[‘ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు’ అనే శీర్షికతో బాలల కథల అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్.]
మళ్లీ కలుస్తాం:
ఉదయం సూర్యుడు కిటికీలోంచి తొంగిచూడక ముందే ప్రద్యుమ్న ఇంట్లో కథలు మేల్కొంటాయి. “అనగనగా ఒకానొక అడవిలో..” అని అమ్మ రేణు కథ మొదలుపెడితే, ప్రద్యుమ్న కళ్లు పెద్దవైపోయేవి. కథ పూర్తయ్యేలోపు మరో కథ అడిగేవాడు. అట్లా వాడికి కథలంటే ఒక రకమయిన ఇష్టం. రేణు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుంది. కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చున్నా, ఇంటికి రాగానే రంగురంగుల పెయింటింగ్‌లు వేస్తుంది. పుస్తకాలు చదువుతుంది. ప్రతి రాత్రి తన కొడుక్కి ఒక కథ చెబుతుంది.
“కథలు చదివితే మనసు పెద్దదవుతుంది బాబూ” అంటుంది.
ప్రద్యుమ్న వాళ్ళ నాన్న ప్రభుత్వ ఉద్యోగి. చిన్నప్పుడు క్రీడల్లో ఎన్నో పతకాలు గెలిచాడు.
“గెలవడం గొప్ప కాదు.. మనిషి మనసు గెలవడం గొప్ప” అని కొడుక్కి నేర్పుతుంటాడు.
అందుకేనేమో.. ప్రద్యుమ్నకు మనుషులంటే చాలా ఇష్టం. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ల వెంటనే తిరుగుతాడు. వెళ్లేటప్పుడు గేటు వరకు వెళ్లి చేతులు ఊపుతాడు. “మళ్లీ ఎపుడు వస్తారు?” అని అడుగుతాడు. వాళ్లు వెళ్లిపోయాక కొద్దిసేపు మౌనంగా ఉంటాడు.
“ఏమైంది?” అని అమ్మ అడిగితే,
“వాళ్లు గుర్తొస్తున్నారు..” అంటాడు. రేణు నవ్వుతుంది.
‘వీడికి మనసు చాలా పెద్దది’ లోపల లోపల అనుకుంటుంది.
***
స్కూల్లో రెండో తరగతి చదువు ముగిసింది. ఫలితాలు వచ్చిన రోజు స్కూలంతా సందడిగా ఉంది. ప్రద్యుమ్న తన తరగతిలో మొదటి స్థానం సాధించాడు. స్నేహితులు చప్పట్లు కొట్టారు.
టీచర్ ముద్దుగా తల నిమిరింది. “వెరీ గుడ్, ప్రద్యుమ్న” అతని ముఖంలో చిరునవ్వు మెరిసింది. అయితే కొద్దిసేపటికి ఆ నవ్వు మాయమైంది. టీచర్ పిల్లలందరినీ చూస్తూ అంది “పిల్లలూ.. ఇవాళ మీకు రెండో తరగతిలో చివరి రోజు. వచ్చే సంవత్సరం మీరు థర్డ్ క్లాస్. కొత్త క్లాస్.. కొత్త టీచర్.. కొత్త పుస్తకాలు.. కొత్త స్నేహితులు. ఆల్ ద బెస్ట్”
తరగతి గదిలో ఒక్కసారిగా కేరింతలు వినిపించాయి.
“బై మేడమ్!”
“హ్యాపీ హాలిడేస్”
“థాంక్యూ మేడమ్” అంటూ పిల్లలంతా బయటకు పరుగులు తీశారు.
ఒక్కడు మాత్రం అలాగే నిలబడ్డాడు. అతడు ప్రద్యుమ్న. టీచర్ దగ్గరకు నెమ్మదిగా నడిచివచ్చాడు. కొంచెం సేపు ఏమీ మాట్లాడలేదు. ఒక్కసారిగా ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. “మేడమ్..” అంతే వాడి మాట గొంతులోనే ఆగిపోయింది.
కన్నీళ్లు మాత్రం ధారగా కారాయి. “మేడమ్.. ఐ మిస్ యూ.. నా ఫ్రెండ్స్‌ని కూడా చాలా మిస్ అవుతాను..” అని వెక్కివెక్కి ఏడవసాగాడు.
టీచర్కి ఒక్కసారిగా నోట మాట రాలేదు. తన ఒడిలో చిన్న పిట్ట వణికినట్టు అనిపించింది.
ఆమె మెల్లగా అతని వీపు తట్టింది. “అయ్యో బంగారం.. మనం ఎక్కడికీ వెళ్లడం లేదు కదా! ఇదే స్కూల్లో ఉంటాం. ప్రతిరోజూ కలుసుకుంటాం” అని చెప్పింది.
కానీ తన కళ్లూ చెమ్మగిల్లాయి. ఒక పిల్లవాడు ఇంతగా ప్రేమించడం ఆమె ఎప్పుడూ చూడలేదు.
