Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రభావం

[శ్రీ షేక్‌ మస్తాన్‌ వలి రచించిన ‘ప్రభావం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“నమస్తే సార్‌!” పెండెన్సీ పై చీవాట్లు తప్పవనే భయంతో పిలుపు వచ్చిన కాసేపటికి బాస్‌ గదిలోకి పిల్లిలా అడుగెట్టా.

మానిటర్‌పై ఫిగర్స్‌ గమనిస్తోన్న ఆయన తల తిప్పి సంగతేంటన్నట్లు చూశాడు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళనే ఆయనతో ఏమన్నా.. అనకున్నా..తంటే! అందుకే తటపటాయిస్తుండిపోయా.

“ఏమయ్యా.. మాట్లాడవ్‌?” బాస్‌ గొంతు ఖంగుమంది.

“సార్‌.. స్సా..ర్‌! పి..లి..చా..రం..టా!”

“ఆఁ.. నేనే రమ్మన్నానయ్యా! అదే.. రేపు మనం హార్స్‌లీ హిల్స్‌కెళ్తున్నాం! సో.. బీ ప్రిపేర్డ్‌!” బాస్‌ ముఖ కవళికలు క్షణాల్లో మారాయి.

“విషయమేంటి.. సార్‌?” వినయం కుమ్మరించాను.

“అదా.. పోయిన శనివారం నేను, నా నెల్లూరు ఫ్రెండ్‌ వాళ్ళ అబ్బాయిని హిల్స్‌ రెసిడెన్షియల్‌ స్కూల్లో చేర్చాం! ఓ నెల దాకా ఆదివారాల్లో బాబును పరామర్శించమని మావాడి రిక్వెస్ట్‌! సో.. ఆబ్లిగేషన్‌ నెరవేర్చాలి గదయ్యా!”

“తప్పకుండా..సార్‌! మరి నన్నెప్పుడు రెడీ గుండమంటారు?” మామూలుగా ఉదయాన్నే విదిలించి, అదిలించే బాస్‌ ప్రసన్నంగుండటంతో నాకు ఏనుగునెక్కినట్లయింది.

“ఉదయం పదిగంటలకు ఆఫీస్‌ దగ్గరుండు.. పికప్‌ చేసుకుంటా!”

“మంచిది సార్‌!” ఒక్కడుగులో బయట పడ్డా.

***

మర్నాడు నేను తయారై వచ్చిన పదినిముషాలకే బాస్‌ వెహికల్‌ కిర్రుమంటు ఆగింది. విష్‌ చేసి కారెక్కా. అయితే కాస్త దూరం వెళ్లగానే ఆయన బండాపమని డ్రైవర్‌కు సైగచేసి ముందుసీట్లో వున్న.. నావైపు చూశాడు.

“ఏమన్నా మరిచిపోయారా..సార్‌?” నేను ఆత్రంగా అడిగా.

“కుర్రాడు తింటానికేమన్నా తీసుకెళ్దాం..రంగా!”

“అలాగే! ఏం కొందామో.. చెప్పండి సార్‌!”

“ఆఁ.. ఏముంది! బ్రహ్మయ్య బేకరీ సరుకు తీసుకెళ్దాం! పిల్లలు ఆ ఫుడ్‌ బాగా లైక్‌ చేస్తారయ్యా!”

“మంచిది సార్‌!”

కాసేపటికి కారు బేకరీకు చేరింది. అక్కడ కొన్ని కేక్‌లు, బిస్కెట్లు కొన్నాం. ఆపై మదనపల్లె నుండి గమ్యం చేరేసరికి పదకొండైంది.

హార్స్‌లీ హిల్స్‌పై పచ్చని ప్రకృతి స్వాగతించింది. చల్లగాలి ఆస్వాదిస్తూ రెసిడెన్సియల్‌ స్కూల్‌కు చేరాం. విశాలమైన ఆవరణ బారులు తీరిన రకరకాల మొక్కలతో ఆహ్లాదంగుంది. నిర్ణీత మార్గాన కారు మెత్తగా వెళ్ళి పార్కింగ్‌లో ఆగింది. వెంటనే బాస్‌ ఠీవిగా రిసెప్షన్‌కు వెళ్ళి బాబు వివరాలు చెప్పాడు.

