Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రదర్శనల ప్రపంచం – బందీల బ్రతుకులు

[కాదాసి అమరేందర్ గారు రచించిన ‘ప్రదర్శనల ప్రపంచం – బందీల బ్రతుకులు’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

కారు కొనేది మన ప్రయాణం కోసమా?
కానే కాదు, పక్కోడి కళ్లు చెదరడం కోసం!
ఇల్లు కట్టేది మన నివాసం కోసమా?
కానే కాదు, సమాజంలో మన హోదా కోసం!

చేతిలో ఫోను, జేబులో లేని మనీ!
కాని లోకానికి చూపాలి మనం ‘ధని’!
పక్కోడి మెప్పు కోసం పడే ఆరాటం,
చివరికి మిగిల్చేది గుండెల నిండా గాయం!

మన కోసం మనం బ్రతుకుతున్నామా అసలు?
లేక లోకం మెచ్చేలా వేస్తున్నామా వేషాలు?
ఉన్న దాంట్లో తృప్తిగా నవ్వే నవ్వు కరువై,
నలుగురి కోసం బ్రతకడమే ఒక బరువై!

నెల తిరిగితే చాలు ఈఎంఐల గుబులు,
రాత్రంతా నిద్ర రాక గుండెల్లో దిగుళ్లు!
సుఖాల కోసం కొన్న వస్తువులేమో ఇంట్లో,
శాంతి లేక మనం ఏడుస్తున్నాం చీకట్లో!

ఆగం అయిపోతోంది ఈ అందమైన జీవితం,
అప్పుల ఊబిలో నలిగిపోతోంది యవ్వనం!
చంపేసుకోకు నీ మనసులోని సంతోషాన్ని,
వదిలేసేయ్ ఈ ప్రదర్శనల ప్రపంచాన్ని!

ఉన్నదాంట్లో మనస్ఫూర్తిగా బ్రతికి చూడు,
నీకంటే రాజు లేడు ఈ లోకంలో ఎంచూడు!

Exit mobile version