Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు-5

[‘ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు’ అనే శీర్షికతో బాలల కథల అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్.]

మాకు మా కల్యాణి టీచర్ కావాలి:

ప్రద్యుమ్న రెండో తరగతి చదువుతున్నాడు. అతడు హైదరాబాద్‌లోని ఒక సాధారణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుతున్నాడు. పెద్ద పెద్ద ప్రకటనలు చేసే ఇంటర్నేషనల్ స్కూలు కాదు. అయినా ఆ పాఠశాలలో పిల్లల నవ్వులు, ఆటలు, పుస్తకాల వాసన, టీచర్ల ప్రేమ మాత్రం చాలా గొప్పవి.

నిజానికి ప్రద్యుమ్న ఇంట్లో కూడా అలాంటి వాతావరణమే. అమ్మ రేణుకు పుస్తకాలంటే ప్రాణం. చిన్నప్పటి నుంచే ఆమె తండ్రి కథల పుస్తకాలు చదివే అలవాటు చేశాడు. అందుకే ఇప్పుడు కూడా తన కొడుక్కోసం ఆమె ప్రతి నెలా ఒక ప్రైవేట్ గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకుని కొత్త కొత్త పుస్తకాలు ఇంటికి తెప్పిస్తుంది. బొమ్మల కథల నుంచి పంచతంత్రం, రామాయణం, మహాభారతం, ప్రకృతి కథలు, శాస్త్రవేత్తల జీవితాలు ఏది వచ్చినా ప్రద్యుమ్నతో కలిసి చదువుతుంది. వాడితో  చదివిస్తుంది.

రేణు మంచి చిత్రకారిణి కూడా. రంగులతో ప్రపంచాన్ని అందంగా మార్చగలదామె. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసినా, సాయంత్రం ఇంటికి రాగానే తన కొడుకుతో కూర్చొని కథలు చదవడం, బొమ్మలు వేయడం ఆమెకు పండుగలాంటివి.

నాన్న మాధవ్ కూడా అలాగే. “పిల్లలు మార్కుల కోసం కాదు, జీవితాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి” అని చెప్పేవాడు. ఇద్దరూ కలిసి ప్రద్యుమ్నను ప్రశ్నలు అడగమని ప్రోత్సహించేవారు. తప్పులు చేస్తే కోప్పడేవారు కాదు. అర్థం చేసుకునేలా చెప్పేవారు.

అందుకే ప్రద్యుమ్నకు కథలంటే ఇష్టం. బొమ్మలు గీయడం ఇష్టం. కార్టూన్లు చూడడం ఇష్టం. ఎవరినైనా వెంటనే స్నేహితులుగా చేసుకోవడం ఇంకా ఎక్కువ ఇష్టం.

స్కూల్లో కూడా అందరితో కలిసిపోయేవాడు. పాఠం శ్రద్ధగా వినేవాడు. కథ చెబితే మొదట చేయి ఎత్తేది వాడే. పెయింటింగ్ పోటీలో బహుమతి గెలిచేది వాడే. స్టోరీ టెల్లింగ్‌లో అందరినీ నవ్వించేది కూడా వాడే. ఒక్క లోపం మాత్రం ఉండేది. క్లాస్‌వర్క్ చకచకా పూర్తి చేసి, బెంచీల మధ్య తిరుగుతూ స్నేహితులతో మాట్లాడడం!

“స్టాప్, ప్రద్యుమ్న” అని కల్యాణి టీచర్ ఒక్కసారి పిలిస్తే చాలు.

“ఓకే మేడం” అంటూ సైలెంట్‌గా నవ్వుకుంటూ తన సీట్లో కూర్చునేవాడు.

ప్రద్యుమ్న అల్లరిని చూసి కల్యాణి టీచర్ కూడా నవ్వకుండా ఉండలేకపోయేది.

ఒకసారి రేణు స్కూలుకు వచ్చినప్పుడు కల్యాణి టీచర్ నవ్వుతూ “మీ అబ్బాయి చాలా మంచి పిల్లవాడు. అన్నింట్లో ముందుంటాడు. కానీ పని అయిపోయాక క్లాస్ అంతా తనదేననుకుంటాడు” అంది.

రేణు కూడా నవ్వేసింది.

“ఇంట్లో కూడా అంతే మేడం” అంది. అలా రోజులు గడిచాయి. ప్రద్యుమ్నకు స్కూలంటే ఇష్టం.

అందులోనూ కల్యాణి టీచర్ అంటే ఇంకా ఇష్టం. స్కూలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా, “ఈ రోజు మా టీచర్ ఒక కథ చెప్పారు..”

“ఈ రోజు నాకు స్టార్ పెట్టారు..”

“ఈ రోజు నేను బాగా చదివానని మెచ్చుకున్నారు..” అంటూ ఆమె గురించే చెబుతుండేవాడు.

