Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు-1

[‘ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు’ అనే శీర్షికతో బాలల కథల అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్.]

క్లాస్ లైబ్రరీ:

“అమ్మా.. ఇంకో కొత్త కథల పుస్తకం ఉందా?” ప్రద్యుమ్న కళ్లల్లో మెరుపు.

తల్లి రేణు నవ్వింది..

“అయ్యో! మొన్నే నాలుగు తెచ్చాను కదరా”

“అవి నిన్ననే చదవడం అయిపోయాయి”

“అంత త్వరగానా?”

“కథలు నన్ను త్వరగా చదివిస్తాయి అమ్మా” అని గిలిగింత నవ్వు నవ్వాడు.

రేణు కూడా నవ్వింది.

“ఈ బుడ్డోడు ఎవరి పోలికో”

పక్కనే పుస్తకాలు సర్దుతున్న తాత ప్రదీప్ అన్నాడు.

“పుస్తకాలు మంచి స్నేహితులైతే.. సమయం పరుగెత్తుతుంది”

తాత గది అంటే ప్రద్యుమ్నకు చిన్న మాయలోకం. గోడంతా అలమారలు. అలమారలన్నీ పుస్తకాలతో నిండిపోయి ఉంటాయి.

కొత్త పుస్తకం వస్తే తాత ముందు దాన్ని తెరిచి చూస్తాడు. తర్వాత మొదటి పేజీ నెమ్మదిగా తిప్పుతాడు.

అది చూస్తూ ప్రద్యుమ్న కూడా అలాగే చేయడం మొదలుపెట్టాడు. కొత్త పుస్తకం చేతికి రాగానే ముందు పెట్టుకుంటాడు, చదవడం మొదలుపెడతాడు. తర్వాత నెమ్మదిగా పేజీ తిప్పి “అమ్మా.. చూడు పుస్తకానికి ఏదో కొత్త వాసన ఉంటుందమ్మా”. అన్నాడు.

రేణు నవ్వుతూ “అది తాత దగ్గర నేర్చుకున్నావు కదూ” అంది.

ప్రద్యుమ్న చిన్నగా నవ్వేశాడు.

***

ఒకరోజు..

“ప్రద్యుమ్నా.. ఎంతసేపురా?”అని అమ్మమ్మ బాత్రూమ్ తలుపు తట్టింది.

సమాధానం లేదు.

“బాబూ” అంటూ నెమ్మదిగా తలుపు తీసింది.

లోపల.. కమ్మోడ్ మీద కూర్చొని కథల పుస్తకంలో మునిగిపోయి వున్నాడు ప్రద్యుమ్న.

“అయ్యో!” అంటూ అమ్మమ్మ నవ్వుతూ బయటికి పిలిచింది.

“రేణూ.. ఏమండీ.. ఒకసారి ఇలా రండి”

అందరూ వచ్చారు. “ఏమైంది?” అన్నారు.

“మీ మనవడు బాత్రూమ్‌లో కూడా లైబ్రరీ పెట్టేశాడు” అందరూ నవ్వేశారు.

ప్రద్యుమ్న మాత్రం ఆశ్చర్యంగా చూసాడు.

“ఏమైంది?”

“ఇక్కడ కూడా చదువుతావా?”

“కథ మధ్యలో ఆగిపోయింది అమ్మమ్మా. హీరో చెట్టు మీద నుంచి దిగాడో లేదో తెలుసుకోకుండా బయటికి ఎలా వస్తాను?”

తాత నవ్వుతూ.. “కథ నచ్చింది, బాత్రూమ్ ఓడిపోయింది కదూ” అన్నాడు.

ఇంట్లో మళ్లీ నవ్వులే.

***

కొన్ని రోజులు గడిచాయి. ఒక సాయంత్రం.. రేణు అలమార వైపు చూసి అంది

“ప్రద్యుమ్నా.. ఈ షెల్ఫ్ మొత్తం చదివేశావా?”

“అవును”

“ఇంకా?”

“ఆ పైనున్నవి కూడా”

“అయితే కొత్తవి కొనాలి”

ప్రద్యుమ్న ముఖం వెలిగిపోయింది.

“నిజంగా?”

“కానీ.. ముందు వీటిని ఖాళీ చేయాలి”

“ఎలా?”

“చదివిన పుస్తకాలు అమ్మేద్దాం లేదా ఏదైనా లైబ్రరీకి ఇచ్చేద్దాం”

ప్రద్యుమ్న మౌనంగా తల ఊపాడు. ఏదో ఆలోచన మాత్రం అతని మనసులో మొలకెత్తింది.

***

రెండు రోజుల తర్వాత..

స్కూల్ గేటు దగ్గర టీచర్ రేణుని పలకరించింది.

“మేడం.. మీ అబ్బాయి చాలా మంచి పని చేయాలనుకుంటున్నాడు.” అంది.

రేణు ఒక్కసారిగా కంగారుపడింది.

“ఏమైంది మేడం?”

“ఏమీ కాదు” టీచర్ చిరునవ్వు నవ్వింది.

“నిన్న నా దగ్గరకు వచ్చి – ‘మా ఇంట్లో కథల పుస్తకాలు చాలా ఉన్నాయి. మా క్లాస్‌లో అందరూ చదువుకునేలా ఇస్తాం. తీసుకుంటారా?’ అని అడిగాడు.”

రేణు ఒక్క క్షణం మాట్లాడలేకపోయింది. టీచర్ మెల్లగా చెప్పింది.

“మీరు ఒప్పుకుంటే.. మన క్లాస్‌లో ఒక చిన్న లైబ్రరీ పెడదాం”

***

సాయంత్రం.. “ప్రద్యుమ్నా..” పిలిచింది.

“ఏమమ్మా?”

“టీచర్ చెప్పింది నిజమేనా?”

“అవును”

“నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే”

“మేడం ‘ఆలోచించి చెబుతాం’ అన్నారు కదా. ముందే చెబితే నువ్వు వద్దంటే?”

“అయితే ఎందుకు ఇవ్వాలనిపించింది?”

ప్రద్యుమ్న కాసేపు మౌనంగా ఉన్నాడు.

“తాతయ్య పుస్తకాలు లైబ్రరీకి ఇస్తాడు కదా”

“అవును”

“నువ్వు కూడా ఇస్తానన్నావు”

“అవును”

“అయితే.. మా ఫ్రెండ్స్ చదివితే ఇంకా బాగుంటుంది కదా”

“ఎందుకు?”

“రాహుల్ ప్రతిరోజూ నా పుస్తకం అడుగుతాడు. సనా కథలు చాలా ఇష్టమంటుంది. వాళ్లందరికీ ఉంటే.. నేను చదివిన ఆనందం వాళ్లకూ వస్తుందికదా” అని చెప్పి బ్యాగ్ తీసుకుని

“హోంవర్క్ చేసేస్తాను అమ్మా..” అంటూ లోపలికి వెళ్లిపోయాడు.

రేణు అక్కడే నిలబడి పోయింది. తనకు ఒక్కసారిగా నాన్న గుర్తొచ్చాడు.

చదివిన పుస్తకాన్ని ఎప్పుడూ తన దగ్గర దాచుకోని మనిషి..

అదే అలవాటు.. అదే మనసు.. మనవడిలో కూడా మొలకెత్తింది.

మరుసటి సోమవారం..

ఒక పెద్ద అట్టపెట్టె నిండా కథల పుస్తకాలు స్కూల్‌కు తీసుకెళ్ళింది రేణు.

టీచర్ బోర్డు మీద చాక్‌తో పెద్ద అక్షరాల్లో రాసింది

“మన క్లాస్ లైబ్రరీ”

పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. ప్రద్యుమ్న మాత్రం వెనక నిలబడి చూస్తున్నాడు.

రాహుల్ మొదటి పుస్తకం తీసుకుంటూ అడిగాడు. “ఇవి నిజంగానే మనందరివేనా?”

ప్రద్యుమ్న చిరునవ్వుతో తల ఊపాడు.

“అవును.. కథలు ఒక్కరి దగ్గర ఉంటే పుస్తకాలు. అందరూ చదివితే.. అవే స్నేహితులు” అన్న టీచర్ కళ్లలో ఆనందం మెరిసింది.

ఆ రోజు పిల్లలు పుస్తకాలు మాత్రమే తీసుకెళ్లలేదు..

ఒక మంచి చదివే అలవాటును కూడా ఇంటికి తీసుకెళ్లారు.

(వచ్చే వారం మరో కథతో కలుద్దాం)

Exit mobile version