ఆపై పావుగంటకు వార్డెన్‌ పిల్లవాడ్ని వెంటబెట్టుకొని వచ్చాడు. అబ్బాయి పేరు రాము. వయస్సు పదిపైనే. తరగతి ఐదు. ఎత్తుగా, సన్నగా, ఎర్రగున్నాడు.

“గుడ్‌మార్నింగ్‌.. అంకుల్‌!” బాబు విష్‌ చేశాడు.

“హల్లో! వెరీగుడ్‌ మార్నింగ్‌! బై.. ది.. బై.. హౌ ఆర్‌ యూ.. మై బోయ్‌?” బాస్‌ కరచాలనం చేస్తుంటే బాబు “ఫైన్‌ అంకుల్‌!” అన్నాడు.

“ఇక ఈయన రంగారావు! నా స్టాఫ్‌ మెంబర్‌!” అంటూ బాస్‌ నన్ను పరిచయం చేయగానే అతను “హాయ్‌!” అంటూ నాతోను చేయి కలిపాడు.

“ఓకే! మరి.. చదువెలాగుంది? టీచింగది బాగుందా? పాఠాలవి.. అర్థమవుతున్నాయా? హాస్టలెలాగుంది? ఫ్రెండ్స్‌ మంచివాళ్ళేనా? గేమ్స్‌.. ఏవైనా ఆడుతున్నావా?” బాస్‌ హోల్‌సేల్‌ విచారణ మొదలెట్టాడు.

“ఫర్వాలే..దంకుల్‌!” అన్ని ప్రశ్నలకు సమాధానంగా అతను చెప్పిన ఒకే ఒక మాటలో సర్దుకుపోతున్నా నన్న భావం స్ఫురించింది.

“అవున్లే.. బాబు! ఎంతైనా హాస్టల్‌.. ఇల్లు కాదుగా! అయినా.. ఓర్చుకోవాలి! అపుడే చదువొస్తుంది! ఎలాగూ శలవుల్లో ఇంటికెళ్ళి ఎంజాయ్‌ చేస్తావుగా!” బాస్‌ పెద్దరికంగా అన్నాడు.

ఆ మాటలకు రాము నీరసంగా తలూపాడు.

“ఆ!.. బాబూ! ఇంతకు.. తింటానికేం కావాలో చెప్పు!” కుర్రోడి నిస్పృహ పోగొట్టాలని బాస్‌ టక్కున టాపిక్‌ మార్చాడు.

“ఏవైనా కేక్స్‌.. బిస్కెట్స్‌.. కావాలి!” పిల్లాడు నసిగాడు.

“గుడ్‌! అవే తెచ్చా!” జూబ్లియంట్‌ గన్న బాస్‌ నావైపు తిరిగి ‘చూశావా.. ఎంత బాగా వూహించానో!’ అన్న చూపు విసిరి బేకరి ప్యాక్‌ కుర్రోడి కిచ్చాడు.

‘ఆ!.. అంతొద్దులే స్వామి! హాస్టల్‌ తిండితో విసిగున్న ఎవరైనా.. అవే కావాలంటారు!’ మనస్సు ఆక్షేపిస్తోంటే పైకి “గుడ్‌ గెస్‌..సార్‌!” అని బాస్‌ను పొగిడా.

ప్యాక్‌ను అపురూపంగా పట్టుకున్న రాము “థాంక్స్‌.. అంకుల్‌!” అన్నాడు. ఆపై స్కూల్‌, హాస్టల్‌, వాటి విస్తీర్ణం, పిల్లల రోల్‌ స్ట్రెంక్త్‌ వగైరాలపై కొంత పిచ్చాపాటి జరిగింది.

“బై.. ది.. బై నాన్నకేమైనా ఫోన్‌ చేసి చెప్పమంటావా రామూ?” చివరిగా బాస్‌ బాబు తలపై బుజ్జగింపుగా అడిగాడు.

“అవునంకుల్‌! అందరు ఒకటే గుర్తొస్తున్నారు! అమ్మని, చెల్లిని తీసుకొని నాన్నను ఒకసారి రమ్మనండీ.. ప్లీజ్‌!” పిల్లాడు ఆత్రంగన్నాడు.

“అలాగే రామూ! అలాగే! నాన్నకు నే చెప్తాగా! నువ్వేమి దిగులు పడకు! నేను మళ్ళా వస్తాగా! సో.. టా!.. టా!!” బాస్‌ స్వచ్ఛమైన హామీ యిచ్చి బయటకు నడిచాడు.

ఆపై తిరుగు ప్రయాణం మొదలైంది.

“ఏమైనా.. రంగా! కుర్రోడు స్కూల్‌ చేరినప్పటికంటే.. యిప్పుడు డల్‌ గున్నాడయ్యా! అప్పుడప్పుడొచ్చి ఓదారుస్తుంటే తేరుకుంటా డనుకుంటా!” దారి మధ్యలో బాస్‌ చెప్పిందానికి “మరే.. సార్‌!” అని దరువేశా.

***

తిరిగి ఆదివారమొచ్చింది. షరా మామూలుగా బాస్‌, ఆ వెనుక నేను రాము రెండవ ఓదార్పు కెళ్ళాం.

అప్పటికి ఉదయం పది గంటలైంది.

స్కూల్‌ రిసెప్షన్‌ లోనే ఎదురైన వార్డెన్‌ “బాబు స్పెషల్‌ క్లాస్‌లో వున్నాడు! ఓ అరగంట వెయిట్‌ చేయండి!” అని చెప్పాడు.

ఈలోగా బాస్‌ ఆయన్ను మాటల్లోకి దించాడు.

“ఆ అబ్బాయి ఈమధ్య పరధ్యానంగుంటున్నాడండీ! తిండీ.. సరిగ్గా తింటం లేదు! నిద్రా.. అంతంత మాత్రంగానే వుంది. చివరకు సాయంత్రాలు ఆటలు మానేశాడండీ!” వార్డెన్‌ రాము తాజా పరిస్థితి వివరించాడు.

“ఓహోఁ!.. అలాగా!” తేలిగ్గా తీసుకున్న బాస్‌ చిద్విలాసంగా నవ్వి, “మరందుకే గదండీ.. నేనీ మధ్య రెండు.. మూడు.. సార్లు వాళ్ళ అమ్మ నాన్నలతో ఫోన్‌ చేయించా! అలాగే అతని చెల్లితోను మాట్లాడించా! అదిగాక నేనూ.. ఓ రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడి.. యింటిపై బెంగొద్దని చెప్పా!” అని పోయిన వారంలో తను చేసిన కార్యక్రమాన్ని సగర్వంగా ఏకరువు పెట్టాడు.

ఈలోగా రాము వచ్చాడు. అతని ముఖం వడలిపోయుంది. కళ్లు ఎర్రగున్నాయి. జుట్టు చెదిరుంది. నడక డీలాగుంది. “గుడ్‌ మార్నిం..గం..కు..ల్‌!” పీలగన్న అన్న అతను బెంచ్‌పై కూర్చున్నాడు.

“ఓఁ.. రామూ.. వచ్చావా! గుడ్‌.. నీకేం తెచ్చానో.. చూడు!” కుర్రోడ్ని ప్లీజ్‌ చేయాలని బాస్‌ బ్యాగ్‌లో నుండి బేకరి ప్యాక్‌ లాగి టన్‌.. టనా.. టన్‌ మోడల్లో అందించాడు. కాని బుడ్డోడు దాన్ని నీరసంగా అందుకున్నాడు.

“ఏంటి?.. బాబు! స్వీట్లిచ్చిన అంకుల్‌కు థాంక్సన్నా చెప్పవా?” అన్న వార్డెన్‌ హెచ్చరికతో ముభావుకత వీడిన అతను “థాంక్సంకుల్‌!” అన్నాడు.

“వెల్‌ కం! అది సరే.. నీ చదువెలాగుంది? తిండి వగైరా లెలాగున్నాయ్‌?” బాస్‌ పరామర్శ మొదలెట్టాడు.

