Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పోటీ

[‘పోటీ’ అనే పిల్లల కథ అందిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]

సముద్ర తీరంలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. దానిమీద వందలాది పక్షులు గూళ్ళు కట్టుకుని నివసిస్తూ ఉండేవి. వాటితో పాటు ఒక కాకి కూడా గూడు కట్టుకుని ఉంది. తెలతెలవారుతుండగా పక్షులన్నీ లేచి ఆహారం కోసం వివిధ ప్రాంతాలకు వెళుతుండేవి. కాకి కూడా సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్లి దొరికినది ఏదో తిని కాలం గడుపుతూ ఉండేది.

ఒకరోజు ఒక ఇంటి ముందు చాలా ఎంగిలి మెతుకులు కనబడ్డాయి. ఆ యింట్లో చాలామంది మనుషులు ఉండటం వలన భోజనాల తర్వాత విస్తర్లు అవతల పారేసేవారు. అందులో మిగిలిన అన్నపు మెతుకులు కాకి తినేది. ప్రతిరోజూ అక్కడికి రావటం, అక్కడి అన్నం తినటం చేసేది. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి అది బాగా తిని బలిసింది.

బలగర్వంతో అది మిగితా పక్షులను చూసి “నేను బలమైన దాన్ని. గరుత్మంతుడితో సమానమైన దాన్ని. నాతో పోటీ పడగల వాళ్ళు మీలో ఎవరూ లేరు” అని గర్వంతో అంటూ ఉండేది. కాకి అలా అవమానిస్తున్నా ఇతర పక్షులు దానితో పోటీ పడలేక తలవంచుకుని ఉండేవి.

ఒకరోజు మానస సరోవరం నుంచీ ఒక హంస ఆ సముద్ర తీరానికి వచ్చింది. గర్వంతో మిడిసిపడే కాకి దాని దగ్గరకు వెళ్లి “నేను గరుత్మంతుడితో సమానంగా ఎగరగలను. నాతో పోటీకి రా! నాతో ఎగరగలవా!” అన్నది.

“మేము మానస సరోవరంలో ఉండే హంసలము. మేము చాలా దూరం ఎగరగలము. కాబట్టి పక్షులన్నీ మమ్నల్ని గౌరవిస్తాయి. నువ్వు సాధారణమైన కాకివే కదా! ఎందుకు బలిష్టమైన హంసతో పోటీ పడుతున్నావు?” అని అడిగింది హంస.

“ఎందుకా! నేను చాలా గమనాల్లో ఎగరగలను. ఎత్తుకు ఎగరటం, కిందికి ఎగరటం, నలువైపులకు ఎగరటం, అడ్డంగా ఎగరటం, ఈకలు కదల్చకుండా ఎగరటం ఇలా నూటొక్క గమనాల్లో ఎగురుతాను. నాతో పోటీకి రా! నా శక్తి ఏమిటో తెలుస్తుంది. నువ్వు ఏ గతిలో కావాలంటే ఆ గతిలో ఎగురుతాను” అన్నది కాకి.

“నీకు తప్పకుండా నూటొక్క గతులు తెలిసే ఉంటాయి. నాకు మాత్రం ఒక్క గతి మాత్రమే తెలుసు. సూటిగా ముందుకు వెళ్ళటం. సరే! నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ఈ సముద్రాన్ని తూర్పు వైపు నుంచీ పడమటి వైపుగా దాటాలి. ఎవరు ముందుగా దాటితే వారే గెలిచినట్లు” అన్నది హంస.

‘ఈ హంస తెలివి తక్కువది. ఒక్క గమనంతోనే నూటొక్క గతులు గల నన్ను ఎలా ఓడించగలదు?’ అనుకుని కాకి తనలో తనే నవ్వుకుని పోటీకి అంగీకరించింది.  రెండూ సముద్రం మీదుగా ఎగరసాగాయి. కాకి కాసేపు పైకి, కాసేపు కిందికి, కాసేపు పక్కలకి ఇలా గతులు మారుస్తూ రకరకాలుగా ఎగురుతూ వెళుతున్నది. హంస మాత్రం సూటిగా పడమటి దిక్కుగా ఎగురుతూ క్రమక్రమంగా వేగం పెంచసాగింది.

