Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు-2

[‘ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు’ అనే శీర్షికతో బాలల కథల అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్.]

ప్రద్యుమ్న సెల్ఫీ:

ఆ రోజు ప్రద్యుమ్నకు చాలా టెన్షన్‌గా ఉంది. ఉదయం స్కూల్‌కు బయలుదేరుతుంటే అమ్మ రేణు అతని ముఖం చూసి అడిగింది “ఏమిట్రా ప్రద్యుమ్నా! ఇవాళ నీ ముఖం ఇంత చిన్నబోయింది?”

“ఏం లేదు అమ్మా!”.

“నిజంగానా?”.

“నిజమే!” అంటూ బ్యాగ్ తగిలించుకుని బయటికి నడిచాడు. కానీ అతని మనసులో మాత్రం ఒక్కటే ఆలోచన ‘రిజల్ట్ ఎలా వస్తుందో?’ అని.

***

స్కూల్లో పిల్లలంతా తమ క్లాసుల్లో కూర్చున్నారు. ఆ రోజు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. టీచర్ క్లాసులోకి వచ్చింది. ఆమె చేతిలో ఒక కాగితం ఉంది.

“గుడ్ మార్నింగ్, చిల్ద్రెన్”..

“గుడ్ మార్నింగ్ మేడమ్!”

“ఇవాళ మీకు ఒక మంచి వార్త” అందరూ ఒక్కసారిగా ముందుకు వంగారు.

“మీ వార్షిక పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి” క్లాసులో గుసగుసలు మొదలయ్యాయి.

టీచర్ ఒక్కొక్కరి పేరు పిలిచి మార్కులు చెప్పింది. “సాయి.. గుడ్.” “అన్వి.. వెరీ గుడ్”, “రాహుల్.. వెల్ డన్” చివరికి టీచర్ కాసేపు ఆగింది. క్లాసులో నిశ్శబ్దం.

“ఈసారి మన క్లాసులో ఫస్ట్..”  ప్రద్యుమ్న గుండె ధక్.. ధక్.. ధక్.. టీచర్ నవ్వింది.

“ప్రద్యుమ్న” ఒక్కసారిగా క్లాసంతా చప్పట్లతో మార్మోగిపోయింది.

“యే!”

“కంగ్రాట్స్ ప్రద్యుమ్న”.

ప్రద్యుమ్న ముఖం పువ్వులా విరిసిపోయింది. అతను తనను తానే ఒకసారి చూసుకున్నాడు. “నిజంగానే నేనా?”  అప్పుడే ప్రిన్సిపాల్ గారు క్లాసులోకి వచ్చారు.

“కంగ్రాట్స్ ప్రద్యుమ్న” అంటూ అతని మెడలో ఒక అందమైన మెడల్ వేశారు. ప్రద్యుమ్న దాన్ని తాకి చూశాడు.

అది బంగారం కాదు. కానీ అతనికి మాత్రం ఆ రోజు అది ప్రపంచంలోనే పెద్ద బహుమతిలా అనిపించింది.

***

ఇంటికి చేరగానే “అమ్మా, నాన్నా” అంటూ పరుగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు.

“మా అబ్బాయి క్లాస్ ఫస్ట్” అంటూ మాధవ్ అతన్ని గాల్లోకి ఎత్తాడు.

“అయ్యో! జాగ్రత్త” అంటూ రేణు నవ్వింది.

“కంగ్రాట్స్ రా! కీప్ ఇట్ అప్”.

“థాంక్యూ నాన్నా”

రేణు అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. “రివిజన్ చేద్దామంటే ఏడ్చేవాడివి కదా! ఇప్పుడు ఎలా ఉంది?”

ప్రద్యుమ్న పళ్లన్నీ కనిపించేలా నవ్వాడు. “ఇప్పుడు రివిజన్ కూడా చేస్తా”

“అబ్బో! ఇది కొత్త వార్త” అందరూ నవ్వారు.

అంతలో మాధవ్ తన వెనుక దాచుకున్న పెద్ద పెట్టెను బయటకు తీశాడు.

“ఇదిగో నీ గిఫ్ట్” ప్రద్యుమ్న కళ్లు పెద్దవయ్యాయి. “లెగోస్” అతను ఆనందంతో కేక పెట్టాడు. టీవీలో ఎన్నిసార్లో చూసిన లెగోస్ అవి. చిన్న చిన్న ముక్కలు. వాటితో ఇల్లు కట్టొచ్చు. కారు చేయొచ్చు. ట్రక్కు చేయొచ్చు, డైనోసార్ కూడా..!

“నాన్నా! అమ్మా! మీరు సూపర్” అంటూ ఇద్దరినీ ముద్దుపెట్టుకున్నాడు.

***

“ఇంకో సర్‌ప్రైజ్ ఉందిరా”అంది రేణు.

“మరొకటా?”

“అవును. రేపు మనం ధర్మారం వెళ్తున్నాం.”.