‘బాగానే వు..న్నా..య్‌.. అంకుల్‌!” సమాధానం చప్పగుంది.

“ఏంటీ? అంత డల్‌గున్నావ్‌! అమ్మ..నాన్న.. చెల్లీ వాళ్లేమైనా గుర్తొస్తున్నారా? బెరుకు లేకుండా చెప్పు!” బాస్‌ బుజ్జగింపుగా అన్నాడు.

“ఆఁ! బాగా గుర్తొస్తోన్నారండీ! అందర్నీ చూడాలనుంది. వెంటనే.. రమ్మని చెప్పండంకుల్‌! పుణ్యముంటుంది!” ఆర్తిగా చెప్తున్న అతని కళ్లలో.. నీటి పొరలు కదలాడాయి.

“ఓకే.. ఓకే! డోంట్‌ బి ఎమోషనల్‌.. మై చైల్డ్‌!” బాస్‌ రామును దగ్గరకు తీసుకొని వీపు తట్టసాగాడు.

“ఏడ్వకూడదు.. బాబూ! ధైర్యంగుండాలి!” నా వంతుగా ఓదార్చాను.

ఎలాగైతేనేం, కాసేపటికి కుర్రాడు మామూలయ్యాడు. ఐతే బాస్‌ “నువ్వు రాత్రులు సరిగ్గా నిద్ర పోవటం లేదంట.. ఎందుకు?” అంటూ ఇంకో ప్రశ్న సంధించాడు. దానికి ఏదో చెప్పాలని కుర్రోడు నోరు విప్పే లోగానే బాస్‌ “ఓహోఁ.. ఇంట్లో నాన్న దగ్గర పడుకోవటం అలవాటా.. ఏంటి?” అని ఓ క్లూ వదిలాడు.

“అవునంకుల్‌!” తలాడించిన రాము ముఖంలో మళ్ళా దిగులు ఛాయలు అలుముకున్నాయి. అతనిలో అశాంతి చోటు చేసుకునుంది.

అంతటితో ఆగని బాస్‌ “తిండి కూడ తింటం లేదట?” అంటూ పిల్లోడ్ని మరో టాపిక్కు లాక్కెళ్ళి “ఆహాఁ! యింటి దగ్గర అమ్మముద్దలు చేసి తినిపించేదా? మరి.. యిక్కడలాంటిది లేదుగా!” అని సమాధానం కూడా ఆయనగారే వెల్లడించి మరో కుదుపిచ్చాడు. దానికి- “అవు..నండీ..!” అన్న అతని బుగ్గలపై కన్నీరు చారికలై టప టప రాలాయి.

“అది సరే.. రామూ! ఆటలకూ వెళ్లటం లేదట?” బాస్‌ చివరి నొక్కు నొక్కాడు. అప్పుడాయన ముఖంలో వల్లమాలిన జాలి కనబరిచాడు.

“ఆడుకోటానికి యిక్కడ చెల్లి లేదు గ..దం..డీ!” కంఠం గద్గద మవుతుంటే కుర్రోడు రెండు చేతులతో కన్నీరు తుడుచుకోసాగాడు.

ఆపై విషయాన్నాపిన బాస్‌ “అలా ప్రతిదానికి బాధ పడకూడదు కన్నా!” అని పిల్లాడ్ని దగ్గరకు తీసుకొని బుజ్జగించ బోయాడు. కాని అతను వెక్కిళ్ళు పెడ్తూ దూరంగా జరిగి కూర్చున్నాడు.

ఇక బాస్‌ వార్డెన్‌ వైపు తిరిగి “చూడండీ! మా రాముకు యింటితో అనుబంధమెక్కువ! అది.. మరిచిపోయేలా మీరు చేయాలి!” అని ఓ ఉచిత సలహా విసిరాడు.

“మా ప్రయత్నంలో లోపమేముండదండీ!” వార్డెన్‌ కూల్‌గా అన్నాడు.

ఆపై బాబుకు టా..టా.. చెప్పి మేము తిరుగుముఖం పట్టాం.

