వాటిని ఏరితెచ్చి వాడుకలో పెట్టగలగాలి! ఇది సంస్కృతానికి ఎదురుచుక్క (వ్యతిరేకత) కాదు, తెలుగుకి ఒద్దిక కలిగించే కదలిక!
అచ్చతెలుగున వ్రాయటానికి వ్రాతనేర్పొక్కటీ చాలదు. తెలుగు నుడుల లోతు కూడా తెలియాలి.
వ్రాయిల్ని(అక్షరాలను) చక్కగా పేర్చడం, నుడికట్టుబాటుల్ని(వ్యాకరణాన్ని) పాటించడం, దాని గురి ఏమిటో (భావం) పొందికగా చెప్పడం వ్రాతనేర్పుకు చెందినవి. కానీ, అచ్చతెలుగు అంతటితో ఆగిపోదు. ఒక మాట ఎక్కడ పుట్టింది, ఎలా పెరిగిందీ, ఎన్ని యేళ్లుగా మంది నోట నానుతూ వచ్చింది, దాని చవీ, నుడితనం ఏమిటి ఇవన్నీ లోతుగా అరసినప్పుడే నుడిలోతు తేటతెల్లమౌతుంది.
ఒక సంస్కృతం మాటను తీసేసి అక్కడ ఒక అచ్చతెనుగు మాటని పెట్టినంత మాత్రాన ఆ వ్రాత అచ్చతెలుగు కాలేదు. అందుకోసం ఎవ్వరికీ అర్థం కాని రీతిలో వింతపదాలను వండి వార్చటాన్ని కూడా మనం ఒప్పాల్సిన పని లేదు. తేలికగా అందరూ పలకగలిగేట్టుగా కనుకలిగా, వినుకలిగా (ఆపాతమధురం) బుర్రకెక్కేలాగా తెలుగు నుడుల వాడకం ఉండాలి. అచ్చతెలుగు అనేది నోరుతిరగని మాటల కుప్ప కాదు; తెలుగు ఎదలోంచి పలికే మన పలుకుల ఒద్దిక.
మనతో, మన నేలతో, మన మనుగడతో, మన నడతతో, మన మిన్నతతో ఉన్న పొత్తుని మన నుడులు తెల్లం చేస్తాయి. మన ఈ ‘పొత్తు’ ఆంగ్లం నుడినో సంస్కృతం నుడినో వాడితే కానరాదు. మన వ్రాతలకు మన మాటలే పొందికైనవి! అలాంటి పొందికైన పలుకుల్ని ఏరగలగాలి. తెలుగు ఎదతో తలచి, తెలుగు నుడులను పలికించాలి! తెలుగు నేలన పుట్టిన మాటల పోడిమినెరిగి వాటిని ఎప్పటికేది చెల్లుతుందో దాన్ని ఎంచుకుని వాడగలగాలి!
ఇదంతా వ్రాసేవారికి కొంత శ్రమే! కానీ, చదువరులు మాత్రం తెలుగు మడుగులలో ఓలలాడతారు.
సంస్కృతం చుట్టాలు
మన మాటల్లో సంస్కృతంతో చుట్టరికం ఉన్నవే ఎక్కువ. వాటిలో నేరుగా సంస్కృతం నుంచి వచ్చిన మాటలున్నాయి; సంస్కృతంతో జోడైన తత్సమాలున్నాయి; సంస్కృతంలోంచి పుట్టిన తద్భవాలున్నాయి. వాటితో పాటు పరాయినుడులూ వచ్చి కొన్ని కలిశాయి. ఇవన్నీ పోగా మిగిలినవే అచ్చంగా మన తెలుగు మాటలు. వాటిలో పల్లెల్లో వాడే అనేక నుడులను గ్రామ్యాలంటూ తక్కువ చేశారు. మిగిలిన కొన్నింటిని మాత్రమే దేశ్యాలంటూ మిన్నగా ఎత్తిచూపారు. ఇది ఒప్పు కాదని గిడుగువారు గురజాడవారూ గట్టిగానే పోరాడారు ఆనాడు.
నుడి(భాష) లోంచి మనం పుట్టాం గానీ మనలోంచి నుడి పుట్టలేదు. ‘మంది అందరూ’ మాటలాడే నుడులకు నుడిదిట్టలు నుడికట్టుబాట్లను (లక్షణాలు, వ్యాకరణ నియమాలు) ఏర్పరుస్తారు. ఆ నుడికట్టులలో ఇమడని తెలుగు నుడులను కట్టులేని పల్లెపలుకులని (గ్రామ్యాలు) ఈసడిస్తున్నారు. ఒక విధంగా ఇది దబ్బరతనం. ఒకరు తక్కువ చేస్తే తగ్గిపోయేది కాదు నుడి! దానికి వేలయేళ్ల వెనకటితనం’ ఉంది. ఇప్పుడొచ్చి గుడ్డు కోడిని వెక్కిరించిన తంతులా గ్రామ్యాల ఈసడింపు ఇప్పటికీ కొనసాగుతోంది.
మన వీలుసాలుల్నిబట్టి నుడుల్ని అందరితో మనం మాట్లాడటానికి గాని, మన ఎదలోని తలపుల్ని చెప్పుకోవటానికి గానీ, అందరితోనూ ‘అతికి మెలగ’టానికి గానీ నుడి ఒక్కటే చేదోడుగా ఉంటుంది మనకి! నుడి (భాష) లేకపోతే మనం లేనట్టే! మన ఉనికి లేనట్టే!
వేల యేళ్లుగా మన వెనకటి పెద్దలు వాడుతూ వచ్చిన నుడుల్ని పల్లెనుడులంటూ తక్కువ చేయటాన్ని ఒప్పుకోవలసిన పనిలేదన్నదే మన గట్టిపట్టు కావాలి!
సంస్కృతానికి చుట్టాలైన నుడులు, పరాయినుడులూ పోగా మిగిలినవన్ని అచ్చతెలుగు నుడులే అవుతాయి. మన ఇచ్చకొద్దీ వాటిని ఎక్కువ తక్కువ పాటించకుండా చక్కగా వాడుకొనే వీలుంది!
పల్లెల్లోని పెద్దల నోట ఇప్పటికీ సొంపైన తెలుగు మాటలనేకం వినిపిస్తాయి. వాటినే మాండలికాలు అంటున్నాం ఇప్పుడు. అవి మనకి తాతముత్తాతల నుండి అబ్బిన చెలిమికలిమి. వాటిని మనం ఏరి తెచ్చి మన మాటల్లో కలుపుకోవాలే గానీ పల్లె నుడులంటూ ఈసడించకూడదు.
నాటుతెలుగు
ఏదైనా నెరవు గలిగినదాన్ని వ్రాయాలంటే అచ్చంగా మనవైన తెలుగు నుడులు చాలవనే ఇన్నాళ్లూ మన వ్రాతనేర్పరులు కుండనిండుగా ఉంటుందని ఎక్కువగా సంస్కృతాన్ని తోడు తెచ్చుకున్నారు. కుండనింపు తెలుగుతోనూ మనం తేవచ్చునన్న యావ లేకపోవటాన సంస్కృతం వాడకం పెచ్చుమీరింది. ఇలా కాదని మన తెలుగే మనకు ఉసురు (ప్రాణప్రదం) అనీ గట్టిగా అనుకుని నాటు తెనుగున కబ్బాలు వ్రాసినవారున్నూ ఉన్నారు. నాటు అనేది ‘నాడు’కు చెందిన మాట (Native). ఇప్పుడందరూ నాటునాటు అని ఊగుతున్నారు కదా.. నాటు తెలుగు మనకా ఊపునిస్తుంది.
కొరవి గోపరాజు సింహాసనాద్వా త్రింశిక, పొన్నకంటి తెలగనార్యుడి యయాతిచరిత్రం, కూచిమంచి తిమ్మకవి అచ్చ తెనుఁగు రామాయణం, నీలాసుందరీ పరిణయం, పాటిబండ పురుపోత్తమకవి కంసవిజయం, అయ్యనకోట పార్థసారథి గారి సత్యవిజయం, వీరేశలింగం పంతులు శుద్ధాంధ్ర భారతసంగ్రహం, శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధం, మచ్చ వెంకటకవి శుద్ధాంధ్ర నిరోష్ఠ్యనిర్వచన కుశచరిత్రం, దేవులపల్లి నరసింహశాస్త్రి శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన సారంగధరచరిత్రం, దాసు శ్రీ రాములు శుద్ధాంధ్ర శాకుంతల నాటకం ఇవి అచ్చతెనుగున వ్రాయాలన్న తలంపుతో వచ్చిన గొప్ప కబ్బాలు!
అచ్చతెనుగులో వ్రాయటం వలన మన నుడికలిమి కుప్పలుగా పెరుగుతుంది. కొత్త మాటలు తెలుగున వాడకాని కొస్తాయన్న ఒళవు (రహస్యం) ఎరిగిన ఆదిభట్ల వారు, దాసు శ్రీరాములు వారూ నాటు తెలుగునే వ్రాయాలని ‘తోరం’ కట్టుకున్నారు. అలాంటి నుడిమక్కువ ఉన్నప్పుడే అచ్చతెలుగు నెరవేర్పు కుదురుతుంది.