***

ఇదిలా వుండగా ఒక సోమవారం ఉదయం. బెల్ మోగింది. క్లాసులో పిల్లలంతా తమ తమ సీట్లలో కూర్చున్నారు. కానీ క్లాస్‌లోకి వచ్చింది కల్యాణి టీచర్ కాదు. ఎవరో తెలియని ఒక కొత్త మేడం. ఆమె నవ్వుతూ,

“గుడ్ మార్నింగ్ చిల్డ్రన్” అంది.

పిల్లలంతా మెల్లిగా “గుడ్ మార్నింగ్ మేడం..” అన్నారు.

కానీ ప్రద్యుమ్న మాత్రం ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడు.

కొద్దిసేపటికి ధైర్యం చేసి లేచి నిలబడ్డాడు.

“యూ ఆర్ నాట్ అవర్ టీచర్” అని గట్టిగా అన్నాడు.

ఆ మేడం ఒక్కసారి తడబడింది.

“అవును బాబూ.. ఈ రోజు నేను మీ క్లాస్ తీసుకుంటాను”

“నో.. నో..” అని ప్రద్యుమ్న తల అడ్డంగా ఊపాడు.

“మా కల్యాణి టీచర్ కావాలి. మీరు కాదు”

మిగతా పిల్లలు కూడా ఒకరినొకరు చూసుకున్నారు.

ఎవరో చిన్నగా, “అవును.. మా కల్యాణి మేడమే కావాలి..” అన్నారు.

అంతే. క్షణాల్లో క్లాస్ అంతా ఒకే స్వరం.

“వీ వాంట్ అవర్ కల్యాణి టీచర్”

కొత్త మేడం ఎంత చెప్పినా పిల్లలు వినలేదు.

“ఈ రోజు మాత్రమే నేను వచ్చాను..”

“లిజన్ చిల్డ్రన్..”

అని ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఆమె బయటకు వెళ్లిపోయింది.

కొద్దిసేపటికి ప్రిన్సిపాల్ వచ్చారు. ముఖంలో చిరునవ్వు.

“వాట్ హ్యాపెండ్?” అని అడిగారు.

ప్రద్యుమ్న లేచి “సర్.. వీ వాంట్ అవర్ కల్యాణి టీచర్” అన్నాడు ధైర్యంగా

ప్రిన్సిపాల్ నవ్వారు.

“ఒకే ఒకే అలాగే బాబూ. రేపటి నుంచి మీ కల్యాణి టీచర్ మళ్లీ వస్తారు. ఈ రోజు మాత్రమే ఇన్‌స్పెక్షన్ కోసం కొత్త మేడం వచ్చారు” అన్నారు.

“రియల్లీ?” అన్న ప్రద్యుమ్న కళ్లు మెరిశాయి.

“యెస్” అన్నారు ప్రిన్సిపాల్.

అంతే. క్లాస్ మొత్తం చప్పట్లు కొట్టింది. కొత్త మేడం కూడా చిరునవ్వుతో పిల్లలను చూసింది.

ఆమెకు కూడా అప్పుడే అర్థమైంది. ఇది మొండితనం కాదు. ఇది ప్రేమ.

***

మరుసటి రోజు కల్యాణి టీచర్ క్లాస్‌లోకి అడుగుపెట్టగానే పిల్లల ముఖాలు పువ్వుల్లా వికసించాయి.

ప్రద్యుమ్న పరుగెత్తి వెళ్లి, “మేడం.. నిన్న మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం” అన్నాడు.

కల్యాణి టీచర్ అతని తల నిమిరింది.

“నేనూ మిమ్మల్ని మిస్ అయ్యాను” అంది.

ఆ క్షణంలో పాఠాలు ఉత్సాహంగా జరిగాయి. ఎవరూ అల్లరి చేయలేదు. ఎవరూ అధికంగా మాట్లాడలేదు.

పిల్లలకే నా హృదయం సమయం అంకితం అన్న ఒక టీచర్ ప్రేమను పిల్లలు కూడా ఎంత నిర్మలంగా తిరిగి ప్రేమించగలరో ఆ సంఘటన చూపింది. పిల్లల హృదయాలు నిజంగా పలకల్లాంటివి. వాటి మీద ప్రేమతో రాస్తే జీవితాంతం చెరగని అక్షరాలవుతాయి.

ఒక మంచి ఉపాధ్యాయుడు పాఠాలు మాత్రమే చెప్పడు. పిల్లల హృదయంలో పాఠశాలపై చదువుపై ప్రేమను వెలిగిస్తాడు. నిజానికి ఆ ప్రేమే విద్యకు మొదటి అక్షరం.

ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రద్యుమ్న జరిగిన సంగతి అమ్మకు చెబితే “మీ కల్యాణి టీచరే కాదు టీచర్స్ అంతా మంచివాళ్ళే వుంటారు రా, మీరే బాగా చదువుకోవాలి” అంది నవ్వుతూ.

(వచ్చే వారం మరో కథతో కలుద్దాం)

Exit mobile version