***
ఇంటికి వచ్చాక కూడా ప్రద్యుమ్న మామూలుగా లేడు. బ్యాగ్ కూడా విప్పలేదు. కార్టూన్ కూడా చూడలేదు. అమ్మ రేణు ఆశ్చర్యపోయింది. “ఏమైంది నాన్నా? నువ్వే కదా క్లాస్ ఫస్ట్?”
ప్రద్యుమ్న ఏమీ మాట్లాడలేదు.అమ్మ దగ్గరకు వచ్చి ఆమె ఒడిలో తల దాచుకున్నాడు.
“అమ్మా..”
“చెప్పు బాబూ”
“మా మేడమ్ గుర్తొస్తోంది..”
కొద్దిసేపు ఆగి.. “మా ఫ్రెండ్స్ కూడా..” అన్నాడు.
రేణు అతని జుట్టు నిమురుతూ అడిగింది “వాళ్ళంటే అంత ఇష్టమా?”
ప్రద్యుమ్న అమాయకంగా చెప్పాడు “అమ్మా.. వాళ్లు లేకపోతే మా క్లాస్ ఖాళీగా ఉంటుంది కదా!”
ఆ సమాధానం విన్న రేణు గుండె కదిలిపోయింది. పిల్లలు పుస్తకాలతో మాత్రమే కాదు..
మనుషులతో కూడా పెరుగుతారని ఆమెకు అర్థమయింది.
***
మరుసటి రోజు రేణు ఒక పెద్ద డ్రాయింగ్ షీట్ తీసుకొచ్చింది.
“రా బాబూ” ఇద్దరూ నేల మీద కూర్చున్నారు.
“ఇది నీ క్లాస్‌రూమ్”
“ఇది నీ బెంచ్”
“ఈమె నీ టీచర్”
“వీళ్ళు నీ ఫ్రెండ్స్”
ప్రద్యుమ్న ఒక్కొక్కరినీ గుర్తు చేసుకుంటూ వాటిల్లో రంగులు నింపాడు.
ఎరుపు..
పసుపు..
ఆకుపచ్చ..
నీలం..
చివరికి క్లాస్‌రూమ్ తలుపు మీద పెద్ద అక్షరాలతో రాశాడు ‘మళ్లీ కలుస్తాం’
ఆ బొమ్మను తన మంచం ఎదురుగా గోడకు అతికించాడు. ప్రతి రోజు చూసి నవ్వుకునేవాడు.
***
వేసవి సెలవులు గడిచిపోయాయి. మూడో తరగతి మొదటి రోజు.
కొత్త యూనిఫాం వేసుకుని, కొత్త పుస్తకాలు తీసుకుని స్కూలుకు వెళ్లాడు.
కొత్త క్లాస్‌లోకి అడుగు పెట్టబోతుండగా వెనుకనుంచి ఎవరో పిలిచారు.
‘ప్రద్యుమ్నా’ తిరిగి చూశాడు. అతని రెండో తరగతి స్నేహితులే! కారిడార్ చివరలో పాత టీచర్ కూడా నిలబడి ఉంది. ఆమె చేతిని ఊపుతూ నవ్వింది.
“ఏమైంది బంగారం? నీ ఏడుపు ఎక్కడకు పోయింది” ప్రద్యుమ్న నవ్వాడు.
పరుగెత్తి వెళ్లి ఆమెకు నమస్కారం చేశాడు. తర్వాత స్నేహితులతో కలిసి కొత్త క్లాస్‌లోకి నడిచాడు.
ఆ రోజు అతనికి పెద్ద ఆనందం. వీడ్కోలు చెప్పుకోవడం అంటే ఫ్రెండ్‌షిప్ ముగిసిందని కాదు. కొత్త స్నేహితులకు, పాత జ్ఞాపకాలకు చోటు కల్పించే బ్యూటిఫుల్ ఇంటర్వెల్ మాత్రమే అనిపించిందతనికి.
అప్పటి నుంచి ప్రద్యుమ్న ప్రతి సంవత్సరం చివరి రోజు తన స్నేహితులకు ‘మళ్లీ కలుస్తాం కదా we will meet again’ అని తన పెయింటింగ్ పేపర్ మీద ఒక చిన్న కార్డు రాసేవాడు.
ఆ కార్డును అందుకున్న ప్రతి స్నేహితుడు నవ్వేవాడు ఎస్ ఎస్ అంటూ నవ్వుకుంటూ బై అంటూ చేతులూపుతూ వెళ్ళేవాళ్ళు. టీచర్లేమో పిల్లల్లో ఎంత స్వచ్చమయిన ప్రేమ వుంటుంది అనుకుంటూ సంతోషపడేవాళ్ళు. కొంతమంది టీచర్ల కళ్లలో మాత్రం చిన్న నీటి బొట్టు మెరిసేది.
ఎందుకంటే..
ప్రేమించే హృదయం ఆకట్టుకునే గుణం కలిగి ఉంటుంది.
ఒక మంచి మనసు మరో మంచి మనసును తప్పకుండా తాకుతుంది.
(వచ్చే వారం మరో కథతో కలుద్దాం)
కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత
