Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-13

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

నారాయణ తీర్థులు – మొదటి భాగం:

సంగ్రహ జీవిత చరిత్ర:

యన 1650 – 1745 కాలానికి చెందినవాడు. ఆంధ్ర బ్రాహ్మణుడు. సంగీత సాహిత్యము లందును, నృత్య, వేదాంతాది శాస్త్రము లందు గొప్ప పండితుడు. శ్రీకృష్ణ భక్తుడు. సంస్కృతంలో ‘శ్రీ కృష్ణ లీలా తరంగిణి’ అను గ్రంథమును, మరికొన్ని వేదాంత గ్రంథాలను, తెలుగులో ‘పారిజాతాపహరణము’ వంటి యక్ష గానములు కూడా రచించిన ప్రతిభావంతుడు.

ఈయన జన్మ స్థానము కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళమని, కూచిపూడి అగ్రహారము అని, గుంటూరు జిల్లాలో ‘కాజ’ అని కొందరు అభిప్రాయములు వ్యక్తం చేసారు. ఇంటి పేరు తల్లావఝుల అనియు, ఈయన పేరు గోవింద శాస్త్రి అని, తండ్రి నీలకంఠ శాస్త్రి అనీ ఇలా అనేక రకాలుగా పరిశీలకులు చెప్పడంతో వీటిలో ఏవి సత్యాసత్యాలో నిర్ధారణగా తెలియదు. కాని ఇతడు కృష్ణానదీ తీర ప్రాంతము వాడు అనే చెప్పవచ్చు. ఇతను పరిణామ శూల బాద నివారణకై శ్రీ తిరుపతి వేంకటేశ్వరుని దర్శించెనని, ఆ స్వామి వారి ఆజ్ఞ మేరకు, తమిళ దేశములోనే వరహూరు వెళ్లి అచటి వేంకటరమణ ఆలయానికి మూల ప్రతిష్ఠ చేసిన అనంతరం ‘శ్రీకృష్ణ లీలా తరంగిణి`ని గానం చేయడంతో దీర్ఘకాలంగా యున్న అతని పరిణామ శూల బాధ నివారణ మయ్యెనట. అందుచే అచ్చటనే స్వామిని సేవించుచూ కొంత కాలానికి అవసాన కాలము సమీపించి – మాసి మాస, శుద్ధ అష్టమి, గురువారము, కృత్తికా నక్షత్రమున సిద్ధి పొందిరని తెలియుచున్నది. వీరి సమాధి వెంకట రమణ స్వామి ఆలయమునకు సమీపమున, వీరి ఛాయాపటము ఆలయము లోపల నేటికి కన్పిస్తుంది.

శ్రీ కృష్ణ జయంతి నాడు భక్తులు వీరి తరంగములను విధిగా అచ్చట పాడుచూ భజనలు చేయుట నేటికినీ చూడవచ్చు. ఇతడు భాగవతంలోని దశమ స్కందమందలి శ్రీ కృష్ణ గాథను సంస్కృతంలో 12 సర్గలు (అంకములు)గా రచించెను. ఈ గ్రంథములను ‘శ్రీ కృష్ణ లీలా తరంగిణి’ అందురు. దీనితో ప్ర్రారంభమున మంగళాచరణము, తరువాత శ్లోకములు, ఇష్ట దేవతా ప్రార్థనలు, తరంగములు యుండును. ఈ తరంగములు పల్లవి, అను పల్లవి, చరణము. స్వనామ ముద్రను గల్గి యుండును. కొన్ని వేల జతులు కూడా యుండును. దక్షిణ భారతంలో ప్రతి భజన కాలక్షేపములోను వీరి తరంగములు విధిగా పాడటం నేటికిని సాంప్రదాయకంగా యున్నది. వీరు మొదటనే సన్యసించిరి.

కంచి యందు శివరామానందుల శిష్యులై సన్యాసం స్వీకరించిరి. నారాయణానంద తీర్థులను నామం వహించిరి. కాని వీరి గ్రంథములలో తరచు నారాయణ తీర్థులని వ్యవహరించుకొనిరి. తర్వాత కాశిలో విద్యా ప్రచారము గావించిరి. అచట వీరికి అనేకమంది శిష్యులైరి. అచట ఉన్నప్పుడే శాండిల్య భక్తి సూత్రముల వ్యాఖ్యయు, పూర్వ మీమాంసా శాస్త్రముపై నొక గ్రంథమును రచించినట్లు తెలియుచున్నది. బహు కాలానికి దేశయాత్ర చేసిరి. కావేరి తీరంలో వరహురిలో సిద్ధి పొందిరి (1745 – 70 సంవత్సరాలు వుంటాయి).

అందువలన మనం శ్రీ నారాయణ తీర్థులు ఆసేతు హిమాచల మధ్య భారత మంతయు సంచరించి, దేశమును పునీతము గావించిరని చెప్పుట పొరపాటు కాదు.

సుప్రసిద్ధులైన కృష్ణ భక్తాగ్రేసరులలో ఈయన ఒకడు. గద విరచితమగు సంప్రదాయ కుల దీపిక అను బిల్వమంగళ మఠ వృత్తాంతము వివరించు గ్రంథములో ‘బిల్వమంగళం’ అని ఎన్నిక గన్న కృష్ణభక్తులు కొందరు కలరు. వారిలో ఒకరు తమిళ, కాశి, ఒరిస్సా, ఉన్నారు. అందరు వైష్ణవులే. కాశీలో వెలసిన అతడు పూర్వ జన్మమున మాథవానలుడని ప్రసిద్ది చెంది యుండెను. అతడే వెనుకటికి బిల్వణుడిగా, లీలాశుకుడుగా, జయదేవుడుగా అవతరించి చివర నారాయణ తీర్థులుగా ఉదయించి ముక్తి చెందెను అని వివరింపబడి యున్నది. ఈ ఐతిహ్యం ప్రచారంలో వున్నది.

వీరు కృష్ణలీలా తరంగిణి ఎచట ప్రారంభించి ఎచట ముగించిరో తెలియరాలేదు. కాని తమ 4వ తరంగములో ‘శ్రీ వరాహపుర శ్రీ వేంకటేశ’ అని ప్రసంగించి యుండుటచే ఆ వరాహపురము కావేరీ తీరమందలి వరహురే అని అందురు. కాని తిరుపతి క్షేత్రమునకు వరాహపురమను ప్రసిద్ధి కలదు. కనుక ఈ విషయం ఇదమిత్థమని తేల్చుట కష్టము.

రుక్మిణి కల్యాణము ముగింపుతో శ్రీ కృష్ణ దర్శనము వీరికి పెండ్లిపీటల మీద వధూవరుల వలె దొరికెను. కనుక అంతటితో వారు దీనిని ముగించిరి.

వీరు జీవసమాధిని గైకొనిరి. అనగా భూమిలో గుంతను త్రవ్వి అందులో వారు కూర్చొని, పైన బండను కప్పమనిరట. ఇప్పటికి ఈ సమాధికి పూజలు జరుగుచున్నవి. వీరి సమాధికి ఉత్తరమున ఒక మామిడి చెట్టుున్నది. దాని కొమ్మలతో సమాధికి నీడు వస్తుంది. దాని క్రిందనే తీర్థులు కడపటి దినములలో యోగనిష్ఠలో కూర్చొనుచుండిరి. దీని ఫలములు చాలా మధురముగా యుంటాయి. టెంక ఒక నాణ్యము వలె యుండును. ఆ టెంకను మరి ఎచ్చట నాటినను మొలకెత్తదు. ఇది ఒక విచిత్రము.

ఆయన రచనలు:

  1. సంస్కృతమున కృష్ణలీలా తరంగిణి యక్షగానం
  2. తెలుగుల పారిజాతాపహరణ యక్షగానం మిగిలినవి సంస్కృత గ్రంథాలు
  3. శాండిల్య భక్తి సూత్ర వ్యాఖ్య – భక్తి, సిద్దాంత సంబంధములు.
  4. భక్త్యధికరణ మాల – భక్తి, సిద్దాంత సంబంధములు.
  5. సాంఖ్య తత్త్వ కౌముదీ వ్యాఖ్య – సాంఖ్య సిద్ధాంతానికి సంబంధించింది.
  6. సాంఖ్య కారికా వ్యాఖ్య – సాంఖ్య సిద్ధాంతానికి సంబంధించింది.
  7. న్యాయ కుసుమాంజలీ టీక – తర్క శాస్త్రానికి సంబందించింది.
  8. న్యాయ ముక్తావళీ టీక – తర్క శాస్త్రానికి సంబందించింది.
  9. భాట్ట బాషా ప్రకాశము – పూర్వ మీమాంస గ్రంథము
  10. యోగ సూత్ర వ్యాఖ్య – పూర్వ మీమాంస గ్రంథము
  11. సిద్ధాంత బిందు లఘు చంద్రిక
  12. వేదాంత వాటిక
  13. వేదాంత విభావ వాటిక

వీటిలో కొన్ని ముద్రితాలు, అముద్రితాలు

సంగీతం:

ఇందులోని 156 కీర్తనలోను ఆంధ్ర దేశంలో భజనబృందాల ద్వారాను, గాయకుల ద్వారాను జనరంజకత పొందిన తరంగాలు ఇవి.