అచ్చతెలుగు తెన్నిడి ‘పొన్నగంటి’
అచ్చతెలుగు కబ్బాల గురించి మాట్లాడినప్పుడల్లా చాలామందికి ముందుగా గుర్తొచ్చేది పొన్నికంటి తెలగనార్యుడి యయాతి చరిత్రము. కానీ, అంతకంటే దాదాపు వందేళ్ల ముందే కొఱవి గోపరాజు సింహాసన ద్వాత్రింశికను పట్టుబట్టి అచ్చతెనుగునే రచించాడు. క్రీస్తు తరువాత 1576లో పొన్నికంటి తెలగనార్యుడు యయాతి చరిత్రము వ్రాస్తే, 1450లలోనే కొఱవి గోపరాజు ఆ దారిని తొక్కాడు. ఈ ఇద్దరూ తెలంగాణ నేలపై పుట్టి పెరిగినవారే. అయినా అచ్చతెలుగు చరిత్రను చెప్పేటప్పుడు కొఱవి గోపరాజు పేరును నుడిదిట్టలు వదిలేశారెందుకో తెలీదు.
క.
“మున్నెవ్వరు నొడువని యీ
తెన్నిడి కడుమీఱి యచ్చతెనుఁగుంగబ్బం
బెన్నిక మీఱఁగఁ జెప్పిన
నిన్నుం బొగడంగఁగలఁడె నెలతా ల్పయినన్”
అంటూ మరింగంటి అప్పయ్యగారనే (అప్పచార్యులవారు) నేస్తుడు ఈ పొన్నికంటి తెలగనార్యుఁడితో అన్న మాటలివి.. మునుపు ఎవ్వరూ చెప్పని తెన్నిడి (రీతి) కడుమీరేలా అచ్చతెలుగులో కబ్బం వ్రాసినట్టైతే ఆ నెలతాల్పు (చంద్రుని ధరించిన ఈశ్వరుడు) అయినా నిన్ను పొగడకుండా ఉండలేడు.. అంటూ వెనకనుండి ఊపునిచ్చాడాయనకి! ఇప్పటి పఠాన్ చేరుకు ఆనాడు ఏలికగా ఉన్న అమీన్ ఖాన్ దగ్గర చిన్న నాయంకుడు ఈ అప్పయ్యగారు. ఎవ్వరూ వ్రాయని కొత్త కబ్బం అయితే అమీర్ ఖాన్ మెచ్చుకుంటాడని, ఈ అచ్చతెలుగు కబ్బాన్ని అమీన్’ఖాన్ పేర్న ఇచ్చి కానుకలు పొందమనీ అన్నాడట.
తెన్నిడి అంటే కొత్త త్రోవ. ఆ త్రోవన మొదటగా నడిచిన వాడు ఆ త్రోవని పరచినవాడౌతాడు.
“అచ్చతెనుంగుఁబద్దె మొకటైనను గబ్బములోన నుండినన్
హెచ్చని యాడుచుందు రది యెన్నుచు నేర్పునఁ బొత్త మెల్ల ని
ట్లచ్చతెనుంగున న్నొడువ నందుల చంద మెఱుంగువారు నిన్
మెచ్చరొ యబ్బురం బనరొ మే లనరో కొనియాడరో నినున్.”
మహాభారతాన్ని తెలుగు చేసేప్పుడు నన్నయ 2 పద్యాల్నీ, తిక్కన 34 పద్యాల్నీ, ఎర్రన 2 పద్యాల్ని మాత్రమే అచ్చతెలుగులో వ్రాస్తే, ‘అబ్బో’ అన్నారంతా! కానీ, మొత్తం కబ్బం అంతా అచ్చతెలుగులోనే వ్రాస్తే నుడి మక్కువ కలిగిన తెలుగయ్యలు అబ్బురం అంటూ మెచ్చుకొంటూ కొనియాడకుండా ఉండగలరా? అంటూ అప్పయ్యగారు తెలుగన్నను ఈ తెన్నిడి (కొత్తదారి)కి పురికొల్పాడట!
తెలుగన్నకు ముందు తరం వాడైన కొరవి గోపరాజుగారు సింహాసన ద్వాత్రింశిక కబ్బంలో:
“తెనుఁగునఁ దేటగాఁ గథలు దెల్పినఁ గావ్యము పొందులేదు మె
త్తన పస చాల దండ్రు విశదంబుగ సంస్కృత శబ్ద మూఁదఁజె
ప్పిన నవి దర్భముండ్లనుచుఁ బెట్టరు వీనులఁ గావునన్ రుచుల్
దనరఁ దెనుంగు దేశియును దద్బవముం గలయంగఁ జెప్పెదన్”
అని చెప్పుకున్నారు. తెలుగులో తేటగా కథలు చెప్తే అది గొప్ప రచన కాదని, మెత్తగా ఉంటుందనీ, పస చాలదనీ అంటారు. పెద్దపెద్ద సంస్కృతం మాటలు గుప్పించకుండా వ్రాస్తే దర్భముండ్లు అంటారు. చదవరు, పెట్టరు. కాబట్టి, తొమ్మిది చవులు (రసాలు) తనరారేలా అచ్చతెలుగు మాటలతో, మరీ అగత్యమైనప్పుడు అది కూడా నేరుగా సంస్కృతం మాటలు కాకుండా సంస్కృతాన్ని అనుసరించి ఏర్పడిన తెలుగు మాటలు (తద్భవాలు) మాత్రమే వాడుతూ ఈ కబ్బాన్ని వ్రాయాలని తాను పూనిక పట్టానన్నాడాయన!
గోపరాజుకీ, తెలగనార్యుడికీ మధ్య నడచిన ఈ వందేళ్ళ కాలంలో అచ్చతెలుగు పట్ల కొంత అనువు (సానుకూలత) పెరిగిందని దీన్ని బట్టి ఉజ్జాయించ(ఊహ)వచ్చు.
తమ కబ్బాలలో చాలినన్ని అచ్చతెలుగు నుడులు వాడిన పోతన, శ్రీనాథుడు ఇంకా చాలా మంది నుడికారులు సంస్కృత నుడుల్ని వాడకూడదని పట్టింపు పెట్టుకోలేదు. ద్రావిడ కుదురుల్లోంచి పుట్టిన తెలుగు నుడులతోనూ, సంస్కృతంలోంచి పుట్టిన పలుకులతోనూ తెలుగు కబ్బాలు సొంపార సాగుతున్నాయి. సంస్కృతంతో జతకూడటం వలన తెలుగు పద్యాలు దిట్టమైన వయ్యాయని అందరూ ఆ త్రోవనే నడిచారు. నడుస్తున్నారు కూడా! అందువలన తెలుగు నుడిమక్కువ మరుగున పడిపోయింది.
పొన్నగంటి తెలగన్నకు మరింగంటి అప్పన లాగా వ్రాత కర్తల్ని అచ్చ తెలుగు వైపుకు నడిపించే వాళ్లు లేకపోవటాన తెలుగు కబ్బాల్ని అచ్చతెలుగులోనే వ్రాయాలనే తలపు ఎవరికీ కలగకుండా పోయింది.
తెలుగన్న వెన్నెలబువ్వ
ఈ విరివివ్రాత (వ్యాసం) మరీ పెద్దదైపోకుండా పొన్నగంటి తెలుగన్న అచ్చతెలుగు కబ్బంలోంచి ఒక్క కట్టుకైతని చవిచూద్దాం:
సీ.
అనుకువెన్నెల దాల్చి తునిచి సేవెలు చేసి వెన్నెలపాలను జున్నొనర్చి
గట్టివెన్నెల పిండిగొట్టి వెన్నెలవెన్న గలయ వెన్నప్పాలుగా నమర్చి
గడితంపు వెన్నెల గండ్రికల్ సిగరిగా దియ్యవెన్నెలలోన దెచ్చిపెట్టి
యెడల వెన్నెల చక్కెరిడి జోర్కు వెన్నెల బూనిక నాళీలుగాను గూర్చి
తే.
పండువెన్నెల యను వెండిపళ్ళెరముల జెలగి యిల్లాండ్రు వడ్డింప జెలులు దాము
వేడుకలు మీఱ బువ్వంపు గూడు గుడిచి పొదలు తమితోడ వెన్నెలపులుగు లమరె
అనుకువెన్నెల దాల్చి తునిచి సేవెలు చేసి: అనుకనుకుగా అంటే గట్టిగానూ కాకుండా, మరీ పలుచగానూ కాకుండా వెన్నెల ‘అనుకుముద్ద’లా ఉందట! ఈ అనుకుముద్దని గిద్దల్లో ఉంచి సన్నకారప్పూస కన్నా సన్నగా వత్తితే అవి ‘సేవెలు’ అనే వంటకంలా ఉన్నాయి. పేణీ అంటే ఇదే! పాలతారికలు లావుగా ఉంటాయి. సేవియలు సన్నగా ఉంటాయి.
