Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు-10

[‘ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు’ అనే శీర్షికతో బాలల కథల అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్.]

కష్టే ఫలి:

సంజీవం చేతిలో బడి గంట టంగుమని మోగింది. అంతవరకూ గోలగోలగా ఉన్న బడి అంతా నిశ్శబ్దమైపోయింది. తరగతి గదుల్లో విద్యార్థులంతా మాటలన్నీ మూటగట్టి, పుస్తకాల మూటల్ని తీయడం మొదలుపెట్టారు. పలకలూ, బలపాలూ, పుస్తకాలూ, పెన్సిళ్ళూ అన్నీ డెస్క్‌ల మీదికి చేరుకున్నాయి.

విద్యార్థులంతా పెదాలు బిగించుకుని టీచర్ల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు.

సంధ్యా టీచర్‌ ఒక చేతిలో పుస్తకాలు, మరో చేతిలో చాక్‌పీస్‌, డస్టరూ తీసుకుని క్లాసులోకి అడుగు పెట్టింది.

“నమస్కారం టీచర్‌” అంటూ విద్యార్థులంతా లేచి నిలబడ్డారు.

“నమస్కారం.. కూర్చోండి” అంది సంధ్యా టీచర్‌ క్లాసులోని విద్యార్థులంతా టీచర్‌ కేసి చూస్తూ కూర్చున్నారు.

“మొదట హాజరు పలకండి” అని సంధ్యా టీచర్‌ హాజరు పిలవడం మొదలుపెట్టింది. ‘హరీష్‌, సరిత, రమేష్‌’

‘ఎస్‌ టీచర్‌’, ‘ప్రెజెంట్‌ టీచర్‌’,’ఉపస్థితి’ అంటూ తలా ఒక రకంగా బదులు పలికారు విద్యార్థులు.

హాజరు ముగించుకుని చాక్‌పీస్‌తో బోర్డు మీద ‘తెలుగు’ అని రాసింది టీచర్‌.

విద్యార్థులంతా రఫ్‌ కాపీలూ, పెన్సిళ్ళూ తీసి రాయడానికి తయారయ్యారు.

“అరే! ఏం చేస్తున్నారు? నేను రాయమన్నానా? కాపీలూ, పెన్నులూ మూయండి” అంది సంధ్యా టీచర్‌.

విద్యార్థులంతా ఆశ్చర్యంగా టీచర్‌ కేసి చూశారు.

“మరైతే పాఠం చెప్పరా టీచర్‌?” అంటూ ఒక విద్యార్థి అడిగాడు.

“లేదు లేదు.. నేను పాఠం కూడా చెప్పను.”

“అయితే నిన్నటి పాఠం ప్రశ్నలడుగుతారా టీచర్‌?”

“నేను నిన్న రాలేదు. పాఠం జ్ఞాపకం చేయలేదు టీచర్‌” అంటూ మహేష్‌ కన్నీళ్ళ పర్యంతమయ్యాడు.

పకపక నవ్వింది సంధ్యా టీచర్‌. “అంటే మీకు క్లాసంటే డిక్టేషనూ, పాఠం, ప్రశ్నలేనా?” అంది.

విద్యార్థులంతా బిక్కమొహాలు వేసుకుని చూడటం మొదలుపెట్టారు.

“మీరు వింటామంటే నేను మీకు ఒక కథ చెబుతాను” అంది టీచర్‌.

“క్లాసులో కథ చెబుతారా టీచర్‌?” అని అంతా అడిగారు.

“అదే! మరి మీరు అల్లరి చేయకుండా నేను చెప్పే కథను వినండి. కథ అయిపోయిన తర్వాత అందులో ఎవరు నచ్చారో చెప్పాలి మరి” అని చెప్పడం మొదలుపెట్టింది సంధ్యా టీచర్‌.

‘అనగా అనగా ఒక దేశంలో ఒక పెద్ద అడవి ఉండేది. అడవిలో గుట్టలు, గుహలు ఉండేవి. అడవినిండా జంతువులు నివసిస్తూ ఉండేవి. ఆ అడవిలోకి వెళ్ళడానికి దారి ఉండేది కాదు.

అలాంటి అడవిలోని ఒక గుహలో ఒక పెద్ద పులి నివసిస్తూ ఉండేది. ఆ పులి ఎంతో పొడవుగా, శరీరంనిండా చారలతో, నోట్లో పదునైన కోరలతో భయంకరంగా ఉండేది.

ఆ పులి గుహలోంచి అప్పుడప్పుడు బయటకు వచ్చి అటూ ఇటూ తిరిగి మళ్ళీ గుహలోకి పోయి పడుకుంటూ ఉండేది. ఆ పులిని చూస్తే ఆ అడవిలోని అన్ని జంతువులకూ భయమే. అది అడవికి రాజు మరి!

ఆ పులి భయంకరంగా గాండ్రిస్తూ అందరినీ బెదిరిస్తూ, అందిన జంతువునల్లా చంపి తింటూ బతికేది.

ఆ పులి ఉంటున్న గుహ ప్రక్కన చెట్టుమీద ఒక కాకి నివసిస్తూ ఉండేది. తన చిన్న చిన్న పిల్లలతో తన చిన్న గూడులో ఆనందంగా నివసించేది కాకి.

