Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు-3

[‘ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు’ అనే శీర్షికతో బాలల కథల అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్.]

ఫిట్‌నెస్‌ స్టొరీ:

“ప్రద్యుమ్నా.. ఇటు రా నాన్నా!” మాధవ్ పిలుపుతో పుస్తకం మూసి పరుగెత్తుకుంటూ వచ్చాడు ప్రద్యుమ్న.

“ఏమిటి నాన్నా?”

“నీ చదువు బాగానే సాగుతోంది. పెయింటింగ్ కూడా బాగా చేస్తున్నావు. అవన్నీ సరే. కానీ మన కేవలం బ్రెయిన్ ఎంత యాక్టివ్‌గా, ఇంటెలిజెంట్‌గా ఉంటే సరిపోదు. మన బాడీ కూడా ఫిట్‌గా, స్ట్రాంగ్‌గా ఉండాలి”

ప్రద్యుమ్న కళ్ళు పెద్దవి చేశాడు.

“అయితే బలం ఎలా వస్తుంది నాన్నా? బాగా తినాలా?”

“ఫుడ్ ఒకటే సరిపోదు అందుకే రేపటినుంచి స్విమ్మింగ్, సైక్లింగ్ మొదలు పెట్టాలి.”

“స్విమ్మింగ్‌నా? సైక్లింగ్‌నా?” ప్రద్యుమ్న ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది.

“అవును. సెలవుల్లో బాగా నేర్చుకుంటే చాలు. శరీరం ఫిట్‌గా ఉంటుంది, బలం వస్తుంది. అంతేకాదు.. కొత్త ఫ్రెండ్స్ కూడా వస్తారు” అంది అప్పుడే వంటింట్లోంచి వచ్చిన రేణు నవ్వుతూ,

“అంతే కాదు రా.. ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు. ఫిట్‌నెస్‌లో ఎంజాయ్‌మెంట్ కూడా ఉండాలి!” అంది.

“అయితే రేపే వెళ్దాం!” అన్నాడు ప్రద్యుమ్న.

ఆ సాయంత్రమే మాధవ్, రేణు, ప్రద్యుమ్నని వెంటబెట్టుకుని షాపింగ్‌కు తీసుకెళ్లారు. ఒక చక్కని స్విమ్మింగ్ సూట్, చిన్న సైజు సైకిల్ కొనిచ్చారు. కొత్త స్విమ్మింగ్ సూట్ వేసుకుని అద్దం ముందు నిలబడ్డాడు ప్రద్యుమ్న.

“నాన్నా! నేను స్విమ్మర్‌లా ఉన్నానా?”

“స్విమ్మర్‌లా కాదు.. రేపటి నుంచి స్విమ్మర్ అవుతావు!” అన్నాడు మాధవ్.

కొత్త సైకిల్‌పై కూర్చున్నప్పుడు అతని ఆనందానికి అవధులే లేవు.

రేణు మెల్లగా మాధవ్ చెవిలో, “వాడి ఉత్సాహం చూస్తుంటే గమ్మత్తుగా ఉందికదా!” అంది.

మాధవ్ నవ్వుతూ “అవును. కానీ రేపు ఉదయం పూల్‌లోకి దిగాక ఈ ఉత్సాహం ఎంత మిగులుతుందో చూడాలి!” అన్నాడు. ఆ మాట ప్రద్యుమ్న చెవిన పడింది.

“ఏమిటి నాన్నా?”.

“ఏమీ లేదు నాన్నా. హాయిగా డిన్నర్ చేసి త్వరగా పడుకో. పొద్దున్నే ఐదింటికి లేవాలి.”

***

తెల్లవారకముందే ప్రద్యుమ్న లేచాడు.

“అమ్మా! లేవమ్మా.. స్విమ్మింగ్‌కు టైమ్ అయింది” రేణు నవ్వుకుంది.

“అయ్యో! నిన్న రాత్రి నువ్వే ముందుగా పడుకున్నావు కదా. ఇప్పుడు మమ్మల్నే లేపుతున్నావా?”

“ఈ రోజు నేను స్విమ్మర్ అవుతాను కదా!” ఆ మాటకు మాధవ్, రేణు ఇద్దరూ నవ్వుకున్నారు.

దగ్గరలోని స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లారు. కోచ్‌కు మాధవ్ ముందే చెప్పి ఉంచాడు. కోచ్ స్విమ్మింగ్ సూట్ వేయించి, క్యాప్ పెట్టి, చిన్న పిల్లల కోసం ఉన్న తక్కువ లోతు పూల్‌లోకి దించాడు.

నీళ్లలో కాలు పెట్టగానే ప్రద్యుమ్న ముఖం మారిపోయింది.

“నాన్నా.. నాన్నా.. ఊపిరి ఆడటం లేదు”

“ఏమీ కాదు నాన్నా. మొదట్లో అందరికీ అలాగే అనిపిస్తుంది”

“నాకు వద్దు”

“ఒక్కసారి ప్రయత్నించు” అన్నాడు కోచ్. “నీళ్లను భయపడకూడదు. నీళ్లతో స్నేహం చేయాలి”

“నీళ్లు నాతో స్నేహం చేస్తాయా?” అడిగాడు ప్రద్యుమ్న.

“నువ్వు వాటిని భయపడకుండా ఉంటే తప్పకుండా చేస్తాయి!” ప్రద్యుమ్న కొంచెం నవ్వాడు.

మొదటి రోజు భయంతోనే గడిచింది. రెండో రోజు కొంచెం ధైర్యం వచ్చింది. మూడో రోజు నీళ్లలో చేతులు కదపడం మొదలుపెట్టాడు.

“చూశావా!” అన్నాడు కోచ్. “నిన్నటి కంటే ఇవాళ బాగా చేస్తున్నావు”

ఆ చిన్న ప్రశంస ప్రద్యుమ్నకు పెద్ద బహుమతిలా అనిపించింది.

కొద్దిరోజుల్లోనే నీళ్లంటే భయం పోయింది. ఈత నేర్చుకోవడం కంటే, నీళ్లలో తన శరీరం తేలడం అతనికి కొత్త అనుభూతిగా అనిపించింది. అక్కడే కొంతమంది పిల్లలు పరిచయమయ్యారు.

“నీ పేరు ఏమిటి?”

“ప్రద్యుమ్న”

“నువ్వు ప్రతిరోజూ వస్తావా?”

“అవును”

“అయితే మనం ఫ్రెండ్స్” కొత్త ఫ్రెండ్స్ కూడా అవుతారు అని అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది ప్రద్యుమ్నకు.

***

సాయంత్రాలు సైకిల్ సమయం. మాధవ్ సైకిల్‌ను ట్రాక్‌పైకి తీసుకెళ్లేవాడు. సైకిల్‌కు రెండు వైపులా చిన్న స్టాండ్లు ఉండటంతో పడిపోతాననే భయం లేదు.

“నాన్నా.. నేను వేగంగా తొక్కనా?”

“ముందు సరిగ్గా తొక్కడం నేర్చుకో. తర్వాత వేగం”

“అంటే?”

“బలం కంటే బ్యాలెన్స్ ముఖ్యం”

ప్రద్యుమ్న ఆ మాటను బాగా గుర్తుపెట్టుకున్నాడు. రోజులు గడిచాయి.

ఒక రోజు మాధవ్ అన్నాడు –

“హాలిడేస్ అయిపోయేలోపు నీ టార్గెట్ ఏమిటో తెలుసా?”

“ఏమిటి?”

“స్విమ్మింగ్‌లో కొంత నేర్చుకోవాలి. సైక్లింగ్ కూడా బాగా రావాలి”

“అయితే నేను ఫిట్ బాయ్ అవుతానా?”

“అవుతావు. ఫిట్‌గా ఉంటే డైటింగ్ గురించి భయపడాల్సిన అవసరం కూడా ఉండదు”

ప్రద్యుమ్న తన పొట్టను చూసుకుని నవ్వుకున్నాడు.

“అంటే ఇక పిజ్జా తినొచ్చా?” మాధవ్, రేణు ఇద్దరూ నవ్వేశారు.

“అన్నీ తినొచ్చు. కానీ మితంగా. ఫిట్‌నెస్ అంటే తినకపోవడం కాదు.. తిన్నదాన్ని శరీరం ఉపయోగించుకునేలా వ్యాయం చఎడం” ప్రద్యుమ్నకు ఆ మాట పూర్తిగా అర్థం కాకపోయినా, నచ్చింది.

***

ఒక రోజు రేణు, మాధవ్‌ల దగ్గరి బంధువులు తమ కూతురు సోనిని హైదరాబాద్‌లో ఇంటర్‌లో చేర్పించేందుకు వచ్చారు.

“ప్రద్యుమ్నా! ఇటురా.. ఎవరొచ్చారో చూడు” అని రేణు పిలిచింది.

లోపల స్టోరీ బుక్ చదువుతున్న ప్రద్యుమ్న పుస్తకాన్ని అక్కడే పెట్టి బయటకు వచ్చాడు.

“ఈమె నీ పెద్దమ్మ. ఈయన నీ పెద్దనాన్న”

“హాయ్ పెద్దమ్మ! హాయ్ పెద్దనాన్న” అన్నాడు ప్రద్యుమ్న.

“ఇక ఈమె ఎవరో తెలుసా?” మాధవ్ అడిగాడు. ప్రద్యుమ్న ఆ అమ్మాయివైపు చూశాడు.

“తను సోని. నీ అక్కయ్య”

“అక్కయ్యా?” అంతే. ప్రద్యుమ్న ఒక్కసారిగా సోని దగ్గరకు పరుగెత్తాడు.

“హాయ్ అక్కా” అంటూ ఆమెను హగ్ చేసుకున్నాడు. సోని నవ్వింది.

ప్రద్యుమ్న ఒక్క అడుగు వెనక్కి వెళ్లి ఆమెను తల నుంచి కాళ్ల వరకు చూసాడు.

“అక్కా..”

“ఏమిటి?”

“నువ్వు డైటింగ్ చేయాలి!” ఒక్క క్షణం అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు.

తర్వాత ఇల్లంతా నవ్వులతో నిండిపోయింది.

సోని మొదట కొంచెం కంగారు పడింది. వెంటనే నవ్వుతూ, “వామ్మో! వీడిని తట్టుకోవడం కష్టమే” అంది.

“అదే మా ప్రద్యుమ్న” అంది రేణు. “మనసులో ఉన్నది నోటికి వచ్చేస్తుంది”

“అది మంచిదే,” అన్నాడు మాధవ్. “కానీ మాట చెప్పేటప్పుడు ఎదుటివాళ్ల మనసు కూడా చూడాలి”

ప్రద్యుమ్న కొద్దిసేపు ఆలోచించాడు. “అయితే అక్కా.. నువ్వు డైటింగ్ చేయకపోయినా ఫర్వాలేదు. నాతో స్విమ్మింగ్‌కు వస్తావా?”

సోని నవ్వుతూ, “అదేంటి, నాకు కూడా స్విమ్మింగ్ నేర్పిస్తావా?”

“అవును. కానీ ముందు నీకు భయం పోవాలి”

“నీకు మొదట భయం వేసిందా?” సోని అడిగింది. ప్రద్యుమ్న కాసేపు మౌనంగా ఉండి,

“వేసింది. చాలా కానీ ఇప్పుడు నీళ్లతో ఫ్రెండ్ అయిపోయాను” అన్నాడు.

అందరూ మళ్లీ నవ్వారు.

“ఇదిగో,” అంది రేణు, “ఇప్పుడే ఇతని ప్రపంచం అంతా స్విమ్మింగ్, సైక్లింగ్, ఫిట్‌నెస్ అయిపోయింది.”

ప్రద్యుమ్న వెంటనే తన సైకిల్ దగ్గరకు పరుగెత్తాడు.

“అమ్మా! ఇవాళ అక్కకు నా సైకిల్ కూడా చూపించాలి.” సోని అతని వెంట నడిచింది.

ప్రద్యుమ్న దూరంగా సైకిల్ తొక్కుతూ కనిపించాడు. అతనికి చెమట పట్టింది. కళ్లలో మాత్రం సంతోషం. .

అప్పుడు సోని నవ్వుతూ అంది – “ప్రద్యుమ్నా.. నువ్వు చెప్పింది నిజమే. ఫిట్‌నెస్ కావాలి!”

ప్రద్యుమ్న సైకిల్ ఆపి వెనక్కి తిరిగి, “అవును అక్కా! కానీ ఫిట్‌నెస్‌తో పాటు.. ఫన్ కూడా కావాలి!” అన్నాడు.

ఆ మాటతో మళ్లీ అందరి నవ్వులు ఆ ఇంటి నిండా మార్మోగాయి.

(వచ్చే వారం మరో కథతో కలుద్దాం)

Exit mobile version