“ధర్మారం?”

సుగేందర్ తాతయ్య, రమ అమ్మమ్మ వాళ్ల ఊరు. ప్రద్యుమ్నకు వెంటనే ఆసక్తి వచ్చింది.

“అక్కడ ఏముంటుంది?”

“వెళ్లి చూస్తే తెలుస్తుంది”

“బిల్డింగులు ఉంటాయా? మరి పెద్ద షాపింగ్ మాల్స్?”

“అవి ఉండవు”

“సినిమా థియేటర్?”

“అది కూడా ఉండకపోవచ్చు”.

“అయితే ఏముంటుంది?”

రేణు నవ్వింది.

“చెట్లు ఉంటాయి. పొలాలు ఉంటాయి. పక్షులు ఉంటాయి. ఇంకా..”

“ఇంకా?”

“తాతయ్య ఉంటాడు!”.

“అదే చాలు” అన్నాడు ప్రద్యుమ్న.

***

మరుసటి రోజు ఉదయాన్నే ముగ్గురూ కారులో బయలుదేరారు. కొంతసేపటికి రోడ్డు రెండు వైపులా చెట్లు కనిపించాయి. ఆ తర్వాత పచ్చని పొలాలు.

“అమ్మా! ఇంత పచ్చగా ఎందుకుంది?”

“అది పొలం.”

“పొలం ఇంత పెద్దగా ఉంటుందా?”

“ఇంకా పెద్దగా కూడా ఉంటుంది.”

ప్రద్యుమ్న కారు కిటికీకి ముఖం దగ్గరగా పెట్టుకుని చూస్తూనే ఉన్నాడు.

***

ధర్మారం చేరుకునేసరికి సుగేందర్ తాతయ్య, రమ అమ్మమ్మ ఇంటి ముందు ఎదురుచూస్తున్నారు.

“రా బాబూ!” అంటూ రమ అమ్మమ్మ అతన్ని ఎత్తుకుంది.

“అయ్యో! ఎంత పెద్దవాడివయ్యావురా”

“నేను రెండో క్లాస్ పాస్ అయ్యాను”

“అందుకే కదా ఈ మెడల్” అంది ఆమె అతని మెడలో చూసి.

“అవును. నేను క్లాస్ ఫస్ట్.”

తాతయ్య నవ్వుతూ “అయితే మా ఊరికీ ఫస్ట్ ర్యాంక్ చూపించడానికి వచ్చావన్నమాట!” అన్నాడు. ప్రద్యుమ్న నవ్వాడు.

***

ఇంట్లో తిరుగుతూ ఒక మూలన ఆగిపోయాడు. “అమ్మా.. ఇది ఏమిటి?”

“బావి”

“బావా? అంటే అందులో నీళ్లు ఉంటాయా?”

“ఉంటాయి”

“ట్యాప్ ఎక్కడుంది?”

తాతయ్య నవ్వాడు. “ట్యాప్ లేదు. ఇదిగో బొక్కెన” అని తాడుకు కట్టిన బొక్కెన చూపించాడు.

“దీంతో నీళ్లు పైకి లాగుతాం”

ప్రద్యుమ్న ఆశ్చర్యపోయాడు.

“అంటే.. మన ఇంట్లో ట్యాప్ నుంచి నీళ్లు వస్తాయి. ఇక్కడ బొక్కెనతో నీళ్లను తీసుకోవాలా?”

“అవును”

“చాలా కష్టమేమో”

“మా కాలంలో ఇదే మాకు ఈజీ” అన్నాడు తాతయ్య.

ప్రద్యుమ్న బొక్కెనను పట్టుకుని చూడసాగాడు.

తర్వాత రోలు కనిపించింది.

“ఇది?”

“రోలు”

“ఇది ఏం చేస్తుంది?”.

“పిండి చేస్తుంది”

“మిక్సీ లేదా?”

“మా వూర్లో అప్పుడు మిక్సీ లేదు”

“మిక్సీ లేకుండా ఎలా?”

“ఇలాగే” అంటూ రమ అమ్మమ్మ రోకలి చూపించింది. ప్రద్యుమ్న ఒక్కసారి రోలును చూశాడు.

ఒక్కసారి రోకలిని చూశాడు.

“ఇక్కడ ఇవే మిక్సీలా?” ఆశ్చర్యంగా అన్నాడు ప్రద్యుమ్న.

“అవును”

“వావ్”

అతనికి ఆ రోజు ఒక్కో వస్తువు ఒక కొత్త బొమ్మలా కనిపించింది.

***

తర్వాత తాతయ్య అతన్ని పొలానికి తీసుకెళ్లాడు. పచ్చగా ఊగుతున్న వరి. పొడవుగా పెరిగిన మొక్కజొన్న.

చెట్ల మధ్య పక్షుల కిలకిల. గాలికి ఊగుతున్న పంట. ప్రద్యుమ్న కాసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు.