వెన్నెల పాలను జున్నొనర్చి: వెన్నెలను జున్నుపాలుగా ఉజ్జాయిస్తున్నాడు పొన్నెగంటి తెలుగన్న. వెన్నెట్లోంచి జున్నుని చవి చూడమన్నాడు!
గట్టివెన్నెల పిండిగొట్టి వెన్నెలవెన్నగలయ వెన్నప్పాలుగా నమర్చి: గట్టివెన్నెల్ని పిండిగొట్టి, అందులో ‘వెన్నెల వెన్న’ కలిపి వండిన వెన్నప్పాలలో ‘తీపి’ ని కూడా చవి చూడాలంటాడు.
గడితంపు వెన్నెల గండ్రికల్ సిగరిగా దియ్యవెన్నెలలోన దెచ్చిపెట్టి: గడితపడటం అంటే గట్టిపడటం. ‘గడితంపు వెన్నెల గండ్రిక’ అంటే పంచదార పలుకుల్లాంటి వెన్నెల అని! దానితో చేసిన వెన్నెల సిగరి (శిఖరిణి-స్వీట్ లస్సీ)ని చవిచూడమన్నాడు!
యెడల వెన్నెల చక్కెరిడి జోర్కు వెన్నెలబూనిక నాళీలుగాను గూర్చి: జోరు =బలము, ఊతము. జోర్కు వెన్నెల= బాగా వత్తుగా ఉన్న చోటు నుంచి చక్కెరలాంటి వెన్నెలని తునిమి తెచ్చి మెత్తగా దంచిన చక్కెరిడి=పంచదార పిండి ఆరబోసినట్టున్నదట వెన్నెల! ఈ చక్కెరపిండితో చేసిన గొట్టాల్లాంటి నాళీల్లా (పాలకాయలు) ఉన్న తియ్యనివెన్నెలని చవిగొనమంటున్నాడు.
ఇలా ఎన్నో వెన్నెలవంటలు చేసి, పండు వెన్నెల అనే వెండి పళ్ళాలలో పేర్చి తమ ఇల్లాళ్లు వడ్డిస్తూ ఉంటే నేస్తులతో కలిసి బువ్వంబంతి కుడుస్తున్నాయట చకోరాలు. చకోరాలు వెన్నెలని తాగుతాయనే ఒక ఉజ్జాయింపుని మన తెలుగన్న ఇలా బువ్వంబంతి (విందుభోజనం)గా మార్చి అందులో వెన్నెలతో చేసిన కమ్మని వంటకాల్ని చవిచూడమని మనల్ని కూడా కోరుతున్నాడు. వెన్నెలను చూసినప్పుడల్లా ఎవరికైనా ఈ వెన్నెలబువ్వ కట్టుకైత (ఛందస్సు, ఇతర కట్టుబాట్లతో వ్రాసిన పద్యం) గుర్తుకొస్తుంది.
ఇది సంస్కృతంపైన పోరు కాదు
అచ్చతెలుగు అనగానే సంస్కృతంతో పోరాటం అనటం సరికాదు. తెలుగు తనను తానే నిలబెట్టుకునే పూనిక. సంస్కృతం మన నుడిలో కలిసిపోయినప్పటి వెనకటి కతలను మనం చెరపలేం; కానీ, ఆ కలబోతలో మరుగునపడిపోయిన మన మాటలను మళ్లీ వెలుగులోకి తేవడం మాత్రం మన చేతిలోనే ఉంది. అదొక్కటే అచ్చతెలుగు వ్రాతల అసలు పూనిక.
ఒక్క తెలుగు మాటను తవ్వితీయటం, ఒక నుడికారాన్ని సొంపెసలార నిలబెట్టటం, నిన్నటి నుడికలిమిని రేపటికి లగ్గు, లెస్సగా అందించటం ఇప్పుడు మనం చేయాల్సిన పని.
అచ్చతెలుగు అంటే నిన్నని అంటుకుని నిలబడిపోవటం కాదు, నిన్నటి నుంచి ఓపికని తెచ్చుకొని రేపటి తెలుగుకు పేరిమిని తేవటం! ఇదంతా మనపనే! మన వ్రాతల్లో మన మాటలు పెరిగిన కొద్దీ తెలుగు నుడికలిమి పెరుగుతుంది; తెలుగు మనుగడ మరింత ఓజనొందుతుంది!
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