క్ర. సం. పేరు రాగం తాళం
1. ఏహి ముదం దేహి యదుకుల కాంభోజి ఆది
2. కలయ కల్యాణాని కేదార గౌళ ఆది
3. కలయ యశోదే కేదార గౌళ ఆది
4. కృష్ణం కలయసఖి ముఖారి ఆది
5. క్షేమం కురు సతతం సావేరి ఆది
6. గోవింద ఘటయ కాంభోజి ఝంప
7. గోవింద మిహ మద్యమావతి ఝంప
8. జయ జయ గోకులబాల కురంజి ఝంప
9. నంద గేహినీ ద్విజావంతి ఆది
10. పూరయ మమకామం బిలహరి ఆది
11. బాల గోపాలకృష్ణ మోహన ఆది
12. బాలగోపాల మాముద్దరు మోహన ఆది
13. మంగళాలయ కేదారగౌళ ఆది
14. వీక్షే కదా దేవదేవం ఆనంద భైరవి ఝంప
15. శరణం భవ కరుణాం సౌరాష్ట్రం ఆది
16. శ్రీ నిలయం సఖి వరాళి ఆది

పారిజాతాపహరణ, యక్షగానమును కూడా వ్రాసిరి.

కృష్ణ లీలా తరంగిణి కావ్య ప్రశంస:

సంస్కృతమున సంగీత రూప కావ్యము. దీనిని గానము చేసి ఆనందింపని భారతీయులుండరు. ఇందలి కవితా ధోరణియు, పద లాలిత్యమును సహృదయుల హృదయము లందును నవ రసములతో ఓలలాడుచుండును.

ఇందలి దరువులు,  శ్లోకములు, గద్యలు, కీర్తనలు చూచిన ఇది ఒక యక్షగాన వర్గములో చేరినదని తెలియును. గీర్వాణ భాషా పరిచయం లేకున్నను ఆంధ్ర భాష తెలిసిన వారికి ఇందలి గద్య పద్య కీర్తనల భావము సుకుమారముగా బోధపడునట్టి సరళ సాహిత్యము కలది.

శ్రీ కృష్ణుని లీలలను తరంగముల కూడిక అగుటచే దీనికా నామము సార్థకమైనది. భాగవతములో ద్వాదశ స్కంధములున్నట్లే. ఇందును అన్ని తరంగములు కలవు.

ఈ గ్రంధ రచనా ప్రసక్తి, యిట్లని కవియే నుడివినారు.

“వాసుదేవే భగవతి భక్తి, ప్రవణ యాధియా

వ్యజ్యతే భక్తి, సారాధ్యా కృష్ణలీలాతరంగిణి”

అనగా కృష్ణ భక్తి సారమును తెలుపుట.

గ్రంధాంతమున,

“కామదా కామినామేషా ముముక్షూణాం చ మోక్షదా

శృణ్వతాం గాయతాం భక్త్యా కృష్ణలీలాతరంగిణీ॥”

ఈ కృష్ణలీలా తరంగిణిని భక్తియుక్తులై వినినను గానము చేసినను భోగములందించ గలవారికి భోగములును, మోక్షము గోరు వారికి మోక్షము గల్గును – అనుటచే గ్రంథ ప్రయోజనం ప్రకాశమైనది.

ఈ గ్రంథము కృష్ణ కర్ణామృతము, గీత గోవిందం మున్నగు కావ్యముల కోవలో చేరినది. దానితో గీత గోవిందం వలె ఇదియు సంగీత సాహిత్యములతో వెలయుచు, నాట్యాభినయములకు అనువై వీణా మర్దలాది వాద్యములతో రంగస్థలమున ప్రదర్శించుటకు తగియున్నది.

గీత గోవిందము రాధాకృష్ణుల ప్రణయ గాథను వర్ణించు శృంగార రస ప్రధాన కావ్యమై యుండ, ఈ తరంగిణి భక్తి రస ప్రధానమై యున్నది.

(ఇంకా ఉంది)

Exit mobile version