ఒకరోజు ఉదయం తన గుహముందు గాండ్రిస్తూ అటూ ఇటూ తిరుగుతున్న పులిని చూసి కాకి – ‘పులి రాజా! ఎందుకివాళ కోపంగా ఉన్నారు?’ అని అడిగింది.

‘గ్రర్ర్.. నిన్నటి నుంచి నా గుహవైపు ఏ జంతువూ రాలేదు. నాకు ఆహారం లేదు. ఆకలితో కడుపు మండిపోతోంది’ అంటూ ఎర్రని కళ్ళను మరింత ఎర్రగా చేస్తూ అంది పులి.

‘అదేమిటి రాజా? నీకు ఆహారం రావడం ఏమిటి? నువ్వు వేటకు వెళ్ళవా?’ అంది కాకి.

భీకరంగా గర్జించి ‘ఏమన్నావు? నేను పులి రాజును. ఆహారం కోసం వెళ్ళాలా? ఇంత శక్తివంతుణ్ణి నేను కష్టపడి వేటకు వెళ్ళాలా? ఎంత మాటన్నావు కాకీ! నీకెన్ని గుండెలు? నా కోసం ఆహారం వస్తుంది. వచ్చిన ఆహారాన్ని నేను తింటాను. నేను రాజును. నేను కష్టపడతానా?’ అంటూ మరోసారి గాండ్రించింది పులి.

పులి గాండ్రింపులకు భయపడి  ‘క్షమించండి మహారాజా. మేం కాకులం. తిండికోసం కష్టపడతాం. మీరు కూడా అంతే అనుకుని అన్నాను. కోపగించకండి’ అని బతిమలాడింది కాకి.

ఆహారం కోసం వెళ్తున్నానని పిల్లలతో చెప్పి వేటకు ఎగిరిపోయింది కాకి.

అడవంతా గాలించి తానింత తిని, పిల్లలకింత తీసుకుని మధ్యాహ్నం వేళకు గూటికి చేరింది కాకి. పిల్లలకు మేత తినిపించి కొంచెంసేపు వాటితో ఆటలాడి పులి గుహకేసి చూసింది.

అప్పటికి ఇంకా అటూ ఇటూ తిరుగుతూనే ఉంది పులి. పులిని కవ్విస్తే కోపగించుకుంటుందని అనుకుని మళ్ళీ మేతకు బయలుదేరింది.

పొద్దుగుంకే వేళకు మేతను నోటబెట్టుకుని కాకి గూటికి చేరింది. తెచ్చిన మేతను పిల్లల ముందేసి, చిటారు కొమ్మన చేరి పులి గుహకేసి చూసింది కాకి.

దినమంతా గాండ్రించి, గాండ్రించి అలసిపోయి గుహముందు నిస్సత్తువగా కూలబడిపోయిన పులి కనిపించింది.

‘అయ్యో! కష్టపడక ఆహారం తనదగ్గరికే రావాలని అహంకారంతో పులి ఆకలిపాలైందే!’ అని జాలిపడింది కాకి.

“అది కథ” అంది సంధ్యా టీచర్‌.

“తర్వాత ఏమయింది టీచర్‌?” అడిగారు విద్యార్థులు.

“ఏమయింది? ఆకలితో పులి చచ్చిపోయింది”

“ఆ..ఇక ఇప్పుడు చెప్పండి. ఈ కథలో మీకు ఎవరు నచ్చారు? కాకా? పులా?”

“కాకి టీచర్‌” అన్నారు అంతా.

“ఎందుకని?”‘

“కాకి మంచిది టీచర్‌.”

“కాకి పిల్లలకు మేత పెట్టింది టీచర్‌.”

“కాకి కష్టపడింది టీచర్‌.”

తలా ఒక రకంగా చెప్పారు.’

“ఆ.. అవును. కాకి కష్టపడింది. కష్టపడి తను తిని పిల్లలకు మేత పెట్టింది. అదే పులి కష్టపడకుండా బద్ధకించి ఆకలితో చచ్చిపోయింది. అంటే ఎవరు కష్టపడతారో వారికే మేత దొరుకుతుంది. వాళ్ళే మంచివాళ్ళు. కష్టపడని వాళ్ళు చెడ్డవాళ్ళు. అవునా? మరైతే మీరు మంచివాళ్ళా? చెడ్డవాళ్ళా?” అడిగింది సంధ్య.

“మంచోళ్ళం టీచర్‌”

“మేం కష్టపడతాం టీచర్‌”

“సరే. అయితే మీరు కష్టపడి ఆడుకుంటారా?”

“లేదు టీచర్‌! మేం కష్టపడి చదువుకుంటాం!”

“వెరీ గుడ్‌. మరైతే నేను ఇప్పుడు చెప్పిన కథని రఫ్‌లో రాయండి చూద్దాం. ఎవరు తప్పులు లేకుండా రాస్తారో”

పిల్లలంతా కాపీలూ, పెన్సిళ్ళూ తీశారు.

కథను రాయడానికి సిద్ధమయ్యారు.

ఆ రోజు సంధ్యా టీచర్‌ చెప్పిన చిన్న కథ పిల్లలకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పింది

కష్టపడితేనే ఫలితం. కష్టానికి ఫలితం తప్పక ఉంటుంది.

♦

Exit mobile version