“ఏం.. రంగా! రామును బాగా ఓదారుస్తున్నానా?” దార్లో బాస్‌ మెచ్చుకోలుకై నావైపు చూశాడు. “గొప్పగుంది సార్‌!” పెదాలు ఉచ్చరిస్తున్నా నా మనస్సు మరో విధంగా ఆలోచిస్తూ వుండిపోయింది.

***

మూడోసారి ఓదార్పులో రాము మరీ నీరసంగా కనిపించాడు.

దాంతో బాస్‌ అతన్ని ఉత్సాహ పరచటానికి విషయాన్ని కొత్త పుంతలు తొక్కించాడు.

“చూడండీ.. వార్డెన్‌ గారూ! మా చంటి వాళ్ళుండే నెల్లూరు ఇల్లు ఓ స్వర్గమండీ!” అని మొదలెట్టాడు.

“ఆహాఁ! అంత బాగుంటుందా?” వార్డెన్‌ వివరణడిగాడు.

“అయ్యో! అది.. విశాలమైన నాలుగు పడగ్గదుల భవంతండీ! దానిముందు పెద్ద పెరడు రకరకాల మొక్కలతో చూడ సొంపుగుంటుంది! ఆ ఆవరణలో ఓ ప్రక్కగా చిన్న ఆటస్థలమూ వుంది! ఇక మావాడు చెల్లితోను, మిత్రులతోను ఆడుకోటానికి అనేకమైన ఆట వస్తువులున్నాయి! మరేమనుకున్నారు.. మావాడు ఆ యింటి రాజానండీ!”

“అలాగా!” వార్డెన్‌ తలాడించాడు.

“అంతే కాదండీ! వాళ్ళమ్మ రోజుకొక రకమైన పిండివంట చేసి పిల్లలకు కొసరి కొసరి తినబెడ్తుంది!”

“మరి అమ్మంటే.. అదే కదండీ!”

“చెప్పటం మరిచా! ప్రతి ఆదివారం నాడు పిల్లల్ని తీసుకొని నా ఫ్రెండ్‌వాళ్ళు ఏదో ఒక అవుటింగ్‌కు వెళ్ళేవాళ్లు!”

“మంచిది! యింతకు.. మీరివన్నీ మాకెందుకు చెప్తున్నారు?” వార్డెన్‌ విసుగ్గా అన్నాడు. దానికి బాస్‌ ఎలా స్పందిస్తాడోనని ఎదురు చూడసాగాను.

“అదే.. వస్తున్నా! బాల్యంలో అలాంటి సౌకర్యాలకు దూరమవటమంటే.. బ్రతుకున శాపమే గదండీ! అయినా మా రాము అవన్నీ వదులుకొని కేవలం చదువు కోసమై మీ సంస్థకు వచ్చాడు! కాబట్టి అతన్ని అన్ని విధాల ప్రోత్సహించాల్సిన బాధ్యత మీపైనుందా? లేదా?..చెప్పండీ?” బాస్‌ వార్డెన్‌ను నిలదీశాడు.

“భలేవారండీ! ఆ మాత్రం ఇంగితం మాకు లేదనుకుంటున్నారేంటి? మా శయాశక్తుల ప్రయత్నిస్తున్నాం! ఆ విషయం మీ వాడికి బాగా తెలుసు!” అన్న వార్డెన్‌ రాము వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.

“వార్డెన్‌ సార్‌ బాగానే చూస్తున్నారంకుల్‌! నాన్ననే ఓసారి ర.. మ్మ.. నం..డి” రాము నంగి నంగిగా అన్నాడు. అప్పుడతనితో దిగులు ఛాయలు కనిపిస్తున్నాయి.

అదేమి పట్టించుకోని బాస్‌ “ఓకే.. ఓకే.. యంగ్‌ మ్యాన్‌! ఎని వే.. నేనీసారి వచ్చేసరికి ఉత్సాహంతో వురకలు వేసే రామూను చూడాలి!.. సరేనా? మరి.. టా.. టా..!” అని ఏకపక్షంగా కుర్రోడి భుజం తట్టి, వార్డెన్‌కు బై చెప్పి ఆనాటి సమావేశం ముగించాడు.

