Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పూల పంజా

[శ్రీమతి మంగు కృష్ణకుమారి గారు రచించిన ‘పూల పంజా’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

బ్బబ్బా! చలికాలం నాకెంతో ఇష్టం
ఏ వయసులోనైనా గొప్ప నేస్తం ఈ‌ కాలం!
గత స్మృతులు అన్నీ చలి చుట్టూ తిరిగేవే!

చక్కిలిగింతల్లాగే‌ గిలిగింతల చలికాలం!
పాత దృశ్యాలే చలిగాలి కొడుతూ ఉంటే
‘ఎటు‌చూస్తే అటు కొత్తగా అందం‌ గానీ పెరిగిందే’ అనుకోడం, అదో ఇష్టం!

అమ్మ ఇడ్లీ పాత్రలోంచి వేడి వేడి ఇడ్లీ తీస్తూ ఉంటే,
ఇడ్లీ సువాసన, ఆవిరి, మొహం మీదకి వస్తూ ఉంటే,
తినడం కన్నా, చలికి‌ వణుకుతూ చూడ్డమే ఎక్కువిష్టం!

నాన్న పాడే ధనుర్మాసపు పాశురాలు
పంచే పొంగలి ప్రసాదాల కన్నా ఇష్టం!

వదిన వేస్తున్న ముగ్గునూ‌, పొగమంచునూ
మార్చి మార్చి చూడ్డం మరీ మరీ ఇష్టం!

పొద్దున్నే పళ్లు టక టక లాడుతుంటే
వాకిలిలో గెంతడం, కొండ వెనకనించీ వచ్చే
ప్రత్యక్ష సూర్య నారాయణుడిని చూడ్డం తగని ఇష్టం!

చలికి వణుకుతున్నా బస్ ప్రయాణంలో కిటికీ పక్కనే కూచుని,
చేతికున్న మెటల్ గాజులు వంగిపొతే ఫక్కున నవ్వడం‌ ఇష్టం!

సుంకీ‌ ఘాట్ రోడ్లో దిగి చలికి కొయ్య కట్టుకున్న వేళ్లతో
పూరీని ముక్క చెయ్యలేక అలానే దోసిటితో పట్టుకొని
నోట్లో పెట్టుకోడం, ‘అబ్బా రుచి పూరీది కాదు చలికొట్టే మలాందే..’
అంటూ చెల్లెళ్లకి చెప్తూ అందరం నవ్వడం ఎంతో ఇష్టం!

ఆరునెలల పరీక్షలంటే భయమే లేదు!
చదువు మిషతో చలిలో లేచి కిటికీలోంచి
తెరలు తెరలుగా తెల్లవారడం చూడడం చెప్పలేనంత ఇష్టం!

అదేమిటో, చలికాలం కోపమే రాదు!
‘పనిమనిషి రాలేదే’ అని అమ్మ అనడమే ఆలస్యం,
బావినీళ్లు తోడుతూ, గిన్నెలు తోమడం,
తూరుపు పక్క ఓ కన్నేసి కల్లాపి చల్లడం,
కసవు ఊడ్చేయడం, అదో ఇష్టం!

చలిమంటల చుట్టూ చేరి మంట దగ్గరగా
రెండు చేతులూ చాపి మళ్లీ బుగ్గలకి
ఆనించుకోడం మహా మహా ఇష్టం!

కట్టుకోబోయేవాడు, చెయ్యిపట్టుకుంటే..
విదిలించి కొట్టబుద్ధే వేయదు

పెళ్లిళ్లు చలికాలంలో అయితే‌
‘ఓహ్’ అరుంధతీ దర్శనం
చలిలో ఎంత బాగుంటుందో అంటూ,
కొత్త జంటకన్నా ముందు ఎగబడి పోడం,
అత్తలూ పిన్నులూ నవ్వుతూ
‘దీని పెళ్లి చలికాలం చేస్తే సరి’ అంటున్నా కోపంరాదు!

‘చలి పులి‌పంజా’ అంటారెందుకో, అదో
పూల‌పంజా అని నా అనుభవం!

ఇట్టే అయిపోతుంది చలి కాలం!
చిట పట లాడుతూ చెమటలు పట్టిస్తూ
ఎండాకాలం చాపకింద నీరులా వచ్చేస్తుంది!

అయితేనేం నా నేస్తం చలికాలం‌ మళ్లీ మళ్లీ వస్తుంది!
‘నువ్వా, నేనా’ అని కవ్విస్తూనే ఉంటుంది!
‘నువ్వూ నేనూ జట్టు’ అంటూ నేను
చలి పూలని ‌వాటేసుకుంటూనే ఉంటాను!

Exit mobile version