Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-5

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

వాగ్గేయకారక లక్షణము:

వాఙ్మాతురుచ్యతే గేయం ధాతురిత్యభిదీయతే।

వాచం గేయం చ కురుతే యః స వాగ్గేయ కారకః॥

మాతు అనబడు సాహిత్యము నందు, ధాతు అనబడు స్వర రూపమ్మైన వర్ణమట్టు నందు రచించు నేర్పు గలిగి, రంజకంగా గానము చేయు గాయకుని ‘వాగ్గేయకారుడు’గా చెప్పబడును.

వాగ్గేయకార లక్షణములను బట్టి 3 తరగతులుగా విభజించవచ్చు

ఉత్తమ వాగ్గేయకారుడు:

ఛందస్సు, వ్యాకరణం, అలంకారం, నవరసములు, విభావాది భావంబులను, సంగీతాది లలిత కళలను, కార్య త్రికంబులను చక్కగా తెలిసినవాడు, నూతన విషయ గ్రహణతో, ప్రజా విశేషము గలవాడు, ప్రబంధ రచన యందు ప్రౌఢిమ, గీత, వర్ణ, ప్రభంద పద, కృతి, కీర్తనాదులు రచించుట యందు సామర్థ్యము; మంద్ర, మధ్య, తారములనెడి త్రిస్థాయి లందు, గమక వ్యాపకముతో రాగాలాపన, రోష, ద్వేషముల పరిత్యాగము, సరసత్వము, ఉచిజ్ఞత, చిత్తైకాగ్రత మొదలగు లక్షణములు గల గాయకుని ఉత్తమ వాగ్గేయకారుడు అని చెప్పుదుము.

ఆంధ్ర వాగ్గేయకారులు:

వాగ్గేయకారులు ఎందరో అపూర్వమైన సంగీత రచనలను చేసి అజరామరమైన కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించారు. వారిలో పేర్కోన్నదగిన వారు తాళ్ళపాక అన్నమాచార్యులు, శివ నారాయణతీర్థులు, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి. వారు గాక మరి కొందరు వాగ్గేయకారులున్నారు. సంగీత లక్షణ కర్తలు, ఆ లక్షణాలకు లక్ష్యాలను రచించిన లక్ష్యకర్తలు కూడా వాగ్గేయకారులే అనుకొంటే భరతుడు, మతంగుడు, రామామాత్యుడు, గోవింద దీక్షితుడు, వేంకటమఖి మొదలగు వారెందరినో వాగ్గేయకారులుగా పరిగణించ వలసివస్తుంది. కాని సంగీతాత్మక సాహిత్య రచనలను చేసిన అన్నమాచార్యులు మొదలైన వారినే వాగ్గేయకారులని వ్యవహరించటం జరుగుతుంది గాని లక్ష్య లక్షణ కర్తలను వాగ్గేయకారులుగా పరిగణించటం కుదరదు.

అసలు వాగ్గేయకారుడు అంటే ఎవరు? వాగ్గేయకార నిర్వచనం, వాగ్గేయకారుని లక్షణాలు, దోషాలు శార్ఙ్గదేవుని సంగీత రత్నాకరంలో వివరించబడ్డాయి. సంగీత రత్నాకరంలోని ప్రకీర్ణాధ్యాయంలో వాగ్గేయకారుని గురించిన వివరమైన చర్చ ఉన్నది. శార్ఙ్గదేవుని వాగ్గేయకార నిర్వచనం ఇది.

వాఙ్మాతురుచ్యతే గేయం ధాతురిత్యభిదీయతే।

వాచం గేయం చ కురుతే యః స వాగ్గేయ కారకః॥

(సంగీత రత్నాకరము – శార్ఙ్గదేవుడు – ప్రకీర్ణాధ్యాయం శ్లో. 2)

గేయంలోని మాటల కూర్పు వాక్కు. దీనికి ‘మాతువు’ అని పేరు. సంగీతపు కూర్పు ధాతువు, ధాతు, మాతు రచనా దక్షుడు వాగ్గేయకారుడు.

16వ శతాబ్దము నుంచీ వాగ్గేయకార శబ్దానికి పర్యాయంగా ‘బయకారుడు’ అనే పదం వాడుకలో వచ్చినది. గోవింద దీక్షితుడు తన ‘సంగీత సుధ’ అనే గ్రంథంలో ధాతు మాత్యు భయకారుడు కనుక వాగ్గేయకారుడికి ఉభయకార సంజ్ఞ ఏర్పడిందనీ, ఈ ఉభయకార శబ్దం అపభ్రంశమై బయకార శబ్దంగా పరిణమించిందని వ్రాశాడు. శార్ఙ్గదేవుడు వాగ్గేయకార లక్షణాలను పేర్కొన్న సంగీత రత్నాకరంలోని శ్లోకాలు ఇవి:

శబ్దాను శాసన జ్ఞాన మభిధాన ప్రవీణతా।

చన్దః ప్రభేద వేదిత్వ మలంకారేషు కౌశలమ్॥

రసభావ పరిజ్ఞానం దేశస్థితిషు చాతుర।

ఆశేష భాషా విజ్ఞానం కలాశాస్త్రేషు కౌశలమ్॥

తూర్య త్రితయ చాతుత్యం హృదశారీర శాలితా।

లయ తాల కలా జ్ఞానం వివేకోనేక కాకుషు॥

ప్రభూత ప్రతిబోద్బేద భావత్వం సుభగ గేయతా।

దేశీరాగే ష్వభిజ్ఞానం వాక్పటుత్వం స భాజ్యతే॥

రోష ద్వేష పరిత్యాగ్యః సార్ద్రత్వ ముచితజ్ఞతా।

అనుచ్చిష్టోక్తి నిర్బంధో నూత్నధాతు వినిర్మితిః॥

పరచిత్త పరిజ్ఞానం ప్రబన్ధేషు ప్రగల్భతా।

ద్రుత గీత వినిర్మాణం పదాంతర విదగ్ధతా॥

త్రిస్థాన గమక ప్రౌడి ర్వివిధాలాప్తి నైపుణమ్।

అవధానం గుణైరేభి ర్వరో వాగ్గేయకారకః॥

(సంగీత రత్నాకరము – శార్ఙ్గదేవుడు – ప్రకీర్ణాధ్యాయం శ్లోకాలు 3 నుంచి 9 వరకు)

మొత్తం 28 లక్షణాలన్నీ ఈ శ్లోకాలలో పేర్కొన్నాడు. 28 లక్షణాలన్నీ కలవాడు ఉత్తమ వాగ్గేయకారుడు.

మధ్యమ వాగ్గేయకారుడు:

ధాతు యందు ఎక్కువ నేర్పు, మాతు యందు తక్కువ నేర్పు గలవాడు. ప్రబంధ రచన యందు ప్రౌఢిమ లేనట్టి గాయకుడు.

అధమ వాగ్గేయకారుడు:

మాతు యందు నేర్పు, ధాతు యందు మాంద్యము గలవాడు.

ఉభయ అనగా రెంటి యందు ప్రతిభ గలవాడు.

వాగ్గేయకార ముద్ర:

స్వనామ, అన్య నామ – అవి గాక ఆచార్య, రాగ, తాళ, రాజ, వంశ, ప్రబంధ, నాయక స్థల, క్షేత్ర, బిరుద, లక్షణ గ్రంథ, సంవత్సర, స్వగ్రామ ముద్రలు ఇలా చాలా కలవు. ముద్రల సంఖ్యను బట్టి 4 రకాలు. ఏక, ద్వి, త్రి ముద్ర, చతుర్ముద్ర అని. ఇపుడు మనం పూర్వపు వాగ్గేయకారుల జీవిత విశేషాలను, వారి సంగీత సేన, ప్రేరణ అంశాలు, ఆ కాలపు రాజు, సంగీత, సాహిత్య ప్రధానం గల అంశాలు, సమకాలీనులు, బిరుదులు, విమర్శలు, మొదలగు అంశాలను చర్చించేటప్పుడు. ఒక మానవుడు వాగ్గేయకారుడు కావాలన్న ఎన్ని లక్షణాలు అతనిలో వుండాలో, అవి సముపార్జించడానికి ఎంత శ్రమకు గురి అవుతాడో, భగవద్ కృప సగపాలు, మానవ కృషి సగపాలు వుంటే తప్ప అతను సమాజంలో రాణించలేడు. అంత జ్ఞానం ఆర్జించిన తరువాత మనం వారి యొక్క జీవిత విశేషాలను ఒక విశేషంగా భావించి, పరిశీలించి, పరిశోధించి, మన ప్రయత్నం కూడా కొంత చేసి, వారి యొక్క సేవను మనము అవగాహన చేసుకుని, ముందు తరం వారికి ఒక మార్గదర్శకంగా వుండాలనే ఈనాటి మన తాపత్రయం.

అనుబంధము:

పూర్వపు వాగ్గేయకారులు అనే అంశం గూర్చి మనం క్లుప్తంగా చర్చిస్తాము.

ప్రతి వాగ్గేయకార కవిత చరిత్రను రాసేటప్పుడు కాని చదివేటప్పుడు గాని మనకు సాధారణముగా ద్యోతకమయ్యే విషయాలను అంశములుగా వ్రాసి, దానినే అనుబంధం రూపంలో జతపరుస్తున్నాను.

  1. వాగ్గేయకారుని నామము (లేక) పేరు
  2. అతని కాలము (క్రీ.శ.)
  3. ఆ కాలపు రాజు
  4. సంగీత, సాహిత్య లక్షణాలు
  5. జీవిత సంగ్రహ చరిత్ర
  6. ప్రేరణాంశములు
  7. బిరుదములు
  8. ఆ కాలంలో వుండే లక్షణకర్తలు
  9. లక్షణకర్తల గ్రంథములు
  10. సమకాలీనులు
  11. ఇతరులపై వీరి ప్రభావము
  12. వారు రచనలలో వాడిన అపూర్వ రాగాలు
  13. ఉపదేశం పొందిన యోగుల పేర్లు
  14. విమర్శ

ఇలా మనం చాలా అంశాలన్ని గణనంలోకి తీసుకోవచ్చు.

మన అనుబంధంలో ఈ పట్టిక ద్వారా వారి పేరు, కాలము, జీవితం, సంగీతం, సాహిత్యం ఇత్యాది విషయాలన్ని మనం గమనించడం జరుగుతుంది.

పూర్వపు వాగ్గేయకారులలో నేను ముఖ్యంగా తొమ్మిది మంది వాగ్గేయకారుల సంగీత, సాహిత్య సేవ గురించి చర్చించాను. వారు:

  1. వాల్మీకి
  2. జయదేవుడు
  3. అన్నమాచార్యులు
  4. పురందర దాసు
  5. నారాయణ తీర్థులు
  6. క్షేత్రయ్య
  7. శ్రీ రామదాసు
  8. మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
  9. సదాశివ బ్రహ్మంద్రస్వామి

(ఇంకా ఉంది)

Exit mobile version