కాసేపటికి కాకి అలిసిపోయింది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకుంటూ చుట్టూ చూసింది. ఎటుచూసినా అపార జలరాశి, ఒక బండరాయి గానీ, ఒక చెట్టు గానీ కనబడలేదు. దానితో దానికి భయం వేసింది. బలవంతాన ఓపిక తెచ్చుకుని ఎగురుతూ ఉంది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. కాళ్ళు, రెక్కలు నీటికి తాకుతూ ఉన్నాయి. ‘కళ్ళు తిరిగి సముద్రంలో పడిపోతానేమో!’ అని భయం వేసి కావు కావు మని అరవసాగింది.

దాని అరుపులకు ముందు వెళుతున్న హంస తల తిప్పి చూసింది. వెనుదిరిగి వచ్చింది. “ఏమిటండీ! మీ రెక్కలు, కాళ్ళు మాటిమాటికీ నీటిని తాకుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ గమనంతో ఎగురుతున్నారు? సముద్రం ఇంకా చాలా ఉంది. మీరు గరుత్మంతుడితో సమానమైన వారు కదా! అప్పుడే అలిసిపోతే ఎలా!” అన్నది పరిహాసంగా.

“నాకు కడుపు నిండా ఆహారం దొరకటంతో బలిసి, గర్వంతో గరుత్మంతుడితో సమానమని భావించాను. అదే గర్వంతో ఇతర పక్షులను అవమానించాను. నిన్ను పోటీకి పిలిచాను. కానీ నేను సాధారణమైన కాకిని. వ్యర్థంగా కావుకావు మని అరుస్తూ ఉంటాను. మిత్రమా! నన్ను క్షమించు. నా కళ్ళు తిరిగిపోతున్నాయి. ఒళ్ళు ఊగిపోతున్నది. సముద్రంలో మునిగిపోక ముందే దయచేసి నన్ను ఏదైనా ద్వీపానికి చేర్చు. నా ప్రాణం కాపాడు” అంటూ బ్రతిమిలాడింది.

ఆ మాటలు విన్న హంసకు జాలివేసింది. నీటిలో పడబోతున్న కాకిని రెండు కాళ్ళతో పట్టుకుని, మెల్లగా తన వీపు మీదకు ఎక్కించుకుంది. తిరిగి తాము పందెం వేసుకుని మొదటగా బయలుదేరిన చోటికి చేరింది. అక్కడికి చేరుకొని కాకిని గట్టుమీద దించింది.

“ఈరోజు నువ్వు లేకపోతే నేను నీళ్ళలో మునిగి చచ్చిపోయి ఉండేదాన్ని. నా ప్రాణం కాపాడిన నీ మేలు ఎన్నటికి మర్చిపోలేను మిత్రమా! నాకు తెలిసి వచ్చింది. నా శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుండా ఇంకెప్పుడూ గర్వించను. ఇతరులను అవమానించను. బుద్ధి వచ్చింది” అన్నది కాకి పశ్చాత్తాపంతో. హంస కాకికి ధైర్యం చెప్పి అక్కడ నుంచీ తన దారిన తాను పోయింది.

“నువ్వు కూడా కాకి లాగా నీ శక్తిసామర్థ్యాలు తెలుసుకోకుండా అధికులైన పాండవులను అవమానిస్తున్నావు. కాకి హంసను శరణు వేడినట్లే అర్జునుడిని శరణు వెడితే ప్రాణాలతో బయట పడగలవు” అంటూ యుద్దరంగంలో కర్ణుడి రథం నడుపుతున్న శల్యుడు కర్ణుడికి ఈ కథ చెప్పాడు.

(మూలం: మహాభారతం – కర్ణ పర్వం. కథనం నా స్వంతం)

Exit mobile version