“తాతయ్యా..”

“ఏమిటోయ్”

“ఇది నిజంగానే పోలమా, పుస్తకంలో చూసిన పొలంలాగే వుంది.”

తాతయ్య పెద్దగా నవ్వాడు. “పుస్తకంలో చూసింది మా పొలమే అయి ఉండొచ్చు” అన్నాడు.

***

రోజంతా ఎలా గడిచిపోయిందో తెలియలేదు. సాయంత్రం తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది.

“ఇప్పుడేనా” అన్నాడు ప్రద్యుమ్న.

“అవును బాబూ. అమ్మానాన్నలకు ఉద్యోగాలు కదా”

కారులో కూర్చున్నారు. కారు కదిలింది. ధర్మారం మెల్లగా వెనక్కి వెళ్లిపోయింది. కొంత దూరం వెళ్లాక ప్రద్యుమ్న ముఖం ఒక్కసారిగా మారిపోయింది.

“ఏమైంది” అడిగింది రేణు.

అతను ఏమీ మాట్లాడలేదు. కళ్లలో నీళ్లు వచ్చాయి.

“ప్రద్యుమ్నా”

“అమ్మా”

“ఏమైంది?”

“నేను ఒకటి మర్చిపోయాను”

“ఏమిటది?”

“ఫొటోలు!”

“ఫొటోలా?”

“అవును!”అతని కళ్లలో కన్నీళ్లు.

“బావిని ఫొటో తీయలేదు. రోలుని ఫొటో తీయలేదు. రోకలితో ఫొటో దిగలేదు. తాతయ్యతో అమ్మమ్మ కూడా కలిసి దిగలేదు”

మాధవ్ నవ్వుతూ “అందుకేనా ఏడుపు?” అన్నాడు.

“అవును!”

“ఫోటోలు ఎందుకు?”

“నా ఫ్రెండ్స్‌కి చూపించాలి. వాళ్లెవరూ ఇవి చూడలేదు”

కాసేపు ఆలోచించిన మాధవ్ కారు వెనక్కి తిప్పాడు.

“అయితే పద!”

“ఎక్కడికి?”

“మళ్లీ ధర్మారానికే”

ప్రద్యుమ్న ముఖం వెంటనే వెలిగిపోయింది.

***

కారు ఇంటి ముందు ఆగగానే తాతయ్య, అత్తమ్మ ఆశ్చర్యంగా బయటకు వచ్చారు.

“ఏమైంది? ఏమైనా మర్చిపోయారా?”

“మేమేం మర్చిపోలేదు. వీడు మర్చిపోయాడు” మాధవ్ నవ్వుతూ అన్నాడు

“ప్రద్యుమ్నకు ఫోటోలు కావాలట”.

తాతయ్యకు విషయం అర్థమైంది. “అంతేనా!” అంటూ బావి దగ్గర నిలబడ్డాడు. “రా! ముందు తాతయ్యతో బావి దగ్గర ఒక సెల్ఫీ”

తర్వాత రమ అమ్మమ్మతో అత్తమ్మతో. తర్వాత రోలు. రోకలి. బొక్కెన. పొలం. పచ్చని వరి మధ్య తాతయ్యతో మరో ఫొటో. ప్రద్యుమ్నకు అంతా పండగలా అనిపించింది.

“అమ్మా! వీడియో కూడా తీయాలి”

రేణు ఫోన్ కెమెరా ఆన్ చేసింది. ప్రద్యుమ్న కెమెరా ముందు నిలబడి అన్నాడు “హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ నేను మా తాతయ్య ఊరికి వచ్చాను. ఇది బావి. ఇది బొక్కెన. ఇది రోలు. ఇది రోకలి. ఇవన్నీ చాలా పాత వస్తువులు. కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి!”

వెనక నుంచి తాతయ్య అన్నాడు “మా ఊర్లల్లో కాలంలో ఇవే గ్యాడ్జెట్లు”

ప్రద్యుమ్న గట్టిగా నవ్వాడు.

“తాతయ్యా! మీ దగ్గర కూడా గ్యాడ్జెట్లే ఉన్నాయన్నమాట!”

***

తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. ప్రద్యుమ్న ఫోన్‌లో ఫొటోలు చూస్తూ కూర్చున్నాడు. ఒక ఫొటోలో తాతయ్య. మరోదాంట్లో అమ్మమ్మ. మరోదాంట్లో బావి. ఇంకో దాంట్లో పచ్చని పొలం. అన్నింటినీ చూస్తూ అతని ముఖంలో చిన్న నవ్వు. కొద్దిసేపటికి అమ్మను అడిగాడు “అమ్మా..”

“ఏమిట్రా?”

“ఇంటికి వెళ్లాక నా లెగోస్‌తో ఒక ఊరు కట్టుకుంటాను”.

(వచ్చే వారం మరో కథతో కలుద్దాం)

Exit mobile version