***

శనివారం..

కార్యాలయంలో బాస్‌ డివిజనల్‌ మీటింగ్‌ ముగించగానే ఓ ఫీల్డాఫీసర్‌, “సార్‌! రేపు పుంగనూరు హోటల్‌ నందీశ్వర్‌లో మ్యారేజ్‌ డే ఫంక్షనుంది! మీరు లంచ్‌కు రావాలి!” అని ఓ ఆహ్వాన పత్రిక చేతికిచ్చి మరీ పిలిచాడు.

“నో.. నో! నాకు వీలు కాదయ్యా! రేపు నాకింకో ఇంపార్టెంట్‌..ప్రాగ్రాముంది!” అన్న బాస్‌ మాటలకు సంగతేంటన్నట్లు అక్కడున్న స్టాఫ్‌ అందరు ఆయనవైపు చూశారు.

అది గ్రహించి చిరునవ్వు చిందించిన బాస్‌ “అలా రేపు నా ఫ్రెండ్‌వాళ్ళ అబ్బాయిని కలసి రెసిడెన్షియల్‌ స్కూల్‌ లైఫ్‌కు మోటివేట్‌ చెయ్యాల్సుందయ్యా!” అంటూ రాము ఓదార్పు వ్యవహారాన్ని వివరించాడు.

“మంచి పని సార్‌! మీరు తలచుకుంటే అదెంత లేండి!” స్టాఫ్‌ బాస్‌ను వుబ్బేశారు. ఇక ఆయనగారి మోటివేషన్‌పై ఏవేవో అనుమానాలు వున్న నేను మాత్రం మౌనంగుండిపోయా.

***

ఆదివారం..

హిల్స్‌ స్కూల్‌ చేరిన మేము రిసెప్షన్లో వివరాలిచ్చి వెయిటర్స్‌ లాంజ్‌లో కూర్చొని ఆనాటి దినపత్రికలు తిరుగేస్తున్నాం.

“నమస్తే అండీ!” కాసేపటికి వార్డెన్‌ ఒక్కడే వచ్చాడు.

“ఆ. నమస్తే సార్‌!.. ఎలా వున్నారు? సంగతు లేంటి?” బాస్‌ చిరునవ్వుల మధ్య కుశల ప్రశ్నలు వేశాడు.

“ఏముందండీ! అన్నీ మామూలే!” వార్డెన్‌ ఎదురు సోఫాలో కూర్చున్నాడు.

“ఓకే! మరి.. మా రాము యిప్పుడెలాగున్నాడండీ? ఈ పాటికి బాగా సెట్టయ్యాడనుకుంటా! నాకు తెలుసండీ.. నా శ్రమ వృథా పోదు! సో.. ఈ విషయంగా మీకిప్పుడే సమస్య లేదుగా! ఇంతకు అబ్బాయి ఎక్కడండీ? ఏదైనా స్పెషల్‌ క్లాస్‌లో వున్నాడా.. ఏంటీ? అతగాడి ఆరోగ్యమది బాగుందిగా?..” బాస్‌ ఏకధాటిగా మాటలు గుప్పిస్తున్నాడు.

“కొంచం నే చెప్పేది వినండి సార్‌!” మధ్యలో ఒకటి.. రెండుసార్లు ఏదో చెప్పాలని ప్రయత్నించి, సందివ్వని ఎదుటి వ్యక్తితో విఫలుడైన వార్డెన్‌ విసురుగా అన్నాడు.

“ఐ యామ్‌ సారీ! చెప్పండి!” దెబ్బతో బాస్‌ దారికొచ్చాడు.

“అయితే.. మీ ఫ్రెండ్‌ మీకేమీ చెప్పలేదన్నమాట! బాగుందండి వ్యవహారం.. ఆయనగారు అకస్మాత్తుగా మొన్నొచ్చి కొడుకును టి.సి.తో సహా స్కూల్‌ నుండి తీసుకెళ్ళాడు!” వార్డెన్‌ విషయాన్ని బాంబులా పేల్చాడు.

“ఆఁ!” ఒక్కసారిగా బాస్‌ నోరు బార్లా తెరుచుకుంది. ఎంతో పట్టుగా సాధిద్దామనుకున్న సంగతి చతికిలబడటంతో ఆయన తక్కబిక్కవ్వసాగాడు. విషయానికి నేనూహించిన ముగింపదే గనుక నాకే ఆశ్చర్యం కలుగలేదు.

“ఇంతకు జరిగిందేం..టండీ?” గాలి తీసిన బుడగలా మారిన బాస్‌ మాటలు నీరసంగున్నాయి.

“అదేనండీ! పోయినసారి మీరొచ్చి వెళ్ళాక రాము మరీ డల్లయ్యాడు! చివరకు పెద్ద జ్వరమొచ్చింది! కుర్రోడికి హోమ్‌ సిక్‌నెస్‌ ముదిరిందని దానికి విరుగుడు యింటికి పంపటమేనని డాక్టర్‌ చెప్పాడు! ఇక చేసేది లేక వాళ్ళ నాన్న అతన్ని తీసుకెళ్ళాడు!” విషయాన్ని విడమరిచిన వార్డెన్‌ “ఇక నే వుంటా!” అంటూ చక్కా వెళ్ళిపోయాడు.

ఆపై ఉసూరుమంటూ బయటకొచ్చిన మేము తిరుగు ప్రయాణం మొదలెట్టాం. చాలాసేపటిదాకా బాస్‌ మాటామంతీ లేకుండా మూడీగా ఉండిపోయాడు. మూర్ఖశిఖామణితో ఏమన్నా.. తంటేనని నేను గమ్ముగుండిపోయా. అయితే దారి మధ్యలో ఆయన “రంగా! ఏంటి.. యిలా అయింది! నా ఫ్రెండ్‌ బిహేవియర్‌ మరీ బాధ గుందయ్యా! అయినా నాకు మాట మాత్రమైనా చెప్పకుండా అతను పిల్లోడ్ని తీసుకెళ్ళటమేంటి? మొత్తానికి.. ఇందులో నే చేసిన తప్పేంటయ్యా?” అని ఒక్కసారిగా ఆవేదన వెళ్ళగక్కాడు.

‘తప్పా.. తప్పున్నరా! పరిస్థితులతో రాజీపడి మెల్ల మెల్లగా కుదురుకుంటున్న కుర్రోడికి ఇల్లని.. చెల్లని, అమ్మని.. నాన్నని, చెట్లని.. పిట్టని, తోటని, ఆటని, వంటని.. పెంటని, లాగి లాగి.. అన్నీ గుర్తుచేసి అతని ధైర్యాన్ని వారం.. వారం తూట్లు పొడిచి చివరకు పారిపోయేలా చేశావు కదురా.. అప్రాచ్యుడా! విషయం వార్డెన్‌ ద్వారా తెలుసుకున్న నీ ఫ్రెండ్‌.. నిన్నొక వెధవ క్రింద జమకట్టి నీకు చెప్పకుండా కొడుకును ఎత్తుకపోయాడురా.. కుంకా! అయినా ఒక వారం ఓదార్పు నుండి రెండో వారం దానికి వెళ్ళే లోపు మొదటిదాని ప్రభావం పిల్లోడిపై ఎలాగుందా.. అని బేరీజు వేసుకోకుండా మొండితనంతో జరిపిన నీ వరుస ఓదార్పులు పిర్రగిల్లి జోల పాడిన విధంగా వున్నాయిరా.. స్వామి! అందుకే అవి వికటించి ఆ బుడ్డోడిపై ప్రతికూల ప్రబావం చూపాయి! మేథావి నంటావ్‌.. ఆ మాత్రం వూహించలేవా?’ నా మనస్సు విరుచుకుపడుతుంటే పైకి- “అయ్యో! ఎంత పనైంది సార్‌..! దీన్నే మంచికి పోతే.. చెడైందంటారు!” అంటూ సానుభూతి తెలిపా.

ఎంతైనా.. బాస్‌ గదా!

Exit mobile version